అనుభవాలూ – జ్ఞాపకాలూ:డా. మోహన్ కందా
ట్రిక్కులు పనిచేయవు…
నేను చీఫ్ సెక్రటరీగా వున్నపుడు ఓ సారి 'మెగాస్టార్' చిరంజీవిగారు ఆయన బ్లడ్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానిస్తూ ''మీరూ ఒకప్పుడు సినిమాల్లో నటించారటగా'' అని అడిగారు.
''నిజం చెప్పాలంటే … అప్పటికంటె యిప్పుడే ఎక్కువ నటిస్తున్నానండి'' అన్నాను.
నటన మన జీవితంలో ఒక భాగం. చేసిన పొరపాటు ఒప్పుకోలేని పరిస్థితుల్లో ఏవో ట్రిక్కులు వేస్తాం, అవతలివాళ్లని బోల్తా కొట్టిద్దామని చూస్తాం.
మనపాటికి మనం ప్రయత్నాలు చేస్తాం కానీ ఫలితాల గురించి గ్యారంటీ ఎవరూ యివ్వలేరు.
ఎందుకంటే 'అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న' ఎప్పుడూ వుంటాడు.
నా పేరు చెప్పగానే ఓ తరం వారు ''పెళ్లి చేసి చూడు'' సినిమాలో చిన్నపిల్లవాడి వేషం వేశారు కదా! అంటారు. ''అమ్మా నొప్పులే..'' అనే ఓ నృత్య నాటికలో నేను స్కూలు పిల్లవాడి వేషం వేశాను. పరీక్షకు సరిగా ప్రిపేరు కాని ఓ పిల్లవాడు కడుపునొప్పి అని సాకు చెప్పి బడి ఎగ్గొడతాడు. అప్పుడు వాడి తల్లి వాడికి చిన్న తమాషా చేసి బుద్ధి చెపుతుంది. మరేం లేదు, గారెలు చేసి వాడిని ఊరిస్తుంది. వీడు పెట్టమంటాడు. కడుపునొప్పి కదా, ఎలా తింటావ్? అంటుంది. అప్పుడు వీడు 'నొప్పి లేదు, పరీక్షగురించి అబద్ధం చెప్పా' అని ఒప్పేసుకుంటాడు. ఆ విధంగా వాడి ట్రిక్కు పనిచేయదు.
ఇలాటి ట్రిక్కులు బడిపిల్లలే కాదు, క్రికెట్ మ్యాచ్ చూద్దామనుకున్న ఉద్యోగులు కూడా వేస్తారు. సినిమాకు వెళ్లాలంటే అర్జంటుగా తలనొప్పి తెచ్చేసుకుంటారు. వారం రోజుల సెలవు కావాలంటే బామ్మల్ని చంపేస్తారు, తండ్రికి హార్ట్ ఎటాక్ తెప్పిస్తారు. అయితే సెలవు మంజూరు చేయవలసిన అధికారికి కూడా యీ కిటుకులన్నీ తెలుసు. ఎందుకంటే ఆయనా వేరేవారి వద్ద యివే ఉపయోగించి వుంటాడు.
అయితే ఈ ట్రిక్కులు ఎల్లవేళలా పనిచేయవని స్వానుభవంతో చెపుతున్నాను. దానికి ముందు నేను ''పెళ్లి చేసి చూడు'' సినిమాలో వేషం వేసే సందర్భం ఎలా వచ్చిందో చెప్పాలి.
''సంసారం'' (1950) సినిమా నిర్మాత దర్శకులు ఓ బాలనటుడి గురించి వెతుకుతున్నారు. అప్పట్లో నేను ఆంధ్రబాలానందం సంఘంలో వున్నాను. రేడియో అన్నయ్యగారు అక్కయ్యగారు (న్యాయపతి రాఘవరావు, కామేశ్వరి) దాని నిర్వాహకులు. ప్రతి శనివారం రేడియోలో నాటకాలతో, పాటలతో బాలానందం అనే ప్రోగ్రాం నడిపేవారు. ఆదివారం వచ్చే కార్యక్రమం పేరు – ఆటవిడుపు. వాటిలో నేను పాల్లొనేవాణ్ని. ఒక వ్యాన్ పొద్దున్నే ఏడింటికి వచ్చి మమ్మల్ని ఎక్కించుకొని తీసుకుని వెళ్ళేది.
