కాంగ్రెసు పార్టీ ఐదు రాష్ట్రాలలో ఘోరంగా ఓడిపోయింది. నాయకత్వంలో మార్పు రావాలని, సంస్థాగత ఎన్నికలు జరిపి బలమైన నాయకులెవరో తెలుసుకుని వారికి బాధ్యతలు పంచాలని జి-23 అడుగుతున్నారు. కానీ సోనియా ఒప్పుకుందా? తను నియమించిన కమిటీ సభ్యుల చేతనే ‘మీరే కొనసాగాలి’ అనిపించుకుంది. మార్పంటే మొహం చిట్లించింది. కాంగ్రెసు పార్టీలోంచి బయటకు వెళ్లి తృణమూల్ కాంగ్రెసు పెట్టుకున్న మమతాదీ అదే ధోరణి. ఓటమి తర్వాత కూడా సోనియా అలా ప్రవర్తిస్తే అద్భుతమైన గెలుపుల తర్వాత మమత యింకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. తృణమూల్ విషయంలో మార్పు అడిగినవాళ్లు పరాయివాళ్లు కాదు, సాక్షాత్తూ మేనల్లుడే! అయినా శిక్ష తప్పించుకోలేకపోయాడు.
ఇప్పటిదాకా తృణమూల్ గెలిచింది అంటే మమత ఒక్కరికే ఆ క్రెడిట్ వెళ్లేది. 2021 మే అసెంబ్లీ ఎన్నికల గెలుపులో ప్రశాంత కిశోర్‌కు, అతన్ని తెచ్చి, అతను చెప్పినట్లు నడుచుకుందామన్న అభిషేక్‌కు కూడా క్రెడిట్‌లో కొంత భాగం వెళ్లింది. ప్రశాంత్ ‘గెలుపు ఘనత నాది కాదు, మమతదే’ అని నిర్ద్వంద్వంగా ప్రకటించాడు. అభిషేకూ అంతే. అయినా మమత అతని పాత్రను గుర్తించి, ఎన్నికల ఫలితాల తర్వాత నెలకు తృణమూల్ జాతీయ జనరల్ సెక్రటరీ పోస్టులో నియమించింది. ఎన్నికలకు ముందు ప్రశాంత్, అభిషేక్ కలిసి ఎన్నో మార్పులు సూచిస్తే వాటిని పార్టీ సీనియర్లు ప్రతిఘటించారు. అయినా మమత వారి మాట కొట్టిపడేసి, ప్రశాంత్ చెప్పిన మార్పులు చేసింది. ఫలితాల తర్వాత తృణమూల్ దేశమంతా విస్తరించాలి కాబట్టి, మమత నేషనల్ ప్రెసిడెంటుగా ఉంటూ 34 ఏళ్ల అభిషేక్‌ను నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంటుగా పెట్టాలని, ఆ విధంగా మమత ఎక్కువగా తిరగనక్కరలేకుండా అభిషేక్ జాతీయ వ్యవహారాలు చక్కబెట్టవచ్చని అనుకున్నారు.
అభిషేక్ పార్టీలో మార్పులు త్వరితంగా చేయడానికి సమకట్టాడు. తృణమూల్ హింసా రాజకీయాలపై అసంతృప్తి ఉన్న వర్గాలను కూడా ఆకట్టుకోవడానికై ప్రయత్నించాడు. ‘ఎన్నికలలో గెలవడానికి పార్టీ తరఫున కొందరు గూండాలు రిగ్గింగ్ చేస్తున్నారు. వారిపై చర్య తీసుకుంటాం’ అని ప్రకటించాడు. పరిపాలనలో ఉన్న లోపాలను, అవినీతిని క్షాళన చేయడానికి సమకట్టాడు. అనేక ప్రభుత్వశాఖల్లో స్పెషల్ సెక్రటరీల పేరుతో కొందరు ప్రొఫెషనల్స్‌ను డైరక్టుగా రిక్రూట్ చేయించాడు. వివిధ శాఖలు జిల్లాలలో నిధులు ఖర్చు చేసే విధానాన్ని గమనించి, సమాచారం అందించడానికి ప్రశాంత్ టీము ఐపాక్‌ను వినియోగించుకున్నాడు. వాటి ఆధారంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ శాఖలోని సెక్రటరీని హెచ్చరించడం కూడా జరిగింది.
