అర్ధరాత్రి చీకట్లో ఎక్కడో పక్షి ఏడుస్తూ వుంది. దాని పిల్లల్ని పాము తినేసి వుంటుంది.
నగరాల్లో వుండేదే చీకటి, కాకపోతే అది వెలుతురు రూపంలో వుంటుంది. శిథిలమైన ఆలయం ముందు ఒక భిక్షగాడు పాడుతున్నాడు. ఏమీ లేని వాడే , అన్నీ వున్న వాడని అతనికి తెలియదు. మనిషి దేవుడెప్పటికీ కాలేడు. కనీసం మనిషిగా వుంటే చాలు, అదో అద్భుతం.
చెవి వైద్యులకి డిమాండ్ పెరిగింది. అనవసర విషయాలు వినేవాళ్లు ఎక్కువయ్యారు. ఇపుడు గోడలకి చెవులు లేవు. అవి ఫోన్లకి మొలిచాయి.
వేటగాళ్లు బాణం మొనతో రాసిందే చరిత్రకాదు. వేటగాళ్లని వేటాడే మహా వేటగాళ్లు వచ్చారు. రక్తం వాళ్లకి కొత్తకాదు. శతాబ్దాలుగా భూమి తడిసింది వాళ్ల రక్తంతోనే.
పాడుబడిన కోటలో కాసేపు తిరిగి చూడు. అనేక ఆత్మలు మాట్లాడుతాయి. ఈ భూమి తనకి శాశ్వతమని, తానే సర్వస్వం అని నమ్మిన వాళ్లు. భూమికి అందరూ సమానం. మహారాజు కూడా ఎరువుగా మారిపోతాడు.
శాంతి, కడుపు నిండిన వాడి పదం. ప్రతిరోజూ యుద్ధం చేసేవాడికి తెలుసు. శాంతి కోసం ఎంత త్యాగం చేయాలో?
అడవికో భాష వుంటుంది. అర్థం చేసుకోలేని వాడు అక్కడ మరణిస్తాడు. మహా వృక్షాలు నిరంతరం దుఃఖిస్తూ వుంటాయి. వాటికి సులభంగా చావు రాదు. అప్పుడే పుట్టిన పువ్వుకి లోకం ఎపుడూ అందంగానే వుంటుంది.
సానరాయి ఒక వేదాంతి. కత్తి వెదజల్లే రక్తంతో దానికి నిమిత్తం లేదు. పుస్తకం పట్టుకున్న ప్రతివాడికీ జ్ఞానం రాదు. అదే నిజమైతే చెద పురుగే అతి పెద్ద జ్ఞానిగా మారాలి.
కనిపించే ప్రతిదీ నిజం కాదు. జీవితం గ్రాఫిక్స్‌గా మారి చాలా కాలమైంది. హాస్యగాడికి కూడా కన్నీళ్లు వుంటాయి. నిలువెల్లా తడుస్తూ వుంటే నువ్వు పగలబడి నవ్వుతావు.
నీ ఇంట్లో కొంత కాలానికి నువ్వుండవు. మునిమనవళ్లకి నీ పేరు కూడా గుర్తుండదు. నీ స్పర్శతో నిలబడిన ప్రతి ఇటుకా రాలిపోతుంది. జ్ఞాపకాలన్నీ రాలిపోయే ఆకులు. నడిచిన పాదముద్రలే వుంటాయి. చాలా మంది నడుస్తూ వుంటారు.
దీపం దారి చూపుతుంది సరే, నీది సరైన దారేనా?
బలహీనంగా వుండకు. కాసేపు మనిషిగా, కాసేపు తోడేలుగా సంచరించే కొత్త జాతి వచ్చింది. ఆ మృగం తినేస్తున్న విషయం కూడా తెలుసుకోలేవు. వాంపైర్లు రక్తాన్ని మాత్రమే తాగుతాయి. ఇవి నీ సంతోషాన్ని పీల్చేస్తాయి.
చితి మంటని ప్రేమించు. అది నీ ఆఖరి కౌగిలి.
అడవి అతి పెద్ద గురువు. అది నీకు అన్నీ నేర్పిస్తుంది. చావుకి, బతుక్కి అక్కడ ఒకే నియమం, పోరాటం.
పాతాళవాసులు స్వర్గాన్ని కోరడం లేదు. భూమిని కోరుతున్నారు. హక్కుల్ని కోరే ప్రతివాడూ దేవతల దృష్టిలో రాక్షసుడే.
వెదురు పొదలో సంగీతం గుంభనంగా వుంటుంది. గాయం చేసుకుని మనకి దానం చేస్తుంది.
ఒంటరి పడవకి కూడా ఏదో ఒక గమ్యం వుంటుంది. ఏ గమ్యమూ లేకపోవడం కూడా ఒక గమ్యమే.
జీఆర్ మహర్షి
Call boy works 8341510897
Thank you 🙏
పిచ్చోళ్ళ గురించి వినడమే కానీ చదవటం ఇదే ఫస్ట్ టైం