అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్ కందా
'జై ఆంధ్ర' లో 'అఫెన్సు' మార్గం
''జై ఆంధ్రా'' ఉద్యమం రోజులు. జిల్లాలో శాంతిభద్రతలు కరువయ్యాయి.
పౌరులతో కలిసి ప్రభుత్వం తరఫున శాంతి సమితి ఏర్పాటు చేయడం తక్షణ కర్తవ్యం.
కానీ పౌరులెవ్వరూ ముందుకు రావడం లేదు. ప్రభుత్వంతో ఆ మాత్రం చేతులు కలిపినా ఉద్యమద్రోహులుగా ముద్ర పడతామన్న భయం.
వాళ్లని మా వద్దకు రప్పించాలి. వస్తే ఏదోలా నచ్చచెప్పి ఒప్పించవచ్చు.
రప్పించడానికి ఓ ప్రమాదకరమైన ఉపాయం ఆలోచించాం.
పని చేస్తే పనిచేయవచ్చు.
చేయకపోతే మాత్రం పరిస్థితి మరింత దిగజారుతుంది.
రిస్కు తీసుకోవాలా? వద్దా?
xxxxxx
ఏదైనా కార్యాన్ని సాధించడానికి సామదానభేద దండోపాయాలుపయోగించమని పెద్దలు అన్నారు. అంటే దండం ఆఖరి ఉపాయం అని, తక్కినవన్నీ విఫలమయ్యాకనే వాడాలనీ వారి ఉద్దేశం. కానీ కొన్ని సందర్భాల్లో దండప్రయోగం సామమార్గానికి కూడా సాధనం అవుతుంది. చిత్రంగా వుందా? ఆంధ్ర ఉద్యమం నాటి ఒక ఉదంతం చెప్తాను.
1972 నవంబరులో ఒంగోలులో ఫైరింగ్ జరిగింది. అయిదుగురు మరణించారు. దానికి కోపగించిన ఆందోళనకారులు ఊళ్లో దహనకాండ మొదలుపెట్టారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులు తగలబెట్టారు. దాంతో కలక్టరు కర్ఫ్యూ విధించారు. అసాంఘిక శక్తులు చెలరేగి కర్ఫ్యూని ఉల్లంఘిస్తూ విధ్వంసకాండ చేస్తున్నారు. నేను సబ్ కలక్టర్‌ని. కలక్టరు టి.ఆర్. ప్రసాద్‌గారిని వేరేచోటకు తరలించవలసి వచ్చింది. ఆందోళన అణచడానికి ఫైరింగ్ ఆర్డర్ యిచ్చినది ఆయనే కదా అందుకని ప్రజలు ఆయన మీద, ఆయన బంగళా మీద దాడి చేశారు. అప్పుడు ఆయనను సురక్షితమైన ప్రాంతానికి తరలించవలసి వచ్చింది. కొండమీద కొన్ని యిళ్లు వుండేవి. వాటిలో ఒకదానికి ఆయనను, ఆయన భార్యను తీసుకెళ్లి వుండమని, చుట్టూ గస్తీ పెట్టించాం.
కలక్టర్ గారి ఆదేశాలపై అవేళ నేను చీరాలలో వున్నాను. నా వద్ద కొంత బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు వుంది. వెంటనే రమ్మనమని కబురు వచ్చింది. వస్తూంటే దారిలో విద్యార్థులు నన్ను అడ్డుకున్నారు. వారికి నచ్చచెప్పి ఊళ్లోకి వచ్చాను. ఎస్.పి. రామస్వామిగారి బంగళా వద్దకు వెళ్లేసరికి బాగా చీకటైంది. అక్కడ ఆయనా, నేను పక్కనే వున్న తాలూకా ఆఫీసుకెళ్లి అక్కడ కూర్చుని ఏం చేయాలో ఒక ప్రణాళిక వేసుకున్నాం. ఏవేవి గొడవ చెలరేగడానికి అవకాశం వున్న ప్రాంతాలు, ఏవి ప్రజలకు అతి ముఖ్యమైన నిర్మాణాలు – అంటే ఎలక్ట్రిసిటీ పవర్ స్టేషన్, వాటర్ సప్లయి పాయింటు, హాస్పటల్ – వంటివి అని అని గుర్తించి, వాటిని కాపాడడం ఎలా అని ఆలోచన వేశాం. పోలీసులలో ఎక్కడ ఎంతమందిని వుంచాలి. అవసరమైతే ఎక్కడికి వెళ్లమని చెప్పాలి యివన్నీ ప్లాను చేశాం.
