మోహన మకరందం: కృష్ణా పుష్కరాలు…

అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్‌ కందా  Advertisement కృష్ణా పుష్కరాలు – ఆదిలో హంసపాదు 2004 కృష్ణా పుష్కరాలు! ఊహ తెలిసి చాలా పుష్కరాలు చూశాను, కానీ పుష్కరాలు గడిచినా 2004 కృష్ణా…

అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్‌ కందా 

కృష్ణా పుష్కరాలు – ఆదిలో హంసపాదు

2004 కృష్ణా పుష్కరాలు!

ఊహ తెలిసి చాలా పుష్కరాలు చూశాను, కానీ పుష్కరాలు గడిచినా 2004 కృష్ణా పుష్కరాలను మర్చిపోలేను.

ఆరంభమవుతూనే, వాస్తవం చెప్పాలంటే – ఆరంభం కాకుండానే, చెమటలు పట్టించాయి.

అప్పుడే కొత్తగా ముఖ్యమంత్రి ఐన వైయస్‌ రాజశేఖరరెడ్డి గారిదీ… – పైకి కనబడకపోయినా – అదే పరిస్థితి కావచ్చు

పాలనలో యిలాటి పరీక్షలు ఎన్నొస్తాయని…!?

xxxxxxx

సంస్థ కానీయండి, ప్రభుత్వం కానీయండి – బాధ్యతాయుతమైన పదవిలో వున్న ప్రతి వ్యక్తికి అతను చేసిన పనులకు అకవుంటబిలిటీ, జవాబుదారీతనం అనేది వుంటుంది. మరి ఆ వ్యక్తిని అజమాయిషీ చేసే అధికారికి ….?

సేవకుడు తప్పు చేసినా రాజు దండనీయుడు అంటుంది ధర్మశాస్త్రం. మహాభారతంలో ఓ కథ చూడండి. ఉదంకుడు అనే ముని తన గురువుగారి కోరిక మేరకు పౌష్యుడు అనే రాజు వద్దకు వెళ్లి ఆయన భార్య కుండలాలు అడిగాడు. ఆయన యిచ్చాడు. ఇస్తూ భోజనం చేసి వెళ్లండని కోరాడు. ఈయన సరేనన్నాడు. అయితే  పెట్టిన భోజనంలో యితనికి వెంట్రుక వచ్చింది. ఉదంకుడికి కోపం వచ్చింది.  తనకు ఉపకారం చేసినవాడు కదా అనైనా చూడకుండా వెంటనే రాజుకి శాపం యిచ్చేశాడు. గుడ్డివాడవై పో అని. ('నిండుమనంబు నవ్యనీతసమానంబు, పల్కు దారుణాఖండల శస్త్రతుల్యంబు..' పద్యం వచ్చేది యీ ఘట్టంలోనే) అదేమిటి? రాజుగారేమైనా ఆ వంట వండేడా? దగ్గరుండి వెంట్రుకలు కలిపిన అన్నం పెట్టించాడా? అయినా శాపాన్ని భరించవలసి వచ్చింది. ఎందుకంటే రాజ్యం ఆయనది. దివాణం ఆయనది. అక్కడ జరిగే తప్పొప్పులకు ఆయన బాధ్యుడు.

వైయస్‌ రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే అంటే .. 2004లో కృష్ణా పుష్కరాలు వచ్చాయి. నేను చీఫ్‌ సెక్రటరీగా వున్నాను. అంతకు ముందు ఏడాది గోదావరి పుష్కరాలు అత్యంత సమర్థవంతంగా నిర్వహించామన్న మంచి పేరు తెచ్చుకున్నాం. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు! ఆ పుష్కరాల అనుభవంతో వీటిని కూడా అంత గొప్పగానూ నిర్వహించి కొత్త ప్రభుత్వానికి ఏ నిందా రాకుండా వుండాలని యంత్రాంగం అంతా శ్రమించాం. కృష్ణా జిల్లా కలక్టరు ప్రభాకరరెడ్డి, విజయవాడ పోలీసు కమిషనర్‌.. అందరూ సమర్థులే. విధినిర్వహణలో మచ్చలేని రికార్డు కలవారే. జనం విపరీతంగా వస్తారని తెలుసు కాబట్టి ఎవరూ యిబ్బంది పడకూడదని, ఎక్కడా, ఎటువంటి పొరబాటూ  జరగకూడదని – చెప్పాలంటే కాస్త చాదస్తంగానే – విపరీతమైన శ్రద్ధ వహించాం.