సెక్రటేరియట్‌లో సైతం సీనియర్ అధికారులు మమతను సమర్థిస్తూండగా, జూనియర్ అధికారులలో అభిషేక్ తన పలుకుబడిని పెంచుకున్నాడు. ఐపిఎస్‌లలో అతని కంటూ ఒక లాబీ ఏర్పడింది. ప్రమోషన్లు, బదిలీలు అతని కనుసన్నల్లో జరుగుతున్నాయట. ఐఏఎస్‌లలో కూడా పిఎల నియమాకం అతను చెప్పినట్లు జరుగుతోందట. కోవిడ్ ఉధృతంగా ఉండగా గంగాసాగర్ ఉత్సవం వచ్చింది. ఇది ప్రజల ఉత్సవం కాబట్టి చేసుకోవచ్చు అని మమత అనగా, అభిషేక్ జరపకపోవడం మేలని నా వ్యక్తిగత అభిప్రాయం అని ప్రకటించాడు. దీనితో పాటు తన డైమండ్ హార్బర్ పార్లమెంటు నియోజకవర్గంలో కరోనా కట్టడికై విపరీతంగా టెస్టింగులు చేయించాడు. వాక్సిన్లు వేయించాడు. ఇది ‘డైమండ్ హార్బరు మోడల్’గా పేరుబడి ప్రశంసలు అందింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ అంతంతమాత్రం అనుకుంటూండగా అభిషేక్ ఐతే యిది సాధించాడు అని అందరూ మెచ్చుకున్నారు.
పార్టీలోంచి వృద్ధనాయకత్వాన్ని తప్పించి, వారి స్థానంలో యువతను తేవాలని, వన్ మాన్-వన్ పోస్టు పథకం కింద నాయకులు పార్టీలో కానీ, ప్రభుత్వంలో ఏదో ఒక పోస్టు మాత్రమే ఎంచుకోవాలని సూచించాడు. డైమండ్ హార్బరు నియోజకవర్గానికి ఎంపీగా వుంటూ, పార్టీ జనరల్ సెక్రటరీగా కూడా ఉండడం సబబు కాదని అనుకుని, ఎంపీ పోస్టుకి రాజీనామా చేస్తాననే ఫీలర్లు వదిలాడు. ఇది విని యువనాయకులందరూ అభిషేక్‌ను సమర్థించసాగారు. సోషల్ మీడియాలో అభిషేక్ నాయకత్వ లక్షణాల గురించి ప్రచారం సాగుతోంది. వీధి రౌడీగా పేరుబడిన మమత కంటె యితను భిన్నం అని మేధావులు, తటస్థులు, బెంగాలీ భద్రలోక్ అనుకోసాగారు. అతను బెంగాలీ, హిందీ, ఇంగ్లీషులలో మంచి వక్త. పాత బెంగాలీ నాయకుల్లా కుర్తా పైజమాలలో కాకుండా డెనిమ్, టీ షర్టుల్లోనే తిరుగుతాడు. ధైర్యవంతుడు కూడా. ఎన్నికల వేళ సిబిఐ తన భార్యపై మనీ లాండరింగ్ కేసు పెడితే ‘ధైర్యముంటే మీ దగ్గరున్న సాక్ష్యాలను బహిర్గతం చేయండి.’ అని అమిత్ షాకు ఛాలెంజ్ విసిరాడు.
పార్టీ బ్యానర్లలో మమత ఫోటోతో పాటు అభిషేక్ ఫోటోలు కూడా దర్శనమివ్వడంతో పార్టీలో అభిషేక్ తనకంటూ ఒక వర్గాన్ని తయారు చేసుకుంటున్నాడని, ఐపాక్ వారి సాయంతో మమతకు యిన్నాళ్లూ అండగా నిలిచిన పార్టీ సీనియర్లకు ముకుతాడు వేస్తాడనీ ప్రచారం జరిగింది. ‘కాళీఘాట్ తృణమూల్’ ‘కామాక్ స్ట్రీట్ తృణమూల్’ అనే వర్గాలున్నాయని జోకులు ప్రారంభమయ్యాయి. కాళీఘాట్‌లో మమత ఇల్లు, కామాక్ స్ట్రీట్‌లో అభిషేక్ ఆఫీసు ఉన్నాయి. చాలా ఏళ్లగా మమతను అంటిపెట్టుకుని ప్రభుత్వ పదవులతో పాటు పార్టీ పదవులు కూడా అనుభవిస్తూ తమకు అవకాశం యివ్వని వృద్ధనాయకత్వంపై అసంతృప్తిగా వున్న యువనాయకత్వం అభిషేక్ చుట్టూ చేరారు.
