సచిన్‌తో పోల్చేస్తే ఎలా.?

ఒక్క సిరీస్‌.. రోహిత్‌ శర్మని టీమిండియాలో సూపర్‌ హీరోని చేసేసింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రోహిత్‌ శర్మ దుమ్ము రేపేశాడు. మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ గెల్చుకోవడం, డబుల్‌…

ఒక్క సిరీస్‌.. రోహిత్‌ శర్మని టీమిండియాలో సూపర్‌ హీరోని చేసేసింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రోహిత్‌ శర్మ దుమ్ము రేపేశాడు. మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ గెల్చుకోవడం, డబుల్‌ సెంచరీ బాదడం.. ఇవన్నీ అతని స్టార్‌డమ్‌ని పెంచేశాయి.

రోహిత్‌ శర్మ ఎప్పుడూ గొప్ప ఆటగాడే, కానీ కాలమే కలిసి రావట్లేదంటారు విశ్లేషకులు. ఇప్పుడు కాలం కలిసొచ్చింది. సమర్థతకు కలిసొచ్చే కాలం తోడైతే ఎలా వుంటుందో రోహిత్‌ శర్మని చూస్తే తెలుస్తుంది.

అయితే, ఇక్కడే రోహిత్‌ శర్మ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వుంటుంది. పొగడ్తలకు పొంగిపోతే, కెరీర్‌ అటకెక్కిపోవడం ఖాయం. చాలామంది క్రికెటర్ల విషయంలో జరిగిందిది. ఒక్క సిరీస్‌తోనే రోహిత్‌ శర్మని, ఏకంగా సచిన్‌తో పోల్చేస్తున్నారు కొందరు. అలాంటి పొగడ్తలకు పొంగకుండా జాగ్రత్త పడాలి రోహిత్‌ శర్మ.

ఫామ్‌ని కొనసాగిస్తూ, మరో సిరీస్‌లోనూ రోహిత్‌ శర్మ సత్తా చాటుకుంటే, టీమిండియాలో అతనో ప్రధానమైన ఆటగాడవుతాడు. కానీ, ఇప్పుడే సచిన్‌తో రోహిత్‌ని పోల్చేయడమూ తగని పని. ఇదే విషయం రోహిత్‌ శర్మ కూడా చెబుతున్నాడు. సచిన్‌తో పోల్చుకోదగ్గ ఆటగాడ్ని తాను కాననీ, తాను ఇంకా నిరూపించుకోవాల్సింది చాలా వుందని అంటున్నాడు రోహిత్‌ శర్మ.