ఒకవైపు ఇరుముగన్ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్న విక్రమ్.. ప్రయోగాలకు కొంత విరామం ఇస్తూ ఒక మాస్ ఎంటర్ టైనర్ కు సిద్ధం అవుతున్నాడు. వరస ప్రయోగాలతో సరైన కమర్షియల్ హిట్టులేని విక్రమ్ తన కెరీర్ లో సూపర్ హిట్టైన ఒక మాస్ ఎంటర్ టైనర్ కు సీక్వెల్ ను రూపొందించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దాదాపు 12 ఏళ్ల కిందట వచ్చిన “సామి’’కి సీక్వెల్ ద్వారా మాస్ కు మళ్లీ దగ్గరయ్యే యత్నం చేయనున్నాడు ఈ హీరో. ఇందుకు సంబంధించి దర్శకుడు హరి ఒక ప్రకటన కూడా చేశాడు. ప్రస్తుతం “ఎస్-3’’ తో బిజీగా ఉన్న ఈ దర్శకుడు సామికి సీక్వెల్ పార్టు మీద దృష్టి నిలపునున్నాడట ఇక.
మరి ‘సామి’ సినిమా తెలుగు వారికి పరిచయం ఉన్నదే. దీన్ని తెలుగులో “లక్ష్మి నరసింహా’ గా రీమేక్ చేశాడు నందమూరి బాలకృష్ణ. తమిళానికి ధీటుగా తెలుగులో కూడా ఈ సినిమా హిట్టు అయ్యింది. మరి బాలయ్య కెరీర్ లో ఇంత వరకూ సీక్వెల్స్ లేవు. ఎలాగూ తమిళ దర్శకుడు హరి మాస్ ఎంటర్ టైనర్లు తీయడంలో, పోలీస్ సబ్జెక్టులు తీయడంలో పండిపోయి ఉన్నాడు. ఈ నేపథ్యంలో సామి -2 పట్ల ఎనలేని ఆసక్తి ఉంటుంది. అదే ఆసక్తి బాలయ్య లో కూడా కలిగే అవకాశాలున్నాయి.
ఒకవేళ బాలయ్య సామి సబ్జెక్టు సీక్వెల్ పార్టును తెలుగులో తెరకెక్కించకపోయినా.. హరికి తెలుగులో ఉన్న క్రేజ్ , విక్రమ్ కు ఉన్న ఇమేజ్ కు తోడు.. తొలి పార్ట్ కథ ఎలాగూ మన వాళ్లకు పరిచయం ఉన్నదే కావడంతో విక్రమ్ తో తీసే తమిళ వెర్షన్ ను అయినా తెలుగులోకి డబ్ చేస్తారు లేదా.. ద్విభాషా చిత్రంగా అయినా రూపొందించే అవకాశాలున్నాయి. ఇలా చూస్తే.. బాలయ్య ఓకే చెప్పినా, చెప్పకపోయినా.. “లక్ష్మీ నరసింహా’ సీక్వెల్ పార్టు తెలుగు వారిని పలకరించవచ్చు.