మా చర్చలతోనే తెల్లవారి పోయింది. శాంతిభద్రతలు త్వరగా నెలకొనేట్టు చేయాలి. దానికి గాను శాంతిసమితి (పీస్ కమిటీ) అని యిలాటి సందర్భాలలో ఏర్పాటు చేయడం రివాజు. వారు ప్రభుత్వాన్ని కొన్ని కోరికలు కోరతారు. వారి మాట మన్నించి పోలీసులను వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. ఈ శాంతిసమితిలో ఊళ్లో నలుగురు పెద్దమనుష్యులను పెడతాం. వారితో చర్చల ద్వారా 'ప్రభుత్వం చర్చలకు సుముఖంగా వుంది. కేవలం పోలీసు లాఠీలతోటే పరిస్థితిని అదుపులోకి తేవడానికి ప్రయత్నించడం లేదు' అనే సందేశం ప్రజల్లో వెళుతుంది. ఆ విధంగా పరిస్థితిలో వేడిని చల్లార్చవచ్చు.
అప్పుడు ఊళ్లో మేం కూడా శాంతి ప్రక్రియ ప్రారంభించడానికి శాంతి సమితి ఏర్పాటు చేయడానికి ఊళ్లో పెద్దమనుష్యులను రమ్మనమని కబురు పెట్టాం. పొద్దున్న ఎనిమిదిన్నర అన్నాం. ఎనిమిదిన్నర కాదు, తొమ్మిదిన్నరయినా, పదిన్నరయినా ఎవరూ రాలేదు. ఏం వాళ్లకు శాంతి అక్కరలేదా? ఇలాగే అలజడులు, విధ్వంసాలు, కర్ఫ్యూలు కావాలా? అని అనుకోనక్కరలేదు. వాళ్లకూ శాంతి కావాలి. కానీ దానికోసం మాతో చేతులు కలిపినట్టు వుండకూడదు.
నిజానికి నేను గాని, రామస్వామిగాని బ్రిటిషు వాళ్లలా పరాయి దేశస్తులం కాము, వర్గశత్రువులం కాము. ప్రజానీకానికి వ్యతిరేకంగా పనిచేయడానికి శత్రుదేశం పంపినవాళ్లం కాము. కరక్టుగా చెప్పాలంటే వారికి సేవలందించడానికి పంపబడిన ప్రజాసేవకులం. (పబ్లిక్ సర్వెంట్స్). మాతో చేతులు కలిపి శాంతిస్థాపన చేయడానికి అభ్యంతరం దేనికి?
దేనికంటే ఆ తీవ్రపరిస్థితిలో వాళ్లు ఉద్యమకారులు. మేము ఉద్యమానికి వ్యతిరేకంగా వున్న ప్రభుత్వం యొక్క ప్రతినిథులం. అందువలన దుర్మార్గులం, దుష్టులం, దుశ్శాసనులం గట్రా ఎట్సెట్రా. మాతో చేతులు కలపడం మాట అటుంచి మేం వున్నచోటకి వాళ్లు వచ్చి మాతో మంచీ చెడ్డా మాట్లాడారంటే చాలు వాళ్లు ఉద్యమద్రోహులుగా ముద్ర పడిపోతారు.
శాంతిభద్రతలు నెలకొనకుండా యిలా వస్తే ఎవరైనా ఏమైనా అనుకుని పోతారేమో అని ఇటువంటి సందేహాలతో వున్నవారు మా దగ్గరకి ఎలా వస్తారు? రారు. రాకపోతే శాంతి భద్రతలు నెలకొల్పడం ఎలా?
