తెలుగు రాష్ట్రాల్లో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. 2014 ఎన్నికలకు ముందే ఆవిర్భవించిన ఆ రాజకీయ పార్టీకి కొద్ది రోజుల క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు లభించింది. అదే జనసేన పార్టీ. సినీ నటుడు పవన్‌కళ్యాణ్ స్థాపించిన పార్టీ ఇది. ‘ఓట్లను చీల్చడం ఇష్టం లేక..’ అని 2014 ఎన్నికల సమయంలో తన రాజకీయ పార్టీని ఎన్నికలకు దూరంగా వుంచిన పవన్‌కళ్యాణ్, దేశ ప్రయోజనాలకోసమంటూ దేశంలో భారతీయ జనతా పార్టీకీ, తెలుగు గడ్డ మీద తెలుగుదేశం పార్టీకీ మద్దతు ప్రకటించారు. నరేంద్ర మోడీ పాల్గొన్న అనేక బహిరంగ సభల్లో పవన్‌కళ్యాణ్ పాల్గొని, బీజేపీకి మద్దతుగా ప్రచారం చేశారు. బీజేపీ, టీడీపీ కూటమి ఆంధ్రప్రదేశ్‌లో అధికారం దక్కించుకుందన్నా, తెలంగాణలోనూ ఆ కూటమికి చెప్పుకోదగ్గ సీట్లు వచ్చాయన్నా, అందులో ఎంతో కొంత పవన్ కంట్రిబ్యూషన్ వుందన్నది నిర్వివాదాంశం. ‘నేను మద్దతిచ్చిన పార్టీలైనా ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడితే ప్రశ్నిస్తా..’ అని ఎన్నికల ప్రచారంలోనే సెలవిచ్చారు పవన్‌కళ్యాణ్.
ప్రశ్నించాలంటే పార్టీకి తగిన గుర్తింపు రావాలి కదా.? అన్న కోణంలో పవన్‌కళ్యాణ్, ఇప్పటిదాకా ప్రశ్నించే విషయంలో వెనుకడుగు వేశారు. ప్రశ్నించడానికి పౌరుడైతే సరిపోతుందిగానీ, పార్టీకి గురింపు అవసరమా.! అన్న డౌట్ మీకు రావొచ్చు. దానికి పవన్ వద్ద జవాబు వుంటే ఈ పాటికే ఆయన రాజకీయ తెరపైకొచ్చి, ప్రజా వ్యతిరేక చర్యల విషయంలో తనదైన వాదన విన్పించి వుండేవారే. సరే, ఆయన అనుకున్నట్టే ఇప్పుడు పార్టీకి గుర్తింపు వచ్చింది. ఓ రాజకీయ పార్టీ అజ్ఞాతంలో వుండటం అంటే, అటెకక్కిపోవడానికి సిద్ధంగా వున్నట్టేనన్న భావన రాజకీయాల్లో వుంది. అందుక్కారణం, గతంలో అనేక పార్టీలు తొలుత మౌనం దాల్చి, ఆ తర్వాత రాజకీయ తెరపైనుంచి అంతర్ధానమైపోవడమే. ఎక్కడిదాకానో ఎందుకు, పవన్‌కళ్యాణ్‌కే ఆ అనుభవం వుంది.
2009 ఎన్నికల సమయంలో పుట్టిన ప్రజారాజ్యం పార్టీకి, పవన్‌కళ్యాణ్ అన్నయ్య చిరంజీవే సారధి. అన్నయ్యకు తోడుగా ‘యువరాజ్యం’ బాధ్యతలు నిర్వహించిన పవన్, 2009 ఎన్నికల తర్వాత పార్టీ గురించి పట్టించుకోవడం మానేశారు. చిరంజీవి కూడా ఎన్నికలకు ముందు చేసిన హంగామా, ఎన్నికల తర్వాత చేయలేక కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని కలిపేశారు. ‘జెండా పీకేద్దాం..’ అని ఓ పత్రికలో వార్త వస్తే, చిరంజీవికి కోపమొచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో అంతా చూశాం. ఇప్పుడు చిరంజీవి కాంగ్రెస్ నేత. పవన్‌కళ్యాణ్ విపరీతంగా విమర్శించే రాజకీయ పార్టీ ఏదన్నా వుందంటే కాంగ్రెస్ పార్టీనే. అది వేరే విషయం. అన్నయ్య అనుభవాల్ని చూసి అయినా పార్టీని ఎలా నడపాలో పవన్‌కళ్యాణ్ ఓ అవగాహనకు వచ్చి, ఆ దిశగా పార్టీని నడిపి వుండాలింది. కానీ, అన్నయ్యను మించిన తమ్ముడు.. అనే విమర్శల్ని పవన్ ఇప్పటిదాకా ఎదుర్కొంటున్నారంటే, రాజకీయ తెరపై ఆయన వ్యవహరించిన తీరు అలానే వుంది.
