మోహన మకరందం : తడాఖా చూపించాలి.. ఒక్కోసారి

అనుభవాలూ – జ్ఞాపకాలూ: || మోహన్‌ కందా  Advertisement తడాఖా చూపించాలి.. ఒక్కోసారి 1973లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబడింది. నెలల తరబడి సాగిన సమ్మె కారణంగా ప్రభుత్వం పని చేయకుండా వుండడంతో ప్రజలలో…

అనుభవాలూ – జ్ఞాపకాలూ: || మోహన్‌ కందా 

తడాఖా చూపించాలి.. ఒక్కోసారి

1973లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబడింది. నెలల తరబడి సాగిన సమ్మె కారణంగా ప్రభుత్వం పని చేయకుండా వుండడంతో ప్రజలలో అరాచకత్వం ప్రబలింది. ప్రభుత్వాన్ని, అధికారులనూ లక్ష్యపెట్టడం మానేశారు. బియ్యం సేకరణ అనుకున్నంత స్థాయిలో సాగడం లేదు. అదుపు చేయడానికి చాలినంత మంది అధికారులు అందుబాటులో లేరు.

మీరు మామూలు ధోరణికి వచ్చి తీరాలి అని ప్రజలకు ధాటీగా చెప్పాలంటే ఏదో ఒకటి తీవ్రంగా చేసి తీరాలి. ఫలితం ఎలా వున్నా దానికి సిద్ధపడాలి. తప్పదు.

కారంచేడు అనే ధనికగ్రామంలో బాగా డబ్బున్న ఆసామీ, మంచివాడు, మంచి స్నేహితుడు. 

ఆయనే సరైన ఛాయిస్‌ అనుకున్నాం. 

చెకింగ్‌కి వెళ్లినట్టు వెళ్లి 'మీ వద్ద ఐదువేల బస్తాల ధాన్యం వుంది, ప్రభుత్వానికి అప్పచెప్పకుండా యింత ధాన్యం ఎందుకు వుంచుకున్నారు?'  అంటూ ధాన్యం స్వాధీనం చేసుకున్నాం.

అంతే! యీ వార్త ఒక కార్చిచ్చులా జిల్లా ప్రజలందరికీ పాకిపోయింది.

పరిణామం ఎలా వుంటుందాని అధికారులమందరం ఉగ్గబట్టుకుని చూశాం. 

xxxxxx

ప్రభుత్వం కానీయండి, సంస్థ కానీయండి. కొన్నిసార్లు చూసీ చూడనట్టుగా వదిలేయాల్సి వస్తుంది. అప్పుడు పరిస్థితి అదుపు తప్పుతుంది. దాంతో అవతలివాళ్లు తోక ఝాడిస్తారు. క్రమంగా అథారిటీని గుర్తించడం మానేస్తారు. అలాటి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి మేనేజ్‌మెంట్‌ స్తబ్దతనుండి మేల్కొని మేమంటూ వున్నామని తెలియచెప్పడానికి తడాఖా చూపించే చర్యలు చేపట్టాలి.

ప్రభుత్వాధినేతలుగా రాజకీయ నాయకులుంటారు. రాజకీయ నాయకులనగానే కాస్త పట్టువిడుపులు పెట్టుకుంటారు. ఎంత మంచి పనైనాసరే ప్రజలకు నచ్చచెప్పలేకపోతే వద్దులే అనేస్తారు. ఎందుకంటే ప్రతీ ఐదేళ్లకు వాళ్లకు ఎన్నికలుంటాయి. అధికారులకైతే ఆ బెడదల్లేవు. రూలు ప్రకారం వాళ్లు నడుపుకుపోతారు. మన రాజ్యాంగనిర్మాతలు అందుకనే వేర్వేరు ఎజెండాలున్న యిద్దర్నీ కలిపి ఒక గాటికి కట్టి నడవమన్నారు – ఇద్దరి మధ్యా ఆటోమెటిక్‌గా బాలన్స్‌ అవుతుందని ఐడియా! ప్రజాక్షేమం గురించి కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసినప్పుడు రాజకీయనాయకులు తటపటాయిస్తారు. దాంతో అందరూ నెత్తి కెక్కుతారు. పాము కరవకపోయినా కనీసం బుస కొట్టాలని సామెత. కానీ ఒక్కో పరిస్థితిలో ప్రభుత్వం బుస కొట్టడం కూడా మర్చిపోతుంది.

