రెండు కళ్ళ సిద్ధాంతం.. రెండు పదవుల ప్రయాణం

మీరు జై సమైక్యాంధ్ర అనండి.. మీరు జై తెలంగాణ అనండి.. అంటూ విభజన  సమైక్య సెగల్లో ఏ వర్గానికి తగ్గట్టు ఆ వర్గాన్ని ప్రోత్సహించారు అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు. సమైక్య…

మీరు జై సమైక్యాంధ్ర అనండి.. మీరు జై తెలంగాణ అనండి.. అంటూ విభజన  సమైక్య సెగల్లో ఏ వర్గానికి తగ్గట్టు ఆ వర్గాన్ని ప్రోత్సహించారు అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు. సమైక్య నినాదం ఓడిపోయింది. తెలంగాణ నినాదం గెలిచింది. ‘మేం తెలంగాణకు కట్టుబడి వున్నాం.. మేం ఇచ్చిన లేఖతోనే తెలంగాణ వచ్చింది’ అని తెలంగాణలో చెప్పమన్నారు తెలుగు తమ్ముళ్ళకి చంద్రబాబు. ‘సమైక్యాంధ్ర కోసం పోరాడాం.. కానీ ఓడిపోయాం.. కాదు  కాంగ్రెస్ ఓడించింది.. విభజించినా సమన్యాయం చెయ్యమన్నాం.. చెయ్యలేదు..’ అని సీమాంధ్ర తెలుగు తమ్ముళ్ళకు చంద్రబాబు ఉద్బోధ చేశారు. అధినేత చెప్పినట్లే తెలుగు తమ్ముళ్ళు నినదించారు. ఇదే పని కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది. అయితే విభజన జరిగింది కాంగ్రెస్ హయాంలో గనుక, ఆ పార్టీ సీమాంధ్రలో గల్లంతయ్యేలా చేశారు అక్కడి ఓటర్లు. తెలంగాణ ఇచ్చామని చెప్పినా కాంగ్రెస్‌ని తెలంగాణలో నమ్మలేదు. తెలంగాణ వచ్చింది మావల్లే.. అని టీడీపీ చెప్పినా, తెచ్చింది తామేనన్న టీఆర్‌ఎస్‌ని మాత్రమే నమ్మారు తెలంగాణ ఓటర్లు. విభజన జరిగిపోయింది గనుక, అనుభవజ్ఞుడైతేనే ఆంధ్రప్రదేశ్‌ని నిర్మించగలరని భావించిన సీమాంధ్ర ఓటర్లు చంద్రబాబుకి పట్టం కట్టారు. కానీ, సీమాంధ్ర (ఇప్పుడు ఆంధ్రప్రదేశ్) ప్రజల ఆశల్ని చంద్రబాబు నిజం చేస్తారా.? రెండు కళ్ళ సిద్ధాంతానికి తిలోదకాలిచ్చి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ బాగు కోసం ఎలాంటి కఠిన నిర్ణయాలైనా తీసుకుంటారా.? అంటే, వాటి సంగతేమోగానీ, కొత్తగా రెండు పడవల ప్రయాణం షురూ చేసిన చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెద్ద షాకే ఇస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టు వ్యవహారాన్నే తీసుకుందాం. ముంపు మండలాల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేతలు ఒకలా మాట్లాడుతోంటే, తెలంగాణ టీడీపీ నేతలు ఇంకోలా మాట్లాడుతున్నారు. అప్పుడు విభజన  సమైక్య ఉద్యమాల్లో ఎలాగైతే ఇద్దర్నీ ఎంకరేజ్ చేశారో, చంద్రబాబు ఇప్పుడూ అదే చేస్తున్నారు. ‘అది కాంగ్రెస్ నిర్ణయం.. ఎన్డీయే హయాంలో అమలయ్యిందంతే..’ అని చంద్రబాబు కూడా చెబుతున్నారు. ‘దానివల్ల రెండు రాష్ట్రాలకూ లాభం.. కావాలని రాజకీయం చేయొద్దు..’ అని టీఆర్‌ఎస్‌పై మండిపడ్తున్నారు చంద్రబాబు. కానీ, తెలంగాణ టీడీపీ నేతల్ని మాత్రం ‘దానిపై రాద్ధాంతం చేయకండి..’ అని నిలువరించలేకపోతున్నారంటేనే, ‘పోలవరం’పై చంద్రబాబుకి ఎంత చిత్తశుద్ధి వుందో అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగోగుల కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సింది పోయి, ఇంకా రెండు రాష్ట్రాల్లోనూ పార్టీని కాపాడుకోవడం.. ఎలా అని ఓ పార్టీ అధినేతగానే ఆయన ఆలోచన చేస్తుండడం ఆశ్చర్యకరమైన విషయం. ఇక్కడ ఆయన రెండు పడవలపై చెరో కాలు వేసి ప్రయాణం చేస్తున్నట్లుగా కన్పిస్తోంది. ఒక పడవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి అయితే, ఇంకో పడవ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి.