సీనియర్లందరూ యువత తమను కూడా ఏదో ఒక పోస్టుకి రాజీనామా చేసి తమకు అవకాశమీయ మంటారేమోనని భయపడ్డారు. మమత దగ్గరకు వెళ్లి మొత్తుకున్నారు. ‘ఇలాటి మార్పులు యింత త్వరగా చేస్తే పార్టీ తబ్బిబ్బు పడుతుంది’ అని వాదించారు. మమత వారి మాట వింది. అభిషేక్‌కు అడ్డుకట్ట వేయాలనుకుంది. 2021 డిసెంబరులో కలకత్తా కార్పోరేషన్ ఎన్నికల సమయంలో అభిషేక్, ఐపాక్ కలిసి తయారుచేసిన అభ్యర్థుల జాబితాలో చాలా మార్పులు చేసింది. ఇప్పటికే పదవులు అనుభవిస్తున్నవారికి, వారి కుటుంబసభ్యులకు టిక్కెట్టు యివ్వకూడదని అభిషేక్ అనగా, మమత ఆ ప్రతిపాదనను తోసిరాజని, ఆరుగురు ఎమ్మెల్యేలకు, ఒక ఎంపీకి, తన అనుయాయుల కుటుంబసభ్యులకు టిక్కెట్లు యిచ్చింది. 144 సీట్లలో 134 సీట్లు గెలిచి తన విధానమే సరైనదని చాటుకుంది.
దీని తర్వాత 2022 ఫిబ్రవరి 12న నాలుగు కార్పోరేషన్లకు జరిగిన ఎన్నికలలో కూడా తన జాబితాలోని వాళ్లకే టిక్కెట్లిచ్చింది. అదే నెలలో ఫిబ్రవరి 27న 108 మునిసిపాలిటీలకు ఎన్నికలు వచ్చాయి. ఐపాక్‌తో కలిసి తయారు చేసుకున్న జాబితాను అభిషేక్ పార్టీ ఐటి సెల్ ద్వారా ‘అభ్యర్థుల జాబితా యిదిగో’ అంటూ పార్టీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయించడంతో రగడ జరిగింది. నిరసనలు చెలరేగాయి. పార్టీ కార్యకర్తలు కొన్ని చోట్ల టైర్లు తగలబెట్టారు. దాంతో మమత వెంటనే మేల్కొని ‘లిస్టు తయారుచేసే బాధ్యతను మమత పార్థా చటర్జీకి, సువ్రత బక్షీకి అప్పగించారు. ఈ జాబితాపై వారి సంతకాలు లేవు. అది బోగస్.’ అని తన అనుయాయి చేత ప్రకటన యిప్పించింది. అభిషేక్‌ను ఏమీ అనలేరు కాబట్టి ఐపాక్ వాళ్లే అప్‌లోడ్ చేసేసుంటారు అనసాగారు కొందరు నాయకులు. దానిపై ప్రశాంత్, ‘అప్‌లోడ్ చేసే సౌకర్యం పార్టీ వర్గాలకే ఉంది తప్ప మా టీముకి లేదు. మేం చేశామనడం అబద్ధం.’ అని ప్రకటించాడు. మమత కొత్త లిస్టు తయారుచేసి దాని ప్రకారమే టిక్కెట్లిచ్చింది. నాలుగు కార్పోరేషన్లను, 108 మునిసిపాలిటీలలో 102టిని తృణమూల్ గెలిచింది.
