దేవుడి ముందు ఎవరైనా ఒకటే.. అని చాలా పురాణాల్లో పేర్కొన్నారు.. భక్తి ప్రవచనాల్లో పండితులు ఇప్పటికీ ఆ మాట చెబుతూనే వున్నారు. కానీ, దేవుడి ముందు వీఐపీలు వేరు.. సామాన్యులు వేరన్న విషయం మాత్రం ఎప్పటికిప్పుడు నిరూపితమవుతూనే వుంది. దేవుడి ముందు ‘పాలన’ ముసుగులో అధికారులు భక్తుల్ని సామాన్య భక్తులు.. వీఐపీ భక్తులుగా విభజిస్తున్నారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుమలకు భక్తులు పోటెత్తారు. తిరుమల మాత్రమే కాదు, రాష్ట్రమంతటా ప్రధాన దేవాలయాల్లో ఇదే పరిస్థితి. అక్కడా ఇక్కడా అన్న తేడాలే లేవు.. అన్ని చోట్లా.. అంటే పాలక మండళ్ళు వున్న ప్రతి చోటా భక్తుల్ని అధికారులు విడదీశారు. ఎవరు ఎంత ఖర్చుపెట్టగలిగితే అంత గొప్పగా దేవుడి దర్శనం దొరుకుతోంది దేవాలయాల్లో.
ఇదేం భక్తి.? అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నా.. పాలకులకి అవేమీ పట్టడంలేదు. నిన్న ఉదయం నుంచీ తిరుమల కొండపైకి వేల సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. సుమారు 2 లక్షల మంది శ్రీవారిని దర్శించుకుంటారని టీటీడీ అంచనా వేసింది. పెద్ద సంఖ్యలో వీఐపీ టిక్కెట్లనూ టీటీడీ అమ్మేసుకుంది. సామాన్యుల పాట్లు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
భక్తితో కొండెక్కిన సామాన్య భక్తులు తమకు వెంకన్న దర్శన భాగ్యం సరిగ్గా జరగకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికీ, టీటీడీకీ వ్యతిరేకంగా భక్తులు చేసిన నినాదాలతో తిరుమల కొండ మార్మోగిపోయింది. వీఐపీలు మాత్రం హ్యాపీ హ్యాపీగా వెంకన్న దర్శనం చేసుకొచ్చేశారు.
హైద్రాబాద్ శివార్లలోని చిలుకూరు దేవస్థానం గురించి చాలామందికి తెలిసే వుంటుంది. అక్కడ భక్తుల మధ్య విభజన లేదు. దేవుడి ముందు ఎవరైనా ఒక్కటేనన్న సిద్ధాంతం అక్కడ అమలవుతోంది. భక్తులకు సౌకర్యాలు కల్పించే ముసుగులో పెద్దయెత్తున వ్యాపారం జరుగుతోందన్న విమర్శలు ఇలాంటి సందర్భాల్లో మరింత ఎక్కువగా విన్పిస్తుంటాయి. కారణం భక్తుల ఆవేదనే.