ఆ రోజు ఉదయం పుష్కరాలు ప్రారంభం కావాలి. పుష్కరుడు యింకా కృష్ణానదిలోకి ప్రవేశించలేదు. కానీ ముహూర్తానికంటె ముందే ఎందుకోగాని కొందరు స్నానాలకని ఎగబడ్డారు. ఘాట్స్‌ వద్ద ఏర్పాటు చేసిన రెయిలింగ్‌ కూలిపోయి నలుగురు పోయారు. సీతమ్మవారి ఘాట్‌ వద్ద స్నానానికి దిగిన యువకుడు ఒకడు మునిగిపోయాడు. పొద్దున్న ఐదున్నరకు హైదరాబాదులో వున్న నాకు ఫోన్‌..! ఇలా ప్రమాదం జరిగింది, ఐదు ప్రాణాలు పోయాయని. 

మనసంతా వికలం అయిపోయింది. శుభమాని పుష్కరాలు ప్రారంభించబోతూ వుంటే యిలా జరిగిందేమిటాని. దుర్ఘటన జరిగింది. ఎవరిని బాధ్యులను చేస్తాం?  పుష్కరాల ప్రారంభానికి ముందే తొందరపడినవారిదే తప్పు అనేసి వూరుకోవచ్చు. కానీ ఆ మాట అనగలమా? అనుకోగలమా? పొరపాటుకి  మూల్యం ప్రాణాలతో చెల్లించినవారిపై అందరం జాలిపడతాం. దానికి ఎవరో ఒకరిని బాధ్యులను చేసి నిందిస్తాం. ఏర్పాట్లు చేసినవారు నిర్లక్ష్యంతో చేశారని, ఇలా నియమాలు అతిక్రమించి స్నానాలకు వచ్చేవారు కూడా వుంటారని ముందే వూహించి, దానికి తగ్గ భద్రతా ఏర్పాట్లు చేసి వుండాల్సిందని (అలాటి కేసులూ ఊహించి తగిన ఏర్పాట్లు చేశాం. కానీ సిబ్బంది వచ్చే లోపునే యిది జరిగింది) వాదిస్తార. ఆరోపణలు చేస్తార. ఏర్పాట్లు చేసిన సిబ్బంది అంతా – పైనుండి కిందవరకూ – చిత్తశుద్ధితో చేశారని వ్యక్తిగతంగా నాకు తెలుసు. ఎవరినీ వ్యక్తిగతంగా దోషులుగా నిలబెట్టలేను. కానీ ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి?

