నీచ రాజకీయాలకు పరాకాష్ఠ

జగన్ పార్టీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. ఎన్సీవై రెడ్టి అప్పడే తెలుగుదేశం పార్టీ తీర్ధం తీసుకున్నారు. జగన్ తో విబేధాలు లేవని, కేవలం తమ ప్రాంత అభివృద్ది కోసం పార్టీ మారానని చెప్పుకొచ్చారు.  Advertisement…

జగన్ పార్టీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. ఎన్సీవై రెడ్టి అప్పడే తెలుగుదేశం పార్టీ తీర్ధం తీసుకున్నారు. జగన్ తో విబేధాలు లేవని, కేవలం తమ ప్రాంత అభివృద్ది కోసం పార్టీ మారానని చెప్పుకొచ్చారు. 

ఇక్కడ మూడు సంగతున్నాయి.. పార్టీ మారడం, నాయకత్వంతో విభేదాలు లేకపోవడం, తమ ప్రాంత అభివృద్దికి పార్టీ మారాలనుకోవడం.

పార్టీ మారడం, నాయకత్వంతో విబేధాలు అన్నవి వ్యక్తిగత విషయాలు. ఒక పార్టీ టికెట్ పై పోటీ చేసి, ఆ పార్టీ సిద్ధాంతాలను, మానిఫెస్టోను జనాలకు ఊదరగొట్టి, గెలవడం అంటే చిన్న విషయమూ కాదు. పిల్లలాటా కాదు. రెండుపార్టీలు హోరాహోరీగా పోరాడినపుడు, ఎంతొ కొంత మంది జనం తమ వైపు నిల్చారంటే, అది పార్టీ సిద్దాంతాలు నచ్చి కొంత, వ్యక్తి నచ్చి మరి కొంత. మరి అటువంటపుడు,. ఆ పార్టీని పురిట్లోనే వదిలేసి, పక్క పార్టీలోకి పారిపోవడం అంటే ఏమనుకోవాలి? ఇంకా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే జంప్ జిలానీల బాగొతానికి తెర తొలగిందంటే ఏమని భావించాలి?

ఓట్లేసి గెలిపించిన ఓటర్ల నమ్మకాన్ని, అభిమానాన్ని టోకున తాకట్టు పెట్టేసినట్లే కదా. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే, విమర్శలతో విరుచుకు పడడానికి కారణం ఇదే కదా? ప్రజా ప్రాతినిధ్య  చట్టానికి ఇలాంటి కొత్త కొత్త రాజకీయవేత్తలను చూసి మరిన్ని మార్పులు చేయాలేమో? గెలిచిన తరువాత కనీసం, ఆరు నెలలయినా వుండాలని, అప్రెంటీస్ పిరియడ్ పెట్టాలేమో? అసలు ప్రజలే ఓట్ల కోసం వచ్చిన నాయకుల దగ్గర బాండ్ రాయించుకోవాలేమో? ఎన్నాళ్లు ఈ పార్టీలో వుంటారన్నదానిపై.

అధికార లాలస, ఖర్చుపెట్టిన కోట్లు, ప్రతిపక్షంలోవుంటే వెనక్కురావేమో అన్న భయం తప్ప వేరు. తమ ప్రాంత అభివృద్ది అన్నది వట్టిమాట. ఇప్పుడు బుట్టా రేణుక వ్యవహారమే చూడండి. వైకాపా అధికారంలోకి వస్తుంది, అంతకు అంతా సంపాదించేసకోవచ్చనో, మరే ఇతర ధీమాతోనో కోట్లు అప్పుచేసి, ఎన్నికలకు ఖర్చు చేసేసారని వినికిడి. ఇప్పుడు గెలిచిన దగ్గర నుంచి అప్పుల వారి వత్తిడులు పెరిగాయని నియోజకవర్గంలో టాక్. అధికారం వచ్చి వుంటే, ఎలాగూ సంపాదన వుంటుంది కాబట్టి వారూ ఆగివుండేవారు. కానీ ఇప్పుడా అవకాశం లేదు. ఇంక ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ మారక ఏం చేయాలి. అధికార పార్టీ వైపు వుంటే, కనీసం బాకీదారులు వత్తిడులైనా తగ్గుతాయి. 

