`రేసుగుర్రం` ఆడియో వేడుకలో అల్లు అర్జున్‌కి చీవాట్లు పెట్టారు చిరంజీవి. ప్రసంగం మొదలుపెట్టాక వేదికపైనున్న అందరికీ థ్యాంక్స్ చెబుతూ… అందరి పనితీరును మెచ్చుకొంటూ చిత్ర నిర్మాల గురించి ప్రస్తావించడం మాత్రం మరిచిపోయాడు అల్లు అర్జున్. ఆ విషయం చిరంజీవి మాట్లాడేటప్పుడు అల్లు అర్జున్‌కి గుర్తొచ్చింది. “నేను నిర్మాతలకి థ్యాంక్స్ చెప్పడం మరిచిపోయాను. ఆ విషయం మీరే చెప్పరా“ అని చిరు చెవిలో చెప్పాడు అల్లు అర్జున్.
ఆ మాట విన్న వెంటనే చిరంజీవి… “అలా మరిచిపోతే ఎలా బన్నీ“ అంటూ చీవాట్లు పెట్టాడు. నవ్వుకొంటూనే అయినా… నిర్మాతల్ని మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ మరిచిపోకూడదని గట్టిగా వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు. “ఇటీవల కాలంలో నిర్మాతలు క్యాషియర్స్ అయిపోయారు. వాళ్లకు హీరోలు, దర్శకులు సరైన గౌరవాన్ని ఇవ్వడం లేదు. నిర్మాత బాగుంటేనే సినిమా ఉంటుంది.
వాళ్లకు ఎంత లాభం వస్తుంది? ఎంత ఖర్చు పెడుతున్నాడు? సినిమా తీస్తున్నందుకు వారికి మనం ఎంత మిగిలివ్వాలి? అనే విషయాలపై దృష్టిపెడుతూ నడుచుకోవాల“ని ఈ సందర్భంగా సూచించారు చిరంజీవి. ఆయన స్పీచ్ విన్నాక అల్లు అర్జున్ మైక్ అందుకుని సారీ చెప్పి… ఆ తర్వాత నిర్మాతలకి థ్యాంక్స్ చెప్పారు. ఇంతకీ ఈ సినిమాకి అసలు నిర్మాత ఎవరో తెలుసా? అల్లు అర్జున్ మావయ్య, చిరంజీవి తోడల్లుడు డాక్టర్ వెంకటేశ్వర రావు.