తన పాప్యులారిటీ ఎంత దృఢంగా వుందో ఓ పక్క నిరూపించుకుంటూనే మమత అభిషేక్‌ను కట్టడి చేయసాగింది. అతని అనుయాయులు పన్నెండుమందికి సెక్యూరిటీ కవర్ తీసేసింది. అతని సన్నిహిత సహచరుడు ఒకణ్ని అరెస్టు చేయించింది. కలకత్తా పోలీసు కమిషనర్‌గా అభిషేక్ సిఫార్సు చేసినతన్ని కాకుండా మరొకతన్ని వేసింది. ఐపిఎస్‌ల పోస్టింగులలో భారీ ఎత్తున మార్పులు తలపెట్టింది. బ్యానర్లలో తన ఫోటో తప్ప వేరేవాళ్ల ఫోటో ఉండరాదంది. ఇదంతా చూసి కళ్యాణ్ బెనర్జీ అనే ఎంపీ ‘డైమండ్ హార్బర్ మోడల్’ని వెక్కిరించాడు. పార్టీలో మమత మోడల్ తప్ప వేరే మోడల్ లేదన్నాడు. వెంటనే కళ్యాణ్‌ను పదవిలోంచి తీసేయాలంటూ అతని నియోజకవర్గంలో పోస్టర్లు వెలిశాయి.
దీనికి తోడు కునాల్ ఘోష్ సీనియర్ లీడరు ముకుల్ రాయ్‌పై బహిరంగంగా విరుచుకు పడ్డాడు. తృణమూల్ సీనియర్ నాయకులలో చాలామంది నిందితులైన శారదా స్కాములో ప్రధాన నిందితుడు ముకుల్. ఇంకో నిందితుడు కునాల్. కునాల్ మూడేళ్లపాటు జైలులో ఊచలు లెక్కిపట్టి బయటకు వచ్చాడు. విచారణ యింకా జరుగుతోంది. ముకుల్ మాత్రం సరైన సమయంలో బిజెపిలోకి దూకేసి అరెస్టు తప్పించుకున్నాడు. అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఓడిపోయాక తృణమూల్‌కు తిరిగి వచ్చేశాడు. మమత అతన్ని రానిచ్చింది. ఇది కునాల్ కడుపు మండించింది. ‘‘సిబిఐ, ఇడి ముకుల్‌ను వదిలిపెట్టకూడదు. విచారించి జైలుకి పంపాల్సిందే.’’ అని స్టేటుమెంటు యిచ్చాడు. ఇలా తన పార్టీలో సీనియర్ నాయకుల కలహాలు చూసిచూసి మమత పార్టీలో తనొక్కతే ఏకైక నాయకురాలినని ప్రకటించవలసిన అవసరం వచ్చిందని గ్రహించింది.
ఫిబ్రవరి 2న తను చైర్మన్‌గా ఎన్నికైన పది రోజులకే ఫిబ్రవరి 12న అనేక కమిటీలు, పదవులు రద్దు చేయడంతో బాటు అభిషేక్ కున్న జాతీయ సెక్రటరీ పోస్టు కూడా తీసేసింది. 20మంది సభ్యులతో నేషనల్ వర్కింగ్ కమిటీ అని ఏర్పరచింది. అది జరిగిన ఆరు రోజులకు ఆ కమిటీలో వారికి పోస్టులు ప్రకటించింది. మమత చైర్మన్, యశ్వంత సిన్హా, సుబ్రతా బక్షి, చంద్రిమా భట్టాచార్య వైస్ ప్రెసిడెంట్లు. అభిషేక్ జనరల్ సెక్రటరీ. ఆరూప్ బిశ్వాస్ కోశాధికారి. అభిషేక్ విధానాలను ప్రతిఘటిస్తున్న ఫిర్హాద్ హాకిమ్‌ను కోఆర్డినేటర్‌గా వేసి, తనకు కమిటీకి మధ్య సమన్వయం చేస్తాడంది. ఆ కమిటీ సభ్యుల్లో చాలామంది 65 ఏళ్లు పైబడినవారే. అభిషేక్ అనుయాయి రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ ఒక్కడే ఉన్నాడు.
