కోడి పందాల్లో అంతా ‘సమైక్యం’

సమైక్య, విభజన ఉద్యమాలెలా వున్నా, వాటి సెగ కోడి పందాలకు అస్సలు తగలడంలేదు. ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు పెట్టింది పేరు. సంక్రాంతి సందర్భంగా జరిగే ఈ కోడి పందాల్లో రాజకీయ ప్రముఖులు…

సమైక్య, విభజన ఉద్యమాలెలా వున్నా, వాటి సెగ కోడి పందాలకు అస్సలు తగలడంలేదు. ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు పెట్టింది పేరు. సంక్రాంతి సందర్భంగా జరిగే ఈ కోడి పందాల్లో రాజకీయ ప్రముఖులు సైతం పాల్గొంటుంటారు. కోడి పందాలపై నిషేధం వున్నా, రాజకీయ నాయకుల అండదండలతో యధేచ్ఛగా కోడి పందాలు జరుగుతూనే వున్నాయి.

ఈ ఏడాదీ కోడి పందాలకు ఉభయగోదావరి జిల్లాలు ‘ముస్తాబు’ అయ్యాయి. ముస్తాబు.. అని ఎందుకు అనాల్సి వస్తోందంటే, వాటి నిర్వహణ అంత గొప్పగా జరుగుతుంది మరి. విభజన, సమైక్య ఉద్యమాలు జరుగుతున్నా కోడి పందాలకు ఈసారీ ఏ సెగా తగలకపోవడం గమనార్హం. పైగా, ఇరు ప్రాంతాలకు చెందిన నేతలు కలివిడిగా ఈ కోడి పందాల్లో పాల్గొనేందుకు తరలివస్తున్నారు.

పెద్ద పెద్ద నేతలు కాస్తంత హద్దుల్లో వుంటారుగానీ, చోటామోటా నాయకులు మాత్రం ప్రాంతీయ విభేదాలు పక్కన పెట్టి, పందాల్లో పాల్గొనేందుకు తరలివస్తున్నారు, ఎంజాయ్‌ చేసేందుకు తెగ ఆరాటం చూపిస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాలతోపాటు ఇతర జిల్లాల్లోనూ గత కొంత కాలంగా సంక్రాంతి సందర్భంగా కోడి పందాల ట్రెండ్‌ పెరుగుతోంది. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో కోడి పందాల్ని నిర్వహించేవారు ఎక్కువవుతున్నారు.

అయినాసరే.. ఉభయగోదావరి జిల్లాల్లో కోడి పందాలకు వున్న క్రేజే వేరు. దాంతో, హైద్రాబాద్‌ నుంచి కేవలం సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారే కాకుండా.. తెలంగాణ ప్రాంతానికి చెందినవారూ పెద్ద సంఖ్యలో కోడి పందాల కోసమే ఉభయగోదావరి జిల్లాలకు వస్తుండడం గమనార్హం.

కోడి పందాల్లో ‘సమైక్యం’ అంటే ఇదే మరి. పనికొచ్చే పనులకైతే విభజనగానీ.. ఇలాంటి పనులకి సమైక్యంగా లేకపోతే ఎలా.? అని అన్నా అంటారు రాజకీయ నాయకులు. రాజకీయం అంటేనే అంత.