xxxxxx

1957లో లాల్‌ బహదూర్‌ శాస్త్రిగారు రైల్వే మంత్రిగా వుండేటప్పుడు జనగామలో ఓ యాక్సిడెంటు జరిగి 112 మంది పోయారు. దానికి కారణం అక్కడి సిబ్బంది నిర్లక్ష్యం. కానీ ఆయన ఆ నిందను తనపై వేసుకుని తనను తానే శిక్షించుకుందామనుకున్నాడు. తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. ప్రధాని నెహ్రూతో సహా అందరూ 'వద్దు, అక్కరలేదు, ఎక్కడో ఆంధ్రలో ఎవరో చేస్తే నీ తప్పేముంది? ఇలా చేయడం మొదలెడితే కాబినెట్‌లో ఎవరైనా మిగులుతామా?' అని చెప్పి మాన్పించారు. మూణ్నెళ్లు తిరక్కుండా తమిళనాడులో అరియలూరులో యింకో యాక్సిడెంటు. ఈ సారి 144 మంది పోయారు. ఇక యీయన రాజీనామా చేస్తానని పట్టుబట్టారు. నెహ్రూగారికి ఆమోదించక తప్పలేదు. ఆమోదిస్తూ నెహ్రూగారు పార్లమెంటులో ఓ ప్రకటన చేశారు. 'శాస్త్రి బాధ్యుడు కాకపోయినా రాజ్యాంగ ఔచిత్యం కాపాడేందుకు ఒక ఉదాహరణగా నిలుస్తుందనే భావనతో దీన్ని ఆమోదిస్తున్నాను' అని. అవేళ రాజీనామా చేసినా లాల్‌ బహదూర్‌ రాజకీయాల్లోంచి తొలగిపోలేదు. మళ్లీ కొద్ది నెలలకే ట్రాన్స్‌పోర్టు మంత్రి అయ్యారు. ఆ తర్వాత హోం మంత్రి అయ్యారు. 1964లో నెహ్రూ మరణం తర్వాత ఏకంగా ప్రధానమంత్రే అయ్యారు. అయితే యాక్సిడెంటు అయిన ఆ క్షణాన రైల్వే మంత్రిగా ఆయన చేసిన రాజీనామా చెప్పుకోదగ్గది.

రాజీనామాతో యావద్భారతదేశం ఉలిక్కిపడింది. ఇది జరిగి ఏభై ఏళ్లయినా యిప్పటికీ చెప్పుకుంటున్నాం. రైల్వే శాఖలో ఒక సందేశం పై నుండి కిందదాకా వెళ్లిపోయింది. మనం ఏదైనా పొరబాట్లు చేస్తే, నిర్లక్ష్యం చూపితే పెద్దాయన తలకు చుట్టుకుంటుంది, మనం ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేయాలి అని. మహాత్మా గాంధి కూడా అంతే కదా. బెంగాల్‌లో హిందూ ముస్లిములు కొట్లాడుకుని హింస ప్రజ్వరిల్లితే అక్కడికి వెళ్లి ఏం చేశారు? మీరు శాంతపడే వరకూ నేను అన్నం ముట్టను అన్నారు. అంటే మతకలహాలకు తను జవాబుదారీ వహించారు. నిజానికి వాటికి ఆయన బాధ్యుడా? కానే కాదు, కానీ హింసకు పాల్పడిన హిందూ ముస్లిముల తరఫున నింద మోయడానికి ఆయన సిద్ధపడ్డారు. ఒళ్లు మరచి, మానవత్వం మంటగలపిన కరకు కసాయిలను సైతం యీ త్యాగం కదిలించింది. అతి కొద్ది రోజుల్లోనే బెంగాల్‌ శాంతించింది. వందలాది సైన్యదళాలు చేయలేని పనిని ఒక్క బక్కమనిషి సాధించారు.

xxxxxx

సంజీవరెడ్డిగారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వుండగా కర్నూలు జిల్లాలో బస్సు సర్వీసులను జాతీయం చేశారు. అప్పట్లో ఎపియస్‌ఆర్‌టిసి వుండేది కాదు. ప్రైవేటు బస్సులదే రాజ్యం. ఈయన జాతీయం చేసి ప్రభుత్వ సర్వీసులను ప్రవేశపెట్టారు. జాతీయం చేయడం వలన నష్టపోయిన పిడతల రంగారెడ్డిగారు కోర్టులో కేసు వేశారు. 1964లో కోర్టు తీర్పు యిస్తూ సంజీవరెడ్డిగారిని తప్పు పట్టింది. ఆయన వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇది చాలామందికి గుర్తు వుండి వుంటుంది. గుర్తు వుండని విషయం ఏమిటంటే ఆయనతో బాటు అడ్వకేట్‌ జనరల్‌గా పని చేసే దువ్వూరి నరసరాజుగారు కూడా తన పదవికి రాజీనామా చేశారు. అదేమంటే – 'అవును, సంజీవరెడ్డిగారికి ఆ సలహా యిచ్చింది నేనే' అన్నారాయన. ఆయన మా బాబాయిగారు. అంటే పిన్ని భర్త…!     
                    
