నవ మాసాలు మోసి కంటి కి రెప్పలా కాపాడుకొంటూ, నీ ఆహారం, శ్వాస ని నా తో పంచి రక్త మాంసాలతో రూపు దిద్దుకుంటున్ననాకు జీవం పోసి, అష్ట పష్టాలు పడుతూ, ఆయాసపడుతూ నా బరువుని మోసి, నన్ను ఈ లోకం లోనికి తీసుకురావాలని పరితపించిన నీకు వందనం. నీ తపస్సు, నీ యజ్ఞం ఫలించి ఈ లోకం లోనికి నేను ఆర్తనాదం తో నీ కోసం ఏడిస్తే, నీ కష్టాన్ని మరచి పోయి నీవు కురిపించే మమకారం దేనికి సాటి రాదు. నాకు తెలిసిన అరుపు అరిస్తే, ఆ మమకార బంధం ఎక్కడవున్న, ఎ స్థితి లో వున్నా అమ్మ పరిగెత్తుకొంటూ వచ్చి నన్ను హత్తుకొంటుంది, అక్కున చేర్చు కొంటుంది, స్వాంతన చేకూర్చుతుంది..
ఆకలితే అమ్మ, కోపం వస్తే అమ్మ, విషయం కోసం అమ్మ, విద్య కోసం అమ్మ, విజ్ఞానం కోసం అమ్మ, వినోదం కోసం అమ్మ..నా ప్రతి అడుగులో నీ నీడ , నా ఎదుగుదలలో నీ భాగస్వామ్యం .. ఈ రోజు నేను ఏంటంటే అది నువ్వే, నీ కలల ప్రతి రూపమే నేను. నేను విసుక్కొంటే నీవు అర్థం చేసుకుంటావు, నేను కోప్పడితే నీవు చిరు దరహాసం చూపుతావు, నీ సహానం నాకు స్ఫూర్తి. ప్రతిఫలం ఆశించని నీ ప్రేమ కు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను?
నేను పుట్టినప్పటి నుండి నీ తో పంచుకున్న బాధలు, కష్టాలు, సుఖాలు అన్నింటికీ నీ సమాధానం నా శ్రేయస్సు .. అమ్మా అంటే ఒక నమ్మకం, అమ్మా అంటే ఒక అనుభూతి, అమ్మా అంటే ఆనందం .. నిన్ను తలచుకోవడానికి ఒక రోజు చాలదు, ప్రతి క్షణం నీ భిక్ష .. కాని అమ్మదనపు కమ్మదనం ఆరగించే అమ్మదినోత్సవం రోజు అందుకో నా వందనం
అమ్మదినోత్సవం రోజు ప్రతి అమ్మకు వందనం!!
–రంగ ఓంకారం