పవన్ బాబూ..మీరు రాకండి శంకుస్థాపనకు

పవర్ స్టారు అనబడు..పవన్ కళ్యాణ్‌కు సగటు అభిమాని రాయు లేఖ. Advertisement అయ్యా..మీరు సర్దార్ సినిమా షూటింగ్‌లో బిజీగా వున్నారని తెలుసు..మీరు అపర  అపరిచితుడు అవతారమనీ తెలుసు. కాస్సేపు జనసేన అంటారు…మరి కాస్సేపు సినిమాలు…

పవర్ స్టారు అనబడు..పవన్ కళ్యాణ్‌కు సగటు అభిమాని రాయు లేఖ.

అయ్యా..మీరు సర్దార్ సినిమా షూటింగ్‌లో బిజీగా వున్నారని తెలుసు..మీరు అపర  అపరిచితుడు అవతారమనీ తెలుసు. కాస్సేపు జనసేన అంటారు…మరి కాస్సేపు సినిమాలు అంటారు. జనసేన అనే రాజకీయపార్టీ తరపున ట్వీట్లు చేస్తారు. ఇంటి సమస్యలు పట్టవు కానీ, పక్కరాష్ట్రానికి వెళ్తానంటారు..అంతలోనే తూచ్..క్యాన్సిల్ అంటారు. రాజకీయపార్టీ నేతగా వర్తమాన సమస్యలపై స్పందించరు. ఎక్కడనా ఏమన్నా ఉపద్రవం వున్నా వెళ్లే ప్రయత్నమూ చేయరు. 

సరే, అసలు పాయింట్‌కు వద్దాం. నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని, ఆవిష్కరణ అన్నంత లెవెల్‌లో భారీగా చేస్తున్నారు..మీ మెంటార్ అని జనం అనుకునే చంద్రబాబు నాయుడు. మిమల్ని ఎలాగూ పిలుస్తారు..పిలవకుండా ఎందుకు వుంటారు చెప్పండి. కానీ మా భయం ఒక్కటే..బాబు పంపిన ఇన్విటేషన్ పట్టుకుని మీరు ఎక్కడ వచ్చేస్తారో అని?

భయం ఎందుకంటారా? మీరేమో పవర్ స్టార్..ఇంతా అంతా క్రేజ్ కాదు మీది. మీరు కానీ అక్కడకు వస్తే, జనం తొక్కేసుకుని, ఒకళ్ల మీద ఒకరు పడిపోయి..మిమ్మల్ని చూడ్డానికి ముందుకు వచ్చేస్తేనో? వచ్చేస్తనో ఏమిటి? వచ్చేస్తారు. అసలు అందుకేగా మీరు..పాపం, హుద్ హుద్ సమయంలో విశాఖ వాసులను పరామర్శించాలని వున్నా కూడా అక్కడికి వెళ్లలేదు. ఇదే కారణం చెప్పే కదా..గోదావరి పుష్కరాల మృతుల పరామర్శకు కూడా మీరు కదలలేదు.

మరి అలాంటపుడు, ఈ రాజధాని శంకుస్థాపనకు మాత్రం ఎలా వెళ్తారు. పైగా మిత్రుడు చంద్రబాబు ఎంతో ఆసక్తిగా, చేసుకుంటున్న కార్యక్రమం. ఇలా మీరు వెళ్లి, జనం అంతా మిమ్మల్ని చూసేందుకు ముందుకు ఉరికితే అభాసయిపోదూ? 

అదీకాక, మీరు మీ ఇంటి జనాల ఫంక్షన్లేక రారాయె. ఎందుకంటే అందరూ మిమల్నే చూస్తారు..దాంతో మిగిలిన మీ వాళ్లు బాధపడతారని..మరి అలాంటిది ఇప్పుడు శంకుస్థాపనకు మాత్రం వస్తే, బాబుగారిని వదిలేసి, అంతా మిమ్మల్నే చూస్తారాయె. అప్పుడు పాపం ఆయన బాధపడరా? ఆలోచించండి.

ఇక్కడ ఇంకో సమస్య కూడా వుంది. అసలే ఈ మధ్య, మీ పవనిజంను పట్టుకుని ఇంటర్నేషనల్ లెవెల్‌కు తీసుకుపోయారు మీ ఫ్యాన్స్. దానికో దినం అదేనండీ..డే కూడా డిసైడ్ చేసారు. అంటే ఇప్పుడు మీ పేరు మన బాబుగారి అభిమాన దేశాలైన చైనా, మలేషియా, జపాన్, సింగపూర్‌లకు కూడా పాకిపోయింది. అక్కడ జనాలకు కూడా మీరు ఫెమిలియర్ అయిపోయారు. ఇప్పుడు ఈ శంకుస్థాపనకు ఆయా దేశాల నేతలు కూడా వస్తున్నారు. వాళ్లంతా ఇదే మిమ్మల్ని చూడడం. దాంతో ఇంక ఆ శంకుస్థాపన సందడి వదిలేసి, మీ వెంట పడితే, పాపం, చంద్రబాబు చిన్న బుచ్చుకోరా?

