మోహన : ఎన్టీయార్‌ హయాంలో చాడీలు-సస్పెన్షన్లు

అనుభవాలూ – జ్ఞాపకాలూ : డా|| మోహన్‌ కందా  Advertisement ఎన్టీయార్‌ హయాంలో చాడీలు-సస్పెన్షన్లు ముఖ్యమంత్రి రామారావుగారు, పివిఆర్‌కె ప్రసాద్‌ గారిపై చర్య తీసుకోబోతున్నారని తెలిసి నేను కంగారు పడ్డాను. సస్పెండ్‌ చేసేముందు ఆయనని…

అనుభవాలూ – జ్ఞాపకాలూ : డా|| మోహన్‌ కందా 

ఎన్టీయార్‌ హయాంలో చాడీలు-సస్పెన్షన్లు

ముఖ్యమంత్రి రామారావుగారు, పివిఆర్‌కె ప్రసాద్‌ గారిపై చర్య తీసుకోబోతున్నారని తెలిసి నేను కంగారు పడ్డాను. సస్పెండ్‌ చేసేముందు ఆయనని పిలిచి మాట్లాడాలని శాంతంగానే అయినా దృఢంగానే చెప్పాను. 

కానీ వేణుగోపాల్‌ గారిపై అపోహలు పెంచుకున్నారని తెలిసినపుడు నాకు రామారావుగారి తొందరపాటుపై కోపం వచ్చేసింది. వెంటనే వీరావేశంతో రామారావుగారి గదిలోకి చొచ్చుకుపోయాను. అక్కడ ఆయన కొంతమంది మంత్రులతో కూర్చుని మాట్లాడుతున్నారు.  

నేను గదిలోకి వెళుతూనే అరవడం మొదలుపెట్టాను – ''చాలా బాగుందండీ, అందర్నీ వరసగా సస్పెండ్‌ చేసేయండి, ప్ఫీడా వదిలిపోతుంది. ఇప్పటికే ఒకర్ని చేసి ఎవరినీ వదిలి పెట్టనని, ఎవరికీ మినహాయింపు లేదని చెప్పారు. ఇప్పుడు యీయన వంతు…! రేపు నన్ను కూడా చేసేయండి…'' అంటూ. 

రామారావుగారు తెల్లబోయి ''మోహన్‌, ఏమిటిదంతా..'' అంటున్నారు. 

నేను ఎవరి మాటా వినడం లేదు. నా ధోరణిలో నేను చెప్పుకుంటూ పోయాను.

xxxxxx

ఒక సంస్థ్థలో పనిచేసినపుడు దాని నియమనిబంధనలకు లోబడి మనం పనిచేయాలి. మనకంటె పైనా, కిందా అనేకమంది పనిచేస్తూ వుంటారు. పైవారి ఆదేశాలకు లోబడి పని చేయవలసి వుంటుంది. వారితో మనం విభేదించే సందర్భాలు అనేకం వస్తాయి. నిర్ణయం తీసుకునే క్రమం నడుస్తూండగా వాదించవచ్చు, విభేదించవచ్చు, పర్యవసానాల గురించి హెచ్చరించవచ్చు. కానీ ఒకసారి నిర్ణయం తీసుకోవడం జరిగిపోయాక అది మనకు యిష్టం వున్నా లేకపోయినా దాన్ని అమలు చేయవలసినదే ! లేకపోతే మనం వ్యవస్థలో భాగమే కాదన్నమాట. 

అయితే నిర్ణయం తీసుకోవడానికి జరిగే ప్రక్రియలో మనం చురుగ్గా పాల్గొనడం మన కర్తవ్యం. మనం వుండే పదవి బట్టి, హోదాబట్టి మనకు కొన్ని పరిమితులుంటాయి. వాటికి లోబడే మనం మన సుపీరియర్స్‌కు  మనం మంచి అనుకున్న సలహా యివ్వాలి. ఎందుకంటే మన బాస్‌ వద్దనున్న సమాచారం అసమగ్రం కావచ్చు, అసత్యం కావచ్చు, కావాలని ఎవరో చెడు సలహా యిచ్చి వుండవచ్చు. దాన్ని ఆధారం చేసుకుని ఆయన నిర్ణయం తీసుకుంటూ వుంటే మనం అడ్డుపడవచ్చు. అయితే ఔచిత్యం చెడకుండా చూసుకోవాలి. హద్దుమీరినట్టు కనబడకూడదు. కానీ ఇదంతా రాసినంత సులభం కాదు. ఆచరణలో మహా కష్టం. పైవారి కోపతాపాలకు గురవుతాం. పక్షపాతంతో వ్యవహరించామంటూ పక్కవారి అపవాదులకు గురవుతాం. ఈ కష్టాలకు ఓర్వలేక కొందరు పై వాడు చెప్పినదానికల్లా తల వూపేస్తారు. అది తప్పంటాను. చేతనైనంత చేయమంటాను.

