అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్ కందా
పివి సమక్షంలో కమలనాథ్ మాట కాదనడమా?
పివి నరసింహారావుగారు ప్రధానమంత్రిగా వుండగా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను సత్వరంగా పరిష్కరిద్దామని ముఖ్యమంత్రి జనార్దనరెడ్డిగారు కేంద్రమంత్రులకు, రాష్ట్ర అధికారులకు ఒక ముఖాముఖీ సమావేశం ఢిల్లీలో ఏర్పాటు చేశారు. పివి గారు అక్కడే కూర్చుని సమావేశాన్ని పర్యవేక్షిస్తున్నారు.
జనార్దనరెడ్డిగారి వెంట వున్న రాష్ట్రాధికారుల టీమ్‌లో నేనున్నాను. పివిగారి వెంట ఆయన మంత్రిబృందం వుంది.
రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు కొన్నిటికి పర్యావరణ అంశంపై చిన్న అభ్యంతరాలు తెలిపి వెనక్కి పంపేశారు. మేము జవాబు యిచ్చాం. వారి దగ్గర్నుంచి అనుమతులు రావాలి. అవి వెంటనే యిప్పించాలని కోరగానే అప్పట్లో పర్యావరణ శాఖ చూస్తున్న కమల్‌నాథ్ –
''ఆ ఫైల్స్ ఏవీ మా దగ్గర పెండింగ్ లేవని మా అధికారులు చెప్పారు. వాటి విషయం వదిలేయండి.'' అన్నారు.
వదిలేస్తే ఎలా? ఆయన ఆఫీసు స్టాఫ్ ఏదో తమాషా చేసి వుంటారు.
కానీ ఆ విషయం ఆయనకు చెప్పడం ఎలా? ఆయన మాట కాదని పట్టుబట్టడం ఎలా?
అదీ ప్రధాని ఎదురుగా !?
ఇక్కడే సమయస్ఫూర్తి అవసరం పడుతుంది.
xxxxxx
జీవనపోరాటంలో సమయస్ఫూర్తి అవసరం చాలా వుంటుంది. జ్ఞానసంపాదన అనేది జీవితమంతా సాగుతూనే వుంటుంది. సంపాదించిన జ్ఞానం అవసరానికి అక్కరకు రావాలి. అర్జునుడితో యుద్ధం చేసే సమయంలో అస్త్రం ప్రయోగించవలసిన మంత్రం కర్ణుడికి గుర్తు రాలేదట. దానికి కారణం శాపం అంటారు. మనకు ఎవరూ పనిగట్టుకుని శాపాలు యివ్వకపోయినా, అనేక సందర్భాల్లో అనాల్సిన మాట, ఉపయోగించవలసిన తర్కం, చేయవలసిన చర్య గుర్తుకు రావు. ప్రసంగం ముగించి కుర్చీలో కూలబడ్డాక, 'అరెరే, ఆ పోలిక బదులు యీ పోలిక చెప్పి వుండాల్సింది' అని వాపోయినట్లే, సందర్భం గడిచిపోయాక 'ఛ, వాడు అడిగినప్పుడు యిలా చెప్పేబదులు అలా చెప్పాల్సింది' అనుకుంటూ వుంటాం. కొందరికి మాత్రం సమయానికి బాగానే తడతాయి. అలాటివారిలో మా బావ ఎస్.ఎస్. ఏచూరి ఒకరు. ఆయన పుణ్యమాని నేను ఐయేయస్ మెడికల్ టెస్టులో గట్టెక్కాను.
ఇంటర్వ్యూలో సెలక్టయ్యాక మెడికల్ టెస్ట్. అప్పటికీ యిప్పటికీ నాకు దేవుడి దయవలన, పెద్దగా చెప్పుకోదగ్గ రోగాలు ఏమీ లేవు. ఊహించుకునే రోగాలు చాలా వున్నా టెస్టుల్లో అంతా బాగానే వుంది ఫో అంటూంటారు. అయితే మొదటినుంచి పెద్దగా పైకి తెలియని చిన్న లోపం వుంది. నేను కలర్ షేడ్స్‌లో తేడా గుర్తించగలను కానీ వాటిని సరిగ్గా వర్ణించి చెప్పడం రాదు. అలా చెప్పలేకపోతే నాకు దృష్టిలోపం వుందని పొరబడే అవకాశం వుంది.
