Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

జగన్ మొండితనం 2: భారం మోయడానికే!

జగన్ మొండితనం 2: భారం మోయడానికే!

తాను చేసిన పనులను సమీక్షించడానికి జగన్ చేసిన ప్రయత్నాన్ని చంద్రబాబునాయుడు మొండితనంగా అభివర్ణిస్తున్నారు. జగన్ చేస్తున్న పీపీఏల సమీక్ష.. యావత్తు ప్రపంచానికి ఇష్టం లేదన్నట్లుగా రంగు పులుముతున్నారు. విద్యుత్తు ఒప్పందాల రూపేణా.. చంద్రబాబునాయుడు ప్రభుత్వం నిర్వాకం పుణ్యమాని రాష్ట్రప్రభుత్వం వేల కోట్ల రూపాయల అనుచిత భారాన్ని మోయవలసిన దుస్థితి ఏర్పడుతోంది. దీన్ని తగ్గించడానికే జగన్ సర్కారు పనిచేస్తోంది. కాకపోతే ఆ విషయాన్ని చక్కగా ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోతోంది.

జగన్మోహనరెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు 18500 కోట్ల రూపాయిల బకాయి ఉంది. ఎక్కువ ధరకు విద్యుత్తును కొనుగోలు చేయడం వల్ల కావచ్చు... సబ్సిడీలు భరిస్తున్నందువలన కావొచ్చు... ఏ రూపంలో అయినా సరే, ప్రభుత్వం చెల్లించవలసి ఉన్న పెండింగ్ భారం అది. ఇవి అధికారిక గణాంకాలు. అంటే చంద్రబాబు సర్కారు 18500 కోట్ల రూపాయల విద్యుత్తు అప్పులను ఖజానా మీద గుదిబండగా మిగిల్చి, గుట్టుచప్పుడు కాకుండా.. ఓటుబ్యాంకు సంక్షేమ పథకాలను ప్రకటించి అధికారంలోంచి తప్పుకుంది.

ఈ భారం ఇలాగే కొనసాగే ప్రమాదం కూడా ఉంది. అందుకే జగన్, ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్తు కొనే ధరలను తగ్గించాలనే నిర్ణయానికే వచ్చారు. మామూలుగా విద్యుత్తు అవసరాల్లో 5 శాతం మాత్రమే పవన విద్యుత్తు, నాన్-కన్వెన్షనల్ విద్యుత్తును కొనాలి. కానీ.. చంద్రబాబు సర్కారు అత్యధిక ధరలకు కొనేలా ఒప్పందాలు చేసుకుంది. పైగా ఈ విద్యుత్తును 18-20 శాతం వరకు కొనుగోలు చేస్తున్నారు. ఆ ధరలకంటె చాలా తక్కువకు థర్మల్ విద్యుత్తు లభ్యత ఉన్నప్పటికీ.. అయినవారికి దోచిపెట్టడం కోసం, అవినీతి సొమ్ము వెనకేసుకోవడం కోసం వాటివైపే అధికధరలకు మొగ్గు చూపారనే ఆరోపణలున్నాయి. వీటిని కట్టడి చేయాలన్నేది ప్రథమ లక్ష్యం.

చంద్రబాబు సర్కారు గత అయిదేళ్ల పాలనలో మూడుసార్లు విద్యుత్తు ధరలను పెంచింది. అదివరలో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా అధికారంలో ఉన్నప్పుడు అయిదేళ్లలో ఒక్కసారి కూడా విద్యుత్తు చార్జీలు పెంచలేదు. అదే స్పూర్తిని జగన్ కొనసాగించాలని అనుకుంటున్నారు. రాబోయే అయిదేళ్లూ విద్యత్తు టారిఫ్ పెంచే ఉద్దేశం లేదు. అందుకోసం, ప్రస్తుతం కొంటున్న అధిక ధరలను సవరించకుంటే... ఖజానా కుప్పకూలుతుందనే ఉద్దేశంతోనే పీపీఏలను సమీక్షించాలని అనుకుంటున్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఎందుకంత గగ్గోలు పెడుతున్నాయనేది ప్రజలే ఆలోచించాలి.

జగన్ మొండితనం 1: అసలెందుకు?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?