అమృతానందమయి – వివాదాలతో ఆలింగనం

మనదేశంలో స్వామీజీ అనే మాటకు పర్యాయపదం – వివాదం. హిందూమతం అనాదిగా వున్నా, దానిలో విషయాలనే కొత్తగా చెపుతున్నానంటూ ఒకాయన వెలుస్తాడు, ఉపన్యాసాలు దంచుతాడు. రెండేళ్లు తిరక్కుండా కొందరు విదేశీ భక్తులు వాళ్ల దగ్గర…

మనదేశంలో స్వామీజీ అనే మాటకు పర్యాయపదం – వివాదం. హిందూమతం అనాదిగా వున్నా, దానిలో విషయాలనే కొత్తగా చెపుతున్నానంటూ ఒకాయన వెలుస్తాడు, ఉపన్యాసాలు దంచుతాడు. రెండేళ్లు తిరక్కుండా కొందరు విదేశీ భక్తులు వాళ్ల దగ్గర చేరతారు. హిందూపేర్లు పెట్టుకుని వీళ్ల దగ్గర థాబ్దాల తరబడి అత్యంత ఆత్మీయంగా మెలగుతారు. ఆ తర్వాత విడిచి వెళ్లిపోతారు. ఇంకో అయిదారేళ్లకు ఆ స్వామీజీకి ఫలానా వికారం వుంది, యింత డబ్బు పోగేసుకున్నాడు, నా జీవితంలో అనేక సంవత్సరాలు వాడి దగ్గర వ్యర్థం చేసుకున్నాను – అంటూ ఓ పుస్తకం రాస్తాడు. అది వాళ్ల దేశంలో అమ్ముడుపోయినా, పోకపోయినా మన దగ్గర అమ్ముడుపోతుంది. 

మన మీడియా దానిలో భాగాలు వేసుకుని పాఠకులను ఆకర్షిస్తుంది. కానీ ఆ స్వామీజీ భక్తులు యిదంతా అబద్ధం అంటారు. ప్రభుత్వం పట్టించుకోదు. ఆశ్రమం యథావిధిగా సాగిపోతుంది. కొత్త భక్తులు వస్తారు. వారిలో కొందరు విదేశీయులు, మళ్లీ కొన్నాళ్లకి వీళ్లలో కొందరు యిలాటి పుస్తకం యింకోటి రాస్తారు. అది వాళ్ల దేశంలో…. ఈ చక్రం దొర్లుతూనే వుంటుంది. ఇన్నాళ్లూ మగ స్వామీజీల గురించి రాస్తూ వచ్చారు కాబట్టి సెక్స్‌ గురించి రాయడం ఖచ్చితంగా వుండి తీరుతుంది. ఈ సారి మాతా అమృతానందమయి అనే సాధ్వి గురించి రాశారు కాబట్టి అది వుండదన్న బెంగ వద్దు. గాయత్రి పేరుతో ఆమె వద్ద శిష్యరికం చేసిన ఆస్ట్రేలియా దేశస్తురాలు గెయిల్‌ ట్రెడ్‌వెల్‌ రాసి, యిటీవలే వెలువరించిన ''హోలీ హెల్‌ – ఎ మెమాయిర్‌ ఆఫ్‌ ఫెయిత్‌, డివోషన్‌ అండ్‌ ప్యూర్‌ మ్యాడ్‌నెస్‌'' అనే పుస్తకంలో ఆ వివరాలూ వున్నాయి.

అమృతానందమయి కేరళలో చాలా పాప్యులర్‌ మాతాజీ. 61 సంవత్సరాల బ్రహ్మచారిణి. ఆవిడ స్పెషాలిటీ అందర్నీ ఆలింగనం చేసుకోవడం. ప్రపంచవ్యాప్తంగా మూడుకోట్ల ముప్ఫయి లక్షల మందిని ఆలింగనం చేసుకున్న రికార్డు ఆమె సొంతం. కేరళలోని కొల్లమ్‌ వద్ద ఒక గుడిసెలో 33 ఏళ్ల క్రితం తన ఆశ్రమం మొదలుపెట్టిన ఆమె యీ రోజు వేలాది కోట్లకు అధిపతి. భారతదేశంలో అనేక పట్టణాలలో, నగరాల్లో ఆమె ఆశ్రమానికి ఆస్తులున్నాయి. కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌, సింగపూరు, స్పెయిన్‌, జర్మనీ, బెల్జియం, జపాన్‌లలో కూడా..! అన్నిటికన్న మిన్న అయినది- ఒకప్పటి అమెరికా మాజీ అధ్యకక్షుడు కెనెడీ సోదరి యూనిస్‌ నుండి సంపాదించిన వాషింగ్టన్‌ డిసిలోని 8 మిలియన్‌ డాలర్ల విలువైన ఎస్టేటు. అనేక ఆశ్రమాలలాగే వీళ్లూ విద్య, వైద్యానికి చేయూత నిస్తున్నామంటూ స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు నడుపుతారు. ఇంత డబ్బున్న ఆశ్రమానికి రాజకీయనాయకుల దన్ను వుండడంలో ఆశ్చర్యం లేదు. శశి థరూర్‌ నుండి నరేంద్ర మోదీ వరకు అందరూ ఆమె ఫంక్షన్లకు వచ్చినవాళ్లే. శశి థరూర్‌ తన పలుకుబడితో యునైటెడ్‌ నేషన్స్‌ చేత 2007లో గాంధీ-కింగ్‌ అవార్డు యిప్పించాడు. అహింసామార్గాన్ని ప్రచారం చేసినందుకు యిచ్చే యీ అవార్డు నెల్సన్‌ మండేలా, కోఫీ అన్నన్‌లకు యిచ్చారు. 

