‘ముని’వాక్యం: కొత్త తెగ పుడుతుందా?

పదిహేనేళ్ల కిందటి సంగతి. ఓసారి నేను గొల్లపూడి మారుతీరావుగారిని ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఆ సమయంలో ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు. ఫోనులో మాట్లాడారు. గంటన్నరకు పైగా సాగింది. అంతా ముగిసిన తర్వాత, ‘నాయనా ఇన్ని ప్రశ్నలు…

పదిహేనేళ్ల కిందటి సంగతి. ఓసారి నేను గొల్లపూడి మారుతీరావుగారిని ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఆ సమయంలో ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు. ఫోనులో మాట్లాడారు. గంటన్నరకు పైగా సాగింది. అంతా ముగిసిన తర్వాత, ‘నాయనా ఇన్ని ప్రశ్నలు అడిగావు.. నేను నిన్ను ఒక్క మాట అడగవచ్చునా’ అన్నారు. ‘భలే వాళ్లు సర్.. అడగండి’ అన్నాను. ‘నీ పేరులో ‘పిళ్లె’ అని ఉందీ.. మీరు తమిళులా?’ అన్నారు. ‘ మా పూర్వీకులు అక్కడివాళ్లే సర్. కొన్ని తరాల కింద వచ్చేశాం.. మాకెవ్వరికీ తమిళం రాదు కూడా.. పేర్లలో అలా మిగిలిపోయింది’ అని చెప్పాను. 

‘నీ పేరులో ‘ముని’ అని ఉంది.. మీది చిత్తూరు జిల్లానా?’ అని అడిగారు అవునని, నా ఊరేదో చెప్పాను. మరి కొన్ని మాటలు మాట్లాడి, నా కులం ఏమిటో ఆయనే చెప్పారు! ‘తమిళుడివై ఉండీ.. ఇంత చక్కటి తెలుగు మాట్లాడుతున్నావు నాయనా’ అంటూ నిందాస్తుతో, స్తుతినిందో బోధపడకుండా ఒక మాట అన్నారు. అప్పటికి అలా సరదాగా ముగించారు.

ఆ తర్వాత, ఆ సంభాషణ నాకు భయం కలిగించింది. కేవలం నా పేరు ఒక్కటీ చెబితే.. కాస్త ప్రాపంచిక జ్ఞానం ఉన్న వ్యక్తులు నా ప్రాంతం, నా భాష, నా కులం, నా మూలం అన్నీ తెలుసుకుంటున్నారే అనే భయం అది! నా చుట్టూ ఏర్పడే ఈ ఇరుకు కంచెల నుంచి నేను దూరం పారిపోలేనా? అని కూడా అనిపించింది.

నిజానికి అప్పటికే నేను కులానికి, మతానికి చాలా దూరం జరిగి ఉన్నాను. పిల్లలకు అవి తెలియకుండా, బడిలో ఎవరైనా అడిగినా సరే సమాధానం చెప్పలేని స్థితిలో ఉంచాను. సనాతనంగా మూలాలను మోసుకుంటూ వస్తున్న ‘ఇంటిపేరు’ కూడా వద్దనుకుని, మా నాన్న 1970లో స్థాపించిన పత్రిక పేరు ‘ఆదర్శిని’ నే surname గా మార్చి పిల్లలకు పేర్లు పెట్టుకున్నాను. కానీ నా పేరులో మాత్రం ఆ చిహ్నాలన్నీ అలాగే మిగిలిపోయాయి. 