క్యాచ్ – 22 సిట్యుయేషన్.
మాకు పరిస్థితి పూర్తిగా అర్థమైంది. మన ప్రత్యర్థి (నిజంగా ప్రత్యర్థి కాదు. మన భావం గ్రహించక మనను శత్రువుగా పరిగణించేవాడు అని అర్థం) మన మీద భయంతోగాని, కోపంతోగాని వెళ్లి కలుగులోకి దూరితే ఏం చేయాలి? బయటకు రప్పించడానికి పొగ పెట్టాలి. పొగబాధ భరించలేక బయటకు వచ్చి తీరతారు. దీన్నే 'స్మోకింగ్ ద ఏడ్వర్సరీ ఔట్ ' (బరికి అటువైపు వున్నవాడని అర్థం చేసుకోవాలి) అంటారు ఇంగ్లీషులో. ఈ పరిస్థితికి కారకులైన వారిని బయటకు లాక్కుని వచ్చి చర్చలలో పాల్గొనేలా చేయాలంటే పొగ పెట్టాల్సిందే.
పొగ పెట్టడం ఎలా? బాగా ఆలోచించి కరవాది వెంకటేశ్వర్లు అనే ఓ పెద్దమనిషిని పట్టుకుని వచ్చి జైల్లో పెట్టేశాం. ఆయన కమ్యూనిస్టు భావాలున్న మనిషి. అందరికీ బాగా తెలిసున్న, ప్రజల్లో మంచి పలుకుబడి వున్న వ్యక్తి. ఎవరైనా చట్టవిరుద్ధమైన పని చేయబోతున్నారని అనుమానం వస్తే చాలు అరెస్టు చేసి కొంత గడువుదాకా పోలీసు కస్టడీలో వుంచే అధికారం ప్రభుత్వానికి వుంది అని సిఆర్‌పిసి 151 చెప్తుంది. ఆ సెక్షన్ ఉపయోగించుకుని యీయన్ను జైల్లో పెట్టేశాం. ఆ వార్త వినగానే ఊరంతా పొక్కిపోయి అలజడి అయిపోయింది. ఊరంతా పొక్కాలనే మా ఉద్దేశం. టెలిఫోన్లు పని చేయడం లేదు. అందువలన పనిలో పనిగా కర్ఫ్యూ సడలించాం. దాంతో మనుష్యులు ఒకళ్ల యింటికి మరొకళ్లు వెళ్లి మరీ యీ విషయం చెప్పుకున్నారు.
అది వినగానే ఊళ్లో పెద్దమనుషులు, చిన్న మనుషులు అందరూ కలిసి మా మీదకు వచ్చేశారు. ఇదెక్కడి అన్యాయమండి అని అడగడానికి. తమాషా చూశారా, అప్పటిదాకా మమ్మల్ని కలవడానికి వాళ్లు పెట్టుకున్న అభ్యంతరాలన్నీ ఆ తరుణంలో జావకారిపోయాయి. వెంకటేశ్వర్లుగారిని రక్షించుకోవాలన్న తపనే వాళ్లను పోలీసుస్టేషన్ బాట పట్టించింది. అదే మేము కోరుకున్నది. ఏ కారణం చేత వాళ్లు వచ్చినా వాళ్లు రావడమే కదా మాకు కావలసినది! వచ్చినపుడు మా వాదనలు మేం చెప్తాం, వాళ్ల వాదనలు వాళ్లు చెప్తారు. చివరకు ఎక్కడో అక్కడ తేలతాం. ఈ నాలుగు మాటలు మాట్లాడుకోవడానికి వాళ్లు మొండికేశారు. అందువలన దండోపాయం వుపయోగించాల్సి వచ్చింది, ఎందుకూ అంటే సామోపాయంతో వాళ్లకు నచ్చచెప్పడానికి.
