‘మార్స్‌’పై మన సంతకం ఖాయమే.!

450 కోట్ల రూపాయల ఖర్చు.. అవసరమా.? అనే ప్రశ్నలు చాలానే వెల్లువెత్తాయి. మంగళవారం శుభప్రదం కాదంటూ పెదవి విరుపులకు లెక్కే లేదు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఘనవిజయం సాధిస్తూ కూడా దేవుడి మీద నమ్మకంతో…

450 కోట్ల రూపాయల ఖర్చు.. అవసరమా.? అనే ప్రశ్నలు చాలానే వెల్లువెత్తాయి. మంగళవారం శుభప్రదం కాదంటూ పెదవి విరుపులకు లెక్కే లేదు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఘనవిజయం సాధిస్తూ కూడా దేవుడి మీద నమ్మకంతో ఉపగ్రహాలు విజయవంతం కావాలని పూజలు చేయడమేంటన్న వెటకారాలకు కొదవేముంది.?

ఎవరేమనుకున్నాసరే, ‘ఇస్రో’ది ఒకటే సంకల్పం. దేశాన్ని అంతరిక్ష పరిశోధనా రంగంలో అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళాలని. ఇస్రో శాస్త్రవేత్తలు ఏనాడూ తమపై వస్తున్న పనికిమాలిన విమర్శలకు సమాధానం చెప్పలేదు పెదవి విప్పి. తమ ప్రయోగాల ద్వారా మాత్రం గుణపాఠం చెబుతూనే వస్తున్నారు.

తాజాగా ఇస్రో మార్స్‌ ఆర్బిట్‌ మిషన్‌ని కూడా సక్సెస్‌ఫుల్‌గా లాంఛ్‌ చేసి, విమర్శకుల నోళ్ళు మూయించింది. ఓ అత్యాధునిక యుద్ధ విమానం కొంటే అయ్యే ఖర్చు కన్నా తక్కువలో ఇస్రో అంతరిక్షంలోకి మార్స్‌ మిషన్‌ని పంపగలిగింది. రాకెట్‌లోని అన్ని దశలూ విజయవంతమయ్యాయి. ఇప్పుడు మిషన్‌ మార్స్‌ దిశగా దూసుకుపోతోంది.

మార్స్‌.. అంగారకుడు.. పేరేదైనా ఇది మనకి కలలో మాట. దాని రహస్యమేంటో తెలుసుకోవడానికి మార్స్‌ వెళ్తూనే వుంది. సుమారు 300 రోజులపాటు మార్స్‌ ఆర్బిట్‌ మిషన్‌ ప్రయాణిస్తూనే వుంటుంది, ఆ తర్వాతే అది మార్స్‌ చేరుకుంటుంది. అయితేనేం.. మార్స్‌ ఆర్బిట్‌లోకి ఉపగ్రహాన్ని పంపడమే ఇస్రో సాధించిన గొప్ప ఘనత.

అతి త్వరలో మార్స్‌పై మన సంతకం చేయబోతున్నాం. దేశం గర్వించదగ్గ క్షణాలివి. దేశంలోని పలువురు రాజకీయ ప్రముఖులు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. అభినందనలు శాస్త్రవేత్తలకు మరింత ఉత్సాహాన్నిస్తాయన్నది నిర్వివాదాంశం.

కేవలం ఇప్పటిదాకా మూడు దేశాలకు మాత్రమే మార్స్‌పైకి చేరుకున్న ఘనత దక్కింది. ఆ ఘనత దక్కించుకునేందుకు ఇస్రో మార్స్‌ ఆర్బిట్‌ మిషన్‌ పరుగులు తీస్తోంది. ఆ ఘతన కూడా ఇస్రో దక్కించుకోవాలనే ఆశిద్దాం.