సంచలనం సృష్టించిన సునంద పుష్కర్ హత్యకేసులో కీలక వ్యక్తిగా సునీల్ సాహెబ్ పేరు తెరపైకొచ్చింది. మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య, ప్రముఖ ఎంటర్‌ప్రెన్యూర్ అయిన సునంద పుష్కర్ గత ఏడాది జనవరి 17న ఓ హోటల్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం విదితమే. అప్పట్లో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినా, ఇటీవల అది హత్యగా ధృవీకరించిన పోలీసులు, హత్యకేసుగా నమోదు చేసి, విచారణను వేగవంతం చేశారు.
హత్యకు కొద్ది రోజుల ముందునుంచీ సునంద, శశిథరూర్‌ల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయని పోలీసుల విచారణలో శశిథరూర్ పనిమనిషి నారాయణ్ వెల్లడిరచాడట. సునందకు సంబంధించి ఫేస్ బుక్, ట్విట్టర్, ఇ-మెయిల్ వంటి వ్యవహారాల్ని సునీల్ సాహెబ్ పర్యవేక్షించేవాడనీ, సునంద మరణించిన సమయంలో ఆమెతోపాటు హోటల్‌లో సునీల్ వున్నాడని నారాయణ్ తెలిపాడట.
అంతే కాదు, ఓ సారి ఇంట్లో సునంద, శశిథరూర్ గొడవపడ్డారనీ, ఈ క్రమంలో సునంద దాడి చేయగా, శశిథరూర్ కాలికి గాయం కూడా అయ్యిందని నారాయణ్ పోలీసుల విచారణలో చెప్పాడని తెలుస్తోంది. నారాయణ్‌పై ఒత్తిడి తీసుకొచ్చి, హత్య తానే చేసినట్లు ఒప్పించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఇప్పటికే కేంద్ర మంత్రి శశిథరూర్ పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓ లేఖాస్త్రం కూడా సంధించారు.
వాస్తవం ఏమిటి.? అన్నది రానున్న కొద్ది రోజుల్లోనే తేలే అవకాశం వుంది. తెరపైకి కొత్తగా వచ్చిన పేరు సునీల్ సాహెబ్. ఈ సునీల్ సాహెబ్ ఎవరన్నది పోలీసులు కనుగొంటే, మిస్టరీ వీడిపోవడం పెద్ద కష్టమేమీ కాదు.