నా మెడికల్ టెస్టు జరిగిన రోజు ఆ డాక్టర్ ఏవో పుస్తకాలలో రంగురంగుల్లో వున్న చుక్కల మధ్య కనబడే అంకెలను గుర్తించమన్నాడు. అంటే కొన్ని చుక్కలు ఓ రంగులోను, కొన్ని యింకో రంగులోను వుండడం చేత రంగుల వ్యత్యాసం వల్ల మనకు ఏవేవో అంకెలు కనబడాలన్నమాట. కంగారు వల్లనో ఏమో, నాకు ఏదీ స్పష్టంగా కనబడటంలేదు. కనబడినా ఆ రంగుల తేడా కనిపెట్టడం నాకు చాలా కష్టం. మొదట్లో ఏవో కనబడినా కంగారులో తర్వాత అస్సలు కనబడడం మానేశాయి. నా కంగారు చూసి డాక్టరుగారు ఆయనా కంగారు పడి, నాకు బొత్తిగా ఏమీ కనబడదేమోననుకుని, యింకో చిన్న మిషన్ బయటకు లాగి, దూరం నుంచి ఏదో చూపించి అదేం రంగు? ఆలివ్ గ్రీనా, నేవీ బ్లూయా? అని అడగ నారంభించాడు. చెప్పానుగా రంగుల పేర్లు కరక్టుగా చెప్పమంటే నాకు మరీ వణుకు. ఇంకా గాభరా పడిపోయాను. అవేళ నేను ఒక్కణ్నే ఆ రూములో వుండి వుంటే నేను క్వాలిఫై అయ్యేవాణ్ని కాను.
xxxxxx
మీరనుకోవచ్చు – మెడికల్ టెస్టు అంటే జస్ట్ ఫార్మాలిటీయే కదా, ఎందుకింత కంగారు? కంగారు వలన పరిస్థితి చెడగొట్టుకోవడం ఎందుకు? అని. ఏ చిన్న పొరబాటో జరిగి నేను సెలక్టవనేమోనని నా భయం. ఏం ఐయేయస్ అవడం కోసం అంత పలవరించావా అని అడగకండి. అది నా కల కాదు. మా నాన్నగారి కల. నన్ను ఐయేయస్‌గా చూడాలని ఆశపడిన ఆయనను ఎక్కడ నిరాశపరుస్తానో అని నా భయం. అసలు ఇంటర్వ్యూ అయినప్పుడే ఆయన దిగాలు పడిపోయారు.
పరీక్షకు హాజరైన తొలిసారే పాసయి ఇంటర్వ్యూకి అర్హత తెచ్చుకున్నాను. నెల్లాళ్ల టైముంది. దానికి కూడా మా నాన్నగారే తర్ఫీదు యిచ్చారు. అప్పట్లో స్టేటుబ్యాంక్‌లో ఆఫీసరుగా పనిచేస్తున్నా వీలైనంతవరకు ఆయన దగ్గరే సమయం వెచ్చించి, ఆయన దగ్గరనుంచి నాకు వీలైనంత జ్ఞానం గ్రహించాను. ఢిల్లీ వచ్చి ఇంటర్వ్యూకు హాజరయ్యాను. అప్పట్లో మా నాన్నగారు వేజ్‌బోర్డ్ చైర్మన్‌గా వుండేవారు. ఏదో పని మీద ఎక్కణ్నుంచో ఎక్కడికో వెళుతూ మర్నాడు ఢిల్లీ వచ్చారు. చెప్పానుగా నా కంటె ఆయనకే ఆత్రుత. నన్ను పక్కన కూర్చోబెట్టుకుని ''వాళ్లేం అడిగారు? నువ్వేం చెప్పావ్?'' అని అన్నీ వివరంగా అక్కడ యింటర్వ్యూ ఎంతసేపయిందో, అంతసేపూ యిక్కడ మళ్లీ నిర్వహించారు.
నా సమాధానాలు విని నీరసించారు. ''నీకు తెలియనిది యింత వుందని నాకెలా తెలుస్తుందిరా?' అని. నా అజ్ఞానపు పరిధీ, వైశాల్యమూ, లోతూ చూసి ఆయన ఆశ్చర్యాంబుధిలో మునిగిపోయారన్నమాట! ఆయన వ్యాఖ్య విని అయితే మనకి యింటర్వ్యూలో తన్నేస్తుందని అనుకున్నాను. మా నాన్నగార్ని చూసి పాపం అని జాలి పడ్డాను. ఎందుకంటే ఇంటర్వ్యూకే కాదు, పరీక్షకు కూడా ట్రెయినింగ్ యిచ్చింది ఆయనే కదా!
