టీడీపీ నేత, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. విశాఖ చేరుకున్న బాలకృష్ణ, సీఎం చంద్రబాబునాయుడిని కలిసి తుపాను బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి 35 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. తుపాను బీభత్సంతో అందమైన విశాఖ విలవిల్లాడిరదనీ, విశాఖను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా వుందనీ, ప్రభుత్వం ముందు జాగ్రత్తలతో ప్రాణ నష్టాన్ని కొంతవరకు తగ్గించగలిగిందని అన్నారు బాలకృష్ణ.
తుపాను బీభత్సం తనను కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేసిన బాలకృష్ణ, విశాఖ ప్రజలు విపత్తు సమయంలోనూ ధైర్యంగా వ్యవహరించారనీ, ప్రభుత్వానికి సహకరించారనీ, పునర్‌నిర్మాణంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సి వుందన్నారు. విశాఖతోపాటు, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలూ తీవ్రంగా నష్టపోయాయని బాలకృష్ణ చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఐదు రోజులుగా విశాఖలోనే వుంటూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారనీ, విశాఖ ప్రజల్లో ధైర్యం నింపారనీ, వారికి అండగా వున్నారని బాలకృష్ణ కొనియాడారు. పర్యాటకంగా పేరొందిన విశాఖ తుపాను దెబ్బకు పచ్చదనాన్ని కోల్పోయినప్పటికీ, దాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటామని అన్నారు.