ప్రభుత్వ యంత్రాంగానికి నేతగా నన్ను నేను పుష్కరం నాటి యీ దుర్ఘటనకు పూచీ పడదామనుకున్నాను. ముఖ్యమంత్రికి ఫోన్‌ చేశాను. ఆయన ఆ సమయానికి శ్రీశైలం మీదుగా విజయవాడకు హెలికాప్టర్‌లో వెళ్లబోతున్నారు. ఐదుగురు మరణించారని విని చాలా బాధపడ్డారు. పరిస్థితి వివరించి ''దీనికి ఎవరో ఒకరు ఎకౌంటబుల్‌ కావాలి. చీఫ్‌ సెక్రటరీగా నేను నింద మోస్తాను. సెలవుమీద వెళతానంటూ సెలవు చీటీ కూడా రాసేశాను. అనుమతి యివ్వండి'' అన్నాను. 

వైయస్‌ఆర్‌ పరిస్థితి ఆకళింపు చేసుకున్నారు. నా ఆవేదన అర్థం చేసుకుంటూనే ఏవో కొన్ని చర్యలు చేపట్టి ఎవరో ఒకరిని జవాబుదారీ చేయవలసిన అగత్యాన్నీ గుర్తించారు.

''మీరు సెలవులో వెళితే యింకా చాలా యిబ్బందులు వస్తాయి. అది పక్కకు పెట్టి ప్రత్యామ్నాయాలు చెప్పండి'' అన్నారు.

ఆలోచించాను. ముఖ్యమంత్రి కొన్ని నిమిషాల్లో విజయవాడ చేరబోతున్నారు. విజయవాడ అంటేనే భావోద్వేగాలకు ముఖ్యకేంద్రం. రాష్ట్రరాజకీయాలకు ప్రముఖ వేదిక. అసలు కృష్ణా జిల్లాయే అంత. దేశంలో ఏ రాజకీయ పార్టీయైనా తీసుకోండి. ఎంత చిన్నదైనా సరే, దానికి కనీసం ఒక్క పార్లమెంటు సభ్యుడు లేదా ఎసెంబ్లీ సభ్యుడు లేకపోయినా సరే. దాని తాలూకు ఓ శాఖ కృష్ణా జిల్లాలో మాత్రం వుంటుంది. అక్కడ రాజకీయాలు గడపగడపనా, అణువణువునా తొణికిసలాడుతూ వుంటాయి.

అటువంటి విజయవాడలో కృష్ణా పుష్కరాల సమయంలో అదీ ప్రారంభదినాన దుర్ఘటన జరిగి యిందరు జలదేవతకు బలి అయిపోవడం ఎన్ని చర్చలకు, ఎంతటి వివాదాలకు దారి తీస్తుందో వూహించవచ్చు. నిజానిజాలు విచారించి తప్పొప్పులు తేల్చగలిగే సంయమనం ఎక్కడ? మామూలు రోజుల్లో ఏమో కానీ పుష్కరాల సమయంలో, వేలాది, లక్షలాది జన సమూహాలు వచ్చిపడుతూ, వారితో బాటు పుకార్లు మోసుకొస్తూ వుంటే, ఊపిరి పీల్చుకునేటంత వ్యవధి లేని సందర్భంలో ప్రభుత్వం తరఫున వాదనలు వినేవారెవరు?  వివేచన చేసేవారెవరు? నిదానంగా యోచించి వీళ్ల తప్పు లేదని సర్టిఫికెట్టు యిచ్చేవారెవరు?