ఐయేయస్‌లో నేను ఏ సబ్జక్టులు తీసుకోవాలో కూడా మానాన్నగారే సెలక్ట్ చేసేసారు. పొలిటికల్ సైన్స్ అంటే మూడు లోయర్‌లెవెల్‌్‌వి, రెండు హైయర్ లెవెల్‌వి తీసుకోవాలి. లోయర్ లెవెల్‌లో – పొలిటికల్ సైన్స్, మ్యాథమాటిక్స్, మ్యాథమాటిక్స్ (లెక్కలు రెండు తీసుకోవచ్చు) తీసుకున్నా. హైయర్ లెవెల్‌లో – పొలిటికల్ థాట్, హైయర్ మ్యాథమాటిక్స్ తీసుకున్నాను. ఆ పొలిటికల్ సైన్స్, పొలిటికల్ థాట్ రెండు సబ్జెక్ట్‌లూ ఆయనే నాకు నేర్పించారు. ప్లస్ జనరల్ నాలెడ్జ్ ప్లస్ ఇంగ్లీష్ ఎస్సే. ఆ టైం లో ఆయనకి హార్ట్ ఎటాక్ వచ్చింది. నాన్నగారు దిగాలు పడితే నేను వేరేవాళ్ల దగ్గర నేర్చుకుంటాను నాన్నా అని సర్ది చెప్పి ఒక ప్రొఫెసర్‌గారి దగ్గరకి వెళ్తే ఆయన ఛర్రుమని లేచాడు.
''ఏంటి నీ ఉద్దేశం? మేమంతా ఏళ్ల తరబడి పుస్తకాలవీ చదివి, అందరి దగ్గరికీ వెళ్లి నేర్చుకున్న సబ్జెక్ట్‌ను నువ్వేదో రెండునెలల్లో ఔపోసన పట్టేద్దామనుకున్నావా? ఇదేమైనా అషామాషీ వ్యవహారమా? నా వల్లే కాదు, ఎవరివల్లా కాదు నీకు యింత తక్కువ టైములో అదంతా నేర్పడం!'' అన్నాడు. ఇంటికి వచ్చి నాన్నగారికి చెబితే ''వాళ్లతో నీకెందుకురా? నీకు కావల్సింది నే చేబుతానుగా'' అన్నారు.
ఆయనకు శ్రమ తగ్గిద్దామని ఆచారిగార్ని పట్టుకున్నాను. మా అక్క ఆ రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటిలో రిసెర్చ్ చేస్తూ వుండేది. తన స్నేహితుడే ఆచారి. మా అక్కకి, బావకికూడా ఇంట్లో మనిషిలా వుండేవాడు. ఆయన నాకు తోడుగా కూర్చునేవాడు. నాకు అనుమానాలు వస్తే తీర్చేటంత పొలిటికల్ సైన్స్ ఆయనకు వచ్చు. లేకపోతే మా నాన్నగారెలాగూ సిద్ధంగా వున్నారు, మా యిద్దరికీ తెలియనది చెప్పడానికి. చివరకి సిటీ కాలేజీలో పరీక్ష రాసి బయటకు వచ్చి ''అమ్మయ్య'' అనుకునేసరికి ప్రతిధ్వని వినబడింది – అది మా నాన్నగారి ''హమ్మయ్య''!
xxxxxx
నా ఐయేయస్ వెనుక మా నాన్నగారి కృషి అంత వుంది కాబట్టి నేనెక్కడ ఆయనను నిరాశపరుస్తానో అన్న భయం నాకుండేది. మెడికల్ టెస్ట్ దాకా వచ్చాక యింకా ఎందుకు సందేహం అంటే… – గమనించారా, గమ్యం చేరువైన కొద్దీ నెర్వస్ అవుతాం. సరైన సమయానికి చేరగలమా లేదా? అని. ఆ నెర్వస్‌నెస్‌లోనే తప్పులు చేస్తాం. దానివల్లనే ఆ రోజు కళ్ల పరీక్షలో కాస్త వుంటే ఫెయిలయిపోయి వుండేవాణ్ని.