ఫిర్హాద్ హాకిమ్ ‘మా పార్టీలో ఒన్ మాన్-ఒన్ పోస్ట్’ అనే పాలసీయే లేదు.’ అని ప్రకటించాడు. అతను కాబినెట్ మంత్రిగా ఉంటూనే కలకత్తా మేయరుగా ఉన్నాడు మరి. పైగా కోఆర్డినేటర్ పదవి ఒకటి. అలా అనక యింకెలా అంటాడు? అయినా పార్టీలో చాలామంది యువనాయకులు తమ ఫేస్‌బుక్ స్టేటస్‌లో ఆ స్లోగన్ ఉంచేశారు. రాబోయే రోజుల్లో అభిషేక్ ఏం చేస్తాడో చూడాలని అందరూ అనుకుంటూండగా, ఫిబ్రవరి 18న జరిగిన ఒక హత్య తృణమూల్‌ను డిఫెన్స్‌లోకి నెట్టింది. హౌడా జిల్లాలోని శారదా దక్షిణ ఖాన్ పాడా అనే చిన్న ఊళ్లో అనీస్ ఖాన్ అనే 28 ఏళ్ల యువకుడున్నాడు. అతను కలకత్తాలోని ఆలియా యూనివర్శిటీలో చదువుకునే రోజుల్లో కమ్యూనిస్టు విద్యార్థి సంస్థ ఐన ఎస్‌ఎఫ్‌ఐలో చురుగ్గా పనిచేశాడు. ఆ చదువై పోయాక యిప్పుడు అదే యూనివర్శిటీలో జర్నలిజం చదువుతున్నాడు.
అతను సిఏఏకు ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నాడు. ఆ ప్రాంతాల్లో పలుకుబడి ఉన్న ముస్లిం మతనాయకుడు అబ్బాస్ సిద్దిఖి స్థాపించిన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్‌ఎఫ్)లో చేరాడు. 2021 ఎన్నికల్లో లెఫ్ట్, కాంగ్రెసులతో జత కట్టిన ఆ పార్టీ తరఫున ముమ్మరంగా ప్రచారం చేశాడు. ఐఎస్‌ఎఫ్‌కు సీట్లేమీ రాలేదు. అనీస్ ఊళ్లో మాత్రం దానికి ఓట్లు పడ్డాయి. అందువలన స్థానిక పంచాయితీ మెంబరు, తృణమూల్ నాయకుడు ఎన్నికల అనంతరం అతని యింటిపై దాడి చేయించాడని, చంపుతానని బెదిరించాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అతనిపై పగబట్టి, పోలీసుల ద్వారా తృణమూల్ వాళ్లే చంపించారు అనేది ప్రతిపక్షాల ఆరోపణ. అనీస్ పెద్ద నాయకుడు కాకపోవడం చేత, యిటీవల మునిసిపల్ ఎన్నికలలో అతని పాత్ర ఏదీ లేకపోవడం చేత యీ ఆరోపణలో బలం లేదని తోస్తుంది. అసలు కారణం వేరేదైనా ఉండవచ్చు. అది విచారణలో తేలుతుందేమో చూడాలి. గతంలో రిజ్వానూర్ కేసులో ఒక మార్వాడీ వ్యాపారస్తుడు తన కూతురు ప్రేమించి, పెళ్లాడిన ముస్లిం కుర్రాణ్ని పోలీసుల చేత చంపించాడు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మమత లెఫ్ట్ ప్రభుత్వానికి విరుచుకుపడి సిబిఐ విచారణ కోరింది. ఇప్పుడు సిబిఐ విచారణ అక్కరలేదంటోంది. ఇప్పుడీ కేసులో కూడా అలాటి ప్రేమ కోణం ఏమైనా ఉందేమో, యిప్పటిదాకా బయటకు రాలేదు.
అనీస్ తండ్రి సలేం ఖాన్ చెప్పిన ప్రకారం – ఫిబ్రవరి 18న ఊళ్లో జనమంతా ఏదో మతసంబంధమైన వేడుకకై పొరుగూరు వెళ్లినపుడు ఆ రాత్రి పోలీసు యూనిఫాంలో ఉన్న ఒక వ్యక్తి ముగ్గుర్ని వెంటపెట్టుకుని అనీస్ మూడంతస్తుల యింటికి వచ్చాడు. యూనిఫాం వ్యక్తి అనీస్ తండ్రి సలేం ఖాన్ తలకు తుపాకీ గురి పెట్టి, తన అనుచరులతో ‘పోయి వెతకండి’ అన్నాడు. వాళ్లు పైకి వెళ్లి కాస్సేపటికి కిందకు వచ్చి, ‘పని అయిపోయింది’ అన్నారు. అందరూ వెళ్లిపోయారు. సలేం బయటకు వెళ్లి చూస్తే అనీస్ నేలమీద రక్తపు మడుగులో పడి వున్నాడు. ఆ ముగ్గురూ మిద్దె మీదకు తీసుకెళ్లి అనీస్‌ను తోసేశారు. సలేం వెంటనే ఆమ్టా పోలీసు స్టేషన్‌కు ఫోన్ చేస్తే ఎవరూ రాలేదు. కొడుకు శవం ఫోటోలను వాట్సాప్‌లలో పంపించడం మొదలుపెట్టాక కదిలి వచ్చారు. వచ్చాక శవం పడి ఉన్న చోటును ‘కార్డన్ ఆఫ్’ (చుట్టూ ఎవరూ రాకుండా రక్షించడం) చేయలేదు. శవాన్ని పోస్టుమార్టమ్ చేసి, ఖననానికి అనుమతించారు.