పిల్లలు కాస్త ఎదిగిన తర్వాత నా పేరుకు, వారి పేర్లకు ఉండే తేడా చూసి, కొత్త సందేహాలు అడగకుండా నేను కూడా పేరు మార్చుకుందామనే కోరికతో చట్టబద్ధ ప్రయత్నం చేశాను. అదొక సుదీర్ఘమైన ప్రక్రియ. ఇద్దరు ఎమ్మార్వోలకు దరఖాస్తును నివేదించి అనుమతి పొందడం, పత్రికలలో ప్రకటన వేయించడం, గెజిట్‌లో ముద్రణ వంటి అనేక దశలుంటాయి. ఈ గండాలన్నీ దాటించడానికి ఓ వ్యక్తిని ఆశ్రయించాను.. అతను మధ్యలో జెండా ఎత్తేయడంతో ప్రయత్నాలు ఆగిపోయాయి. చాలా కష్టం పడిన తరువాత.. ‘నా పేరులోని కుల ప్రాంతీయ తత్వాలను నేను తలకెక్కించుకోనంత వరకు, అవి కేవలం చిహ్నాలే కదా’ అనే తరహా వాదనతో ఆ ప్రయత్నాలకు తిలోదకం ఇచ్చాను.

ఒక వ్యక్తి గుణగణాల సంగతి తర్వాత.. కులమతాల గురించి  మన సమాజం ఎంత నిశితంగా గమనిస్తూ ఉంటుందో.. వాటినుంచి పారిపోవడానికి ఆ వ్యక్తి  ప్రయత్నిస్తే, విరక్తి పుట్టించగల స్థాయిలో ఎంతటి ప్రయాస ఉంటుందో అర్థం చేసుకోవడానికి నా అనుభవాలే పెద్ద ఉదాహరణ. అలాంటిది.. బిడ్డ పుట్టినప్పుడు- జనన ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకునే సమయంలోనే ‘ఏ కులానికీ మతానికీ చెందము’ అనే ఆప్షన్ కూడా ఎంచుకునే వెసులుబాటు కల్పించాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఎంతో సంతోషం కలిగిస్తోంది. కులమతాలు ఏమిటో చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా, అసలవి తెలియకుండా బతికే ఒక తెగ భవిష్యత్తులో ఉంటుందనే సంతోషం అది. 

కులమతాలను అందరూ ఈసడించుకుంటారు. కానీ వాటిని వదిలించుకోవాలని ఎవ్వరూ అనుకోరు. కులమతాల పట్ల అసహ్యభావం.. రిజర్వేషన్ల విషయంలో చాలా మంది నుంచి వినిపిస్తూ ఉంటుంది. రిజర్వుడు కేటగిరీలకు చెందని వాళ్లలో, దాదాపుగా అందరూ కులపరమైన రిజర్వేషన్లు ఉండనే కూడదంటారు! కొందరు ఉదారవాదులు.. ఒక అడుగు ముందుకేసి, అసలు ఈ కులమతాలనే రద్దు చేయాలని కూడా అంటుంటారు. కానీ తమ స్నేహబంధాలను విస్తరించుకోవడంలో, అభిమాన నాయకులను, కథానాయకులను ఎంచుకోవడంలో కులం గోడలను దాటి రాలేరు. 

కులం వలన కొందరు రిజర్వేషన్ లాంటి లబ్ధి పొందుతున్నప్పుడు.. తాము ఇంకా కట్టుబాటుగా ఉండి పరస్పర హితమొనర్చుకుంటూ, పరస్పరం చేయూత అందించుకుంటూ మరింతగా లబ్ధి పొందాలని, ఎదగాలని అనుకుంటారు. సాటికులంలోని గొప్పవాళ్లు తమకేమీ సాయం చేయలేదంటూ, ‘మా కులమే అంత.. ఒకరికొకరు సాయం చేసుకోవడం ఉండదు.. దరిద్రమైన కులం.. అదే ఫలానా కులంలో చూడండి.. ఎంత చక్కటి తోడ్పాటు ఉంటుందో..’ అంటూ స్వకులనిందకు పాల్పడే వాళ్లు.. మనకు ప్రతికులంలోనూ పుష్కలంగా కనిపిస్తారు. అదొక తమాషా!

