పొట్టి క్రికెట్ అని అందరూ ముద్దుగా పిలుచుకునే టీ20 క్రికెట్ ఫార్మాట్ వచ్చాక, బౌలర్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది. యువరాజ్‌సింగ్, ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ వేసిన ఒకే ఓవర్‌లో ఆరు బంతుల్ని ఆరు సిక్సర్లుగా మలిచినప్పుడే బౌలర్ల పని ఇక ఖతం అనుకున్నారు క్రికెట్ విశ్లేషకులు.
ఇదంతా కేవలం పొట్టి ఫార్మాట్ వరకే పరిమితమని కొందరు సరిపెట్టుకున్నారు. ఓ బౌలర్‌కి ఒకే ఓవర్‌లో 36 పరుగులు సమర్పించుకోవడమంటే అది అత్యంత అవమానకరమైన విషయం. ఇరవై పరుగులు ఇస్తేనే, ఆ బౌలర్ కెరీర్ అటకెక్కిపోయేది నిన్న మొన్నటిదాకా.
కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి, బంతిని బలంగా బాదేవాడే మైదానంలో హీరో అయిపోయాడు. దాంతో బౌలర్లు చేతులెత్తేయడం మినహా ఏమీ చేయలేకపోతున్నారు. ఫీల్డింగ్ విన్యాసాలతో పనే లేకుండా పోతోంది. కోడితే బంతి గ్యాలరీల్లో పడాల్సిందే.. అన్నట్టు న్యూ క్రికెట్‌లో సీన్ మారింది.
క్రిస్‌గేల్ లాంటి భీకరమైన ఆటగాళ్ళే కాదు, బ్యాటింగ్ పెద్దగా రాని టెయిల్ ఎండర్స్ కూడా అవకాశం దొరికితే విరుచుకుపడ్తున్నారు. నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ భారీ స్కోర్ సాధించడం, ఆస్ట్రేలియాపై నెగ్గడం సంగతెలా వున్నా, ఇరు జట్లలోని బౌలర్ల గణాంకాలు చూస్తే, అయ్యో పాపం.. అన్పించకమానదు.
‘ఇకపై స్పెషలిస్ట్ బౌలర్లు అవసరం లేదు.. ఎవర్నయినా ఒకేలా బ్యాట్స్‌మన్ బాదేస్తున్నారు కాబట్టి, అందరూ ఆల్‌రౌండర్లు వుంటే సరిపోద్ది..’ అని వివిధ జట్లు భావించే రోజులొచ్చేస్తున్నాయి. అయినా ఒకప్పటిలా, లెక్కలేసుకుని బౌలింగ్ చేసే మేటి బౌలర్లు లేరిప్పుడు. కొడితే కొట్టాడు సిక్స్, నెక్స్‌ట్ బాల్‌కి వికెట్ పడాల్సిందే.. అన్న కుంబ్లే లాంటి ‘బౌలింగ్ ఇంజనీర్స్’ ఇప్పుడేమాత్రం కన్పించడంలేదు.
దాంతో, క్రికెట్ అంటే ఎన్ని పరుగులు.? అన్న ఆలోచన తప్ప, ఎన్ని వికెట్లు ఎవరు తీశారన్న చర్చే జరగడంలేదు. 9 ఓవర్లు 102 పరుగులు.. ఇదీ భారత బౌలర్ వినయ్‌కుమార్ పరిస్థితి. ఒక వికెట్ తీశాడుగానీ, ఇది అత్యంత అవమానకరమైన గణాంకం అతనికి. రవీంద్ర జడేజా 10 ఓవర్లు వేసి 73 పరుగులు సమర్పించుకున్నాడు. ఆస్ట్రేలియన్ బౌలర్లు తక్కువేం తిన్లేదు, 89, 80, 75, 74.. ఇదీ వారి ప్రతిభ. సమర్పించుకున్న పరుగులివి.
మొత్తం 38 సిక్సర్లు ఇరు జట్లకు చెందిన ఆటగాళ్ళూ బాదేశారంటే బ్యాట్స్‌మన్ ఏ రేంజ్‌లో బౌలర్లతో బంతాట ఆడుకున్నారో అర్థం చేసుకోవచ్చు. క్రికెట్ అంటే జెంటిల్‌మెన్ గేమ్. కానీ, బౌలర్లు నిస్తేజంగా, అవమాన భారంతో కూరుకుపోయే పరిస్థితి వస్తే, అదో బ్లైండ్ గేమ్ అయిపోతుంది. బంతికీ, బౌలర్‌కీ వాచిపోతే.. ఇక క్రికెట్‌లో మజా ఏముంటుంది.? బ్యాట్స్‌మన్ – బౌలర్ సమ ఉజ్జీగా వుంటేనే కదా క్రికెట్‌లో మజా వుండేది.?