ఆరోజుల్లో మా బావ ఢిల్లీలో హెల్త్ మినిస్ట్రీ దగ్గర పనిచేసేవాడు. నాతోటి మెడికల్ టెస్ట్‌కి వచ్చాడు. ఆయన నాకంటే పద్ధెనిమిది ఏళ్లు పెద్దాడు. ఆయనకు పెళ్లయ్యేటప్పటికి నాకు మూడేళ్లు. అందువలన నన్ను చంటిపిల్లాణ్ని చూసుకునేట్టు చూసేవాడు. వచ్చి నా పరిస్థితి చూశాడు. గొప్ప సమయస్ఫూర్తితో ఆ టెస్టు చేసుకునేవాణ్ని తగులుకున్నాడు. వాణ్ని అడ్డదిడ్డమైన ప్రశ్నలు చాలా వేశాడు – నీ పద్ధతి ప్రకారమే చేయాలని ఎక్కడుంది? ఇది కరక్టుగా చెప్పాడు కదా అలాటప్పుడు కలర్ బ్లయిండ్‌నెస్ వుందని ఎలా చెప్పగలవ్? వీడేమైనా రైల్వేలో గార్డ్ అవుతాడా? ఎరుపును ఆకుపచ్చగా అనుకుని రైలుని ముందుకు పోనిచ్చేసి యాక్సిడెంట్లు చేస్తాడా? కలక్టర్ వుద్యోగంలో కలర్ ప్రసక్తి ఎక్కడొస్తుంది? అసలు యీ పరీక్ష యివాళే చేయాల్సిన అవసరం ఏముంది?..యిలా
అంతేకాదు, వాణ్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేశాడు – నీ మెథడ్ తప్పుకాదని ఎలా చెప్పగలవ్? అసలు నీ మెషిన్ డిఫెక్టివ్ కాదని ఎలా చెప్పగలవ్?… యిలా వాణ్ని కన్‌ఫ్యూజ్ చేసేయడంతో వాడు చేతులెత్తి దండం పెట్టి ''మహానుభావా! మీతో పెట్టుకుంటే నేను యింక ఎవర్నీ టెస్ట్ చేయలేను. నామీద నాకే అనుమానం వచ్చేట్టు చేస్తున్నారు. కావాల్సిన సర్టిఫికెట్టు యిచ్చేస్తాను కానీ ముందితన్ని తీసుకుని మీరు బయటకు వెళ్లండి, నాకు అదే పదివేలు'' అన్నాడు.
xxxxxx
మా రామస్వామి సమయస్ఫూర్తికూడా చెప్పుకోదగ్గది. నేను ఒంగోలులో సబ్ కలక్టర్‌గా వుండగా (1971-73) ఆయన కొంతకాలం జిల్లా డియస్పీగా వున్నారు. జై ఆంధ్ర వుద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజులవి. జనాలంతా మంచి ఆవేశంగా వున్నారు. మా న్యాయమైన డిమాండ్లకోసం మేం ఉద్యమం చేసుకుంటూ వుంటే మధ్యలో యీ పోలీసులు మమ్మల్ని లాఠీలతో కొట్టడం, బాష్పవాయువు ప్రయోగించి తరిమేయడం ఏమిటని. ఓ రోజు రాత్రి ఎక్కడికో వెళ్లి జీపులో తిరిగి వస్తున్నాం. ఓ తాగుబోతు మా దారికి అడ్డం పడ్డాడు. చిత్తుగా తాగేసివున్నాడు.
''జీపు ఆపేశారేం? ఎక్కించేయండి సార్. చంపేయండి. మా ప్రాణాలేగా మీకు కావలసింది. రండి, తీసుకోండి. మీకు ఏ కష్టం లేకుండా నా అంతట నేనే ఛస్తున్నాను. రండి'' అని అరిచాడు, చొక్కా గుండీలిప్పి ఛాతీ మీద అరచేయి చరుచుకుంటూ.
''ఒరేయ్, తప్పుకోరా, తాగుబోతు నా…..'' అని హారన్ కొడుతూ తిట్టాడు జీపు డ్రైవర్.