అందరికీ కులాలు కావాలి. అవి తమకు ప్రయోజనకరంగా మాత్రమే కావాలి. తమ ప్రయోజనాలకు భిన్నంగా కులాల ప్రస్తావన ఉన్నప్పుడు.. వాటిని అసహ్యించుకోవాలి. ఇదే అందరి తరహా! మనం పరిగణించే కులాలు స్వార్థంతో జట్టుకట్టడానికి, ఒకరినొకరు దోచుకోవడానికి జరిగిన కుట్రపూరిత ఏర్పాట్లు అంటే ఎవ్వరూ అంగీకరించరు. ఇవన్నీ మిథ్య అనీ, ఈ ప్రపంచంలో ‘ధనిక- పేద’ రెండు కులాలుమాత్రమే ఉంటాయనే సత్యాన్ని అంగీకరించాలంటే చాలా మందికి మనసొప్పదు. ఇలాంటి చోట కులం వద్దనుకునేవాళ్లు ఎందుకుంటారు? ఎందరుంటారు?

కొందరు తప్పకుండా ఉంటారు. ఇప్పుడు ఈ అంశాన్ని ప్రస్తావనార్హం చేసిన ఉదంతాలు కొత్తవి కాదు. కులం- మతం వర్తించకుండా తమకు ధ్రువపత్రాలు కావాలని గతంలో కూడా న్యాయపోరాటం చేసి సాధించుకున్న వాళ్లు కొందరున్నారు. తాజాగా తెలంగాణలో అలాంటి సంఘటన జరగడం, ఈ కేసులో ప్రభుత్వ వ్యవస్థలోనే కుల, మతాలకు చరమగీతం పాడగల ఒక ఏర్పాటు ఉండేలా మార్పులు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడం ఆశావహంగా కనిపిస్తోంది.

హైదరాబాదుకు చెందిన సందేపు స్వరూప అనే మహిళ తనకు పుట్టిన బిడ్డకు కుల మత ప్రస్తావన లేకుండా జనన ధ్రువీకరణ పత్రం కావాలని కోరితే, దానిని మునిసిపల్ కమిషనర్ తిరస్కరించారు. ఆయన తిరస్కారాన్ని సవాలు చేస్తూ స్వరూప హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. అంశం వ్యక్తిగతం కావడంతో హైకోర్టు దానిని పిటిషన్‌గా మార్చి విచారించింది. రాజ్యాంగంలోని 25వ అధికరణం ప్రకారం దేశంలోని ప్రతి ఒక్కరికీ నచ్చిన మతం ఆచరించడానికి హక్కు ఉందని, అదేవిధంగా ఆచరించకుండా ఉండే హక్కు కూడా ఉందని న్యాయమూర్తి కన్నెగంటి లలిత తీర్పు వెలువరించారు. 

ఇకమీదట దరఖాస్తుల్లో కులం, మతం ప్రస్తావన వద్దనుకునే వారికి ఓ కాలమ్ విడిగా ప్రవేశపెట్టాలని విద్యాశాఖ, పురపాలక శాఖ కార్యదర్శులతో పాటు, కమిషనర్లకు ఆదేశాలు జారీచేశారు.

కుల మతాల ప్రభావం మనమీద చాలా ఉంది. మహాత్మా గాంధీ జయంతిని పండుగగా చేయాలని ఒక కులం అనుకున్నప్పుడు, అంబేద్కర్ మేథస్సును- సమరస చింతనను పరిగణించకుండా ఆయన అస్తిత్వాన్ని కొన్ని కులాలకు ప్రతీకగా భావిస్తున్నప్పుడు మనస్సు చివుక్కుమంటుంది. అంబేద్కర్ విగ్రహం అనేది కొన్ని కులాలను ఆకట్టుకునే తాయిలంగా మారితే, అల్లూరి సీతారామరాజు విగ్రహం కొన్ని కులాల గర్వప్రతీకగా అవతరిస్తే చాలా సిగ్గుగా అనిపిస్తుంది. 

‘ఇంతకంటె ఘోరంగా మనం ఎలా కుంచించుకుపోగలం?’ అని ఛీత్కారంగా కూడా అనిపిస్తుంది. అలాగని ఇలాంటి పోకడలన్నింటినీ ఉన్నపళంగా దిద్దేయడం సాధ్యం కాదు. అంతమాత్రాన తెలంగాణ హైకోర్టు తీర్పు ఏమీ సాధించకుండా ఉంటుందని అనుకోవడం కూడా సరికాదు.