పార్టీ పెట్టేశాం.. అనుకుంటే సరిపోదు. రాజకీయ పార్టీ పెట్టడమంటే అదో బాధ్యత. సమాజానికి ఎంతోకొంత మేలు వ్యక్తిగతంగా కూడా చేయొచ్చు. కానీ, వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతి, అక్రమాల్ని, అనేక జాడ్యాల్నీ మటుమాయం చేయడానికే రాజకీయ వేదికను ఎంచుకుంటుంటారు. అలానే పవన్ కూడా జనసేన పార్టీని స్థాపించారు. ఆ విషయం స్వయంగా పవన్ చెప్పారు కూడా. మరి అలాంటప్పుడు, దేశవ్యాప్తంగా అనేక సమస్యలు వెల్లువెత్తుతున్నా, జనసేన పార్టీ అధినేతగా పవన్ ఇప్పటిదాకా స్పందించిన పరిస్థితులే లేవు. ఓ సినీ నటుడు విపత్తుల వేళ ఎలా స్పందిస్తాడో, హుద్‌హుద్ తుపాను సమయంలోనూ, ఇతరత్రా సందర్భాల్లోనూ పవన్ స్పందించారే తప్ప, రాజకీయ నాయకుడిగా, రాజకీయ పార్టీ అధినేతగా సమాజంలోని పరిస్థితులపై ఆయన స్పందించేందుకు తగిన ముహూర్తం కోసం ఎదురు చూస్తుండడం ఆశ్చర్యకరం, హాస్యాస్పదం కూడా.
జనసేన పార్టీ ఆవిర్భవించి చాన్నాళ్ళే అయ్యింది. ఆ పార్టీ కార్యాలయం నుంచి అప్పుడప్పుడూ మీడియాకి సందేశాలు అందుతుంటాయి. అది కూడా మూడు నెలలకో, ఆర్నెళ్ళకో మాత్రమే. పార్టీ కార్యాలయం ఎక్కడ? పార్టీ వాయిస్‌ని పవన్ తరఫున వినిపించేదెవరు? అనే ప్రశ్నలకు ఇప్పటిదాకా సమాధానం దొరకలేదు. పార్టీ ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందింది గనుక, ఇప్పటికైనా పవన్‌కళ్యాణ్ ప్రజల ముందుకు రావాల్సి వుంది. పార్టీ ఏంటి? విధి విధానాలేంటి? పార్టీలో ఎవరెవరున్నారు? వంటి అంశాలపై పవన్ స్పష్టత ఇప్పటిక ఇవ్వాల్సి వున్నా, ఇవ్వలేదు గనుక.. ఇప్పటికైనా ఆ పని ఆయన చేస్తే మంచిది. ఉమ్మడి తెలుగు రాష్ర్టంలో ఆయన జనసేన పార్టీని స్థాపించారు గనుక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ వుంది గనుక.. రెండు రాష్ట్రాల్లోనూ ఆయన పార్టీని విస్తరించాల్సి వుంది. పార్టీ విస్తరణ సంగతి అటుంచితే, ఇరు రాష్ట్రాల్లోనూ అనేక సమస్యలున్నాయి. వాటిపై ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాల్నే ప్రశ్నిస్తారో, కేంద్రాన్నే ప్రశ్నిస్తారోగానీ.. ఆ పని ఎంత తొందరగా పవన్ చేస్తారోనని ఆయన అభిమానులే ఎదురుచూస్తోన్న పరిస్థితి.
గత అనుభవాల నేపథ్యంలో, రాజకీయ నాయకుడిగా పవన్‌పై బాధ్యతలు చాలానే వున్నాయి. చిరంజీవి పార్టీ ఓ ఎన్నికల్ని ఎదుర్కొంది. పవన్‌కళ్యాణ్ పార్టీ ఎన్నికల్ని ఎదుర్కొంటుందా? అన్న అనుమానాల దరిమిలా, అలాంటి అనుమాలనుంచి అభిమానులేక పవన్ తొలుత స్పష్టత ఇస్తే, అది పార్టీకి ఉపయోగపడ్తుంది. లేదూ.. ఇంకా మౌనమే కొనసాగిస్తానంటే, జనసేనను ఎన్నికల కమిషన్ గుర్తించినా జనం గుర్తించే పరిస్థితే వుండదు. ఇంతకీ పవన్ ఆలోచనలేమిటి? ప్రశ్నించేందుకు పవన్ జనసేన అధినేతగా జనంలోకి వస్తారా? వస్తే ప్రజా క్షేత్రంలో ఆయన ‘నాయకుడిగా’ నిలదొక్కుకుంటారా.? సినీ రంగంలో అన్నయ్యను మించిన తమ్ముడన్పించుకున్న పవన్, రాజకీయాల్లో ఏ మేరకు అన్నయ్యను అయినా దాటగలుగుతారు.? వేచి చూడాల్సిందే.
-వెంకట్ ఆరికట్ల