చేపా చేపా ఎందుకు ఎండలేదు.?

చేప కథ గురించి తెలియనివారుండరు. చేపా చేపా ఎందుకు ఎండలేదు.? అన్న ప్రశ్నకు ఏవేవో కారణాలు చెప్పి, అసలు సంగతిని అటకెక్కించేస్తారు. అదో సరదా కథ. కానీ, ఇక్కడ కథ చాలా దయనీయమైనదీ, దారుణమైనదీ.! …

చేప కథ గురించి తెలియనివారుండరు. చేపా చేపా ఎందుకు ఎండలేదు.? అన్న ప్రశ్నకు ఏవేవో కారణాలు చెప్పి, అసలు సంగతిని అటకెక్కించేస్తారు. అదో సరదా కథ. కానీ, ఇక్కడ కథ చాలా దయనీయమైనదీ, దారుణమైనదీ.! 

హైద్రాబాద్‌ నుంచి అమరావతికి 'అమరావతి స్పెషల్‌ బస్సుల్లో' ఉద్యోగుల్ని ప్రభుత్వం తరలించింది, తరలిస్తూనే వుంది. వీకెండ్‌ సరదా షికారు.. అన్నట్లు, పొద్దున్నే బయల్దేరుతున్నారు, సాయంత్రానికి తిరుగుటపా అదే బస్సులో వచ్చేస్తున్నారు ఉద్యోగులు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇప్పటికే పలు ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభం అవడమంటే, చంద్రబాబు మార్కు రిబ్బన్‌ కటింగులు మాత్రమేనండోయ్‌.! 

ఇప్పటిదాకా విజయవాడ, గుంటూరుల్లో ప్రారంభించిన కార్యాలయాల్లో సగానికి పైగా మూతపడి వున్నాయి. ఏ కార్యాలయం చూసినా ఏమున్నది గొప్ప.? అన్నట్లు తయారైంది పరిస్థితి. ఉద్యోగులు లేకపోవడంతో, మెయిన్‌టెనెన్స్‌ కూడా దండగనుకున్నారేమో, ఆయా కార్యలయాలు ఇప్పుడు అత్యంత దారుణంగా తయారయ్యాయి. ఓపెనింగ్‌ రోజు అలంకరణ కోసం ఉపయోగించిన పూల దండలు వంటివి ఇప్పటికీ అక్కడే పడి వున్నాయి. 

ఎప్పుడో జూన్‌ 2 నాటికి అమరావతిలో తాత్కాలిక సచివాలయం ప్రారంభమయిపోతుందనీ, ఆ రోజునాటికి హైద్రాబాద్‌ నుంచి పూర్తిగా కార్యాలయాల్ని తరలించేస్తామనీ, తాత్కాలిక సచివాలయానికి శంకుస్థాపన చేసిన సమయంలో చంద్రబాబు చెప్పారు. జూన్‌ పాయె, జులై పాయె, ఇప్పుడు ఆగస్ట్‌లోకి వచ్చేశాం. తాత్కాలిక సచివాలయ నిర్మాణం ఎక్కడిదాకా వచ్చిందయ్యా.? అంటే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. 

పేరుకి తాత్కాలిక సచివాలయాన్ని ఎప్పుడో ప్రారంభించేశారు. ఒకసారి కాదు, ఒకటికి పదిసార్లు. తాత్కాలిక సచివాలయం పరిస్థితే ఇలా వుంటే, విజయవాడ – గుంటూరుల్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యాలయాల పరిరిస్థితి ఇంకెలా వుంటుంది.? ఆవు చేలో మేస్తోంటే, దూడ గట్టున మేయదు కదా. చంద్రబాబు నిర్లక్ష్యానికి పదింతల నిర్లక్ష్యాన్ని ఉద్యోగులు ప్రదర్శిస్తున్నారు. దాంతో, హైద్రాబాద్‌ నుంచి అమరావతికి 'స్పెషల్‌ సర్వీసుల' ఖర్చు అదనంగా సర్కార్‌ ఖజానాపై పడ్తోంది. 

నేడు తాజాగా, మరికొన్ని శాఖలకు చెందిన ఉద్యోగులు అమరావతి సర్వీసుల్లో తాత్కాలిక సచివాలయానికి వెళుతున్నారు. షరామామూలుగానే ఇక్కడ, వారు హంగూ ఆర్భాటాలతో బయల్దేరుతుండడం, అక్కడ వారికి స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయనుకోండి.. అది వేరే విషయం. 

ఇంతకీ, అమరావతికి హైద్రాబాద్‌ నుంచి ఏపీ ఉద్యోగులు తరలి వెళ్ళడంలో ఎందుకు ఇంతటి జాప్యం, నిర్లక్ష్యం చోటుచేసుకుంటున్నట్లు.? ఆ ఒక్కటీ అడక్కండి.. నిప్పు నారా చంద్రబాబునాయుడిగారికి కోపమొచ్చేస్తుంది.