అనుభవాలూ – జ్ఞాపకాలూ : డా|| మోహన్ కందా
పెంపుడు జంతువులు ఉండడం చాలా మంచిది
ఎన్ని ఒత్తిళ్లలలో వున్నా మనం రిలాక్సవడానికి యింట్లో పెంపుడు జంతువులుండడం ఎంతో మంచిది. కానీ పెంపుడు జంతువంటూ వుంటే మనకు పనులు, బాధ్యతలు పెరుగుతాయి కూడా.
ఇప్పుడు ఎందరో డాక్టర్లు చెపుతున్నారు – ఇంట్లో ఆక్వేరియం వుంటే, ఆఫీసునుండి తిరిగి రాగానే ఆ చేపలకేసి చూస్తూ వుంటే బిపి తగ్గుతుందని. మరి ఆక్వేరియం శుభ్రం చెయ్యడం అనేది ఓ బాధ్యతే కదా. ఆ చేపలకు వేళకు ఆహారం వేయడం, ఆ గాజుతొట్టిని వారం వారం శుభ్రం చేయడం, పిల్లలు ఎవరూ దాన్ని తోసేయకుండా చూసుకోవడం.. యిలా పనులుంటాయి. పనులున్నాయి కదాని ఆక్వేరియం వద్దని అనుకుంటే ఎలా?
అలాగే కుక్క వంటి పెంపుడు జంతువు యింట్లో వుంటే చాలా పనులుంటాయి. పనివాళ్లకు అప్పగించవచ్చు కదా అంటారేమో, పనివాళ్లు ఎంత చేసినా కొన్ని మనమే స్వయంగా చేయాలని కుక్క ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే కుక్కలు పిల్లల్లాటివి. అవి తమకు కావలసినవి డిమాండ్ చేసి మరీ తీసుకుంటాయి. పిల్లలు చిన్నగా వున్నప్పుడు మనం ఆఫీసునుండి రాగానే బయటకు తీసుకెళ్లమని మారాం చేస్తారు. అలసిపోయి వున్నా, మనం ఓ రౌండు కొట్టి తీసుకుని వస్తాం. వాళ్లు మనమీద ఆధారపడి వున్నారు, మనం కాకపోతే యింకెవరు తీసుకెళతారు అని జాలి పడతాం.
పిల్లలు పెద్దవాళ్లయాక అడగడం మానేస్తారు. కాస్త తీరిక దొరికో, తీరిక చేసుకునో మనమే అడిగినా 'వద్దులే, మా ఫ్రెండ్స్‌తో వెళతాం' అంటారు. మధ్యవయసు వచ్చేసరికి, పిల్లలు హాస్టల్స్‌కు వెళ్లిపోవడం లేదా చదువుల్లో పూర్తిగా మునిగిపోవడం అవీ జరిగాక మనలో ఒక ఎమోషనల్ వాక్యూమ్ ఏర్పడుతుంది. వయసు పెరుగుతున్నకొద్దీ అది పెరుగుతూ పోతుంది. పెళ్లిళ్లయి పిల్లలు వెళ్లిపోయాక భార్యాభర్తలిద్దరూ మాత్రమే మిగిలాక, యీ శూన్యం భయపెడుతుంది. మనపై ఆధారపడేవాళ్లు, మనని దబాయించి సేవలు చేయించుకునేవారూ ఎవరూ లేరే అని దిగాలు పడతాం. మనుమలు మన దగ్గర వుంటే యీ బాధ వుండదు. కానీ యీ ఆధునిక యుగంలో అది చాలా అరుదైన సందర్భం. ఇటువంటి పరిస్థితుల్లో కుక్కల్ని పెంచడం చాలా మంచిది అని నా వ్యక్తిగతమైన సలహా.
xxxxxx
నా మట్టుకు నేను నా తొమ్మిదో ఏటనుండి యింట్లో కుక్క లేకుండా లేను. ఇంట్లో ఆల్శేషన్ డాగ్ వుండేది. రామూ అనే పనివాడు, మా కుక్క యీ రెండూ నాకు చాలా యిష్టం. కుక్కలు కనబరిచే విశ్వాసం, వాటికున్న ప్రేమ మనం ఎన్నడూ, ఎక్కడా చూడలేం, పొందలేం. ముఖ్యంగా మన కోపతాపాలకు, ప్రేమానురాగాలకు అవి యిచ్చే రెస్పాన్సు మనను కదిలిస్తుంది. మనుష్యుల మనసుల్లో అరలు, పొరలు వుంటాయి. కుటుంబసభ్యులు సైతం తమ అనుభూతులను దాచుకుంటారు. అనేక సందర్భాలలో, అనేకానేక కారణాల వలన బాహాటంగా వెలిబుచ్చరు. స్పందన ఎదురుచూసి మనం భంగపడతాం.
