పబ్లిసిటీ డిజైనర్‌గా బాపు రకరకాల 'ప్రొడక్టు'లను మార్కెట్ చేయడానికి చిత్రకళను సమర్థవంతంగా ఉపయోగించారు. సినిమా కూడా ఓ 'ప్రొడక్టే' కాబట్టి దానికీ ప్రకటనలు రాశారు. సినిమా పోస్టర్లలో తారలను ప్రముఖంగా చూపిస్తూ డిజైన్ చేయడం ఎప్పణ్నుంచో వుంది. బాపు డిజైన్ చేసిన పోస్టర్లు యిస్తూ పోతే ఎన్ని పేజీలూ చాలవు. మచ్చుకి ఒకటి చూడండి.
మూగమనసులు సినిమాలోని ముఖ్యపాత్రలు ముగ్గుర్నీ బొమ్మల ద్వారా పరిచయం చేసిన ప్రకటన. హీరో పడవవాడు, అతను హీరోయిన్‌కు రోజూ ముద్దబంతి పువ్వు యిస్తూ వుంటాడు. ఇక ప్రేమ త్రికోణంలోని మూడో పాత్ర ఎప్పుడూ పంగల కఱ్ఱ చేత ధరించి తిరిగే గొఱ్ఱెలు కాచుకునే గౌరి! పడవ కింద నీటి అలల్ని గమనిస్తే పంగల కఱ్ఱ కనబడుతుంది.
1967లో సొంతంగా సినిమా నిర్మాణంలోకి దిగి తీసిన ''సాక్షి'' పోస్టర్ యిది. అప్పట్లో యిది వినూత్నంగా వుండి అందరినీ ఆకర్షించింది. హీరో కంటె విలనే ప్రస్ఫుటంగా కనబడ్డాడు. అదీ వింత! తీసిన చిత్రనిర్మాణ సంస్థ 'నందనా' ఫిలింస్. అందుకే పైన నెమలికన్ను. దానికి తోడు హీరో పేరు కిట్టప్ప. వీధినాటకంలో కృష్ణుడి వేషం కడతాడు కూడా.
కార్టూన్ల ద్వారా సినిమాను ప్రమోట్ చేసిన సందర్భాలు ఒకటి రెండు చూద్దాం. ''మంచి మనసులు'' సినిమా లో 'ఏమండోయ్ శ్రీవారూ, ఒక చిన్న మాట' అనే పాటను ప్రమోట్ చేస్తూ కార్టూన్‌లా వేశారు.
అలాగే ''ఖైదీ కన్నయ్య'' సినిమా చూడడానికి సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు ఎలా సిద్ధమవుతున్నారో కూడా వ్యంగ్యచిత్రాల ద్వారానే చెప్పారు.
''బాలరాజు కథ'' సినిమా చూడడానికి ఓ పిల్లవాడు తల్లి దగ్గర వేసే ట్రిక్కులు మరో కార్టూన్!
''బాగ్దాద్‌గజదొంగ'' లాటి సినిమాలకు పబ్లిసిటీ డిజైన్ల ద్వారా కథలు చెపితే,
మరి కొన్నిటి ద్వారా ''వింతకాపురం'' సినిమాలో కారుని హైలైట్ చేస్తూ కార్టూన్ పబ్లిసిటీ చేశారు.
''ముత్యాలముగ్గు'' నూరు రోజుల పండగకు ఆహ్వానం దానిలోని కాంట్రాక్టరు పాత్ర ద్వారానే చెప్పించారు.
''బుద్ధిమంతుడు'' సినిమా పబ్లిసిటీలో ఆ సినిమాలో ముఖ్యఘట్టాలను రేఖాచిత్రాలుగా పరిచయం చేసి, ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తించారు.
'అల్లుడే మేనల్లుడు'' సినిమా పబ్లిసిటీలో పాత్రల గురించి ఏమీ వుండదు. సినిమా చూస్తే ఎంత హాయిగా వుంటుందో కొన్ని ఉదాహరణలతో చెప్తుందంతే.