కులమతాల అడ్డుగోడలను దాటుకుని యువతీయువకులు వివాహబంధంతో ఒక్కటవడం ఈ రోజుల్లో చాలా సహజంగా, తరచుగా జరుగుతోంది. అలాంటి దంపతులు తమలో ఏ ఒక్కరి కులానికో ఆధిపత్యం కట్టబెడుతూ, కులపరమైన లొంగుబాటుకు న్యూనతకు గురికావాల్సిన అవసరం లేకుండా.. స్వతంత్రమైన జీవనం గడపడానికి ఇలాంటి కోర్టు తీర్పు చాలా దోహదం చేస్తుంది. వారి పిల్లలకు కులమతాల ఊసులేని ధ్రువపత్రాలు తయారు కావడం మొదలైతే.. భవిష్యత్తులో ఖచ్చితంగా కులమతాలు లేని ఒక కొత్త తెగ ఆవిర్భవిస్తుంది. 

కుల మతాలు ఎప్పుడూ కూడా మన ఆలోచనలను సంక్లిష్టం చేసే, సంకుచితంగా మార్చే శృంఖలాలు. ఎదిగిన మన బుద్ధి, చదువులు, మనం ఎంచే తారతమ్యాలు ఎందుకూ పనికిరానివని నిరూపించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానపు పోకడలూ అన్నింటినీ.. తొక్కేసి, పాతరవేసి, ఆలోచనల్లో మనల్ని మరుగుజ్జులుగా మార్చేసే బంధనాలు. అందుకే వాటిని తెంచుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది. 

కోర్టు తీర్పు కేవలం భవిష్యత్తుకు మాత్రమే ఆశాదీపం. అలాకాకుండా ప్రస్తుత తరంలో వయోజనులకు కూడా కులమతాల ప్రస్తావన లేని ధ్రువపత్రాలు పొందేలా ప్రభుత్వం నిబంధనలను సరళీకరించవచ్చు. సాధారణంగా ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజన ప్రేరితాలు. కులాల గీతలు గీసి, జనాన్ని సమూహాలుగా విభజించేసి.. వారిని ఒక రకమైన భయంలోకి, అర్థరహితమైన ఆవేశంలోకి నెట్టేయడం ద్వారా మాత్రమే మనుగడ సాగించే రాజకీయ పార్టీలు మన సమాజంలో కాలనాగుల్లా విస్తరించి ఉన్నాయి. 

కులం లేని సమాజం ఆవిష్కృతం కావడం అనేది తమ తమ ప్రయోజనాలకు గండి కొడుతుందేమోననే భయంతో వారు అవాంతరాలు సృష్ఠించినా ఆశ్చర్యం లేదు. రాజకీయ కుత్సిత బుద్ధులు కొత్త ఎత్తులు వేయకుండా ఉంటే ప్రమాదం ఏమీ రాదు. కానీ కులమతాలు ఎరగని ఒక భవిష్యత్ తెగ ఏర్పడకుండా అడ్డుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు! ఆలస్యం కావొచ్చు.. కానీ అసంభవం కాదు!!

‘‘నువ్వెవరని అడుగుతున్నావు కదూ.. నువ్వు నన్ను!?
విషం నింపుకుని ఊగుతున్న పేరు చివరి తోకల్ని..
నిర్దయగా కత్తిరించి, నిర్వాలం అయిపోయిన వాణ్ని!
ఎలా తెలుసుకుంటావు నువ్వు నన్ను!?’’

..అంటూ పంచమ వర్ణాల విభజనను పట్టించుకోకుండా, తనకు అంటనివ్వకుండా తయారయ్యే రేపటి సమాజపు విరాట్ స్వరూపాన్ని, ‘షష్ఠముడు’ అనే కవితలో ఆశించాను నేను. ఇప్పుడు ఈ కోర్టు తీర్పులోని స్ఫూర్తిని నవతరంలో ఆలోచనాశీలురైన యువత బోధపరచుకుంటే గనుక.. ఆ ఆశలు సాకారం అవుతాయి కూడా. 

.. కె.ఎ. మునిసురేష్ పిళ్లె

[email protected]