యథార్థవాదీ – రాజవిరోధీ

జాన్‌ ప్యాటన్‌ డేవిస్‌ జూనియర్‌ అనే అమెరికన్‌ డిప్లోమాట్‌ రాసిన ఆత్మకథ ‘‘చైనా హ్యేండ్‌’’ మార్కెట్లో లభిస్తోంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మావోను విస్మరించడం తగదని హితవు చెపుతూ తన అమెరికా దేశానికి…

జాన్‌ ప్యాటన్‌ డేవిస్‌ జూనియర్‌ అనే అమెరికన్‌ డిప్లోమాట్‌ రాసిన ఆత్మకథ ‘‘చైనా హ్యేండ్‌’’ మార్కెట్లో లభిస్తోంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మావోను విస్మరించడం తగదని హితవు చెపుతూ తన అమెరికా దేశానికి చైనా గురించిన క్షేత్రవాస్తవాలు చెప్పి అతనెన్ని కష్టాలు పడ్డాడో అది చదివితే తెలుస్తుంది. విషయం తెలియాలంటే చైనా చరిత్ర కాస్త గుర్తుకు తెచ్చుకోవాలి. ప్రజలను ఉత్తేజపరచి విప్లవం తెచ్చి చైనా చక్రవర్తిని గద్దె నుండి దింపివేసిన డా॥ సన్యట్‌ సేన్‌ కొమింటాంగ్‌  అనే తన ఉద్యమం పేర ప్రభుత్వం ఏర్పరచి భూ సంస్కరణలు చేపట్టాడు. అతనికి చైనా కమ్యూనిస్టులు మద్దతు యిచ్చి ప్రభుత్వంలో చేరారు. సన్యట్‌ మరణం తర్వాత అతని స్థానంలో వచ్చిన చాంగ్‌ కై షేక్‌ కమ్యూనిస్టు వ్యతిరేకి. కుటిలుడు. పాశ్చాత్య దేశాలకు ఆప్తుడిగా మెలగుతూ వాళ్లకు నచ్చని భూ సంస్కరణలను పక్కన పడేశాడు. అప్పటికే రష్యాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. చైనా కూడా ఆ దోవన పడిపోకుండా చాంగ్‌ ఆపుతాడు కదాని అమెరికా వంటి దేశాలు అతనికి అండగా నిలిచాయి. కమ్యూనిస్టులకు యీ వరస నచ్చలేదు. చాంగ్‌ను వ్యతిరేకిస్తూ ప్రభుత్వం నుండి తప్పుకున్నారు. 

ఇంతలో రెండవ ప్రపంచయుద్ధం వచ్చింది. చైనాకు ఆగర్భశత్రువైన జపాన్‌ పెరల్‌ హార్బర్‌పై బాంబులు వేసి అమెరికాను యుద్ధంలోకి లాగింది. జపాన్‌ను యిటునుండి ఎదుర్కోవాలంటే చైనాయే తగినదని తలచిన అమెరికా కొమింటాంగ్‌కు, కమ్యూనిస్టులకు యిద్దరికీ ఆయుధాలు అందించింది. కొమింటాంగ్‌ సైన్యం కంటె కమ్యూనిస్టులు చిత్తశుద్ధితో పోరాడుతున్నారని గమనించి, వాళ్లకు ఎక్కువ ఆయుధాలు యిచ్చారు. తను యుద్ధంలో దిగేటంత వరకూ రష్యా కూడా కమ్యూనిస్టులకు బోల్డు ఆయుధాలు యిచ్చింది. అమెరికా జపాన్‌పై ఆటంబాంబు వేయడంతో జపాన్‌ ఓడిపోయింది. ఉత్తర కొరియానుండి, మంచూరియా నుండి తన సైన్యాన్ని వెనక్కి రప్పించింది. అప్పుడు రష్యా వాటిని ఆక్రమించి చైనా కమ్యూనిస్టు పార్టీ పరం చేసింది. ఇటు అమెరికా సహాయంతో కొమింటాంగ్‌ ప్రభుత్వం మధ్య చైనా, దక్షిణచైనా ప్రాంతాలను తన అధీనంలోకి తెచ్చుకుంది. చైనా కమ్యూనిస్టు పార్టీని అడ్డుపెట్టుకుని రష్యా చైనాలో తన పలుకుబడి పెంచుకుందామని చూసినట్లే చాంగ్‌కై షేక్‌ను అడ్డుపెట్టుకుని అమెరికా చైనాను తన గుప్పిట్లోకి తెచ్చుకుందామనుకుంది. మరి కమ్యూనిస్టులతో ఎలా వ్యవహరించాలి? జపాన్‌ ఓడిపోయింది కాబట్టి యిక కమ్యూనిస్టులకు ఆయుధాలు యివ్వనక్కరలేదు. కమ్యూనిజం వ్యాప్తి నివారించాలంటే చాంగ్‌ కై షేక్‌ను దువ్వాలి. కమ్యూనిస్టులను కూడా దార్లో పెట్టుకోవాలి. ఎలా? ఇది యుద్ధానంతరం అమెరికా ముందున్న సమస్య. తన విదేశాంగ శాఖలో ఉద్యోగి ఐన చైనా నిపుణుడు జాన్‌ ప్యాటన్‌ను సంప్రదించారు.