xxxxxx

మిత్రులు, నాకు సీనియర్‌ అయిన పివిఆర్‌కె ప్రసాద్‌గారు రచయితగా కూడా పాఠకులకు పరిచితులు. ఏ శాఖలో వున్నా ఆయన తన ముద్ర వేశారు. అనితరసాధ్యమైన సాహసాలు చేశారు. ఖమ్మం జిల్లా కలక్టరుగా, టిటిడి ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరుగా, వైజాగ్‌ పోర్టు ట్రస్టు చైర్మన్‌గా…- ఏ పదవిలో వున్నా ఆ పదవికే వన్నె తెచ్చారు. ఆ పై ఢిల్లీ వెళ్లి పివి నరసింహారావుగారికి ఆంతరంగికుడిగా మసలి దేశవ్యవహారాలనే చక్కబెట్టారు. అటువంటి సమర్థుడు, నిజాయితీపరుడు ఓ సారి చిక్కుల్లో పడ్డారు. ఎవరూ వూహించని పరిణామం అది. 

జరిగినదేమిటంటే ప్రసాద్‌ టిటిడి ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరుగా భక్తులకు ఉపకరించే ఎన్నో పనులు చేపట్టారు. ఎన్నో పథకాలను తలపెట్టి రికార్డు టైములో పూర్తి చేశారు. సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అమలు క్రమంలో ప్రభుత్వ అనుమతి గురించి ఎక్కువకాలం వేచి వుండకుండా స్వతంత్రించి ముందుకు వెళ్లిపోయేవారు. రూల్సు, రెగ్యులేషన్స్‌ను పట్టుకుని వేళ్లాడుతూంటే పనులు జరగవని ఆయన ఫిలాసఫీ. ఆ తర్వాత అన్నీ క్రమబద్ధీకరించుకోవచ్చు ముందు ప్రజలకు మేలు చేద్దాం అని చొరవ చూపించారు. ఇది కొందరి అసూయకు కారణం అయి వుండవచ్చు.

 కాంగ్రెస్‌ హయాంలో నాలుగు సంవత్సరాల పాటు టిటిడి ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరుగా చేసిన తర్వాత ప్రసాద్‌ ఒక ఏడాదిపాటు కేంబ్రిడ్జి యూనివర్శిటీలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ ప్రోగ్రామ్‌ చేయడానికి వెళ్లిపోయారు. ఆయన వెళ్లిన మూడు, నాలుగు నెలలకే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్టీ రామారావుగారు కాంగ్రెస్‌ పరిపాలనను ఘాటుగా విమర్శించి స్వచ్ఛమైన పరిపాలన అందిస్తానని ప్రజలకు మాట యిచ్చి వారి విశ్వాసాన్ని చూరగొని ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనతో బాటు మంత్రిపదవులు అలరించిన చాలామంది రాజకీయాలకు, పరిపాలనకు కొత్తవారే. అంతకుముందునుండి వున్న అధికారగణం ఎటువంటిదో, వారిలో ఎవరి గుణగణాలు ఎటువంటివో చాలామందికి తెలియదు.

పరిపాలనాయంత్రాంగాన్ని క్షాళన చేద్దామన్న ఉద్దేశంలో వున్న రామారావుగారి అంకితభావాన్ని కొందరు తమకు అనువుగా వాడుకోబోయారు. చాడీలు చెప్పనారంభించారు. దాంతో  కొత్త పాలకవర్గం అందరినీ అపనమ్మకంతో చూస్తూ అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకోసాగింది. ప్రసాద్‌ కూడా యిలాటి అపవాదులకే గురి కాబోయారు. తన గురించి చెప్పుకోవడానికి ఆయన దేశంలో లేడు. ఎక్కడో దూరంగా ఇంగ్లండ్‌లో వున్నారు. తిరిగి వచ్చాక ఆయనకు తనపై ఆరోపణల గురించి, అనేకమందితో బాటు తననూ సస్పెండ్‌ చేయడానికి ఆలోచిస్తున్నారన్న సంగతి గురించి తెలియవచ్చింది. ఆ ఆరోపణల గురించి, అప్పటి పనివాతావరణం గురించి ఆయన తన 'నాహం కర్తా, హరిః కర్తా' పుస్తకంలో వివరంగా రాశారు. ఆయన చెప్పినదాని సారాంశం – 