'' జై ఆంధ్రా! ఆంధ్రరాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములుగారి ప్రాణాలు తీసుకున్నార్రా మీరు. ఇప్పుడు నావి తీసుకోండి. ప్రత్యేకరాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించడానికి నేను రెడీరా..'' అన్నాడు తాగుబోతు జీపు ముందునుండి అంగుళం కదలకుండా. కుడివైపుకి, ఎడమవైపుకి ఎటు పోనిచ్చినా అటు పరిగెడుతూ, అడ్డం పడుతున్నాడు.
''నీ చావు సంగతి సరే, మమ్మల్ని చంపకురా బాబూ, యిప్పటికే లేటయి ఆకలితో ఛస్తన్నాం.'' అన్నాడు ఓ కానిస్టేబుల్.
''నన్ను చంపి ఆ రక్తంతో మీ దాహం తీర్చుకోండి. మీరంతా రక్తపిచాశులు.. కాదు, పిసాచులు..ఛ,.. పిశాచులు. మొన్ననే తుపాకులు కాల్చి అరడజనుమందిని పొట్టన పెట్టుకున్నారు. ఇవాళ నా వంతు. రండి రా. నేను ప్రకాశం పంతులుగారి లాటోణ్ని. తుపాకీ గుండుకు గుండె ఒడ్డుతా…యియాల ఛస్తే రేపటికి రెండు.. రారా, దమ్ముంటే కాల్చరా…. షంషేర్.. ఆంధ్ర రాష్ట్రంకోసం అమరజీవి నవుతా..ఏటనుకున్నావో..ఏటో..'' అంటూ తొడగొట్టి ఛాలెంజ్‌లు చేస్తూ పెద్ద గోల చేయసాగాడు.
కానిస్టేబుళ్లు దిగి వాణ్ని పక్కకు లాక్కుని వెళుతున్నా వాడు వెళ్లటం లేదు. ఈ ఆగడం చూసి చుట్టూ జనం మూగుతున్నారు. వాళ్లని చూస్తూంటే మనవాడి హీరోయిజం పెరిగిపోతోంది. అప్పటికప్పుడు తుపాకీ గురిపెట్టి వాణ్ని కాల్చకపోతే వూరుకునేట్టు లేడు. జనాలకు వేడుకగా వుంది. మరింతమంది చేరుతున్నారు. వాళ్లలో పోలీసులమీద కోపం వున్నవారు ఎవరైనా రాళ్లూ, చెప్పులూ విసిరినా గతి లేదు. గుంపుని హ్యేండిల్ చేయడం మరీ కష్టం.
అప్పుడు మా రామస్వామి సమయస్ఫూర్తి ఉపయోగించాడు. ఇలాటి సమయాల్లో మనం వాడికి బుద్ధి చెప్పి ప్రయోజనం లేదు. నచ్చచెప్పినకొద్దీ బిర్రబిగుస్తాడు. వాడు చెప్పినట్టుగానే వినాలి. కానిస్టేబుల్సుని ఉద్దేశించి ''ఏయ్, ఆపండయ్యా గోల. వాడు ఛస్తానంటున్నాడు కదా! మోసుకొచ్చి జీపులో పడేయండి. పోలీసు స్టేషన్‌కి తీసుకెళ్లి కాల్చి పారేద్దాం. గబగబా కానీయండి. టైము లేదు. వీణ్ని చంపేసి, యింటికెళ్లాలి.'' అన్నాడు.
తాగుబోతు పరమానంద భరితుడై పోయాడు. ''అద్దీ మాటంటే ! పెద్దదొరగారు పెద్దదొరగారే ! ఖమాన్, పోలీసు స్టేషన్‌కి వెళదాం పదండి.'' అంటూ చరచరా వచ్చి జీపెక్కాడు. ఎక్కబోయే ముందు రామస్వామికి కృతజ్ఞతాపూర్వకంగా ఓ సలాం కొట్టాడు కూడా.
స్టేషన్‌కి రాగానే ఓ సెల్‌కి తీసుకెళ్లి ''ఇక్కడే ఎటెన్షన్‌లో నిలబడి వుండు. ఇంకో నలుగుర్ని కూడా పిలుచుకుని వస్తాం. అందరం ఒకేసారి తుపాకులు ఎక్కుపెట్టి కాలుస్తాం. జై ఆంధ్రా అని గట్టిగా స్లోగన్స్ యిస్తూ సినిమా హీరోలా నేలకు ఒరిగిపోదువుగాని.. ''అని వాణ్ని ఉత్సాహపరిచి అంతా బయటకు వచ్చేశారు. వాడు వీళ్లకోసం ఓ పావుగంట ఎదురుచూస్తూండగానే కళ్లుమూతలు పడ్డాయి, తనను తాను భగత్‌సింగ్‌గా వూహించుకుంటూ కలలు కనడానికి కాబోలు..
