ఇస్లామిక్ స్టేట్ పేరుతో ప్రపంచాన్ని వణికిస్తోంది ‘ఐస్’. ఐస్ అనీ ఐసిస్ అనీ ఒక్కొక్కరూ ఒక్కోలా సంబోదిస్తున్నా, అంతిమంగా అదో ఉగ్రవాద సంస్థ. ప్రపంచాన్ని ఏ స్థాయిలో వణికిస్తోందంటే, అగ్రరాజ్యం సైతం ఐస్ దెబ్బకు బెదిరిపోతోందిప్పుడు. ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో ఐస్ తీవ్రవాదులు సృష్టించిన గందరగోళం అంతా ఇంతా కాదు. ఓ కేఫ్‌లో ప్రవేశించి, కొందర్ని బందీలుగా ఉగ్రవాదులు వుంచుకోవడంతో, వారిపై ఆస్ట్రేలియా భద్రతా బలగాలు అత్యంత చాకచక్యంగా వ్యవహరించాల్సి వచ్చింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరిగినా, అది చాలా తక్కువే.
తాజాగా ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో ఐస్ తీవ్రవాదులు ఓ పత్రికా కార్యాలయంపై తెగబడ్డారు. ఇస్లాంకి వ్యతిరేకంగా కార్టూన్లు ప్రచురించారని ఆరోపిస్తూ తీవ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ‘నేరానికి శిక్ష విధించాం..’ అంటూ ఐస్, పారిస్‌పై దాడి అనంతరం నిస్సిగ్గుగా ప్రకటించుకుంది. ఐస్ ఇప్పుడు అంతర్జాతీయంగా వివిధ దేశాల్లోని తీవ్రవాద సంస్థలతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానే సంబంధాలు పెట్టుకుందన్నది ఓపెన్ సీక్రెట్.
పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఓ సైనిక్ స్కూల్‌పై తాలిబన్లు దాడికి పాల్పడటం వెనుక ఐస్ వ్యూహం వుందన్న అనుమానాలు అప్పట్లోనే వ్యక్తమయ్యాయి. భారతదేశంలోనూ ఐస్ కార్యకలాపాలకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. ఇలా అక్కడా ఇక్కడా అని కాకుండా, ప్రపంచంలో ఎక్కడ ఏ తీవ్రవాద ఘటన జరిగినా దానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఐస్‌తో లింకుల్ని ఆపాదించడం జరుగుతోంది.
మొత్తంగా చూస్తే ఇప్పుడు ఐస్ ఓ కొత్త వైరస్. ఇది తీవ్రవాద వైరస్. ప్రపంచాన్ని వణికిస్తోందిది. యధేచ్ఛగా మారణాయుధాలతో స్వైరవిహారం చేస్తోంది. అగ్ర రాజ్యం సైతం బెదిరిపోతున్న దరిమిలా, ఈ మహమ్మారిని ప్రపంచం భవిష్యత్తులో తట్టుకోగలదా.?