జాన్‌ ప్యాటన్‌ డేవిస్‌ జూనియర్‌ తండ్రి అమెరికాలో పుట్టిన క్రైస్తవ మిషనరీ. మతవ్యాప్తికై చైనాలో నివసించినప్పుడు జాన్‌ పుట్టాడు. చదువు అమెరికాలో సాగింది. అమెరికన్‌ ప్రభుత్వంలో ఫారిన్‌ సర్వీసెస్‌లో చేరితే చైనాలో పోస్టింగ్‌ యిచ్చారు. జనరల్‌ జోసెఫ్‌ స్టిల్‌వెల్‌ వద్ద స్పెషల్‌ డిప్లోమాటిక్‌ అటాచీగా నియమించారు. జనరల్‌ జోసెఫ్‌ చైనా-బర్మా-ఇండియా సైన్యాలకు కమాండర్‌. చాంగ్‌ కై షేక్‌కు చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ కూడా. చైనాలో అమెరికన్‌ రాయబారిగా వున్న పాట్రిక్‌ హర్లీకి కూడా చాంగ్‌ కై షేక్‌ అంటే అభిమానం. పాట్రిక్‌ అమెరికాలో ఆయిల్‌ వ్యాపారి. చైనా గురించి ఏమీ తెలియదు. అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ రూజ్వెల్టుకు కూడా చైనా గురించి పెద్దగా ఐడియా లేదు. అందువలన చాంగ్‌కు మద్దతు యివ్వాలని భావించారు. కమ్యూనిస్టులను అతని పాలన కిందకు తేగలమని కలలు కన్నారు. రాయబారి కార్యాలయంలో వున్న జాన్‌ ప్యాటన్‌ యీ అంచనా తప్పని వాదించాడు. తన ప్రభుత్వానికి లేఖలు రాశాడు. ‘‘నేను మావో, చౌ ఎన్‌ లైలను స్వయంగా కలిసి మాట్లాడాను. వాళ్లకే ప్రజల మద్దతు వుంది. అమెరికా వాళ్లను ఆదుకొనకపోతే, చాంగ్‌ను గుడ్డిగా సమర్థిస్తే మావో యిష్టం లేకపోయినా స్టాలిన్‌ దరి చేరతాడు. చైనాతో అమెరికా శాశ్వతంగా స్నేహం కోల్పోతుంది.’’ అని హెచ్చరించాడు. 
కానీ అతని మాట అమెరికన్‌ ప్రభుత్వం వినలేదు. నిన్నటిదాకా ఆయుధాలు యిచ్చి సహాయం చేశాం కాబట్టి కమ్యూనిస్టులు మన మాటకు విలువిచ్చి  కొమింటాంగ్‌తో కలిపి సంకీర్ణ ప్రభుత్వంలో చేరతారని భ్రమపడింది. ‘ఆయుధాలకు థ్యాంక్స్‌ కానీ మీరు అడిగిన ప్రత్యేక వ్యాపార సదుపాయాలకు అంగీకరించలేం’ అన్నాడు మావో. 