విద్యుత్ విషయంలోనూ చంద్రబాబు రెండు పడవల ప్రయాణాన్నే కొనసాగిస్తున్నారు. విద్యుత్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరిగిందన్నది నూటికి నూరుపాళ్ళూ నిజం. అన్నీ జనాభా లెక్కన పంచి, విద్యుత్‌ని మాత్రం వాడకం లెక్కన పంచడం ఏం న్యాయమో కేంద్రానికే తెలియాలి. దాన్ని ఎండగట్టడానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి నోరు పెగలడంలేదు. ఏమన్నా అంటే, తెలంగాణకి కేటాయింపులు తగ్గించొద్దు.. ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం చేయకుండా వుండేందుకే వేరే ప్రత్యామ్నాయం చూడాలంటూ వితండవాదం చేస్తున్నారాయన. ఇదేనా సమన్యాయం అంటే.? కానే కాదు. కేంద్రంలో అధికారంలో వున్నది చంద్రబాబు మద్దతిచ్చిన ఎన్డీయే కూటమి. ఆ మాటకొస్తే, కేంద్రంలోనూ తెలుగుదేశం పార్టీకి భాగం వుందిప్పుడు. కాబట్టి, విభజన ద్వారా ఆంధ్రప్రదేశ్‌కి కలిగిన అన్యాయాన్ని సరిదిద్దే దిశగా చంద్రబాబు చర్యలుండాలి. కానీ, ఆ అన్యాయాన్ని సరిచేయాలంటే, తెలంగాణతో పంచాయితీ పెట్టుకోవాల్సిన పరిస్థితి. అలా పంచాయితీ పెట్టుకుంటే తెలంగాణలో పార్టీ మునిగిపోతుంది. ఎలాగూ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో వున్నాం గనుక, సన్నాయి నొక్కులు నొక్కినా ఎవరూ పట్టించుకోర్లే.. సమైక్య రాష్ట్రాన్ని విభజిస్తూ, సీమాంధ్రులకు అన్యాయం జరిగినా వారు చేయగలిగారు గనుక.? అన్న నిర్లక్ష్యం చంద్రబాబులో వుందా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయంటే.. పరిస్థితులు అలా వున్నాయి మరి.

రేప్పొద్దున్న ఉద్యోగుల విషయంలోనూ చంద్రబాబు ఇలాగే వ్యవహరిస్తారేమో.. అనే ఆందోళన పెరిగిపోతోంది. ‘స్థానికత’ అంశం తేలకుండా ఉద్యోగుల పంపకాలు సాధ్యం కావు. తెలంగాణలో పుట్టి, తెలంగాణలో పెరిగినా మూలాల్ని బట్టి ‘ఆంధ్రోడు’ అనేస్తోన్న తెలంగాణ వాదులకు ‘ఇది కాదు పద్ధతి’ అని చెప్పే సాహసమూ చంద్రబాబు చేయడంలేదు. ముందుంది మొసళ్ళ పండగ.. అన్నట్టు నీటి సమస్యలూ, పన్నులు, విద్య, వైద్యం వంటి అంశాలూ.. చెపకుంటూ పోతే పెద్ద కథే వుంది. ఒకపడు ప్రతిపక్షంలో వున్నారు గనుక, రెండు కళ్ళ సిద్ధాంతమన్నా ఇంకోటన్నా నడిచిపోయింది. ఇపడు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం అధికార పార్టీ. విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నుంచి చాలా ఆశిస్తున్నారు. కానీ, వారి ఆశలు అడియాసలయ్యేలానే కన్పిస్తున్నాయి. పోలవరం విషయంలో అయినా, ఇంకే విషయంలో అయినా తెలంగాణ ముఖ్యమంత్రి చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిక్కచ్చిగా మాట్లాడుతున్నారు. తప్పా, ఒప్పా అన్నది కాదిక్కడ. తనను నమ్ముకున్న ప్రజల కోసం తాను కఠినంగా వ్యవహరిస్తున్నాననే సంకేతాలు ఇవ్వగలగడం కేసీఆర్‌కి మాత్రమే చెల్లింది. అదే వైఖరి చంద్రబాబు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశించడంలో తప్పేముంది.?

కేసీఆర్‌కి కుదిరింది.. తెలంగాణకు పరిమితమైన పార్టీకి ఆయన అధినేత కాబట్టి.. అనంటే సరిపోదు. తమ ముఖ్యమంత్రి తమ బాగోగులు చూడాలి అని ఏ రాష్ర్ట ప్రజలైనా ఎదురు చూస్తారు.. ఎదురుచూడాలి కూడా. ముఖ్యమంత్రి కూడా, తన నుంచి చాలా ఆశిస్తోన్న ప్రజల ఆశల్ని వమ్ము చేయకూడదన్న ఇంగితం కలిగి వుండాలి. విభజనతో నష్టపోయి, కొత్త రాష్ర్టంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ‘డైనమిక్’గా వుంటే తప్ప, కొత్త రాష్ర్ట నిర్మాణం సరిగ్గా జరగదు. సింగపూర్ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తానని చంద్రబాబు చెబితే సరిపోదు.. ప్రజలకు భరోసా ఇచ్చేలా ఆయన వ్యవహారశైలి వుండాలి. ఏదీ ఆ భరోసా.? అదే కన్పించట్లేదు. అప్పుడు రెండు కళ్ళ సిద్ధాంతం.. ఇప్పుడు రెండు పడవల ప్రయాణం.. ఇదేనా రాజకీయం చంద్రబాబుగారూ.. అని ప్రశ్నిస్తోన్నవారికి ఆయనేం సమాధానం చెప్తారు.?

-వెంకట్ ఆరికట్ల