xxxxxx

ఆయనపై ప్రధానంగా మూడు ఆరోపణలు వచ్చాయి. తన వర్గం వారి పట్ల పక్షపాతంతో లక్షలాది రూపాయల్ని వారికి ధారాదత్తం చేశారన్న ఆరోపణ మొదటిది. వాస్తవం ఏమిటంటే 370 మంది వేదపండితులకు రోజుకి 8 గంటలపాటు వేదపారాయణ చేసినందుకు నెలకు 600-800 రూ.లు గౌరవభత్యం యిచ్చే పథకం అమలు చేశారీయన. దానికి చిలవలు, పలవలు చేర్చి అంకెలు పెద్దవి చేసి దురభిప్రాయం కలిగేట్లు చేశారు.

రెండో ఆరోపణ – వెంకటేశ్వరుడికి చేయిస్తున్న వజ్రకిరీటంలో పొదగవలసిన వజ్రాల గురించి. స్మగ్లర్ల నుండి కస్టమ్స్‌ శాఖ స్వాధీనం చేసుకున్న వజ్రాలతో చేయించే బదులు ప్రైవేటుగా కొనడం వలన మధ్యలో తేడాలు వచ్చాయనీ! స్మగ్లర్లు వజ్రాలను రహస్యంగా తెచ్చేటప్పుడు తమ మర్మాంగాలలో దాచి తెస్తారని తెలుసుకున్న ప్రధానమంత్రి కస్టమ్స్‌ వారి వద్ద తీసుకోవద్దన్నారట. అప్పుడు ఒక ప్రభుత్వ సంస్థ ద్వారా తెప్పించారు. కొనడానికి వెళ్లేలోపునే ప్రసాద్‌కు బదిలీ అయిపోయింది.

ఇక మూడో ఆరోపణ పాపనాశనం డామ్‌ గురించి. మొదట్లో అనుకున్నదానికంటె ప్రాజెక్టు స్థాయి పెరిగింది. కంట్రాక్టర్‌కు బిల్లు చెల్లింపు ఫైలు ప్రభుత్వం వద్దనే పెండింగులో వుంది. కానీ కంట్రాక్టర్లతో కుమ్మక్కయి వాళ్లకు  అనుకూలంగా నిబంధనలు సవరించేశాడని చెప్పారు. ఆయన ఇంగ్లండ్‌నుండి రాగానే పోస్టింగ్‌ యివ్వకుండా తాత్సారం చేయడంతో ప్రసాద్‌కు అనుమానం వచ్చింది. కొందరు ఆయనను హెచ్చరించారు. ఆయన తన జాయినింగ్‌ రిపోర్టును ప్రభుత్వానికి పంపారు. ఇక నిర్ణయం తీసుకోవలసిన సమయం ఆసన్నమైంది. 

అప్పుడు ముఖ్యమంత్రిగారి ఆఫీసులో జాయింటు సెక్రటరీగా పని చేస్తున్న నేను కలగజేసుకున్నాను. ప్రసాద్‌ నిజాయితీ నాకు తెలుసు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న రామారావుగారి చిత్తశుద్ధికి కళంకం వస్తుంది. ప్రసాద్‌ వైపునుండి చూస్తే కేసులో గెలిచినా నా సామర్థ్యానికి, నిజాయితీకి దక్కిన ఫలితం యిదా? అన్న నిస్పృహ ఆవహించి యిదివరకులా పనిచేయకపోవచ్చు. ఆయనే కాదు, యింత బాగా పనిచేసి ప్రసాద్‌ ఏం బావుకున్నాడు అన్న ఆలోచన తక్కిన అధికారుల్లో కూడా కలిగి వారి అంకితభావమూ పలుచన కావచ్చు. అంతిమంగా ప్రభుత్వపు పనితీరుకే దెబ్బ. అందువలన ప్రభుత్వాధినేతగా వున్న రామారావుగారిని ఒప్పించైనా, నొప్పించైనా ప్రయత్నించాలి అనుకున్నాను.

