అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్ కందా
ఈ జాలర్లకు కార్లు యిచ్చేస్తే ప్ఫీడా వదిలిపోతుంది కదా…
1977. దివిసీమ ఉప్పెన, తుఫాను. దేశం దృష్టినే ఆకర్షించిన బీభత్సమైన విపత్తు. నేను గవర్నరు శారదా ముఖర్జీ గారి వద్ద స్పెషల్ సెక్రటరీగా వున్నాను. ఆవిడ తన వంతు సాయం ఏదో చేద్దామనుకున్నారు. ''నువ్వు గుంటూరు జిల్లాలో కలక్టరుగా పని చేసి వచ్చావు కదా. అక్కడి పరిసరాలన్నీ బాగా తెలుసు కాబట్టి ఒక నెల్లాళ్లు అక్కడే వుండి తుఫాను సహాయకార్యక్రమాలన్నీ పర్యవేక్షించరాదా'' అంటే 'తప్పకుండా' అని వెళ్లి నెల్లాళ్లు వుండి చేతనైనంత చేసి తిరిగి వచ్చాను.
ఈ లోపుగా ఆవిడ తనకు తెలిసిన సాంఘిక సేవాసంస్థలను అక్కడకి వెళ్లి ఏదైనా చేయమని ప్రోత్సహించారు. ఆవిడ మార్గదర్శకత్వంలో 'చేతన' అని సంస్థ మొదలుపెట్టాం. దాని ద్వారా బొంబాయి కేంద్రంగా పని చేసే టాటా రిలీఫ్ కమిటీ వారితో మాట్లాడి వారిని రప్పించింది. వాళ్లు ఒక టీముగా ఏర్పడి హైదరాబాదు వచ్చారు. దివిసీమ ప్రాంతాన్ని కళ్లారా చూసి, అక్కడి పరిస్థితులు అధ్యయనం చేసి, ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించి చేస్తాం అన్నారు. వాళ్ల దగ్గర బోల్డు నిధులు వున్నాయి.
శారదా ముఖర్జీ నన్ను వారితో వెళ్లి బాధిత కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రాంతాలను చూపమని కోరారు. సరేనని వెళ్లాను. అక్కడి వారి జీవితం ఎంత అతలాకుతలం అయిపోయిందో చూపించాను. సముద్రం మీద బతికే జాలర్ల ఉపాధికి కావలసిన ఉపకరణాలు – పడవలు, వలలు – అన్నీ పోగొట్టుకున్నారు కాబట్టి వారి జీవితాలను పునరుద్ధరించడానికి ఏమైనా చేస్తే మంచిదని సూచించాను. సరేనన్నారు. వాళ్లు ఎంత విరాళమిస్తున్నారో కనుక్కుని అప్పుడు నా ఐడియా చెప్పాను –
'మనం మత్స్యకారులకు 28 సొసైటీలు పెడదాం. ఒక్కొక్క దాంట్లో ఐదుగురు మత్స్యకారులు సభ్యులుగా వుంటారు. ఒక్కొక్క సొసైటీకి ఒక్కో బోటు కొనిద్దాం. వంతుల వారీగా వాళ్లు దాన్ని వాడుకుంటారు. వాళ్లకు మళ్లీ ఉపాధి అవకాశం దొరుకుతుంది. ఆ బోటుతో వేటకు వెళ్లి ఆదాయం సంపాదించుకుంటారు. ఆ డబ్బులు ఖర్చు పెట్టడం వలన గ్రామంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయి. వీళ్ల దగ్గరనుంచి డబ్బు వేరే వాళ్లకు ప్రవహిస్తుంది కాబట్టి వాళ్ల జీవితాలూ బాగుపడతాయి. కొద్దికాలానికి యిళ్లు కట్టుకుంటారు. గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పిస్తే దాన్ని వాడుకునే ఆర్థిక స్తోమత వస్తుంది. అప్పటివరకు మనం వాళ్లకు అండగా నిలబడవచ్చు.' అంటూ యిలా రాబోయే కొన్నేళ్లలో మనం ఏం చేయాలో థలవారీగా చెప్పుకుపోయాను.
మిసెస్ మూళ్‌గాంవ్‌కర్ అనే ఆవిడ ఆ టీముకి హెడ్‌గా వుంది. ఆవిడకు యిదంతా ఆశ్చర్యంగా అనిపించింది. తాము వచ్చింది రిలీఫ్ యివ్వడానికైతే నేను రీహేబిలిటేషన్ గురించి మాట్లాడడం వింతగా తోచింది. ఏదో యిద్దామనుకున్న డబ్బు ఒక్కసారిగా విరాళంగా యిచ్చి త్వరత్వరగా సంచీ దులిపేసుకుని వెళ్లమంటే వెళ్లగలం కానీ యిలా వాళ్ల జీవితాలలో వెలుగు తెచ్చేవరకూ సంచీలోంచి కాస్త కాస్త తీసి యివ్వడం, అప్పటిదాకా సంచీని భద్రంగా దాచి వుంచడం, వెలుగు వస్తోందా లేదాని పర్యవేక్షించడం… యివన్నీ అయ్యే పని కాదనిపించింది.