1972లో జై ఆంధ్రా ఉద్యమం నడిచినప్పుడు అదే జరిగింది. అధికారంలో వున్నవారూ, ఉద్యమకారుల్లో ప్రముఖులూ ఒకే పార్టీవారు. రాజకీయంగా సయోధ్య సాధించి ఉద్యమం చల్లారుద్దామని చూశారు చాలాకాలం. ఉద్యమకారులపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడారు. ఏం తీసుకుందామన్నా మధ్యలో ప్రజలున్నారు. వాళ్లు పూర్తిగా ఆవేశంలో పడి కొట్టుకుపోతూ వుండేవారు. ఎవడో ఒకడు పేపర్లో రేపు బంద్‌ అని చిన్న స్టేటుమెంటు యిస్తే చాలు, 'అసలు వాడెవడు? ఉద్యమంలో వాడి స్థాయి ఏమిటి? ఆ పిలుపు మనం మన్నించాలా అక్కరలేదా?' ఇవేమీ ఆలోచించకుండా ఎందుకైనా మంచిదన్నట్టు మర్నాడు ఆంధ్రప్రాంతమంతా బంద్‌ అయిపోయేది.

ఒకరోజు నాకు బాగా జ్ఞాపకం. ఇలాగే బంద్‌ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో సబ్‌కలక్టర్‌గా వుండేవాణ్ని. అవేళ చీరాలలో వున్నాను. బంద్‌ రోజు నిరసన యాత్ర అన్నారు. అవాంఛనీయ సంఘటనలు ఏవీ జరగకుండా చూడడానికి వెళ్లి పోలీసు స్టేషన్‌లో కూర్చున్నాను. ఓ పెద్ద ఊరేగింపులా జనాలు అలా వెళుతూనే వున్నారు. బస్సులు, లారీలు, కార్లు, జీపులు, స్కూటర్లు, మోటారు సైకిళ్లు, సైకిళ్లు, నడిచివెళ్లేవాళ్లు, కొన్ని వేలమంది అలా ఒకరి తర్వాత ఒకరు వెళుతూనే వున్నారు. ఏడున్నర గంటలపాటు అలా సాగింది ఆ యాత్ర. ఉద్యమం వెనక్కాల రాజకీయాలున్నాయా, సంస్కరణలు అడ్డుకునే స్వార్థపరుల ప్రయోజనాలున్నాయా అంటూ కొన్ని వర్గాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో మామూలు ప్రజలకు ప్రమేయం లేదు. 'మనకేదో అన్యాయం జరుగుతోంది. రాష్ట్రం విడిపోతే తప్ప మార్గాంతరం లేదు. మన బతుకులు బాగుపడవు' అనే భావన ప్రజల్లోకి చొచ్చుకుపోయి వాళ్లంతట వాళ్లే వచ్చి ఉద్యమంలో పాల్గొన్నారని స్పష్టంగా తెలుస్తోంది. 

అలాటి పరిస్థితుల్లో 1973 జనవరిలో పి వి నరసింహారావుగారు రాజీనామా చేయడం, రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. అప్పటికే ప్రధానమంత్రిగా వున్న ఇందిరా గాంధీ స్పష్టమైన, దృఢమైన వైఖరి తీసుకున్నారు – 'ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రం విడగొట్టే ప్రశ్న లేదు' అని. రాష్ట్రపతి పాలన అంటే ఆయన ప్రతినిథిగా గవర్నరు పాలన. గవర్నరుకు సలహాదారుగా ఎచ్‌.సి.శరీన్‌ అని ఒక సీనియరు అధికారిని వేశారు. పాలన మొత్తం అధికారుల చేతిలోకి వచ్చింది. మొహమాటాలకు పోయి వాళ్లకు అడ్డుపడే రాజకీయనాయకులు ఎవరూ లేరు. ఇన్నాళ్లగా ప్రభుత్వం అనేది వుందా లేదా అన్న సందేహంలో వున్న సామాన్యప్రజలకు 'ఉంది, అరాచకచేష్టలు సహించదు' అని అర్థమయ్యే రీతిలో చెప్పాలని మాకు ఆదేశాలు వచ్చాయి. ఒక్కమాటలో చెప్పాలంటే 'మేక్‌ యువర్‌ ప్రెజన్స్‌ ఫెల్ట్‌' (మీ ఉనికిని వాళ్లు గుర్తించేట్టు చేయండి) అని ఆర్డర్స్‌.