నేను ప్రసాద్‌ మాట ఎత్తడం ఆయనకు రుచించకపోయి వుండవచ్చు. కానీ నేను దృఢంగా చెప్పాను – ''చూడండి, ఆయన నా మిత్రుడు కదాని నేను రికమెండ్‌ చేయడం లేదు. ఆయన తప్పు చేసినా వదిలేయమనీ చెప్పడం లేదు. నేను కోరేదల్లా యింతటి కఠినమైన నిర్ణయం తీసుకునేముందు ఆయనకు ఒకసారి ఎపాయింట్‌మెంట్‌ యిచ్చి చూడండి. ఆయన చెప్పేదేదో ఓపిగ్గా వినండి. ఆ తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ యిష్టం.'' అని.

ఆయన సరేనన్నారు. ప్రసాద్‌ను పిలిపించారు. ప్రసాద్‌ ఆ అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నారు. రామారావుగారికి అపోహలు తొలగిపోయాయి. సస్పెన్షన్‌ ఆలోచన విరమించడమే కాదు, తన హయాంలో ప్రసాద్‌కు ఎన్నో మంచి పోస్టింగులు యిచ్చారు. సహజంగానే సామర్థ్యం, చాకచక్యం వున్న ప్రసాద్‌ ఆ అవకాశాల్ని చక్కగా ఉపయోగించుకుని ఎంతో ఎదిగారు. నేను చేసినదల్లా – నాకెందుకులే అని వదిలేయకుండా పూనిక వహించి పరిస్థితిని చక్కదిద్దడానికి చేతనైనది చేయడం. ప్రసాద్‌ కేసులో మెత్తగానే చెప్పాను కానీ వేణుగోపాల్‌గారి విషయంలో కాస్త.. కాస్తేమిటిలెండి.. బాగానే ఆవేశంగానే చెప్పాను. 

xxxxxx

కె.ఆర్‌.వేణుగోపాల్‌గారు మా కంటె బాగా సీనియర్‌. చాలా సమర్థుడు, నిజాయితీపరుడు. మన రాష్ట్రంలో వరంగల్‌ జిల్లా కలక్టరు, సివిల్‌ సప్లయిస్‌ కమిషనర్‌ వంటి పదవుల్లో పనిచేసి తర్వాత కేంద్రప్రభుత్వంలో పలుహోదాల్లో పని చేసి ప్రధానమంత్రి కార్యాలయంలో సెక్రటరీగా కూడా చేశారు. 

రామారావుగారి ఎన్నికల వాగ్దానాలలో ముఖ్యమైనది 'రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం'. నెగ్గిన తర్వాత వాగ్దానాలు మర్చిపోయే రకం కాదాయన. దాన్ని అమలు చేయాలని గట్టిగా నిశ్చయించుకున్నారు. అన్ని పథకాల కంటె ఆయన హృదయానికి అతి దగ్గరగా వుండే పథకం అది. దాని బాధ్యతను అప్పట్లో సివిల్‌ సప్లయిస్‌ కమిషనర్‌గా వున్న వేణుగోపాల్‌ గారికి అప్పగించారు. ఈ పథకం ఆచరణలో విజయవంతం కావాలంటే రైసు మిల్లర్ల సహకారం తప్పనిసరి. వారు తక్కువధరకు బియ్యం అందిస్తేనే ప్రభుత్వానికి చౌక బియ్యం అందుబాటులోకి వస్తుంది. ఆ విషయం తెలిసిన రైసు మిల్లర్లు వారికి తోచిన డిమాండ్లు ఏవో ముందుకు పెడుతున్నారు. వాటిలో కొన్ని అంగీకారయోగ్యమైనవే కానీ, కొన్ని ఆమోదయోగ్యం కావు. అందువలన వారితో సంప్రదింపుల పర్వం కొన..సాగుతోంది. అనుకున్నదాని కంటె ఎక్కువ సమయం పడుతోంది.