చిత్రం ఏమిటంటే యిప్పుడు ఈ గెయిల్‌, తన పుస్తకంలో అమృతానందమయి హింసాప్రవృత్తి కలదని, తన శిష్యులను, పరిజనాన్ని తిడుతుందని కొడుతుందని ఆరోపించింది. శృంగార కార్యకలాపాల్లో పాల్గొందని,  డబ్బు విపరీతంగా సంపాదించి, దాచుకుందని కూడా చెప్పింది. మాతాజీ ఆశ్రమం పెట్టిన తొలిరోజుల్లోనే 1981లో గెయిల్‌ వచ్చి ఆవిడ వద్ద శిష్యురాలిగా, వ్యక్తిగత సహాయకురాలిగా, ఆంతరంగికురాలిగా చేరి 18 ఏళ్ల పాటు వుండి 1999లో విడిచి వెళ్లిపోయింది. ఇన్నాళ్లకు యీ పుస్తకం రాసింది. ఇక్కడ వున్నపుడు, వెళ్లిపోయిన 14 ఏళ్ల పాటు మౌనంగా వుండి యిప్పుడు యిలా రాయడమేమిటని ఆమె భక్తులు అడుగుతున్నారు. దానికి ఆమె – ''భక్తులిచ్చిన డబ్బును మాతాజీ తన తలిదండ్రులకు యిస్తూండేది. ముగ్గురు సోదరులకు, ముగ్గురు సోదరీమణులకు ఖర్చుపెడుతూ వుంటే కుటుంబం బాంధవ్యాలు దృఢంగా వుండే భారతదేశంలో యిది సహజం కాబోలు అనుకున్నాను. ఆశ్రమంలో నాపై లైంగిక దాడులు జరిగాయి. ఆర్థికపరమైన అక్రమాలు అనేకం జరిగాయి. ఆమె కోపతాపాలు భరించడం కష్టమైంది. ఇవన్నీ భరించలేక వెళ్లిపోయాక ఆ ట్రామా (మానసిక అవేదన) నుండి బయటపడడానికి చాలా ఏళ్లు పట్టింది. ఆ తర్వాత యీ బాధలన్నీ మర్చిపోతే మంచిదన్న ఆలోచనలో కొంతకాలం గడిపాను. ఆ తర్వాత వాళ్లు భౌతికంగా దాడి చేస్తారన్న భయపడ్డాను. ఇక తెగించి యిన్నాళ్లకి పుస్తకం రాశాను.'' సమాధానమిచ్చింది. ''ఆమె వెళ్లిపోవడానికి యివేమీ కారణాలు కావు. ఆమె లైంగిక విశృంఖలత్వం కారణంగానే వెళ్లిపోమన్నాం. న్యూయార్క్‌ నుండి వచ్చిన బిలియనీర్‌ను పెళ్లి చేసుకుంటానంటూ అతని వెంట పడింది. ఈమెతో వేగలేకపోతున్నానని అతను ఫిర్యాదు చేశాడు. 'నువ్వు ఆశ్రమంలో వుండతగవు' అని చెప్పి పంపించివేశాం.'' అంటున్నారు మాతాజీ భక్తులు. 

ఇప్పుడు యీ 229 పేజీల పుస్తకం ఈ-వెర్షన్‌ సోషల్‌ మీడియాలో వీరవిహారం చేస్తోంది. అప్‌లోడ్‌ చేసిన వారి కోసం కేరళ పోలీసులు గాలిస్తున్నారు. కేరళ రాజకీయనాయకులందరూ అమృతానందమయికు మద్దతుగా నిలబడ్డారు. ముఖ్యమంత్రి చాండీ ''ఆశ్రమం వారు ఎంతో సమాజసేవ చేశారు. ఆధారరహితమైన ఆరోపణలతో వారి ప్రతిష్ట మసకబారకూడదు.'' అన్నారు. సిపిఎం సెక్రటరీ పినరాయి విజయన్‌ ''ఆరోపణలపై విచారణ జరపాలి'' అని వూరుకున్నారు. ఇక బిజెపి, విశ్వహిందూ పరిషత్‌ అయితే ఆశ్రమం తరఫున వకాల్తా పుచ్చుకుని వాదిస్తున్నారు. ''ఇలాటి పుస్తకం రాసి హిందువులను రెచ్చగొట్టడం ఒక కుట్ర'' అంటున్నారు. ఇక భక్తులైతే – పుస్తకంలో ప్రస్తావించిన నలుగురు విదేశీభక్తుల చేత భక్తులు రచయిత్రి చేసిన ఆరోపణలు ఖండింపచేయడమే కాక ఆమె స్వైరిణి అని ప్రత్యారోపణలు చేయించారు. ఇంకో స్వామీజీ బండారం బయటపడేవరకు యిది నడుస్తుంది. తర్వాత దీన్ని మర్చిపోతాం. భక్తుల సంఖ్యా తగ్గదు, పుస్తకాల సంఖ్యా తగ్గదు. మాతాజీ శిష్యురాళ్లలో హాలీవుడ్‌ నటీమణి షారోన్‌ స్టోన్‌ కూడా వుంది. కొన్నాళ్లకి ఆమె కూడా యిలాటి పుస్తకం రాస్తే అప్పుడు యివన్నీ మళ్లీ గుర్తుకు తెచ్చుకుంటాం.