ఈ హత్యపై వామపక్ష విద్యార్థి సంస్థలు, ముస్లిం వర్గాలు కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ప్రభుత్వం వెంటనే మేల్కొని, సిట్ (స్పెషన్ ఇన్వెస్టిగేషన్ టీమ్) వేసింది. ఫిబ్రవరి 23న కాశీనాథ్ బేరా అనే ఒక హోంగార్డును, ప్రీతమ్ భట్టాచార్య అనే వాలంటీరును అరెస్టు చేసింది. పోలీసు స్టేషన్ ఇన్‌చార్జి దేవవ్రత చక్రవర్తిని లాంగ్‌లీవ్‌లో పంపించింది. అరెస్టయినవారు మేం అమాయకులం అంటున్నారు. అనీస్ కుటుంబం ‘ఎవరు చంపారో కాదు, ఎవరు చంపించారో తేలాలి. అది సిబిఐ విచారణ ద్వారానే బయటకు వస్తుంది.’ అంటున్నారు. ఈ అనుమానితులకు ఆదేశాలిచ్చాడని అనుమానించబడుతున్న వారిని ప్రభుత్వం దోషులను కాపాడుతోందని అనుమానాలు వచ్చాయి. అందుకే ఫిబ్రవరి 26న సిట్ బృందం వచ్చి పాతిపెట్టిన శవాన్ని బయటకు తీసి, మరోసారి పోస్టుమార్టం చేస్తామని అంటే ప్రదర్శనకారులు అడ్డుకున్నారు. రెండు రోజుల పాటు నచ్చచెప్పాక అప్పుడు అనుమతించారు.
ఈ లోపున తృణమూల్ ఎమ్మెల్యే షౌకత్ మొల్లా ‘పోలీసులు రాగానే అనీశ్ పారిపోవడానికి చూశాడు. ఇంటి బయట నీటి పైపు పట్టుకుని కిందకు జారుతూండగా పట్టుదప్పి కిందపడి చచ్చిపోయాడు’ అన్నాడు. అసలా యింటికి నీటి పైపులే లేవు! ముస్లిం ఓట్లు మమతకు అత్యంత ప్రధానం కాబట్టి, దీనిపై ఆమె పూర్తిగా విచారణ జరిపించి ముస్లిం ఆగ్రహాన్ని చల్లారుస్తుందని అనుకోవచ్చు. పైగా అనీశ్ తృణమూల్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలూ చేయలేదు. ఎన్నికలలో కొన్ని ఓట్లు ఐఎస్‌ఎఫ్‌కు వేయించడం ద్వారా స్థానిక తృణమూల్ నాయకులకు కోపం తెప్పించాడేమో అంతే! ఆ మాత్రానికే చంపుతారంటే నమ్మశక్యంగా లేదు. హతుడు ముస్లిము కాబట్టి కాబోలుప్రధాన ప్రతిపక్షం బిజెపి యీ నిరసన కార్యక్రమాలకు దూరంగా వుంది. కానీ బిజెపి నాయకుడు శుభేందు అధికారి అసెంబ్లీలో మాట్లాడుతూ ‘‘అసెంబ్లీ ఎన్నికలకు ముందు మమత ఎన్‌ఆర్‌సి అమలు చేసి ముస్లిములను పరప్రాంతాలకు పంపేస్తానన్నారు. ఇప్పుడు ఏకంగా పరలోకాలకే పంపేస్తున్నారు. ఈ సిట్ వలన జరిగేది ఏమీ లేదు. సిబిఐ విచారణ జరపాల్సిందే!’ అన్నారు. చూదాం కథ ఎటు సాగుతుందో! (ఫోటో- మమత, ముకుల్ రాయ్, అభిషేక్, ఇన్‌సెట్ అనీస్ మృతిపై నిరసన)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2022)