తెల్లారింది. మత్తు దిగింది. సెల్ తెరిచి వాణ్ని యింటికి పొమ్మన్నారు. గతరాత్రి జరిగినది వాడికి గుర్తు లేదు. కల్లుపాకలో బయలు దేరిన వాడు పోలీసు స్టేషన్‌లో ఎందుకు తేలాడో ఆ సంగతి తేలక బుర్రగోక్కుంటూ యింటికి పోయాడు.
xxxxxx
వ్యాసం మొదట్లో చెప్పిన కమలనాథ్ గారి వుదంతంలో వాళ్ల ఆఫీసువాళ్లు ఏదో తమాషా చేసి వుంటారని ఎలా వూహించానో చెప్తాను. సాంకేతికపరమైన అంశాలపై ఫైళ్లు తిప్పి పంపడాలు, ఎవరి వద్ద పెండింగ్ వుందోనన్న విషయంపై వివాదాలు ఎలా వుంటాయో ఒక ఉదాహరణ ద్వారా మీకూ తెలుస్తుంది.
ఓ ఉన్నతాధికారి రోజూ సాయంత్రం అయిదున్నర కల్లా హరిమీద గిరి పడ్డా, గిరి మీద హరిపడ్డా యింటికి వెళ్లిపోయేవారు. ఆయన క్రింద పనిచేసేవారు కావాలని ఆయన్ని ఆపేద్దామని ఓ రోజు 5.25 కి ఓ ముఖ్యమైన ఫైలు పంపారు. ఆయన తక్కువ్వాడా? అనేక ఢక్కామొక్కీలు తిన్న రకం. ఫైలులో గుర్తుకు పెట్టిన ఓ ఫ్లాగ్ తీసి కింద పారేసి ''వేరీజ్ ఫ్లాగ్ 'ఏ'?'' (పద్ధతి ప్రకారం పెట్టవలసిన ఫ్లాగ్ ఎక్కడ? ఫైలు సరైన రీతిలో పరిశీలనకు పెట్టండి) అని ఫైలు మీద రాసేసి యింటికి వెళ్లిపోయారు. దాంతో ఆ ఫైల్ ఆయన వద్ద పెండింగ్ లేనట్టే లెక్క కదా!
కమల్‌నాథ్‌గారి ఆఫీసులో అధికారులు కూడా మా ఫైల్సు విషయంలో యించుమించు యిటువంటి ఉపాయమే అవలంబించి, ఫైల్సు డిస్పోజ్ చేసేసి, మా దగ్గర ఏవీ లేవని మంత్రిగారికి చెప్పి వుంటారనిపించింది. అవన్నీ అప్పుడు నేను వివరించి వాదిస్తూ కూచోలేను కదా. అందుకని
''నాకు 24 గంటలు టైమిస్తే 'ప్రాజెక్ట్ గురించి ఏం జరిగిందో మంత్రిగారిని విడిగా కలిసి వివరించగలుగుతాను. ఇప్పుడు వాటి గురించి చెప్పడం మొదలుపెడితే విలువైన ప్రధానమంత్రిగారి సమయం, యితర మంత్రులు సమయం వ్యర్థం అవుతుందని నా బాధ. అందువలన యీ మీటింగ్ అయ్యేవరకైనా నన్ను నమ్మి, నేను చెప్పినదే కరక్టు అని అనుకుని, వ్యవహారం ముందుకు సాగిద్దాం.'' అని కోరాను. అప్పుడు వాళ్ల మాటను కాదన్నట్టూ కాదు, ఔనన్నట్టూ కాదు.