బాపు రమణలు తమపై, తమ సినిమాలపై తామే జోకులు వేసుకుంటారని అందరికీ తెలుసు. ఈ జోకులు కాస్ట్‌లీ జోకులు – ఎందుకంటే వాటిని పత్రికలు యాడ్స్‌గానే చూస్తాయి. వాళ్ల రెండో సినిమా ''బంగారు పిచిక'' లో బజెట్‌లోనే తీశారు. అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో బహుమతులు వచ్చే అవకాశం ఎందుకు లేదో చమత్కారంగా చెప్పారు. లీడ్ చూస్తే ఆ ఫెస్టివల్స్‌లో ఆ సినిమా పాల్గొంటోందన్న భ్రమ కల్పించి, తర్వాతి వాక్యాలలో అబ్బే వెళ్లటం లేదు, ఎందుకంటే కాస్త ఆలస్యంగా రిలీజవుతోంది అని సంజాయిషీ. (లేకపోతే వెళ్లేట్లే!) ఇలా బడాయికి పోయేవాళ్లపై యిది చురక లాటిది.
అలాగే ''అందాల రాముడు'' సినిమా మొదటి రిలీజ్‌లో అనుకున్నట్లుగా ఆడకపోతే డబ్బు ఖర్చు పెట్టి యిలాటి జోకులతో ప్రచారం చేసుకున్నారు. అంకె పెద్దగా కనబడాలని రాష్ట్రంలో ఆడిన అన్ని ఆటలను కలిపి పెద్ద అంకె వేసి 'సంయుక్త ప్రదర్శన' అని క్లెయిమ్ చేశారన్నమాట. దాని కిందే జోకు – టీచరు పడవల వేగంపై ప్రశ్న వేస్తే విద్యార్థి చెపుతాడు -అసలు పడవలు కదలటమే లేవండి అంటూ. ఆ సినిమాలో కథంతా రెండు పడవల చుట్టూ తిరుగుతుంది. ఒక మధ్యతరగతి వారి జనతా బోటు, మరొకటి డబ్బున్నవాళ్ల రాజహంస. ఇద్దరి మధ్య జరిగే పేచీలు, ప్రేమలే కథాంశం. ఇలాటి సొంత నెగటివ్ పబ్లిసిటీ ఫలించి, సినిమాకు మేలు జరిగి పుంజుకోవడం ఆశ్చర్యకరమైన వాస్తవం.
ఊరికే పొగిడేవాళ్లను భజంత్రీ మేళం ద్వారా ''ముత్యాలముగ్గు'' లో ఆట పట్టించిన బాపురమణలు తమను కూడా స్పేర్ చేసుకోలేదు. 100 వ రోజు ఫంక్షన్ నాడు ఎవరో వచ్చి కాంట్రాక్టర్ వద్ద 'ఆహా ఓహో ఏం పిక్చరండి' అనగానే భజంత్రీల వాళ్లు మేళం వాయించేస్తారు.
వారి ప్రభ తగ్గిపోయిన తర్వాత వచ్చిన సినిమా ''రాధాగోపాళం''. మధ్యతరగతి యింటి లొకేషన్‌లోనే భార్యాభర్తల మధ్య శృంగారాన్ని చిత్రీకరించారు. తక్కువ బజెట్ కాబట్టి బెడ్‌రూమ్‌లోనే రెండు మంచాలు వేసి రీళ్లు చుట్టేశారని విమర్శలు వచ్చాయి. అవును, నిజమే అని ఒప్పుకుంటూ దాన్నే ఓ ఘనతగా అనుకోండి అన్నట్టు వేసిన పబ్లిసిటీ కార్టూన్ యిది. నిర్మాతలు వేరే వారు కాబట్టి దీన్ని పేపర్లో యాడ్‌గా యిచ్చినట్లు లేదు. ''బంగారు పిచిక'' విషయంలో అయితే వాళ్లే నిర్మాతలు కాబట్టి 'భారీ ఎత్తున బ్రహ్మాండమైన సెట్లతో, అధిక వ్యయప్రయాసలతో తీసిన చిత్రం' అని మొదలుపెట్టి '…అని చెప్పుకునే సావకాశం మాకు లేదు. సాధ్యమైనంత తక్కువ వ్యయంతో తక్కువ కాలంలో ఆడుతూపాడుతూ సరదాగా తీశాం. మీరూ మా అంత సరదాగా ఆనందంగా చూస్తారని మా ఆశ' అని బాహాటంగా చెప్పేశారు. అలాటి నిర్మాతలు వేరెవరైనా వున్నారా? (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2014)