ముఖ్యమంత్రి విజయవాడలో అడుగు పెట్టగానే ఆకలేసిన సింహాల్లా విలేకరులు చుట్టుముడతారు. వారిలో అత్యుత్సాహం గల విలేకరులు (కబ్‌ రిపోర్టర్లు అంటారు ఇంగ్లీషులో) రెచ్చిపోతారు – 'ఇవతల జనాలు అసువులు బాస్తే మీకేం పట్టదా? దిద్దుబాటు చర్యలు ఏం చేపట్టారు? ఎవర్ని శిక్షించారు? చేతకానిప్రభుత్వం చేతిలో యింకెంతమంది చావాలి?' అంటూ. అది వారి వృత్తిధర్మం. ఆ సమయంలో సంయమనం ప్రదర్శించమని వారిని ఎలా కోరతాం? పైగా పాపం ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన సందర్భం అది. ఏవో కొన్ని తలలు.. పెద్ద తలకాయలు.. తెగవలసినదే!  

తలకాయలు ఎంచుకున్నాం. అత్యంత సమర్థుడు, నాకు ఆప్తుడు అయిన జిల్లా కలక్టరు ప్రభాకరరెడ్డిగారిని లీవులో వెళ్లమన్నాం. ప్రజ్ఞాపాటవాలున్న, అంకిత భావమున్న సిటీ పోలీసు కమిషనర్‌ కృష్ణప్రసాద్‌ని బదిలీ చేసేశాం. ఐదుగుర్ని (డియస్‌పి, ఎస్‌.ఐ., జిల్లా పరిషత్‌లో డిప్యూటీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంటు ఇంజనియర్‌, మండల్‌ రెవెన్యూ ఆఫీసర్‌) సస్పెండ్‌ చేశాం. జరిగిన దుర్ఘటనలో ఎవరి బాధ్యత ఎంతో తేల్చడానికి అప్పట్లో లాండ్‌ కమిషనర్‌గా పనిచేస్తూ నిజాయితీపరుడిగా పేరుబడిన పి సి సమాల్‌ గారికి విచారణ జరిపే బాధ్యత అప్పగించాం.

వైయస్‌ఆర్‌ గారు విజయవాడలో దిగుతూనే – మీడియావాళ్లు చుట్టుముట్టి ప్రశ్నలతో ముంచెత్తేందుకు ముందే – యివన్నీ ప్రకటించేశారు. ప్రజలు చల్లబడ్డారు. ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి దీన్ని అస్త్రంగా వుపయోగించదలచుకున్న విమర్శకుల చేతిలోంచి విల్లు లాగేసుకున్నట్టయింది. ఇంగ్లీషు వాడి పరిభాషలో చెప్పాలంటే 'వాళ్ల పడవలు ముందుకు సాగకుండా గాలి స్తంభింప జేసినట్టయింది'.

రోమన్‌ సామ్రాజ్యంలో గ్యాలరీ జనాల కేరింతలకోసం క్రైస్తవులను సింహాలకు ఆహారంగా వేసేవారు. ప్రజలకు సంతోషం చేకూరేది.. మంచిదే. మరి క్రైస్తవుల మాటేమిటి? వాళ్లు నమ్మిన విశ్వాసాలకోసం వాళ్లు బలి కావలసిందేనా?

చిత్తశుద్ధితో పనిచేసిన వాళ్లు చేయని తప్పుకి బలి కావటం చూసిన పిమ్మట చెదిరే ప్రభుత్వోద్యోగుల నైతికస్థయిర్యం మాటేమిటి? 

సమాల్‌ గారి ఎంక్వయిరీ పూర్తయింది. ఉద్యోగులెవరూ బాధ్యులు కారని తేలింది. అమాయకులెవరికీ అన్యాయం జరగకుండా చూశాం. పుష్కరాలు విజయవంతంగా, ఏ చిన్న పొరబాటూ లేకుండా, అందరూ సంతసించేట్లా జరిగిపోయాయి. 

మీ సూచనలు [email protected] కి ఈమెయిల్‌ చేయండి.

excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com

please click here for audio version