విష కౌగిలిలో విశాఖ

విశాఖపట్నం అంటే శాంతి భద్రతలకు నిలయమన్నది నిన్నటి మాట. అరాచకానికి అద్దమన్నది  నేటి మాట. నగరం పెరుగుతోంది. అంతే స్ధాయిలో శాంతి భద్రతలూ గుల్ల అవుతున్నాయి. అంతర్జాతీయ నగరంగా కీర్తిని అందుకుంటున్న విశాఖలో  …

విశాఖపట్నం అంటే శాంతి భద్రతలకు నిలయమన్నది నిన్నటి మాట. అరాచకానికి అద్దమన్నది  నేటి మాట. నగరం పెరుగుతోంది. అంతే స్ధాయిలో శాంతి భద్రతలూ గుల్ల అవుతున్నాయి. అంతర్జాతీయ నగరంగా కీర్తిని అందుకుంటున్న విశాఖలో   ఆ అలవాట్లు కూడా అల్లుకుంటున్నాయి. పబ్ కల్చర్ విశాఖను నిండా ఆవహించి ఉంది. రాత్రీ, పగలూ తేడా లేకుండా యువత మత్తులో జోగే విష సంస్కృతి కూడా వేళ్లూనుకుంటోంది. ఢిల్లీ, హైదరాబాద్‌ల తరువాత అత్యాచారాలకూ నగరం కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. తాజాగా గురువారం ఓ న్యాయ విద్యార్ధినిపై జరిగిన అత్యాచారం నగర పరిస్థితులకు అద్దం పడుతోంది. మరింత అప్రమత్తత అవసరమని తెలియచేస్తోంది.

పెరిగిన పబ్ కల్చర్ 

హైదరాబాద్‌లో రేవ్ పార్టీలు, రెయిన్ డ్యాన్స్‌లు అన్నవి జరుగుతాయి. అక్కడ అది సర్వ సాధారణం.  అదే రకమైన  సంస్కృతి విశాఖకు పాకిందని తెలిసి విస్తుబోవడం నగర జీవి వంతవుతోంది. విభజనకు ముందు విశాఖ ఓ మాదిరిగా ఉండేది. విభజన తరువాత ఐటి సెక్టార్‌లో హైదరాబాద్ స్ధానాన్ని ఆక్రమించుకుంది. ఈ క్రమంలో ఐటిలో ఉన్న సవాలక్ష అవలక్షణలూ విశాఖకు వలస వస్తున్నాయి. వీకెండ్ పార్టీలు ఇపుడు నగరంలో షరా మామూలు వ్యవహారంగా మారిపోయింది. అలాగే, అర్ధరాత్రి అపరాత్రి అన్న తేడా లేకుండా యువత మందేసి చిందేయడమూ బాగా ఎక్కువైంది. నగరంలోని  ప్రధాన ప్రాంతంలో  ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది. పదేళ్ల క్రితం ఏర్పాటైన ఈ కంపెనీలో షిఫ్టు డ్యూటీల మీద యువత పనిచేస్తారు. ఇక్కడ గతంలోనే ఉద్యోగులలో లైంగిక స్వేచ్ఛ ఎక్కువన్న వార్తలు వచ్చాయి. ఇటీవల కాలంలో అది మరింత ఎక్కువైంది. కంప్యూటర్ జాబ్‌లు చేసే వారికి ఆ మాత్రం ఉపశమనం ఉండవద్దా అన్న వాదనలూ గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇవి ఎంతవరకూ వెళ్లాయంటే మేము ఏం చేసినా తప్ప లేదు అన్న ధోరణి యువతలో పెరిగిపోతోంది. 