కమల్‌నాథ్ చాలా చురుకైన మంత్రి. నా మనసులో ఏముందో అర్థం చేసుకున్నారు. రాష్ట్రం నుండి వచ్చిన ఓ అధికారి యీ విధంగా మాట్లాడడం అనూహ్యంగా, వింతగా తోచినా ఈలోపుగానే ప్రభుత్వ వ్యవహారాలను కాచివడపోసిన పివి గారు బ్యూరాక్రసీ లీలా విన్యాసాలను తలచుకుని లీలగా నవ్వబోవడం గమనించి 'సరే యీసారికి యిలా కానీ' అన్నట్టు తనూ తలవూపారు.
xxxxxx
సమయస్ఫూర్తి అనగానే మా ఫ్రెండ్సందరికీ మా అచ్యుతరామే గుర్తుకు వస్తాడు. కాలేజీలో చదువుకునే రోజుల్లో కొంతమంది కజిన్స్, ఫ్రెండ్స్ అందరం కలిసి తిరుపతి వెళుతున్నాం. అచ్యుతరామ్ అని మా కజిన్ వున్నాడు. చిన్నప్పటినుండీ వాడికి యాక్సిడెంట్స్‌తో అవినాభావ సంబంధం వుంది. ఏ మాత్రం అవకాశం వున్నా ఎక్కడో అక్కడ జారిపడి దెబ్బ తగలించుకునేవాడు. నెల్లూరు స్టేషన్‌లో ట్రెయిన్ ఆగితే కాఫీ తాగడానికి అని దిగారు అందరు. తాగుతుండగానే గంట కొట్టేసారు. ట్రెయిన్ స్టార్ట్ అయిపోయింది. ట్రెయిన్ కదులుతున్నా ఎక్క గలగడం ఆ వయసులో సహజమేగా ! అందరం ఎక్కేశాం. అచ్యుతరామ్ మాత్రం ట్రెయిన్ ఎక్కలేకపోయాడు సరి కదా తలుపు దగ్గర ఉన్న కడ్డీ పట్టేసుకున్నాడు. వదిలిపెట్టడు – ట్రెయిన్ ఎక్కడు ! రైలు వేగం పుంజుకుని వాణ్ని యీడ్చేస్తోంది. అసలే యాక్సిడెంటు ప్రోన్. ఇలాటి పరిస్థితుల్లో ఎక్కడిదాకా పోతుందో అని భయపడి చచ్చి మేం నలుగురం సాయంపట్టి వాణ్ని లోపలికి గుంజి గుంజి కంపార్టుమెంటులో పడేశాం.
''బుద్ధి లేదురా, ఆ రాడ్ పట్టుకుని ఎందుకు వేళ్లాడడం?'' అని మేము మందలించే లోపున వాడే పెద్ద గొప్పగా ''థాంక్ గాడ్ ఫర్ మై ప్రజన్స్ ఆఫ్ మై మైండ్ ! ఎంతో సమయస్ఫూర్తితో ఆ కడ్డీ వదలకుండా పట్టుకుని వున్నాను. లేకపోతే ఏమై పోయేవాణ్నో..'' అంటూ తనను తాను తెగ మెచ్చేసుకోవడం మొదలెట్టాడు.
మాకు మతి పోయింది. అసలు ఏ మాత్రం బుర్ర పని చేసినా, తను చేయకూడని పని చేశాడని వాడు గుర్తించాలి. రైలు వేగం అందుకోగానే వాడు కడ్డీ వదిలేసి వుంటే వాడు ప్లాట్ ఫారం మీదే తూలేవాడు, మహా అయితే పడేవాడు. మేము చెయిన్ లాగి రైలాపి వాణ్ని తీసుకుని వచ్చేవాళ్లం. లేదా తర్వాతి ట్రెయిన్‌లో వచ్చేవాడు. అలా కాకుండా దాన్నే పట్టుకుని వేళ్లాడడంతో రైలు వాణ్ని యీడ్చుకుపోతోంది. మధ్యలో ఏ స్తంభమో తగిలి వుంటే మనిషి దక్కేవాడు కాడు. ఇది గ్రహించకుండా వాడు తన సమయస్ఫూర్తి చూసి మురిసిపోయాడంటే ఏమనుకోవాలి!
అందుకే మా బంధు, మిత్రవర్గాలలో ఎవరైనా తమ 'ప్రెజన్స్ ఆఫ్ మైండ్' గురించి గొప్పలు చెప్పుకోబోతే వెంటనే 'ఏదీ? మన అచ్యుతరామ్ వెరయిటీనా!?'' అని వేళాకోళం ఆడుతూంటాం.
మీ సూచనలు [email protected] కి ఈమెయిల్ చేయండి.
excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com
please click here for audio version