కానీ కుక్కల విషయంలో అలా కాదు. వాటి భావాలను అవి అరమరికలు లేకుండా వెలిబుచ్చుతాయి. అందుకే వాటితో అనుబంధం పెంచుకోకుండా వుండలేం. నోరు లేదంటారు కానీ లేదని అనిపించదు వాటితో వ్యవహరిస్తూంటే! వినిపించుకునే మనసుంటే వాటి భావాలు అవి చెప్పగలవు. తమకు ఏం కావాలో అవి అడుగుతాయి, యివ్వకపోతే అలుగుతాయి, నిరసన తెలపడానికి మన చెప్పులో ఏవో బయటకు పీకి కొరికి పెడతాయి, మనల్ని సతాయించి సాధించుకుంటాయి. కోరినది దక్కకపోతే వాటికి కోపం వస్తుంది, చికాకు వస్తుంది. అవి నవ్వుతాయి, ఏడుస్తాయి, బతిమాలుతాయి, ఒక్కోప్పుడు బుంగమూతి పెడతాయి.
కుక్కలతో సహజీవనం పెరుగుతున్నకొద్దీ వాటి భాష మనకు అర్థమై పోతుంది. మనకు చాలా గొప్పగా అనిపించే విషయం ఏమిటంటే – మన కుక్కకు ఎప్పటికీ హీరోలమే! ఎగుడుదిగుళ్లు వుండవు. ఒక్కోప్పుడు చీదరించుకున్నా, కొట్టినా, పార్టీ ఫిరాయించవు. అటువంటి నిరంతర హీరో వర్షిప్ మనం లోకంలో ఎవరివద్దా పొందలేం. అందుకే ఒక మహానుభావుడు అన్నాడు – ''మనుష్యుల్ని చూసినకొద్దీ నాకు కుక్కలమీద ప్రేమ పెరిగిపోతోంది'' అని.
ఇప్పుడు మా యింట్లో కుక్కవుంది లాసీ అని. కాకర్ స్పానియల్ జాతికి చెందినది. వయసు రెండేళ్లు. దానికి మూడు భాషలు అర్థమౌతాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీషు. మనం మాట్లాడుతూంటే ఫాలో అవుతుంది. చెప్పుకోదగ్గదేమిటంటే దాని సెన్స్ ఆఫ్ టైమింగ్ అద్భుతం. టైము ప్రకారం ఏం జరగాలో దానికి ఎదురు చూస్తుంది కూడా. ఇవాళ శనివారం అంటే యివాళ పూరీలు చేస్తామని దానికి ఐడియా వుంటుంది. కాలెండర్ చూడకపోతే మనకే ఒక్కోప్పుడు గుర్తు రాదు. మరి అవి ఎలా గుర్తు పెట్టుకుంటాయో, ఆ దేవుడు వీటికి అంత శక్తి ఎలా యిచ్చాడో తెలియదు.
