2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలైన తర్వాత.. ఇప్పటి వరకూ ఒక సత్యంలా నిలిచిన అంశంలో మార్పు చోటు చేసుకుంది. మధ్యలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రెండేళ్ల పాటేమో ఐపీఎల్ లో పాల్గొన లేకపోయినట్టుగా ఉంది. ఆ సమయంలో ధోనీ మరో జట్టుకు ఆడాడు. అయితే అదెంతమందికి గుర్తుందో కానీ.. సీఎస్కే అంటే ధోనీ, ధోనీ అంటే సీఎస్కే!
తమిళులతో ఈ విషయంలో ఎంతో భావోద్వేగపూరితమైన బంధాన్ని పెనవేసుకుపోయాడు ధోనీ. చరిత్రలోకి వెళితే.. ఐపీఎల్ ఆరంభంలో ధోనీని ఏకంగా ఆరు కోట్ల రూపాయలు చెల్లించి కొనుగోలు చేసింది సీఎస్కే యాజమాన్యం. ఆ సమయంలో అది రికార్డు ధర!
ఇప్పటి మారకంలో ఐపీఎల్ వేలంలో ఆరు కోట్ల రూపాయల ధర అంటే.. అనామక ఆటగాళ్లు కూడా లక్కీగా ఆ మాత్రం మొత్తాన్ని పొందుతున్నారు కానీ, ఐపీఎల్ చరిత్రలో తొలి సారి ఆరు కోట్ల రూపాయల రికార్డు ధర పలికింది ధోనీనే. ఆ తర్వాత ధోనీ సీఎస్కే యాజమాన్యం నుంచి ఏడాదికి ఎంత పొందుతున్నాడు? అనేది బహిరంగంగా చర్చలో లేని అంశమే!
ధోనీతో సీఎస్కే యజమాని శ్రీనివాసన్ చాలా సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. తన కంపెనీల్లో షేర్లో. ఏదో ప్రముఖమైన పోస్టో కూడా ధోనీకి ఇచ్చినట్టుగా ఉన్నాడు శ్రీనివాసన్. ధోనీకి క్రికెట్ బ్యాట్ పట్టుకునే ఓపిక ఉన్నన్ని నాళ్లూ సీఎస్కే జట్టుతో అతడికి బంధం కొనసాగుతుందేమో అనే రకంగా వీరి వ్యవహారం సాగింది. అయితే క్రితం సారి కూడా ఆ జట్టును విజేతగా నిలిపిన ధోనీ ఉన్నట్టుండి కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. మరో సీజన్ ఆరంభంలో పగ్గాలను వదులుకున్నాడు. ధోనీ నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నట్టుగా సీఎస్కే ప్రకటించింది.
బహుశా ఐపీఎల్ లో చెన్నై జట్టును నాలుగు సార్లు విజేతగా నిలపడం, పలు సార్లు ఫైనల్స్ కు చేర్చడం వల్ల కూడా ధోనీతో సీఎస్కే యాజమాన్యం, తమిళ క్రికెట్ ఫ్యాన్స్ తమ బంధాన్ని భావోద్వేగపూరితంగా మార్చుకుని ఉండవచ్చు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనేది ఎంత నిజమో, ధోనీ సీఎస్కే జట్టు వైపు ఉంటాడనేది కూడా అలాంటి నిజంలానే ఇన్నాళ్లూ సాగింది. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీ.. ఇదే సీజన్ తర్వాత ఆటగాడిగా తప్పుకున్నా.. పెద్ద ఆశ్చర్యం లేదు. అయితే మెంటర్ అనో, కోచ్ హోదాతోనో.. ధోనీ తమిళ జట్టుతోనే కొనసాగడం కూడా జరగొచ్చు.