నడిరోడ్డు మీదనే యువతీ యువకులు మందేసి చిందేయడం సర్వ సాధారణంగా చేసే ప్రక్రియకూడా సాగుతోంది. పబ్‌లు ఉంటేనే తప్ప నగరంలో ఐటీ సెక్టార్‌ను విస్తరించలేమన్న మహా కంపెనీలూ ఉన్నాయి. వీకెండ్‌లో జల్సా చేయడానికి అవసరమైన రెస్టారెంట్లు, పార్కులు మరిన్ని ఉండాలన్న సాఫ్ట్‌వేర్ యువత డిమాండూ ఇపుడు బాగానే వినిపిస్తోంది. రుషికొండలో ఐటి సెక్టార్ ఇపుడు కాళ్లూనుకుంటోంది. అలాగే, మధురవాడ పరిసరాలలో ఐటికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలూ, ప్రాజెక్టులు విస్తరించే పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ నేపధ్యంలో యువతకు జల్సాలకు తగినన్ని ఆనందనిలయాలను ఏర్పాటుచేసే పనిలో కొన్ని రిక్రియేషన్ సంస్ధలు సిద్ధంగా ఉన్నాయి. వాటికి అవసరమైన స్ధలాలను ఇచ్చేందుకు కూడా సంబంధిత ప్రభుత్వ శాఖలూ సుముఖంగా ఉన్నాయి. 

ఇవి ఇలా ఉండగానే ఉన్నంతలోనే సరదాలు తీర్చుకునే పనిలో యువత పడ్డారు ఏదో ఒక సందర్బం చూసుకుని పార్టీలు చేసుకోవడం నగరంలో షరామామూలు వ్యవహారమైంది విశాఖలో విద్యా సంస్ధలు కూడా పెరగడం, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న విద్యార్ధినీ, విద్యార్ధులకు అలవి కాని స్వేచ్ఛ లభించడం కూడా విష సంస్కృతి వీర విజృంభణకు మరో కారణం. తాజాగా జాతీయ న్యాయ కళాశాలలో చదువుతున్న ఓ న్యాయ విద్యార్ధినిపై ఓ బీహారీ యువకుడు అత్యాచారం చేయడంతో నగరం ఉలిక్కిపడింది. ప్రశాంత విశాఖలో ఎన్నడూ జరగని వ్యవహారంగా దీనిని నగర ప్రజలు భావించారు. ఇలాంటివి ఇక్కడ కూడా జరుగుతున్నాయా అని ఆవేదన వ్యక్తం చేశారు.  ఎక్కడో వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ఈ విద్యార్ధినీ విద్యార్ధులంతా పార్టీలు చేసుకుని మద్యం సేవించారని,  ఆ తరువాత ఆ యువకుడు అత్యాచారం చేశాడన్నది  పోలీస్ దర్యాప్తులో వెల్లడైన సత్యం. 

ఆ సిటీల బాటలో…

నగరంలో సాఫ్ట్‌వేర్ సిటీల వాతావరణం బాగా విస్తరిస్తోంది.   దీంతో,   పార్టీల కల్చర్ బాగా ఎక్కువైంది. ఆడా మగా కలసి ఒక్కటై చేసుకుంటున్న సరదా సంబరాలు చివరికి విచ్చలవిడి తనాన్ని ప్రోత్సహిస్తున్నాయి. హద్దు మీరుతున్న యువత చివరికి జీవితాలేక కళంకం తెచ్చుకుంటున్నారు. నగరంలో ఇపుడు యువతీ యువకులకు అద్దెకు ఇవ్వడం కూడా మారుతున్న నగర సంస్కృతిని తెలియచేస్తోంది. ఒకప్పుడు ఇల్లు అద్దెకు ఇవ్వాలంటే పెళ్లి అయిందా, వాళ్ల కుటుంబ వివరాలు ఏమిటన్నది ఆరా తీసి మరీ ఇచ్చేవారు. ఇపుడు ధనమే పరమావధిగా మారిన రోజులలో ఎంవీపీ కాలనీ, సీతమ్మధార వంటి ప్రాంతాలలో ఎటువంటి వివరాలూ సేకరించకుండానే భారీ మొత్తాలను అందుకుని ఇళ్లను అద్దెలకు ఇస్తున్నారు.  