ఇది వాళ్లు చెప్పినంత సులభం కాదు. ఎందుకంటే ఏ డిపార్టుమెంటు తీసుకోండి దానిలో నెలల తరబడి సమ్మె జరుగుతోంది.  ఆసుపత్రి సిబ్బంది సమ్మె, మునిసిపాలిటీ వర్కర్ల సమ్మె, విద్యార్థుల సమ్మె, స్కూలు టీచర్ల సమ్మె, కాలేజీ లెక్చరర్ల సమ్మె, ప్రభుత్వోద్యోగులందరూ సమ్మె. వీళ్లందరూ కలిసి పోస్టల్‌ డిపార్టుమెంటు వాళ్లు పని చేయకుండా అడ్డు తగిలారు. రైళ్లు ఆపేశారు. బస్సులు, లారీలు తిరగనివ్వలేదు. ఎటుచూసినా స్ట్రయికో, సమ్మో. రాష్ట్రపతి పాలన విధించినా రాజకీయంగా చల్లారలేదు. అప్పటిదాకా మమ్మల్ని పాలించినవాళ్లందరూ వెళ్లి ఉద్యమంలో కలిసిపోయి ఉద్యమకారులై పోయారు. ఆవేశకావేషాలు రెచ్చగొడుతున్నారు. ప్రజలంతా రగులుతున్నారు. 

ఒంగోలులో ఫైరింగ్‌ జరిగినందుకు కలక్టరు టిఆర్‌ ప్రసాద్‌ గారి మీద ప్రజలకు విముఖత ఏర్పడింది. అసమంజసమే అయినా, ఆయన ఎక్కడ కనబడినా దాడి చేసేవారు. అందువలన ఆయనను ఓ యింట్లో దాచి వుంచాల్సి వచ్చింది. ఒక మనిషి ఎంతకాలం అలా దాగుని వుండగలరు? అప్పుడప్పుడు మేము అంటే నేనూ, ఎస్‌ పి గా వున్న రామస్వామి జీపులో తలోవైపు కూర్చుని బయటకు తీసుకుని వస్తూ వుండేవాళ్లం. నాకు బాగా గుర్తు – ఒకసారి క్లబ్‌కి తీసుకెళ్లి ఒక గంటసేపు బ్రిడ్జ్‌ గేమ్‌ (పేకాట) ఆడాం. ఆయన ఎంత సంతోషపడ్డారో ఆ రోజు!

జిల్లా మొత్తానికి అధికారిగా వున్న వారే యిలా బయటకు వచ్చే పరిస్థితిలో లేనప్పుడు జిల్లా ప్రజలకు మా అధికారాన్ని ప్రదర్శించడం ఎలా? గతం గతః ఇప్పుడు మేమే కింగ్స్‌, మీరంతా అరాచకత్వం మాని మామూలు ధోరణిలోకి వచ్చి తీరాలి అని చాటి చెప్పడం ఎలా? దానికోసం కలక్టరుగారు, నేను, ఎస్పీ గారు, యితర అధికారులం కలిసి ఓ ప్రణాళిక రచించుకున్నాం.