వాళ్లు వచ్చినపుడు కాస్సేపు వాళ్లు చెప్పదలచినదేదో చెప్పనిచ్చాం. ఆ తర్వాత మేం చెప్పాం – 'మీ ఉద్యమలక్ష్యం ఏదైనా కానీయండి, ఎంత గొప్పదైనా కానీయండి, ఎంత న్యాయమైనదైనా కానీయండి.. ప్రభుత్వం తన వైఖరికి కట్టుబడినట్టే మీరు మీ వైఖరికి కట్టుబడుతున్నారు. మంచిదే. కానీ దానివలన మధ్యలో జరుగుతున్న నష్టం ఎవరికి? మీకూ, మాకూ, మన ఊరికీ.
మనం యిక్కడ ఈ టేబులు దగ్గర కూర్చుని తీసుకునే నిర్ణయాల వలన ఎవరి వైఖరులూ ఉన్నట్టుండి మారిపోయే పరిస్థితి లేదు. ఇది మన ఊరికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఉద్యమం రాష్ట్రస్థాయిలో జరుగుతోంది. దానికి సారథులు వేరే వున్నారు. వారు చెప్పినట్టు మీరు నడుచుకోవాలి. ఇక ప్రభుత్వ పక్షాన అంటారా, రాష్ట్రస్థాయిలోనే కాదు, జాతీయస్థాయిలో తీసుకోవలసిన నిర్ణయం అది. అది కూడా మన కంటె ఎంతో సీనియర్లు, పెద్ద పదవుల్లో వున్నవాళ్లు తీసుకుంటారు. దానికి ఎంత టైము పడుతుందో మాకూ తెలియదు, మీకూ తెలియదు.
ఈ లోపున మామూలు జీవితం అంటూ నడవాలి కదా. మీరైతే అన్ని రకాల త్యాగాలకు సిద్ధపడి వున్నారు బాగానే వుంది. ఈ ఉద్యమంతో సంబంధం లేని సామాన్య ప్రజానీకం కూడా చాలామంది వున్నారు కదా. ఎవరింట్లోనో పురుడు వస్తుంది, లేక ఎవరో పెద్దాయనకు హార్ట్ ఎటాక్ వస్తుంది. ఆయన్ని హాస్పటల్‌కి తీసుకెళ్లాలి. ఎవరికో కబురు వస్తుంది పెళ్లనో, చావనో ఏదో. ఆ ఊరి కెళ్లాలి. అంతకంటె ముందు స్టేషన్ కెళ్లాలి. మనం బంద్ లంటూ ఊళ్లో రిక్షాలాపేసి, రైళ్లాపేసి యింట్లోనే కూర్చోబెడితే ఎలా? కాస్త దూరదృష్టితో వ్యవహరించవద్దా?
మిమ్మల్ని ఉద్యమం మానేయమని గాని, అసలు ఉద్యమం చేయడం తప్పని కాని మేము అనటం లేదు. అది అసలు యిస్యూయే కాదు. ప్రస్తుతానికి మనం చూడవలసినది మామూలు జనజీవితం పునరుద్ధరించాలా వద్దా అన్నది. అది చేయలేకపోతే మేము దానిలో విఫలం చెందామని చాటి చెప్పినట్టవుతుంది. పోనీ మేం మాట పడినా మీకు దానివలన లాభం ఏమైనా చేకూరుతుందా? మేం చెబుతున్న అవస్థలన్నీ పడిన జనం మిమ్మల్ని మెచ్చుతారా? మామూలు మనిషికి పొద్దున్న లేచే సరికి పాలు కావాలి. కరంటు కావాలి. కూరగాయలు కావాలి. బియ్యం దొరకాలి. టెలిఫోను వుండాలి. ఉత్తరాలు రావాలి. బస్సులు తిరగాలి. ఇవన్నీ మీరు స్తంభింపచేస్తే అతను సంతోషిస్తాడా? ఉద్యమం కోసం అని ఓర్చుకుంటాడు. ఎన్నాళ్లు? సహించలేక వాళ్లు ఎదురు తిరిగితే అప్పుడు మీ ఉద్యమానికే దెబ్బ కదా!''