బాలానంద సంఘం సభ్యుల్లో మా పిన్ని కూతురు అన్నపూర్ణ కూడా వుంది. తను ''చంద్రహారం'' సినిమాలో చిన్నప్పటి రాకుమారిగా వేషం వేసింది. మేం రేడియోలోనే కాదు, స్టేజిపై కూడా నాటకాలు వేసేవాళ్లం. మద్రాసులోనే కాదు, వేరే వూళ్లకు కూడా తీసుకెళ్లి అక్కడ వేయించేవారు. చిన్నపిల్లలలోని ప్రతిభను వెలికిదీయడంలో, మాలాటి బాలలను సానబెట్టడంలో అన్నయ్యగారికి, అక్కయ్యగారికి సాటి వచ్చేవారు లేరు.
మేం మైలాపూర్‌లో చెంగళనీర్ పిళ్లయార్ వీధిలో వుండేవాళ్ళం. దానికి దగ్గర్లో వున్న లజ్ కార్నర్‌లో హిమాలయా కూల్‌డ్రింక్స్ అని ఒక దుకాణం వుండేది. అక్కడ కూర్చుని ఏవేవో కబుర్లు చెబుతూ వుండేవాణ్ని. ఓ రోజు నేను అక్కడ కూర్చుని వాగుతూవుంటే నా ధోరణి చూసి 'వీడికి స్టేజి ఫియర్ లేనట్టుంది. మనకు పనికి వచ్చేట్టున్నాడు.'' అనుకున్నారేమో, యిద్దరు నా దగ్గరికి వచ్చి ''బాబూ సినిమాల్లో యాక్ట్‌చేస్తావా?'' అని అడిగారు.(ట).
''తప్పకుండానండి పదండి'' అన్నాను.
''ముందర మీ అమ్మని నాన్నని అడుగుదాం. ఇంటికెళ్దాం పద'' అన్నారు వాళ్లు.
''అది మాత్రం వొద్దు. నేను యాక్ట్ చేయాలని మీకుంటే ముందర నన్ను తీసుకెళ్లండి తర్వాత వాళ్ళకి చెబుదాం'' అని వాళ్లని తొందర పెట్టేశాను. వాళ్లు ఘటికుడివిరా బాబూ అనుకుని వుంటారు.
తీసుకెళ్లి చిన్న ఆడిషన్ ఏదో చేశారు. అది బాగుంది లాగుంది. వేషం ఆఫర్ చేద్దామని మా ఇంటికి వచ్చారు. నేను సినిమాల్లోకి వెళ్లడం మా అమ్మకి సరదాయే. కానీ మా నాన్నకి చెప్పాలంటే భయం.
''ముందర మీరు కానివ్వండి. తర్వాత నేను ఆయనకు నింపాదిగా చెబుతా'' అంది. తర్వాత మా నాన్నకి మెల్లమెల్లగా సముదాయించి చెప్పిందట. ''ఫరవాలేదు వాడి చదువుకేం కాదు. డబ్బులుకూడా మనమేమీ తీసుకోవద్దు. వాడికి కొద్దిగా ధైర్యం అవీ వస్తాయి. సభాపిరికితనం పోతుంది. మంచి ఎక్స్‌పీరియన్స్, ఎక్స్‌పోజరూ కదా. అందరికీ ఇటువంటి ఆవకాశం వస్తుందా?'' అని ఏదో చెప్పి ఒప్పించి నన్ను పంపింది.