దాంతో, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌లకు పరిమితమైన డేటింగ్ సంస్కృతి కూడా మెల్లగా నగరానికి పాకుతోంది. అలాగే, అపార్ట్‌మెంట్‌లలో సైతం విచ్చలవిడితనంగా ఉండడం, రాత్రీ పగలూ లేకుండా జల్సాలు చేయడం కూడా అక్కడ వాచ్‌మెన్‌లు చెబుతున్న నగ్న సత్యాలు.  పోలీస్ పెట్రోలింగ్‌లో ఇవన్నీ కనిపిస్తున్నాయో లేదో తెలియదు కానీ, పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు మాత్రం ఉన్నాయి. అంతే కాదు, పోలీసులు కొంతమంది చిత్తశుద్ధితో విధి నిర్వహణచేస్తూ  పెడదారిన పడుతున్న యువతను పోలీస్ స్టేషన్‌కు రప్పించీ రప్పించకుండానే వారిని వదిలేయమని పలుకుబడి కలిగిన వాళ్ల నుంచి ఫోన్ల ద్వారా వత్తిడి వస్తోందని తెలుస్తోంది. మొత్తం మీద అందరూ కలిసే ఈ విష సంస్కృతిని పెంచి పోషిస్తున్నారన్నది వాస్తవం. ఇలాగే చూసీ చూడనట్లుగా వదిలేస్తే రానున్న రోజులలో విశాఖ కూడా ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్‌లతో పోటీ పడి నేర నగరంగా మారడానికి ఎంతో దూరం లేదన్నది పచ్చి నిజం.

మరో వైపు డ్రగ్ ముఠాలు

ఇక, విశాఖ నగరంలో మత్తు పదార్ధాల ముఠాల వీర విహారం కూడా ఇటీవల కాలంలో బాగా అధికమైంది. నగరంలోని రైల్వే ఆసుపత్రి అడ్డాగా డ్రగ్స్ ముఠాలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి.  ఆసుపత్రి వెనుక భాగంలో నిర్మానుష్యంగా ఉండడంతో ఇక్కడకు చేరుకుంటున్న కొందరు యువకులు మద్యం, ఇతర మత్తుపదార్థాలతో మునిగి తేలుతున్నారు. వారికి సరఫరా చేసేందుకు ముఠాలు తయారుగా ఉంటున్నాయి.  బడా బాబుల పిల్లలకు వీటిని విక్రయిస్తున్నారు. కేవలం వాటి కోసమే కార్లలో బారులు తీరుతున్న సంపన్న యువతను కూడా ఇక్కడే చూడడం జరుగుతోంది. 

విభజన తరువాత డ్రగ్స్ ముఠాలు విశాఖలో తమ ఉనికిని బలంగా చాటుకుంటున్నాయి. వీరి అయిపూ అజాలను కనుగొనడంలో అటు రైల్వే పోలీసులు, ఇటు నగర పోలీసులు కూడా వైఫల్యం చెందడంతోనే మూడు పువ్వులు ఆరు కాయలుగా వీరి వ్యాపారం విస్తరిస్తోంది. చదువుకున్న యువత, సంపన్న వర్గాలే లక్ష్యంగా వీరు ముందుకు కదులుతున్నారు. వీరికి కొంతమంది రాజకీయ పెద్దల అండదండలు కూడా ఉండడంతో అటు హైదరాబాద్, ఇటు ఒడిషా నుంచి మత్తు పదార్ధాలను తీసుకువచ్చి విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారు. 

మొత్తం మీద చూసుకుంటే విశాఖ అభివృద్ధికి చిరునామాగా మారడం మాట ఏమో కానీ, విషపు కౌగిలిలో చిక్కి విలవిలలాడుతోంది. రానున్న రోజులలో మరిన్ని సాప్ట్‌వేర్ కంపెనీలు విశాఖలో నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. అది కూడా జరిగితే బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ నుంచి మరింతగా ఈ సంస్కృతి దిగుమతి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీకెండ్ పార్టీలతో యువత భారతీయ నైతిక మూలాలేక తిలోదకాలు ఇస్తున్న ఉదంతాలను ఇకపై అంతా కళ్లారా చూసి తరించే రోజు అతి సమీపంలోనే ఉందన్నది సత్యం.

-పివిఎస్‌ఎస్ ప్రసాద్,
విశాఖపట్నం