ఈ లోగా రామారావు గారికి ఎవరో చెప్పారు – వేణుగోపాల్‌, రైసు మిల్లర్ల మధ్య చర్చలు మీరు అనుకున్న రీతిలో సాగటం లేదని ! నిప్పు లేకుండా పొగ పుట్టించగల ప్రజ్ఞావంతులు ఎప్పుడూ వుంటారు ! రామారావుగారు వేణుగోపాల్‌ గారిని పిలిచి మాట్లాడారో, ఎవరిచేతనైనా చెప్పించారో కానీ వేణుగోపాల్‌గారు తీవ్రంగా నొచ్చుకోవడం జరిగింది. నిజాయితీపరుడు కావడంతో మనసు గాయపడింది. పక్క రూముకి వెళ్లి తలవంచుకుని కూర్చుని కళ్లనీళ్లు తుడుచుకుంటున్నారు. అనుకోకుండా ఆ గదిలోకి వెళ్లిన నాకు ఆ దృశ్యం కంటపడింది. వెంటనే బయటకు వచ్చేసి ఇదేమిటని అడిగితే ఎవరో సంగతిదని చెప్పారు ! ఈయన్నీ సస్పెండ్‌ చేయబోతున్నారని అర్థమై పోయింది. వెంటనే నాకు రామారావుగారి తొందరపాటుపై కోపం వచ్చేసింది.

నాకూ పివిఆర్‌కె ప్రసాద్‌కు మధ్య వున్న సమీకరణం లాటిది కాదు నాకూ వేణూగోపాల్‌ గారికీ వున్న యీక్వేషన్‌ ! ఫిషరీస్‌ శాఖలో పనిచేసినపుడు ఆయన ప్లానింగ్‌ సెక్రటరీ. ఓ సారి నేను, నా సహచరుడు బెనర్జీ ఆయనను కలవడానికి వెళ్లి మా ప్రతిపాదనలన్నిటికీ 'నో' అనిపించుకుని గదిలోంచి బయటకు వస్తున్నాం. ''యార్‌, ఈ వేణుగోపాల్‌గారు… మనం ఎంత చెప్పినా.. ప్చ్‌..'' అన్నాను బెనర్జీతో, వేణుగోపాల్‌ మా వెనక్కాలే గదిలోంచి బయటకు వచ్చిన విషయం గమనించకుండా !  ఆ పైన యింకా ఏం మాట్లాడతానో ఏమో అనుకున్నాడో ఏమో నా భుజం తట్టి ''మోహన్‌, దిసీజ్‌ వేణుగోపాల్‌..'' అన్నాడు. అప్పుడు నేను గతుక్కుమన్నాను. 

xxxxxx

ఆ రోజు వేణుగోపాల్‌కి జరిగినది నాకు అస్సలు జీర్ణం కాలేదు. వెంటనే వీరావేశంతో రామారావుగారి గదిలోకి చొచ్చుకుపోయాను. అక్కడ ఆయన కొంతమంది మంత్రులతో కూర్చుని మాట్లాడుతున్నారు.  నేను గదిలోకి వెళుతూనే అరవడం మొదలుపెట్టాను – 

''చాలా బాగుందండీ, అందర్నీ వరసగా సస్పెండ్‌ చేసేయండి, ప్ఫీడా వదిలిపోతుంది. ఇప్పటికే ఒకర్ని చేశారు. ఇంకా ఎవరినీ వదిలి పెట్టనని, ఎవరికీ మినహాయింపు లేదని చెప్పారు. ఇప్పుడు యీయన వంతు…! రేపు నన్ను కూడా చేసేయండి. 'చిన్నప్పటినుండీ తెలిసిన, తను ఏరికోరి తెచ్చి తన కార్యాలయంలో జాయింటు సెక్రటరీగా పెట్టుకున్న, తనకెంతో నమ్మకస్తుడు, ఆత్మీయుడైన మోహన్‌ కందానే సస్పెండ్‌ చేసి తనకు స్వపరభేదం లేదని చాటుకున్న ఎన్టీయార్‌' అని పేపర్లో బ్రహ్మాండంగా వస్తుంది…' అంటూ యిలా పటపటా శివాజీ గణేషన్‌ టైపులో డైలాగులు వల్లించాను. 