కొద్దిరోజుల్లోనే ప్రభుత్వోద్యోగులు సమ్మె విరమించుకున్నారు. మేం ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ను పిలిచి 'ఏమయ్యా, నువ్వు హోటల్స్‌కి వెళ్లి నాలుగు శాంపుల్స్‌ తీసుకుని రా. ఏమైనా లోపాలు కనబడితే వెంటనే కేసులు పెట్టేయ్‌' అని చెప్పాం. అలాగే సేల్స్‌టాక్స్‌ వాళ్లను పిలిచి నువ్వు వెళ్లి నాలుగు దుకాణాలు యిన్‌స్పెక్ట్‌ చేసి పుస్తకాలన్నీ సరిగ్గా వున్నాయో లేదో చూడు అన్నాం. పబ్లిక్‌ హెల్త్‌ వాళ్లని పిలిచి మీరూ వెళ్లి కాస్త దర్పం ప్రదర్శించి రండన్నాం. ఇరిగేషన్‌ వాళ్లని పిలిచి మీరు కాలవ పనులవీ ఎంతవరకూ అయ్యాయో చూసి కాస్త హంగామా చేయండన్నాం. ఒక్కో ఊళ్లో ఒక్కో డిపార్టుమెంటు చేత దడదడలాడించాం. దాంతో 'ఇన్నాళ్లూ ఏదో గడిచిపోయింది కానీ యిప్పుడు ప్రభుత్వం మారిపోయింది. మొర పెట్టుకోవడానికి కూడా ఏ రాజకీయ వ్యవస్థా లేదు. చచ్చినట్టు రూలు ప్రకారం నడవాల్సిందే' అన్న పాఠం చరచరా ప్రజల నరనరాల్లోకి ఎక్కిపోయింది.

ఈ పాఠాన్ని అందరి కంటె చురుగ్గా నేర్చుకున్నది సింగరాయకొండ ప్రజలు. వాళ్లకు మేం 'ప్రెవేటు' చెప్పవలసిన అవసరం తమ ఆక్రమణలద్వారా కల్పించారు వాళ్లు. ఒంగోలు నుండి నెల్లూరు కెళ్లే దారిలో టంగుటూరు, కావలికి మధ్య సింగరాయకొండ వస్తుంది. మేము జీపులో వెళుతూ గమనించాం. ఎన్నో షాపులు, టీ కొట్లు, బడ్డీ కొట్లు, పాన్‌షాపులు రోడ్డుని ఆక్రమించేశాయి. అక్రమంగా ముందుముందుకు వచ్చేసాయి. ఎంత ముందుకు వచ్చేశాయంటే పోలీసు స్టేషన్‌ ఎక్కడుందో కనబడటం లేదు. వీటి పని పడితే చాలు, మన తడాఖా ఏమిటో ప్రజలకు అర్థం అయిపోతుంది అనుకున్నాం. రహస్యంగా సర్వే చేయించాం. కరక్టుగా ఎక్కడ దాకా వుండాలో, ఎక్కణ్నుంచి తీసి పారేయాలో ఎవరి నోటీసుకి రాకుండా రోడ్డు మీద గీతలు గీయించాం. 

ఓ శుక్రవారం రాత్రి పని మొదలుపెట్టాం. శని, ఆదివారాలు కోర్టుకు సెలవులు. ఎవరైనా వెళ్లి స్టే తెచ్చుకుందామన్నా కుదరదు. సోమవారం పొద్దున్న కోర్టు తెరిచే లోపున పని పూర్తయిపోవాలి. ఇలాటి పనులు చెప్పాపెట్టకుండా మొదలుపెట్టి అతి వేగంగా పూర్తి చేయాలి. లేకపోతే ఎప్పటికీ పూర్తి కావు. ఒకళ్లది కొట్టేసి, టైములేక మరొకళ్లది ఉంచేస్తే మొదటివాడు గోల పెడతాడు, లేదా మళ్లీ దుకాణం పెడతాడు. అందువలన ఆర్‌ అండ్‌ బి వాళ్ల ద్వారా మూడు వందలమంది గ్యాంగ్‌ కూలీలను రహస్యంగా ఏర్పాటు చేసుకుని, వాళ్లకు కావలసిన గడ్డపారలు, పలుగులు యిచ్చి శుక్రవారం రాత్రి మొదలు పెట్టించి, శని ఆదివారాలంతా చేయించాం. అన్యాయంగా రోడ్డు ఆక్రమించినవన్నిటినీ కొట్టి పారేశాం.