కమ్యూనిస్టులతో పొత్తుకు చాంగ్‌ కై షేక్‌ అంగీకరించకపోగా 1946 జులై నుండి కమ్యూనిస్టు స్థావరాలపై దాడి ప్రారంభించాడు. జాన్‌ ప్యాట్రిక్‌ సలహాకు వ్యతిరేకంగా అమెరికా దానికి వత్తాసు పలికింది. సోవియట్‌ రష్యా కమ్యూనిస్టులకు కొండంత అండగా నిలబడింది. యూరప్‌దేశాల తొత్తుగా మారడమే కాక, జపాన్‌ దాడిని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయిన చాంగ్‌ కై షేక్‌ను చైనా ప్రజలు అసహ్యించుకున్నారు. కమ్యూనిస్టులకు వత్తాసు పలికారు. అందువల్ల మూడేళ్ల పాటు జరిగిన అంతర్యుద్ధంలో మావో గెలుపొందారు. 1949 అక్టోబరు 1 న ‘పీపుల్స్‌ చైనా రిపబ్లిక్‌’ ఏర్పరచారు మావో. చాంగ్‌ కై షేక్‌ ఫార్మోజా ద్వీపానికి పారిపోయి అక్కణ్నుంచి ‘తనదే అసలైన చైనా ప్రభుత్వమ’ని చెప్పుకున్నాడు.

పీపుల్స్‌ చైనా ఏర్పడగానే అమెరికాలో గగ్గోలు పుట్టింది. ‘‘యుద్ధసమయంలో మన నుండి ఆయుధాలు తీసుకున్న కమ్యూనిస్టులు పార్టీ ఫిరాయిస్తారా?  రష్యాకు విజయమూ, మనకు అపజయమూనా? మన రాయబార కార్యాలయం గుడ్లప్పగించి చూస్తూ వుందా?’’ అని ప్రజలు నిలదీశారు. వెంటనే అమెరికన్‌ ప్రభుత్వం ‘‘మన రాయబార కార్యాలయంలో దేశద్రోహులున్నారు. వాళ్లు అంతరంగంలో కమ్యూనిస్టులు. వాళ్లే మనను తప్పుదోవ పట్టించారు.’’ అంటూ జాన్‌ ప్యాట్రిక్‌తో సహా కొంతమంది పేర్లు పేర్కొన్నారు. ఆనాటి రోజుల్లో కమ్యూనిస్టులంటే అమెరికాలో జ్వరం వచ్చేసేది. మెక్‌ కార్థీ అనే సెనేటర్‌ కనబడిన ప్రతీ వాణ్నీ కమ్యూనిస్టు అని ఆరోపించడం, ప్రభుత్వం, ప్రజలు వారిని వెంటాడి వేధించడం జరిగింది. చార్లీ చాప్లిన్‌ కూడా అదే విధంగా అమెరికానుండి తరిమివేయబడ్డాడు. జాన్‌ ప్యాట్రిక్‌ను 1954 నవంబరులో ఫారిన్‌ సర్వీసు నుండి తొలగించి అతనిపై విచారణలు జరిపారు. ఒకదాని తర్వాత మరొకటిగా 8 విచారణలు జరిగాయి. ఒక్కటీ అతన్ని దోషిగా నిలబెట్టలేకపోయింది. తొమ్మిదో విచారణ జరిపించి ‘అతనికి వివేకం, యింగితం లోపించాయని’ తేల్చారు. జాన్‌ ప్యాట్రిక్‌కు ఒళ్లు మండి ‘నేను రాజీనామా యివ్వను, రిటైరవ్వను, పెన్షన్‌ తీసుకోను. ఏం చేస్తారో చేసుకోండి.’ అని ప్రకటించి ఫర్నిచర్‌ వ్యాపారిగా సెటిలయిపోయాడు.

కథకు ముక్తాయింపు ఏమిటంటే – అమెరికా పీపుల్స్‌ చైనాను కాకుండా చాంగ్‌ కై షేక్‌ ఫార్మోజాలో ఏర్పరచిన దాన్నే చైనాగా గుర్తించినంత కాలం గుర్తించి, చివరికి నిక్సన్‌ కాలంలో దాన్ని పక్కకు నెట్టేసి, మావో చైనానే అసలైన చైనాగా గుర్తించింది! ఇప్పుడు ఆ చైనాయే అమెరికాకు ఆక్సిజన్‌ అందిస్తోంది. 70 ఏళ్ల క్రితమే దీన్ని ముందే వూహించినందుకు జాన్‌కు శిక్ష పడింది పాపం. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]