సాధారణంగా భూకంపం కానీయండి, వరదలు కానీయండి, సహాయకార్యక్రమాలలో పాలుపంచుకుంటున్నామంటూ వచ్చే వాలంటీరు టీముల్లో చాలామంది యిలాగే వుంటారు. బాధితులకోసం సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంప్ లలో రోడ్డుకి అతి దగ్గరగా వున్నది, మొదటిది అయిన సహాయక శిబిరం దగ్గరకు వచ్చి తాము లారీలో తెచ్చిన తిండిపదార్థాలు, బట్టలు యిచ్చేసి వెళ్లిపోతారు. 'వీళ్లకు ముందే యిచ్చేశారు, కాస్త లోపలకి వెళ్లి తక్కిన శిబిరాల వాళ్లకు యివ్వండి' అని అధికారులు చెప్పినా వినరు. 'అక్కడకి వెళ్లడం కష్టం. వెళ్లినా తిరిగి రాగలగుతామో లేదో..' అంటూ వీళ్ల నెత్తినే పడేసి పోతారు. అందువలన వరదలో మునిగిన గ్రామవాసులకు ఏమీ అందదు. మొట్టమొదటి శిబిరంలో వున్నవాళ్లకు ఎక్కీతొక్కీ!
టాటా వాళ్లది అలాటి సంస్థ కాదు. కానీ వాళ్లూ యింత భారాన్ని మోయడానికి సిద్ధంగా లేరు. ''ఎందుకిదంతా? మేం యిద్దామనుకున్నది ఒకేసారి యిచ్చేస్తే సరిపోతుంది కదా, వాళ్ల బాగేదో వాళ్లే చూసుకుంటారు. మనం వాళ్లను చక్కదిద్దుతూ ఎన్నాళ్లని యిక్కడ వుంటాం?' అందావిడ.
నాకు ఒళ్లు మండింది. ''నేను చెప్పినవి ఓపిగ్గా చేసే ఆసక్తి లేకపోతే మీ దగ్గరున్న డబ్బుతో ఎంచక్కా 28 కార్లు కొనేయండి. 28 మంది జాలర్లను వెతికి పట్టుకుని వాళ్లకు యిచ్చేద్దాం. ప్ఫీడా వదిలిపోతుంది. 'అసలు తిండీగుడ్డా కూడా కరువైన బీదలకు ఏక్‌దమ్ కార్లే యిచ్చేసి వాళ్లను ఒక్కసారిగా ఎక్కడికో తీసుకుపోయింది – మీ సంస్థ' అని అందరూ చెప్పుకుంటారు. బోల్డంత పబ్లిసిటీ. ఏవంటారు?'' అని కసిగా వచ్చేశాను.
బాపుగారి కార్టూన్ వుంది. ఒక ముష్టివాడికి లాటరీలో కారు తగిలిందట. కారులో కూర్చుని పెట్రోలు డబ్బుల కోసం ముష్టి ఎత్తుకుంటూ వుంటాడు. ఆ మిసెస్ మూళ్‌గాంవ్‌కర్‌తో మాట్లాడుతూంటే ఆ కార్టూన్ నా కళ్లముందు కట్టింది.
xxxxxx
నాకు ఏ పనైనా సరే పదికాలాలపాటు నిలిచేదిగా చేయాలని వుంటుంది. ఈ రోజు గడవడం ఎలా అన్నది ముఖ్యం కాదు. రెండు జతల బట్టలు పసుపుపూసి చేతిలో పెట్టి, అవి తొడుక్కున్నాక జేబులో వంద రూపాయలు పెట్టి ఆశీర్వదించేస్తే సరిపోదు. వాడు బతికి బట్ట.. సొంత బట్ట.. కట్టే ఏర్పాటు చూడాలి. పేదలకు యిల్లు కట్టించి యిచ్చాం అని భుజం చరుచుకోవడం అనవసరం. సొంత యిల్లు కట్టుకునే స్తోమత అతనికి కల్పించండి చాలు. ఆ స్తోమత కలగాలంటే అతను ఆదాయం తెచ్చుకోగల అనువైన వాతావరణం కల్పించాలి, ఉపకరణాలు యివ్వాలి, ధైర్యాన్ని యివ్వాలి. అతని జీవితంలో ఏ మార్పు తెచ్చినా దానంతట అది చాలాకాలం పాటు సొంతకాళ్లపై నిలదొక్కుకునేలా, ఆటుపోట్లకు తట్టుకునేలా ప్రణాళిక రూపొందించాలి. దాన్నే మేక్రో లెవెల్ మానేజ్‌మెంట్ అంటారు.