అదీ కాక, మీ ఫ్యాన్స్‌కు ఓ మంచి అలవాటు వుంది. ఫంక్షన్ ఎవరిది? అక్కడ మీరు వున్నారా లేదా  అన్నది కూడా మరిచి, పవర్ స్టార్ అని అరవడం, లేదా జిందాబాద్‌లు కొడుతుంటారు. అలాంటిది ఇఫ్పుడు మీరు అక్కడకు వెళ్లారంటే, జనం అంతా మీకే జిందాబాద్ కొడతారు. అది గ్యారంటీ. పవర్‌లో వున్న బాబును, మోడీని వదిలి, ఈ పవర్ స్టార్ జిందాబాద్‌లు ఏమిటి అని భాజపా, తెలుగుదేశం పార్టీల జనాలు లోలోపల బాధపడే ప్రమాదమూవుంది. 

అసలు అన్నింటికి మించి, మీరు జనసేన తరపున రావాలంటే, మీకు కాస్తయినా గడ్డంపెరగాలి. మేధావితనం అన్న లుక్ రావాలి. ఇప్పుడు మీరు క్లీన్ షేవ్‌తో సర్దార్ పాటల హడావుడిలో వున్నారు. మరి ఇప్పుడు అందుకోసం గెడ్డం ఎక్కడ పెంచుతారు. లేదా సినిమాల్లో అలవాటు కాబట్టి పెట్టుడుగడ్డంతో రావాలి. కానీ జనానికి డవుట్ వస్తుంది కదా..

సో..ఇన్ని సమస్యలు వున్నప్పుడు, మీరు రావడం అవసరమా? అయినా మీరు రాకుండానే మీ ఇంటి జనాల అడియో ఫంక్షన్లు, సినిమా ఫంక్షన్లు..అన్నీ సజావుగా జరిగిపోతున్నాయి. మీరు పట్టించుకోకున్నా ఆంధ్ర నాట సమస్యలు పెద్దగా తేడా లేకుండా అలాగే వున్నాయి. మీరు పట్టించుకుంటారని పాే్యకజీ..కాస్తా,..హోదాగా మారదు…పట్టించుకోలేదని..పాే్యకజీగా మారదు. అలాగే మీరు రాలేదని మోడీ గాభరా పడరు..ఎన్నికల తరువాత ఎలాగూ మీరు మీరు మొహం..మొహం చూసుకోలేదు..ఆ ఎడబాటు అలా మరి కొన్నాళ్లు వుండనీయండి. దాని వల్ల మీ మధ్య బంధం మరింత పెరుగుతుంది కానీ తగ్గదు లెండి. 

సో..మరీ మేం ఇలా అన్నామని మీరు బాధపడకండి..రావద్దని అన్నాం అంటే, మీ పద్దతి మాకు గడచిన ఏణ్ణర్ధంలో అర్థమైపోయింది కదా..అందుకే ఇలా అన్నాం. అంతకు మించి మా మనసులో ఏమీ లేదు..కరెంట్ కట్‌లు, వాటి టైమ్‌లు అలవాటైపోయిన వారికి ‘పవర్’ రాక పోకలు తెలిసినట్లు..మీరు ఎప్పుడు వస్తారో మాకు అర్థమైపోయింది. బాబుగారి ప్లాన్‌లకు ఎక్కడన్నా ఇబ్బంది వస్తే, చటుక్కున వచ్చి, నాలుగు మంత్రాల్లాంటి మాటలు వల్లించి వెళ్తారు. అంతే ఆయన సమస్య సద్దుమణిగిపోతుంది. ఇప్పటికి రెండుసార్లు రాజధాని ప్రాంతానికి ఇలాగే వెళ్లి సెటిల్‌మెంట్ చేసి వచ్చారు కదా.

అవునండోయ్..ఇప్పుడు రాజధాని శంకుస్థాపన కూడా అక్కడే అవుతోంది. వెళ్తే ముచ్చటగా మూడోసారి అన్నట్లు బాగానే వుంటుంది కానీ, భూములు పోయి, కడుపుమండుతున్న రైతు ఎవరైనా నలుగురి ముందు, పవర్ జిందాబాద్ అనడానికి బదులు ఇంకేమన్నా అంటే..అంత బా…గో…దు..

అన్నట్లు..చివరాఖరుగా ఓ ముక్క మిగిలిపోయిందండోయ్..బాబుగారు ..తలా పిడికెడు మట్టి తెమ్మన్నారు కదా.. అని మీరు, మరీ ఎమోషనైపోయి, మీ ఫార్మ్ హవుస్‌లో మట్టి కనుక గుప్పెడు తీసుకుని, జుబ్బా జేబులో వేసుకు వచ్చేయాలని అనుకోకండి. ఇప్పుడు ఆ మట్టి కనుక, ఈ మట్టిలో కలిపితే, రేపు భవిష్యత్‌లో ఏ కేసిఆర్ ముని మనుమడో, మా తెలంగాణ మట్టి, మీ ఆంధ్ర రాజధానిలో వుంది..అందువల్ల మాకూ వాటా వుందని ఉద్యమించేసే ప్రమాదం వుంది. అందువల్ల మీరు అలా మట్టి పట్టుకొచ్చే ప్రయత్నం ఏమీ చేయకండి..

అందుకే..ఇన్ని సమస్యలు వున్నాయి..పైగా ఇక్కడ శంకుస్థాపన సభలో ఎవడి డప్పు వాడు మోగించేసే పనిలో వుంటారు..మీకేమో అలా కొట్టడం అస్సల రాదు. అందువల్ల..మీరు రాకండి..ప్లీజ్.

ఇట్లు
మీ అభిమాని.