కుదేలైపోతున్న బయ్యర్లు

సినిమాలు కొడుతున్న దెబ్బలకు తెలుగునాట బయ్యర్లు కుదేలైపోతున్నారు. కొన్నాళ్ల క్రితం రభస, ఆగడు, సికిందర్, తదితర సినిమాలు కొట్టిన దెబ్బలు ఇన్నీ అన్నీ కావు. కాస్త తేరుకున్నారు అంటే లింగా వచ్చి మళ్లీ దెబ్బేసింది.…

సినిమాలు కొడుతున్న దెబ్బలకు తెలుగునాట బయ్యర్లు కుదేలైపోతున్నారు. కొన్నాళ్ల క్రితం రభస, ఆగడు, సికిందర్, తదితర సినిమాలు కొట్టిన దెబ్బలు ఇన్నీ అన్నీ కావు. కాస్త తేరుకున్నారు అంటే లింగా వచ్చి మళ్లీ దెబ్బేసింది. అది అలా పచ్చిగా వుండగానే ఇప్పుడు గోపాల గోపాల, ఐ సినిమాలు కూడా అదే బాదుడు బాదేలా కనిపిస్తున్నాయి.

 గోపాల గోపాల ఇప్పటికి అధికారిక లెక్కలు తెలియకపోయినా, మన రాష్ట్రంలో పన్నెండు నుంచి పదమూడు కోట్లు వరకు వసూళ్లు వచ్చాయని వినికిడి. సినిమాను యాభై పైనే అమ్మారని తెలుస్తోంది. పోనీ నలభైకి అమ్మారు అనుకున్నా, ఇప్పటికి ఇరవై వచ్చేసింది అని ఎక్కువ అంచనా వేసుకున్నా, ఇంకా ఇరవై రావాల్సి వుంది. ఎంత వచ్చినా మరో నాలుగు రోజులే. ఆపైన ఈ హడావుడి వుండదు. 

ప్రస్తుతానికి ఐ ఎఫెక్ట్ వల్ల గోపాల గోపాల కాస్త పుంజుకుంది. అయినా కూడా  దాదాపు పావలా నుంచి అర్థరూపాయి పోయే అవకాశం కనిపిస్తోంది బయ్యర్లకు. 

ఇక ఐ సినిమా 32 కోట్లకు తెలుగుహక్కులు కొన్నారు. ఖర్చులు కలిపి ఎంతకు అమ్మి వుంటారో తెలియదు. దాదాపు అన్ని ఏరియాలు అమ్మేసారని, కొంత మేర స్వంత విడుదల జరిగిందని తెలుస్తోంది. అమ్మిన ఏరియాలు మాత్రం చాలా భారీ ఫ్యాన్సీ రేట్లకు అమ్మారని వినికిడి. మొదటి రెండు రోజుల కలెక్షన్లు బాగానే వున్నాయి. మరో నాలుగు రోజులు ఇదే మాదిరిగా వున్నా కూడా కోలుకోవడం కష్టం అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.