స్మార్ట్ స్మార్ట్ స్మార్ట్… దేశవ్యాప్తంగా ఇప్పుడీ 'స్మార్ట్' రగడ చుట్టూ పెద్ద చర్చే జరుగుతోంది. బ్యాంకింగ్ కార్యకలాపాలు ఇకపై పూర్తిగా స్మార్ట్ ఫోన్ల ద్వారా జరగాలన్నది ఆ చర్చల సారాంశం. కరెన్సీ వాడకం తగ్గించేసి, డిజిటల్ కరెన్సీని వాడటం (స్మార్ట్ ఫోన్ల ద్వారా) మంచిదనీ, తద్వారా పారదర్శకత పెరుగుతుందనీ 'టెక్' నిపుణులు అభిప్రాయపడ్తున్నారు.
నిజమే, స్మార్ట్‌గా టెక్నాలజీని వాడుకోవడం మంచిదే. కానీ, ఎంతవరకు.? ఈ స్మార్ట్ వినియోగంపై అవగాహన ఎంతమందిలో ప్రస్తుతం వుంది.? భవిష్యత్తులో ఎంతమందికి ఈ స్మార్ట్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది.?
ఏటీఎం కార్డుల్నే తీసుకుందాం. దేశంలో ఇప్పటికీ చాలామందికి ఏటీఎం కార్డుల వినియోగం తెలియదు. ఆ చాలామందిలో రైతులున్నారో, చిన్న చిన్న పనులు చేసుకునే కూలీలున్నారు, ఇంకా చాలా రంగాలకు చెందినవారున్నారు. బ్యాంకు అకౌంట్ తెరిస్తే, ఆటోమేటిక్‌గా ఏటీఎం కార్డ్ చేతిలో పడుతుంది. కానీ, దాని వినియోగం తెలియొద్దూ.! అటూ ఇటూగా తెలిసినాసరే, 'ఎందుకులే టెన్షన్.?' అన్న భావనతో, ఏటీఎం సెంటర్ వద్దకు వెళ్ళి సెక్యూరిటీ సిబ్బందితోనో, ఇతరులతోనే డబ్బులు డ్రా చేయించేవాళ్ళు ఇప్పటికీ చాలామంది కన్పిస్తుంటారు.. అదీ పట్టణాల్లో కూడా. మరి, పల్లెటూళ్ళలో పరిస్థితి ఊహించుకోవడమే కష్టం.
ఇంకో ముఖ్యమైన విషయం స్మార్ట్ దోపిడీ. జేబులో భద్రంగా దాచుకునే క్యాష్‌కి గ్యారంటీ వుండదు. దోపీడీలు జరుగుతాయేమోననే భయంతోనే వుండాలి పెద్ద మొత్తం జేబుల్లో వుంటే. అదే, అక్కౌంట్లలో సొమ్ములుంటే భద్రం.. అనుకుంటాం. కానీ, అక్కడా సేఫ్టీ తక్కువే. మొన్నీమధ్యనే బ్యాంకుల్లోని అక్కౌంట్ల భద్రతకు ముప్పు వచ్చిపడిందంటూ పలు బ్యాంకులు హైరానా పడ్డాయి. ఏటీఎం పిన్ నెంబర్లు మార్చుకోమని సలహాలిచ్చాయి బ్యాంకులు. చాలా కార్డుల్ని రద్దు చేసి, కొత్త కార్డుల్ని కొత్త భద్రతా ఫీచర్లతో విడుదల చేశాయి కూడా. అంటే, ఇక్కడ భద్రత పూర్తిస్థాయిలో లేదనే కదా అర్థం.!
పెద్ద నోట్ల రద్దుతో పెద్ద పెద్ద సమస్యలొచ్చినమాట వాస్తవం. ఆ సమస్యల్ని కేంద్రం ముందే అడ్రస్ చేయలేకపోయిందన్నదీ నిర్వివాదాంశం. దాంతోపాటుగానే, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల ద్వారా బ్యాంకింగ్ కార్యకలాపాలపైనా చర్చ జరుగుతోంది. 'ప్లాస్టిక్ కార్డులు' అయినా, స్మార్ట్ ఫోన్ల ద్వారా బ్యాంకింగ్ అయినా.. బ్యాంకుల తరఫు నుంచి భద్రత సరిగ్గా వుండాలి. లేకపోతే, టెక్నాలజీకి అర్థమే వుండదు.
మన దేశంలో నిర్లక్ష్యం రాజ్యమేలుతుంటుంది. బ్యాంకుల పరంగా అయినా, వినియోగదారుడి పరంగా అయినా, ప్రభుత్వాల పరంగా అయినా. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అందుకే, ఇది తీసేద్దాం.. అదొక్క పద్ధతిలోనే నడుద్దామనంటే చెల్లదిక్కడ. మేధావి వర్గంగా చెప్పుకునే కొందరు పొలిటీషియన్లు, ఇతర ప్రముఖులు.. పెద్ద పెద్ద మాటలు చెప్పడం బాగానే వుంటుందిగానీ, ఆచరణలోనే అష్టదరిద్రాలూ కన్పిస్తాయి. మచ్చుకు ఓ ఉదాహరణ.. పెద్ద నోట్ల రద్దు. ఎనీ డౌట్స్.?