జానపద సినిమాల్లో ప్రజల కష్టాలు చూసి కడుపు రగిలిన శివాజీ గణేషన్‌, ఎన్టీయార్‌ వంటి కథానాయకుడు రాజదర్బార్‌లో రాజుగార్ని నిలదీస్తూ ఉద్రేకంగా ముందుకుపోతూ వుంటే అతన్ని గొలుసులతో కట్టేసి వెనక్కి లాగే సైనికుల్లా ఇవి చెప్తున్న టైములో నా వీరాభద్రావేశం చూసి అందరూ నన్ను చుట్టుముట్టి వెనక్కి లాగసాగారు. రామారావుగారు ''మోహన్‌, ఏమిటిదంతా..'' అంటున్నారు. నేను ఎవరి మాటా వినడం లేదు. నా ధోరణిలో నేను చెప్పుకుంటూ పోయాను.

నన్ను చిన్నప్పటినుండీ తెలిసున్న రామారావుగారి బంధువు అక్కడే వున్నారు. కష్టపడి నన్ను బయటకు లాక్కుని వచ్చి ఓ గదిలో కూలేసి ''ఏమిటయ్యా నీ ఘోష'' అన్నారు. ''వేణుగోపాల్‌ వంటి నిజాయితీపరుడికే దిక్కు లేకపోతే యిక ఈ ప్రభుత్వాన్ని ఎవరు నమ్ముతారండీ? దీనిలో ఎవరు పనిచేస్తారండీ?'' అని వాదించసాగాను.

కాస్సేపటికి రామారావుగారు పిలిచి ''ఏమిటయ్యా నీ ఘోష?'' అని అడిగారు. ''ఏం లేదండీ, ఆయన్నో సారి పిలిచి మాట్లాడండి. ఏదైనా నిర్ణయం తీసుకునేముందు ఆయనికి చెప్పండి. ఆయన చెప్పేది వినండి. ఆ తర్వాత మీ యిష్టం.'' అన్నాను. ఆయనకిది సబబుగా తోచినట్లుంది. వేణుగోపాల్‌ను పిలిచి ఓ గదిలో ఏకాంతంగా మాట్లాడడం, ఆయన అపోహలు తొలగిపోవడం జరిగింది. శాంతించారు. మచ్చ తొలగించుకున్న వేణుగోపాల్‌గారు అతిత్వరలోనే కేంద్రానికి వెళ్లిపోయారు. ప్రధానమంత్రికి సెక్రటరీగా జాతీయస్థాయిలో పేరు తెచ్చుకున్నారు.

xxxxxx

ఆ నాటి నా ఆవేశం కావాలని తెచ్చుకున్నది కాదు, ఆ డైలాగులు ముందే రాసుకున్నవి కావు. అన్యాయం జరుగుతూంటే చూస్తూ ఊరుకోకూడదు, ఏదో ఒకటి చేతనైనంతవరకు చేయాలి అన్న సంస్కారమే నన్ను ఆవహించి ఆ మంచి జరిపించింది. సంతానంగారిని సస్పెండ్‌ చేసినపుడు కూడా నేను రామారావుగారికి చెప్పి చూశాను. కానీ అప్పటికి పట్టించుకోలేదు. దరిమిలా తన అభిప్రాయం మార్చుకుని సస్పెన్షన్‌ ఎత్తివేయడమే కాదు, ఆయనను ఆత్మీయుడిగా చేసుకున్నారు. అందువలన నేను అనేదేమిటంటే – మన ప్రయత్నం ఒక్కొక్కప్పుడు ఫలించవచ్చు, మరో సందర్భంలో ఫలించకపోవచ్చు. కానీ నాకేం పట్టింది అని వూరుకోకుండా చేతనైనంత చేసి తీరాలని! 

కొసమెరుపు – నా సీనియర్‌, మిత్రులు కాకి మాధవరావుగారికి ప్రసాద్‌ విషయంలో, వేణుగోపాల్‌గారి విషయంలో నేను చేసినది తెలిసింది. ఏదైనా క్లిష్టమైన సమస్య వచ్చినపుడు జోక్‌ చేసేవారు – ''ఇది కూడా అటువంటి బాపతే నయ్యా. నువ్వు ఆయన్ను విడిగా ఓ గదిలోకి తీసుకెళ్లి తలుపేసేసి విషయం యిదీ.. అని చెప్పు.. '' అని ఆట పట్టించేవారు.

మీ సూచనలు [email protected] కి ఈమెయిల్‌ చేయండి.

excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by
kinige.com
please click here for audio version