ఇలా చెప్తూ పోయేసరికి వాళ్లు కాస్త మెత్తబడ్డారు. కానీ ఫైరింగ్ జరగడంపై కోపంగా వున్నారు. ఎందుకంటే కాల్పుల్లో నలుగురు పోయారు పాపం. ''దాని సంగతి ఏమిటి?'' అన్నారు.
''దాన్నీ వదిలిపెట్టం. ఫైరింగ్ ఎందుకు జరిగింది? అవసరమా కాదా అన్న విషయంపై ప్రభుత్వం ఎలాగూ విచారణ జరిపిస్తుంది. బాధ్యులెవరో తెలుసుకుని ప్రభుత్వం తప్పకుండా చర్య తీసుకుంటుంది… కదా! ఆ హామీ మాత్రం మేం యివ్వగలం. ఈ లోపున మీరు మామూలు పరిస్థితులు నెలకొనేందుకు సహకరిస్తేనే యీ కథంతా ప్రారంభమవుతుంది. లేకపోతే ఎక్కడ వేసిన గొంగళీ అక్కడే..''
అని యిలా చెప్పాం. వాళ్లు మేం చెప్పినదానికల్లా తాళం వేయకపోయినా, ఓపిగ్గా విన్నారు. వెళ్లిపోయారు. మేం వెంకటేశ్వర్లు గారిని విడుదల చేసేశాం. దానివలన విజయం సాధించినట్టు వాళ్లు ఫీలయ్యారు. నెమ్మదిగా సాధారణ పరిస్థితులు తిరిగి రావడం మొదలైంది. ఒక్కసారిగా కాకపోయినా కుంటుకుంటూ రోజురోజుకి పరిస్థితి మెరుగుపడింది.
కుంటు కుంటూ అని ఎందుకన్నానంటే ఒంగోలు కాల్పులయిన వెంటనే ఒకటి, రెండు రోజుల్లో చీరాలలో కాల్పులు జరిగాయి. ఎవరూ పోలేదనుకోండి. అక్కడ శాంతిభద్రతల కోసం నేను అక్కణ్నుంచి వెంటబెట్టుకుని వచ్చిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సుతో మళ్లీ వెనక్కి వెళ్లవలసి వచ్చింది. వెంటనే సద్దు మణిగింది.
నిజానికి ఒంగోలులో కాల్పులు జరిగిన రోజునే తెనాలిలో, ఆదోనిలో ఫైరింగ్స్ జరిగాయి. రాష్ట్రమంతా అట్టుడికిపోయినట్టు ఉడికిపోయింది. దాని వలన ఎక్కడ చూసినా ఏదో ఒక సంఘటన చోటు చేసుకునేది. కానీ ఒంగోలులో మాత్రం మళ్లీ అవాంఛనీయ సంఘటన ఏదీ జరగలేదు. దానికి కారణం – ఆదిలోనే జరిగిన నిష్ఠూరం వలన కావచ్చు, ఎంక్వయిరీ వేయడం వలన కావచ్చు, మానవీయ కోణాన్ని విస్మరించకుండా దృఢమైన చర్యలు చేపట్టడం వలన కావచ్చు, సంభాషణా ప్రక్రియ ప్రారంభించి, కార్యకలాపాలలో అవతలివారిని భాగస్వామిని చేయడం వలన కావచ్చు.
అవేళ మాకు ఆ విధంగా ఉపయోగపడిన వెంకటేశ్వర్లు గారు నాకు మంచిమిత్రులయ్యారు. ప్రకాశం జిల్లా కలక్టరుగా పనిచేసిన చంద్రయ్యగారి అధ్యక్షతన చాలా ఏళ్ల తర్వాత వెంకటేశ్వర్లుగారికి ఒంగోలులో సన్మానం జరిగినప్పుడు నన్ను ఆ సభకు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అలాగే దరిమిలా టి ఆర్ ప్రసాద్‌గారు జిల్లాలో చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. కాబినెట్ సెక్రటరీగా పని చేసి ఫైనాన్స్ కమిషన్ మెంబరుగా రిటైరయ్యారు.
మీ సూచనలు [email protected] కి ఈమెయిల్ చేయండి.
excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com
please click here for audio version