కానీ ఎస్పీవై రెడ్డి సంగతేమిటి? ఆయన ఆర్థికంగా బలవంతుడు. ఆయన వ్యాపారాలు ఆయనకు వున్నాయి. కానీ ఆయన చెబుతున్నదేమిటి? తనకు రాజకీయాలు వృత్తి కాదు, ప్రవృత్తిమాత్రమే అని. ఈ మాట ఎన్నికల ముందు చెప్పి వుంటే, జనం వృత్తిగా భావించిన వారిని గెలిపించుకునేవారు కదా. ఈ పార్ట్ టైమ్ జనాలెందుకు?  కేవలం అధికార పార్టీలో వుంటేనే ప్రజలకు సేవచేసేందుకు వీలవుతుందనుకున్నపుడు, నికార్సయిన రాజకీయ నాయకులైతే, ప్రతిపక్షంలో వుండి నేను పీకేదేమీ లేదు, నాకు ఎలాగూ ఇవి పార్ట్ టైమ్ వ్యవహారామే అని రాజీనామా చేసి, పోటీ చేయకుండా ఇంట్లో కూర్చోవాలి. అంతే కానీ, తమ తమ వ్యాపారాలు సజావుగా సాగేందుకు అధికార పార్టీతో అంట కాగడం, దానికి ప్రజా సేవ, ప్రాంతీయ అభివృద్ది అన్నది మాస్క్ గా పెట్టుకోవడం చాలా అసంబద్ధం. ఏ వ్యాపారం చేసేవాడు, ఆ వ్యాపారానికి దన్నుగా రాజకీయాల్లోకి రావడం మామూలే. నంది పైపుల దగ్గర నుంచి, అనేకానేక వ్యవసాయాధార వస్తువుల వ్యాపారం ఆయనది. ఇప్పుడు అధికారపార్టీ కన్నెర్ర చేస్తే ఆయన పరిస్థితి ఏమిటి? ప్రభుత్వ ఫథకాలకు, ఆయన సామగ్రి కొనకూడదని ఆఫ్ ది రికార్డు వత్తడి వుంటే ఏమవుతుంది. ఈ దెబ్బ ముందు ప్రజలకు వెన్నుపోటు పెద్ద విషయం కాదు. ఒక రోజు, రెండు రోజులు, వాళ్లే మరిచిపోతారు. వీధి పండుగలు, ఫంక్షన్లకు డొనేషన్లతో  పరిస్థితి మళ్లీ మామూలే. 

వ్యక్తులు ఇలా ఆలోచించారంటే, అర్థం వుంది,. కానీ ప్రజాస్వామ్యానికి అంతో ఇంతో ఆసరాగా వున్న పార్టీలు కూడా ఇలాంటివి ప్రోత్సహిస్తే ఎలా? పైగా నీతి నిబద్దత మా ఊపిరి అని చెప్పుకునే పార్టీలు ఇలా చేస్తే ఎలా? గతంలో వైఎస్ఆర్ రెండోసారి ముఖ్యమంత్రి కాగానే ఈ తరహా ఆపరేషన్ ఆకర్షను చేపట్టారు. అయితే అక్కడ పార్టీల నాయకులను ఆయన ఆకర్షించే పని పెట్టకున్నారు. ఇక్కడ గెలిచిన వారిని రాబట్టే పని పెట్టుకున్నారు. రెండింటికీ తేడా ఏమీ లేదు. తప్పు ఎవరు చేసినా తప్పే. 

అయితే ఇక్కడ తెలుగుదేశం పరమార్థం మాత్రం వేరు. జగన్ అనే వాడిని కూకటి వేళ్లతో ఏరేయాలి,. వచ్చే ఎన్నికల నాటికి అతగాడిని వుంచకూడదు. అందుకు కావాల్సింది ముందుగా అతడి చుట్టూ వున్న బలాన్ని తగ్గించాలి. ఆపై అతగాడి గతకాలపు చీకటి వ్యవహారాలను మళ్లీ తవ్వాలి. అప్పుడు అడ్డుపడడానికి, చట్టసభల్లో గొంతెత్తడానికి ఎవరూ వుండకూడదు. అలాచేయాలంటే, ముందుగానే వాళ్లని లాగేయాలి. అదీ ప్రణాళిక. 

గెలిచి పక్షం రోజులు కాకుండానే ఇలా జంప్ అంటే, తప్పు అని చెప్పాల్సింది పోయి, యనమల లాంటి రాజనీతి కోవిదులు, ఫలానా సెక్షన్ ప్రకారం హాయిగా గోడగెంతేసి మా దాంట్లోకి రావచ్చు అనడం అంటే, నీతిమాలిన, దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అనుకోవాలి తప్ప వేరు కాదు. 

నిజానికి వైకాపా అధికారంలోకి వస్తుందని కళ్లు మూసేసుకుని, ఇష్టం వచ్చినట్లు చిత్తానికి డబ్బులు అప్పులు చేసి మరీ ఖర్చు చేసేసిన కాండిడేట్లు చాలా మందే వున్నారు. వీరందరికీ ఇప్పుడు ఇంట్లో తలుపులు మూసుకుని బాధ పడడమే తరువాయిగా వుంది. ఆ మధ్య మాజీ మంత్రి డొక్కా చెప్పింది ఇదే. గెలిచినవాడు ఇంట్లో ఏడుస్తాడు..ఓడిన వాడు బయట ఏడుస్తాడు అని. అలాంటి వాళ్లందరికీ ఇప్పుడు అధికార పక్షమే దిక్కు. అధికార పక్షానికి కావాల్సిందీ ఇదే. ఎంత మంది వస్తే అంతమందినీ లోపలకు తొసి, ఆపై జగన్ ను ఒంటరి చేయడం. ఇది పెద్ద కష్టమెమీ కాదు.. కానీ రాజకీయ పార్టీలు అనేవి గుర్రపు డెక్క దుంపలాంటివి. అవి అలా పిలకలు వేస్తూనే వుంటాయి. ఇప్పుడు ఖాళీ అయిపోయినా, మళ్లీ ఎన్నికల నాటికి 175 మంధి అభ్యర్ధులు ఇట్టే పుట్టుకు వస్తారు. అంతవకరు పార్టీని నిలబెట్టుకోవడం, పాడు చేసుకోవడం అన్నది జగన్ చేతిలో వుంది. 

చాణక్య

[email protected]