తెలంగాణలో స్వైన్‌ఫ్లూ దెబ్బకి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఇప్పటికే వందకు పైగా స్వైన్‌ఫ్లూ బారిన పడ్డారు తెలంగాణలో. రోజూ ఒకరో ఇద్దరో స్వైన్‌ఫ్లూ దెబ్బకు మృత్యువాతపడ్తున్నారు. ‘స్వైన్‌ఫ్లూ ఇప్పుడు అంత ప్రమాదకరంగా లేదు.. చిన్నపిల్లలు, వృద్ధులు, వివిధ రకాలైన వ్యాధులతో బాధపడ్తున్నవారు అప్రమత్తంగా వుంటే సరిపోతుంది..’ అని స్వైన్‌ఫ్లూపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక వైద్య అధికారులు చెబుతున్నా, పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది.. స్వైన్‌ఫ్లూ భయాందోళనలు కలిగిస్తోంది.
స్వైన్‌ఫ్లూపై ప్రభుత్వం అప్రమత్తంగా వుందని ఉప ముఖ్యమంత్రి, స్వతహాగా వైద్యుడు అయిన రాజయ్య చెప్పడం సంగతెలా వున్నా, ప్రజల ప్రాణాలు మాత్రం స్వైన్‌ఫ్లూ పుణ్యమా అని హరీమంటున్నాయి. చలి తీవ్రత పెరగడం స్వైన్‌ఫ్లూకి వరంగా మారింది.. అది జనం నెత్తిన పిడుగులా పడేందుకు అవకాశం కలుగుతోంది. ప్రజల్లో అప్రమత్తత పెంచడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసౌకర్యాలు మరింత మెరుగుపరచడం అనే కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సి వున్నా, ఈ విషయంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చలి తీవ్రత ఇంకెన్నాళ్ళు వుంటుందోగానీ, ఈలోగా స్వైన్‌ఫ్లూ మరింతమందిని మింగేసే ప్రమాదం పొంచి వుందన్నది నిర్వివాదాంశం. ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ విషయంలో మరింత చొరవ చూపాల్సి వున్నా, ఆయనా.. ఆయన మంత్రి వర్గం ఏ మేరకు అప్రమత్తంగా వుందో ఎవరికీ తెలియని పరిస్థితి. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ళి, అక్కడ సరైన చికిత్స అందక.. చివరి నిమిషంలో ప్రభుత్వాసుపత్రులకు వస్తుండడం వల్లే మరణాలు పెరుగుతున్నాయని ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది.
అయితే, ప్రభుత్వాసుపత్రుల్లో నమోదవుతున్న కేసులకన్నా, రోగం తెలియక మరణిస్తోన్నవారి సంఖ్య ఇంకా చాలా ఎక్కువగానే వుందనే అభిప్రాయాలు, భయాందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు.?