సంసారం (1950)కు దర్శకులు ఎల్.వి. ప్రసాద్‌గారు. ఆయనకు నేను బాగా నచ్చానులాగుంది. ఆయన దర్శకత్వంలోనే తీసిన ''పెళ్లిచేసి చూడు'' (1952), ''పెంపుడు కొడుకు'' (1953) లో నాకు ఛాన్సు యిచ్చారు. అప్పట్లో ''మనోహర'' (ఆలస్యంగా 1954లో రిలీజైంది) అనే సినిమా మూడు భాషల్లో తీశారు. తెలుగు, తమిళం, హిందీ. ఎల్వీ ప్రసాద్‌గారు డైరక్టర్. హీరో శివాజీగణేషన్. మైలున్నర పొడుగు డైలాగులు గుక్క తిప్పు కోకుండా చెప్పగలిగిన ఘనపాఠి. దానిలో పెద్దయ్యాక శివాజీ గణేషన్ కావల్సిన బాలతారడు కూడా చిన్నప్పుడే గడగడా మాట్లాడే ప్రతాపం కనబరచాలి కదా! అందువలన ఆ పాత్రా నాకే యిచ్చారు.
''మనోహర'' లో పాత్ర అభినయం చేయడానికి కోయంబత్తూర్ పక్షిరాజా స్టూడియోకి తీసుకెళ్లారు. అక్కడ లలిత, పద్మిని, రాగిణి అనే ట్రావన్‌కోర్ సిస్టర్స్‌ని కలవడం జ్ఞాపకముంది. షూటింగ్ కోసం నేనూ అమ్మా కలిసి ట్రెయిన్‌లో సెకండ్‌క్లాస్‌లో వెళ్లాం. ఎక్కడో విన్నాను – ఓ వూళ్లో కమ్యూనిస్టులు పట్టాలు తీసి ట్రైన్ పడగొట్టేశారని! ఆ రాత్రంతా నేను పడుకోలేదట కమ్యూనిస్టులు వస్తారేమో పట్టాలు తీసేస్తారేమో ట్రెయిన్ పడిపోతే మా అమ్మకు దెబ్బ తగులుతుందేమోనని !
తర్వాత తర్వాత ఉద్యోగధర్మంగా ఎందరో కమ్యూనిస్టులతో సన్నిహితంగా మెలగవలసి వచ్చింది. సిపిఐ లీడరు చతురానన్ మిశ్రా గారు మాకు మంత్రిగా వున్నారు. అంతేకాదు, మా మేనల్లుడు సీతారాం ఏచూరి ప్రస్తుతం సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యుడిగా వున్నాడు!
''మనోహర'' తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అలా అలా మొత్తానికి 28 సినిమాల్లో (తమిళం, తెలుగు, రెండు హిందీ కలిపి) యాక్ట్ చేసాను.
1951 నుండి 54 వరకు అంటే మేము మద్రాసు నుంచి గుంటూరుకి షిఫ్ట్ అయ్యేవరకూ యీ నటనాధ్యాయం నడిచింది. నాగేశ్వరరావుగారితోటి, ఎన్.టి. రామారావుగారితోటి కూడా నటించినా అందరికీ ఎక్కువగా జ్ఞాపకంవున్న సినిమా 'పెళ్లి చేసి చూడు ! అందులో 'అమ్మానొప్పులే' అంతర్నాటకంలో నేను వేసిన పాత్ర అందరికీ గుర్తు. ఇప్పటికీ నన్ను చూసినప్పడల్లా అందరూ దాని గురించే మాట్లాడుతూంటారు.
ఆ'బాల'గోపాలం చూసే సినిమాలు తీసే విజయావారు చిన్నపిల్లలకోసం యిలాటి నృత్యనాటకాలు వారి సినిమాలలో పెడుతూ వుండేవారు. అవన్నీ పిల్లలనే కాక, అందర్నీ అలరించేవి. అదే సినిమాలో మా బాలానంద సంఘం సభ్యుడు, అన్నయ్యగారి మేనల్లుడు మాస్టర్ కుందూ చాలా పెద్ద పాత్ర ధరించారు.