తర్వాతి రోజుల్లో సహకారసంస్థలకు రిజిస్ట్రార్‌గా వెళ్లినపుడు సొసైటీలను కూడా పదికాలాలపాటు పదిలంగా వుండేట్లా చేయాలని శ్రమించాను. వీటికి కావలసినది ప్లానింగ్. ఆ ప్లానింగ్ మొదటి థ – గమ్యం ఏమిటో తేల్చుకోవడం. గమ్యం అనేది ఏకవచనం కాదు, బహువచనం. ఎందుకంటే దానిలో పరిపాలనా పరంగా చేరవలసిన లక్ష్యం, ఆర్థికపరంగా, ఆపరేషన్స్‌పరంగా, పాలనాపరంగా, చట్టపరంగా చేరవలసిన లక్ష్యాలు యిమిడి వుంటాయి. ఆ తర్వాత ఒక్కొక్కదానిలో చేయవలసినది ఏమిటి? ఏ విధంగా..? ఎవరు ఏఏ పనులు చేయాలి? ఎప్పటిలోగా చేయాలి? అన్నది నిర్ధారించుకుని రోడ్ మ్యాప్ వేసుకోవాలి. ఆ మ్యాప్‌లో మళ్లీ మైల్ స్టోన్స్ గుర్తించాలి. ఎందుకంటే అప్పుడప్పుడు పీరియాడికల్‌గా ఎంతవరకు రావల్సి వుంది, ఎంతవరకు చేరాం? అని సింహావలోకనం చేసుకుని, ఎందుకు చేరలేదో గ్రహించుకుని గమనంలో కాని, గమ్యంలో కాని ఏమైనా మార్పులు కావాలేమో సమీక్షించుకోవాలి కదా! ఈ విధంగా మధ్యలో చేసే మార్పులను 'మిడ్ కోర్స్ కరక్షన్స్' అంటారు. ఇవన్నీ జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ వుంటేనే సవ్యంగా జరుగుతాయి.
పర్యవేక్షించడం కూడా ఏదో మొక్కుబడిగా చేస్తే లాభం లేదు. ఉదాహరణకి నేను యిల్లు కట్టిస్తున్నాననుకోండి. నాలుగునెలలు పడుతుందని కాంట్రాక్టరు అన్నాడు. నేను నెలకోసారి వెళ్లి చూస్తే సరిపోతుందిలే అంటే మా ఆవిడ నాతో దెబ్బలాడి 'వారానికి ఓ సారైనా వెళ్లి చూడండి' అందనుకోండి. అప్పుడు నేను ఏదో ప్రతీ సోమవారం కాస్త పెందరాళే బయలుదేరి 9 గం||ల కల్లా వెళ్లి అక్కడ పనివాళ్లు వున్నా లేకపోయినా ఓ అరగంటసేపు అక్కడ తచ్చాడి అక్కణ్నుంచి ఆఫీసుకి వెళ్లిపోతూ వచ్చాననుకోండి. దానివలన ఏం లాభం? ఇల్లు కట్టడంలో నాలుగు ముఖ్యమైన ఘట్టాలుంటాయి. పునాది తీయడం, లింటల్, రూఫ్ స్లాబ్, ఇంటీరియర్ ఫినిషింగ్! ఆ మైలురాళ్లు పడే సమయంలో నేను – యింటి యజమానిగా – అక్కడ వుండాలి. అవన్నీ సోమవారం 9 గంటలకే వేయాలన్న రూలు లేదు. వాటికి వుండే లయ వాటికి వుంటుంది. వాటి మధ్య విరామం వాటికి అనువుగా వుంటుంది. కానీ అవి నా సోమవారం టైమ్‌టేబుల్‌లో యిమడవు కాబట్టి నేను వెళ్లలేదు. అంటే పుల్లయ్య వేమవరం కథలా అయిందన్నమాట. సూపర్‌విజన్ యిలా అఘోరిస్తూ వుండడం వలననే పనులలో అవకతవకలు జరుగుతున్నాయి.
xxxxxx
కోఆపరేటివ్ సొసైటీల మానిటారింగ్ ఎలా అంటే దానికి గైడ్‌లైన్స్ తయారుచేశాం. మనిషి విషయంలో బిపి, టెంపరేచర్, పల్స్ చూస్తే ఆరోగ్యంగా వున్నాడో లేదో తెలిసిపోతుంది. అప్పుడప్పుడు వైద్యపరీక్ష చేస్తూ వుంటే నలతగా వుంటే వెంటనే వైద్యం మొదలుపెట్టేయవచ్చు. సహకారసంస్థల ఆరోగ్యసూచికలను తయారుచేశాం. ఏవైనా జబ్బు పడినట్లు గ్రహించగానే నిధులకోసం ప్రభుత్వం దగ్గరకి కూడా వెళ్లకుండా సహకార విజ్ఞానసమితి అని ఒకటి పెట్టించాం. అది సహకారసంస్థల వాటాలతోనే తయారుచేసి అవసరం వచ్చినపుడు వారిని ఆదుకునేది. కాలక్రమేణా అది కుంటుపడి ఆశయాలు పూర్తిగా సాధించలేకపోయింది. కానీ యిలాటిది ఒకటి చేయవచ్చు అనే ఆలోచనకు నాంది పలికింది.