వాచీ చూడకపోతే మనకు టైమెంతయిందో తెలియదు కదా. లాసీకి ఆ అవసరమే లేదు. సాయంత్రం ఆయిదయితే చాలు నేను యింటికి వచ్చేస్తానని దానికి తెలిసిపోతుంది. నేను ఆఫీసునుండి తిరిగి వస్తూంటే నా కారు శబ్దం మా ఆవిడ కంటె చాలా ముందుగానే దానికి తెలిసిపోతుంది. ఎందుకంటే కుక్కలకి సబ్‌సోనిక్ సౌండ్స్ వినే శక్తి వుంటుంది. మనుష్యులు వినగలగాలంటే ఒక స్థాయి శబ్దతరంగాలుండాలి. కుక్కలకైతే అంతకంటె తక్కువస్థాయి చాలు. అందువల్ల నా కారు శబ్దాన్ని అది అందరికంటె ముందే వినగలుగుతుంది. విని నన్ను రిసీవ్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. అంటే యింట్లోకి రాగానే స్లిప్పర్స్ నోటితో కరుచుకుని పట్టుకుని వచ్చి యివ్వడం.. యిలాటివన్నమాట! ఇప్పటికి కూడా నా జీవితంలో కుక్కలు ఓ ముఖ్యమైన భాగం. వాటి ప్రస్తావన లేకపోతే మా కుటుంబసభ్యుల కథ అసంపూర్ణమే. మా పిల్లలు మాకు ఫోన్ చేయగానే వేసే మొదటి ప్రశ్న మేం ఎలా వున్నామని కాదు, మా కుక్కలు ఎలా వున్నాయని.
xxxxxx
మాకు పదేళ్ల క్రితం ఓ కాకర్ వుండేది. అది కొన్నాళ్లకు పాపం జబ్బు పడింది. నీరసంగా నడవలేకుండా వుంది. వెటర్నరీ డాక్టరు వద్దకు తీసుకెళ్లాను. అక్కడ డాక్టర్లకు మనవాళ్ల కంటె ఎమోషన్స్ తక్కువ అనిపిస్తుంది. ఇలా జబ్బుపడిన కేసుల్లో వాటిని అవస్థ పెట్టడం ఎందుకు అనే తర్కంతో ఓ యింజక్షన్ యిచ్చి కథ సమాప్తి చేసేస్తారు. అవేళ కూడా డాక్టర్ నన్ను అడిగారు. నిజానికి అది అవేళ మరీ మృత్యుముఖంలో ఏమీ లేదు. శారీరక బాధలూ లేవు. కాస్త అవస్థపడుతూనైనా కొంతకాలం జీవించవచ్చు. నేను చెప్పాను – 'భగవంతుడు యిచ్చిన ఆయుర్దాయం ఎంత వుందో చూద్దాం. మన మెందుకు మధ్యలో దూరి అర్ధాయుష్షుగా చేయడం?' అని. సరే మీ యిష్టం అన్నాడు డాక్టర్. ఇంటికి తీసుకుని వచ్చేశాను.
ఓ వారం రోజులు గడిచాయి. అది యింకా నీరసించింది. ఓ రోజు పొద్దున్న నేను ఎక్సర్‌సైజ్ చేసుకుంటూ వుంటే కష్టపడి కుంటుకుంటూ వచ్చి కూర్చుంది. రోజూ నేను బెడ్‌రూమ్ పక్క గదిలో ఓ చిన్న చాప వేసుకుని ఎక్సర్‌సైజ్ చేసుకునేవాణ్ని. ఇది వచ్చి కూర్చుని చూస్తూ వుండేది. ఎక్సర్‌సైజ్ అయిపోగానే నేను ఓ బిస్కెట్ యిచ్చేవాణ్ని. అదీ మా యిద్దరికీ అలవాటు. ఆ రోజు కూడా రివాజు తప్పకూడదని ఓపిక లేకపోయినా, శక్తి కూడగట్టుకుని కుంటుకుంటూ వచ్చి కూర్చుంది. నా వ్యాయామం అయిపోగానే దానికి బిస్కట్ యివ్వబోయాను. పాపం తినే పరిస్థితిలో లేదు. ఓ చెంచాడు ఐస్‌క్రీమ్ నాకిస్తే నాకింది. అది కూడా దానికి యిష్టమై కాదు. నేను నొచ్చుకోకూడదని! అది నా పట్ల చూపిన ఔదార్యం అన్నమాట. (జంతువులను పెంచుకుని వాటి పట్ల జాలి కనబరుస్తున్నామని మనం అనుకుంటాం. కానీ నిజానికి యిలాటి సందర్భాల్లో అవి చూపిస్తాయి జాలి!)