ఆ తర్వాత మా కలక్టరు ప్రసాద్‌గారిని తీసుకుని వచ్చి చూపించాం. రోడ్లు ఎంత వెడల్పయ్యాయో చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడు. చిన్నపిల్లలు పిచ్చిగీతలు గీస్తే రబ్బరు తీసుకుని తుడిపేసినట్టు యివన్నీ ఎగిరిపోయాయి. యుద్ధబీభత్సం రుచి చూసిన పట్టణంలా వుందయ్యా అన్నాడాయన. అంటే అర్థం ఏమిటి? ఎన్నో ఏళ్లగా ప్రభుత్వంవారి రోడ్లు ఆక్రమిస్తూ పోతే అసమర్థత అనండి, అవినీతి అనండి, నిర్లక్ష్యం అనండి ఏదో కారణం చేత  గుడ్లప్పగించి చూస్తూ కూర్చున్నాం అన్నమాట. అధికారులు ఎపుడైనా చర్యలు తీసుకోబోతే ప్రజాప్రతినిథులు అభ్యంతరం చెప్పి వుంటారు. ఒక్కసారి అవన్నీ తీసి పారేసేసరికి అది ఒక్కసారిగా అందరికీ షాక్‌ యిచ్చింది. మౌనంగానే అయినా, బలంగా గుండెలకు హత్తుకునేలా మనం చెప్పదలచుకున్నది చెప్పేమన్నమాట!  అటువంటి సందర్భాలలో అంత తీవ్రమైన చర్యలు తీసుకుంటే తప్ప ఫలితాలనివ్వవ్‌.

అదేటైములో మేం చేసిన ఇంకో పని ప్రొక్యూర్‌మెంట్‌, మామూలుగా బియ్యం సేకరించాలి. దానికిగాను చాలామంది గెజిటెడ్‌ ఆఫీసర్లు అవసరపడతారు. కానీ అప్పుడు చాలినంతమంది లేరు. కొద్దికొద్దిగా డ్యూటీల్లో జాయినవుతున్నారు. స్టాఫ్‌ లేనప్పుడు వీళ్లు వచ్చి ఏం పట్టుకెళ్లగలరు అన్న చులకన భావం ప్రజల్లో వుందని గ్రహించాం. ఏదో ఒక హంగామా చేసి ప్రజలు వాళ్లంతట వాళ్లే పట్టుకుని యిచ్చేట్లా చేస్తే మాకు సిబ్బంది కొరత సమస్య రాదు. కానీ ఎలా?

మామూలుగా మిల్లర్స్‌ నుండి బియ్యం సేకరిస్తాం. దాని గురించి ఏదో కొంత అలజడి సృష్టించినా పెద్ద ప్రభావం పడదు. ప్రతి గ్రామస్తుణ్ని ప్రభావితం చేయాలంటే ధాన్యం సేకరించాలి. వాళ్ల దగ్గరుండేది ధాన్యమే కాబట్టి! కానీ ఇన్నాళ్లూ బియ్యం సేకరిస్తూ వచ్చి యిప్పుడు సడన్‌గా ధాన్యం అనగలమా? వెతికి వెతికి చూడగా డిఫెన్సు ఆఫ్‌ ఇండియా రూల్సు క్రింద ఓ ప్రొవిజన్‌, ఓ వెసులుబాటు కనబడింది. బాగుంది. ఇక ఎక్కణ్నుంచి మొదలుపెట్టాలి?

కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నారు పెద్దలు. చిన్నా చితకా వాళ్ల మీద చర్య తీసుకుంటే అది గుర్తింపులోకి రాదు. ఎవరైనా ఎప్పుడైనా ప్రజలు ఉలిక్కిపడి మనవైపు చూడాలంటే భారీ సంఘటనైనా వుండాలి, లేదా భారీ వ్యక్తిని యిన్‌వాల్వ్‌ చేయాలి.  భారీ సంఘటన అంటే సింగరాయకొండలో ఎన్‌క్రోచ్‌మెంట్స్‌ తీసేసినట్టు లాటిది. ఇక భారీ వ్యక్తి ఎవరాని చూశాము.

దొరికారు. కారంచేడు అనే గ్రామం. బాగా డబ్బున్న గ్రామం. (డా|| దగ్గుబాటి వెంకటేశ్వరరావు, శ్రీ డి. రామానాయుడు గార్లది ఆ వూరే) అందులో డబ్బున్న ఓ ఆసామి. చాలా పేరున్న పెద్దమనిషి. మంచివాడు. ఊరంతా.. ఊరంతా ఏమిటి, జిల్లా అంతా తెలిసున్నవాడు. మన కార్యక్రమానికి అతికినట్టు సరిపోతాడు. ఆయన గోడౌన్‌లో వున్న ధాన్యం స్వాధీనం చేసుకుంటే చాలు జిల్లా అంతా ఫ్రీ పబ్లిసిటీ – ప్రభుత్వం సీరియస్‌గా వుందని, శక్తిసామర్థ్యాలతో మంచి పకడ్బందీగా ముందుకు సాగుతోందని, ఏ మాత్రం పిచ్చిపనులు చేసినా తాట తీసే తడాఖా కలిగి వుందని.