అదే సమయంలో ఏదైనా పర్మనెంట్‌గా ఎసెట్ వుండేట్లా చేసి ఆర్థికపరిపుష్టి కలిగించాలి అని 'హాకా' బిల్డింగ్ తలపెట్టాం. కోఆపరేటివ్ డిపార్టుమెంటుకి పబ్లిక్ గార్డెన్స్ ఎదుట ఆల్ ఇండియా రేడియోకు పక్కనే పెద్ద జాగా వుంది. ఊరి మధ్యలో వుంది కదాని అన్ని శాఖలకూ దానిమీద కన్ను. మాదంటే మాది అని, ఖాళీగా వుంది కదా మాకు యిచ్చేయవచ్చు కదా అని డిమాండ్లు మొదలుపెట్టారు. పోతను గారు తన కావ్యకన్యకను గురించి చెప్పుకున్నట్లు నాక్కూడా మన స్థలానికి వేరెవరికో అప్పగించి వాళ్లు యిచ్చే నష్టపరిహారం తీసుకోవడం కంటె మనకే ఎందుకు భవనం కట్టుకోకూడదు అనిపించింది. సహకారసంస్థలందరి చేత పెట్టుబడి పెట్టించి అది కట్టించేశాం. దానికోసం కాస్త పోట్లాడవలసి వచ్చింది కానీ ప్రభుత్వాన్ని ధనసహాయం అడగకుండా మా డబ్బుతోనే చేసుకున్నాం కాబట్టి ధైర్యంగా పూర్తి చేయగలిగాం.
ఇలా ఎన్ని ఆస్తులు సమకూర్చినా కోఆపరేటివ్ వ్యవస్థ మొత్తం సవ్యమైన నాయకులు చేతిలో వుంటేనే బాగుపడుతుంది. ఎవరికి అప్పగించాలో తేల్చవలసినది గ్రామ స్థాయిలో వున్న సభ్యులు. సహకారరంగం ప్రారంభమైనపుడు ఎలా వుందో తెలియదు కానీ తదుపరి రోజుల్లో పూర్తిగా రాజకీయాలు చొరబడ్డాయి. అధికారపక్షం వాళ్లే పెత్తనం చలాయిస్తున్నారని, ఎన్నికలు సక్రమంగా ప్రజాస్వామ్యపద్ధతిలో జరపకుండా తమ గుప్పిట్లో పెట్టుకున్నారనీ, ఆ విధంగా అట్టడుగు స్థాయి నుండి ఆర్థిక వ్యవస్థను గుప్పిట్లో కలక్టరు, ఎస్పీలతో మీటింగులు పెట్టి ఎన్నికలకు కార్యక్రమం తయారుచేసి గుర్తుల కేటాయింపు, బ్యాలట్ పేపర్లు, ప్రింటింగు, పోలింగు, లెక్కింపు, ఫలితాలు.. యింత పారదర్శకంగా మున్నెన్నడూ జరగలేదన్నంత చక్కగా చేశాం.
ఏతావతా చెప్పవచ్చిన దేమిటంటే – వ్యక్తుల విషయంలోనైనా, సంస్థల విషయంలో నైనా ఏదైనా తలపెడితే గణనీయమైన, శాశ్వతమైన మార్పు తేవాలి. ఏదో అప్పటికప్పుడు పని నడిచిపోతుంది కదాని తాత్కాలికమైన సర్దుబాట్లతో కాలం గడపకూడదు.
xxxxxx
ఈ ఫిలాసఫీ వున్నవాణ్ని కాబట్టే ఆ రోజు నాకు మిసెస్ మాళగాంవ్‌కర్‌పై అంత కోపం వచ్చి అలా వెక్కిరించాను.
ఆవిడకు కోపం వస్తుందనుకున్నాను కానీ నా ఆవేదన, దీర్ఘప్రణాళికను అర్థం చేసుకుంది. నన్ను పిలిపించి ''అలాక్కాదులే, మీరు చెప్పినట్టే మనం ఓపిగ్గా చేద్దాం'' అంది.
మీ సూచనలు [email protected] కి ఈమెయిల్ చేయండి.
excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com
please click here for audio version