కొంతమంది అంటూ వుంటారు 'నేను ఏ పని చేద్దామనుకున్నా ముందుకు పడటంలేదండీ'..అని. ఇంకొందరంటారు 'ఎంత జాగ్రత్తగా ఉన్నా నా చేతిలో డబ్బు నిలవడంలేదండీ'..అని. ఇది విన్నవారు 'నీ జాతకం అటువంటిది. ఎవరేం చేస్తారు' అంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి జాతకం కూడా ఇటువంటిదేనేమో. ఆయన బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఎలో భాగస్వామి. ప్రధాని మోదీకి మిత్రుడు. అయినప్పటికీ కేంద్రంతో సంబంధమున్న ఏ పనీ ఓ పట్టాన అయ్యే పరిస్థితి లేదు. బాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే సీన్. గొంతెమ్మ కోరికలు కోరితే, అలవిమాలిన డిమాండ్లు చేస్తే కేంద్రం ఒప్పుకోవడంలేదని అనుకోవచ్చు. అలాంటిదేమీలేదు. చట్టబద్ధంగా, న్యాయంగా తీర్చాల్సిన కోరికలనే కేంద్రం తీర్చడంలేదు. కేంద్రంతో ఏ పని కావాలన్నా పురుటి నొప్పులు పడాల్సిందే. ప్రతిసారి టెన్షన్ పడాల్సిందే. చేతులు కట్టుకొని నిల్చోవాల్సిందే. ఢిల్లీ చుట్టూ తిరగాల్సిందే.
అడగందే అమ్మయినా పెట్టదంటారు. చంద్రబాబు అడుక్కుంటున్నా కేంద్రం పెట్టని పరిస్థితి ఉంది. ఇదీ బాబు జాతకం. ఎవరెంత మొత్తుకున్నా, ఎంతగనం ఆందోళన చేసినా ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయమే. ప్రజల్లో ఆ డిమాండును సజీవంగా ఉంచడానికి ఆందోళనలు ఉపయోగపడతాయేమోగాని అది రాదనే సంగతి ప్రతిపక్షాలకూ తెలుసు. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించడానికి కాంగ్రెసు, బీజేపీ ఎలా ఒక్కటయ్యాయో ప్రత్యేక హోదా ఇవ్వకూడదని బీజేపీ, టీడీపీ ఒక్కటయ్యాయి. అదలా ఉంచితే ఆంధ్రాకు సంబంధించి కేంద్రం చేయాల్సిన ప్రధాన పనుల్లో ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక సాయానికి చట్టబద్ధత కల్పించడం, రైల్వే జోన్ కేటాయించడం. ఈ రెండు పనులను చంద్రబాబు ఇప్పటివరకు సాధించలేకపోయారు.
ప్రత్యేక సాయం ప్రకటించి ఐదు నెలలైంది. దానికి ఇప్పటివరకు చట్టబద్ధత ఎందుకు కల్పించడంలేదో అర్థం కావడంలేదు. ఈ సాయం హోదాతో సమానమన్నారు కాబట్టి తప్పనిసరిగా చట్టబద్ధత కల్పించాలి. హోదా అడిగితే అది ఇతర రాష్ట్రాలతో ముడిపడి ఉన్న సమస్యని చెప్పారు. కాని ఈ ప్యాకేజీకి ఇతర రాష్ట్రాలతో సంబంధం లేదు. కాని చట్టబద్ధత కల్పించడంలో ఉన్న ఇబ్బందులేమిటో చెప్పడంలేదు. విభజన చట్టంలో ఉన్నవన్నీ ఇస్తున్నప్పుడు ఇంకా చట్టబద్ధత అవసరమా? అని బీజేపీ నాయకులు ఒకసారి ప్రశ్నించారు. దీన్నిబట్టే వారికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. పార్లమెంటు బడ్జెటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అన్ని పార్టీలు వ్యూహాలు రచించడంలో తలమునకలుగా ఉన్నాయి. చంద్రబాబు కూడా టీడీపీ ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధానాంశం ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని ఎంపీలు గట్టిగా పట్టుపట్టడం. కేంద్రంపై ఒత్తిడి తేవడం. ఎంపీలంతా 'సరే'నన్నారు.
బాబుకు ఇష్టుడైన కేంద్ర మంత్రి సుజనా చౌదరి 'ఫిబ్రవరి 15నాటికి చట్టబద్ధత సాధిస్తాం' అని చెప్పారు. అంటే పదిహేను రోజుల్లో ఈ పనిచేస్తారన్నమాట. కాని నమ్మకమేనా అనే సందేహం కలుగుతోంది. హోదా విషయంలోనూ ఇలాగే అనేక గడువులు పెట్టి తుస్సుమనిపించారు. ఇదే సుజనా చౌదరి ఒకసారి 'వారం రోజుల్లో ప్రత్యేక హోదా తెప్పిస్తాం' అని చెప్పారు. అప్పటికే అది రాదనే విషయం ఆయనకు తెలిసి కూడా మభ్య పెట్టారు. ఇప్పుడూ అదే జరిగితే ఏం జవాబు చెబుతారు? ఇక రైల్వే జోన్ విషయం కూడా పార్లమెంటులో ప్రస్తావించాలని చంద్రబాబు ఎంపీలకు చెప్పారు.
దీనిపై కూడా బీజేపీ నాయకులు రకరకాలుగా చెబుతుండటంతో ఎగ్గొట్టే బాపతేమోననిపిస్తోంది. రైల్వే జోన్‌ను కూడా పొరుగు రాష్ట్రాలతో ముడిపెట్టి మాట్లాడుతున్నారు. ఇది విభజన చట్టంలోనే ఉన్నా పనయ్యేలా కనబడటంలేదు. ఆంధ్రాకు కేటాయించిన కేంద్ర విద్యా సంస్థలనే గొప్ప అభివృద్ధిగా బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. విద్యా సంస్థలను ఇచ్చినందుకు మెచ్చుకోవలసిందేగాని అభివృద్ధిలో వాటి పాత్ర ప్రత్యక్షంగా కనబడదు. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి. అందుకు కేంద్రం ఏం సాయం చేస్తోంది?