విచిత్రమేమిటంటే 'అమ్మానొప్పులే' వంటి సంఘటనే నాకు మళ్లీ ఐ.ఎ.ఎస్. పరీక్ష పాసయ్యాక మసూరి ఎకాడమీలో ట్రెయినింగ్ జరిగేటప్పుడు ఎదురయింది.
మా డైరెక్టరుగారు ఒక్కొక్క ట్రెయినీకి ఐదేసి నిమిషాల ఎపాయింట్‌మెంట్ యిచ్చి స్వయంగా యింటర్వ్యూ చేస్తానన్నారు. నాలుగువందల మంది ట్రెయినీస్‌కీ తలా ఒక టైమ్ ఇచ్చి టైముకి రమ్మన్నారు. నాకిచ్చిన టైము మూడుగంటలకి.
మసూరీలో అంతా కొండ ప్రదేశం. రోడ్లు ఎగుడూ దిగుడూ. రూమ్‌లు, గదులు, క్లాస్‌రూమ్‌లు, ఆఫీస్‌రూమ్‌లు – ఒకదాని నుండి మరోదానికి వెళ్లాలంటే బోల్డు టైము పడుతుంది. ఎక్కడో కిందలోయలో ఎవరి రూమ్‌లోనో కూచుని పేకాడుకుంటున్నాం. మధ్యలో ఏం తోచక తలెత్తి గడియారం కేసి చూస్తే టైము మూడు అవుతోంది. పేకాట అడావుడిలో చూసుకోలేదు. మొదటిసారి ఉద్యోగం. మా డైరెక్టర్ చండశాసనుడు. ఆయనతో మొట్టమొదటి పరిచయానికే అలస్యమైపోయింది.
ఏం చేయాలాని భయపడుతూ, కొండలూ గుట్టలూ దాటుకుంటూ, ఎగురుకుంటూ, పరుగెత్తుకుంటూ వెళ్ళా – రొప్పుకుంటూ, రోజుకుంటూ లోపలికి వెళ్లి కూర్చున్నాక చెప్పాను – ''కడుపు అప్‌సెటయింది సర్! అందుకే అలస్యమయింది'' అని.
ఆయన అనుభవజ్ఞుడు. ఇలాంటివి ఎన్ని చూశాడో, ఇవన్నీ తెలియక వుంటాయా!? ''అయితే ఏ మందు వేసుకున్నావు?'' అన్నాడు.
ఏదో చెప్పింది విని వూరుకుంటాడు అనుకున్నా కాబట్టి యీ ప్రశ్నకు ప్రిపేర్ అవ్వలేదు. ఎందుకైనా మంచిదని 'హోమియోపతి మందు' అని చెప్పేశా.
''మరి హోమియోపతిలో రకరకాల మందులుంటాయి కదా, ఏది వేసుకున్నావు?'' అన్నాడు.
మన డ్రామా సంగతి ఆయనకు తెలిసిపోయిందని నాకు తెలిసింది, 'ఏదో తెల్లగా గోళీలండి. మా అమ్మ పొట్లం కట్టి యిచ్చింది' అని నసిగా.
ఆయన చిరునవ్వు చూస్తూనే అర్థమైపోయింది – ఇదీ 'అమ్మా నొప్పులే' కేసని. సినిమాలో తెరమీద తల్లిని మోసం చేయలేకపోయినట్టే, యీయన్నీ మోసం చేయలేకపోయానని అర్థమైంది.
ఏం చేయలేక ఒక చిరునవ్వు నవ్వేశాను.
ఆ ట్రిక్కు సినిమాలోనూ పనిచేయలేదు, ఎకాడమీలోనూ పని చేయలేదన్నమాట.
మీ సూచనలు [email protected] కి ఈమెయిల్ చేయండి.
excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com
please click here for audio version