అయితే ఆ పెద్దమనిషి నాకు మంచి స్నేహితుడు. ఉద్యమం సమయంలో ఎంతటి స్నేహితులూ పలకరించేవారు కారు. ప్రభుత్వాధికారితో కలిసి కనబడితేనే ఏదో దేశద్రోహం చేసేసినట్టు ఫీలయ్యేవారు. అటువంటి భయానక వాతావరణంలో కూడా యీయన వచ్చి కలిసి మంచీ చెడ్డా మాట్లాడేవారు. ఉద్యమం గురించి ఫలానా చోట యిలా జరుగుతోందటండి, ఫలానావాళ్లు కూడా యిలా చేయబోతారు అంటూ ముఖ్యమైన విషయాలుంటే చెప్పేవారు. 

అటువంటి ఆయనపై చర్య తీసుకోవడమా? అంటే.. తప్పదు మరి. ఆయన దగ్గర ఐదువేల బస్తాల ధాన్యం వుందని మాకు సమాచారం వుంది. చెకింగ్‌కి వెళ్లినట్టు వెళ్లి ప్రభుత్వానికి అప్పచెప్పకుండా యింత ధాన్యం ఎందుకు వుంచుకున్నారు? అని సీజ్‌ చేశాం.

అంతే! ఈ వార్త ఒక కార్చిచ్చులా జిల్లా ప్రజలందరికీ పాకిపోయింది. ఆయన స్టేచర్‌ అలాటిది! అమ్మో ఆయన్నే వదలలేదంటే మనమనగా ఎంత? ఈ ప్రభుత్వం ఆషామాషీగా, చూసీ చూడనట్లు పోయే రోజులు వెళ్లిపోయాయి అన్న ఫీలింగ్‌ ఒక్కసారిగా గ్రామీణ ప్రజలందరకూ కలిగింది. వెన్ను జలదరించింది. వాళ్లంతట వాళ్లే వచ్చి మిగులుధాన్యం మాకు అప్పగించసాగారు. ఎంత వచ్చి పడిందంటే పెద్ద వెల్లువలాగ, మమ్మల్ని ముంచెత్తే ఒక పెద్ద ధాన్యపు వరదలాగ! మా స్టాఫ్‌ బయటకు కాలు పెట్టనక్కరలేకుండా కాగల కార్యం గంధర్వులు.. కాదు కాదు ప్రజలు తీర్చేశారు. తగినంతమంది సిబ్బంది లేకపోయినా పని సాధించగలిగామంటే మేం ఎంచుకున్న వ్యక్తి అలాటి ప్రాముఖ్యత కలవారు!

కొసమెరుపు – ఒంగోలులో ఫైరింగ్‌కి ఆర్డరిచ్చి చాలా నెలలపాటు ప్రజల అయిష్టాన్ని రుచి చూసిన కలక్టరు ప్రసాద్‌ గారు చాలా విశేషమైన వ్యక్తి. ఆయన ధైర్యం, దృఢనిశ్చయం, అంకితభావం చెప్పుకోదగ్గవి. అంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఆయన వెన్ను చూపలేదు. జావ కారిపోలేదు. మాకు మార్గదర్శనం చేస్తూనే వున్నారు. అదే చిత్తశుద్ధితో, కార్యదీక్షతో యింకో రెండేళ్లు అదే జిల్లాలో పనిచేసారు.  ఆ అయిష్టాన్ని యిష్టంగా మార్చుకున్నారు. వెళ్లేటప్పుడు ప్రజానీకంలో అన్ని వర్గాల వారూ ఆయనను మెచ్చుకున్నవారే. ప్రభుత్వ యంత్రాంగంలో అన్ని సెక్షన్లవారూ ఆయనపై ప్రశంసలు కురిపించినవారే. 
                                    
మీ సూచనలు [email protected] కి ఈమెయిల్‌ చేయండి.

excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com

please click here for audio version