అవేళ మా సెక్రటరీగారితో అజ్మీర్ వెళ్లవలసి వచ్చింది. కొసప్రాణంతో వున్న కుక్కను విడిచి వెళ్లాలని లేదు. మా సెక్రటరీగారితో 'ఇలా మా కుక్కకు ఒంట్లో బాగాలేదు, రానండి' అని చెప్పాలి. అలా చెప్తే నూటికి 90 మంది ఎగాదిగా చూస్తారు. మన ఆవేదన అర్థం చేసుకోరు. అయినా నేను చెప్తూండేవాణ్ని – 'మా కుక్క పిల్లకు ఆరోగ్యం బాగాలేదు, పార్టీకి రాలేను' అని. వాళ్లు కాస్త కన్‌ఫ్యూజ్ అయి 'మీ పిల్లకా? కుక్కపిల్లకా?' అని కూడా అడిగేవారు. అవేళ యీయనకు కూడా చెప్పేద్దును కానీ నేను అడిగితే ఆయన ఒప్పుకున్న కార్యక్రమం అది. కాన్సిల్ చేయడం మర్యాద కాదు. అందుకని వెళుతూ వెళుతూ మా ఆవిడకి లక్ష అప్పగింతలు పెట్టి మరీ వెళ్లాను.
అజ్మీర్ చేరగానే ఫోన్ చేశాను. 'ఎలా వుంది దానికి?' అని. అప్పటికే అంతా అయిపోయిందని తెలిసింది. నేను బయలుదేరిన కాస్సేపటికే అది చచ్చిపోయిందని. దాని శవాన్ని కార్లో పెట్టుకుని మా అమ్మాయి డాక్టరు వద్దకు తీసుకెళ్లింది – అది నిజంగా చనిపోలేదేమో అనే మిణుకుమిణుకుమనే ఆశతో! ఢిల్లీలో కుక్కలకు ఓ ధర్మసంస్థవాళ్లు కట్టించిన శ్మశానం వుంది. అక్కడ వెళ్లి పూడ్చిపెట్టించింది.
మా నాన్నగారు చిన్నప్పణ్నుంచి చెపుతూండేవారు- 'నెవర్ గివ్ యువర్ హార్ట్ టు ఎ డాగ్,.. టు బ్రేక్' అని. కుక్కకు మనసివ్వకు. ఇస్తే భగ్నహృదయం ఖాయం అని. ఎందుకంటే వాటి జీవన ప్రమాణం తక్కువ – ఏడు నుంచి పధ్నాలుగేళ్లు! మన జీవనప్రమాణం ఎక్కువ. అందువలన మన జీవితకాలంలో చాలా కుక్కల్ని పెంచుతాం, పోగొట్టుకుంటాం. పోయినప్పుడల్లా మనం విపరీతమైన బాధ పడక తప్పదు. కుక్క చనిపోయిందని మనశ్శాంతి, మతిస్థిమితం పోగొట్టుకున్నవారిని కూడా చూశాను. ఇటువంటి వాటికి సిద్ధపడితేనే పెంచాలి. మా అమ్మాయి మళ్లీ యింకో కుక్క పెంచుకునే సాహసం చేయలేకపోయింది. ఇప్పటికీ దాని యింట్లో కుక్కలు లేవు.
xxxxxx
మాకు మాత్రం బుద్ధి రాలేదు. మళ్లీ పెంచుకున్నాం. మరణం అనివార్యం. బంధుమిత్రులు లోకం నుండి వెళ్లిపోయేటప్పుడు బాధ కలిగిస్తారు. అలా అని స్నేహం చేయడం మానేయం, చుట్టాల్ని పెంచుకోక మానేయం. ఢిల్లీ నుంచి హైదరాబాదు వెళ్లాక మళ్లీ పెంచుకున్నాం. చీఫ్ సెక్రటరీ పోస్టు ఒక్క ఏడాది మాత్రమే వుండగా లక్ష్మీ పార్థసారథి అనే ఐయేయస్ ఆఫీసర్ మా యింటికి వచ్చి ''సార్ మీకు కుక్కలంటే యిష్టం కదా, మా కుక్క పిల్లలు పెట్టింది. మీకో పిల్లను యిస్తాను'' అన్నారు. నేను మళ్లీ కొత్త కుక్కల లంపటం పెట్టుకోదలచుకోలేదు. కొత్తగా రాబోయే కుక్కపిల్ల కనీసం పదేళ్లు బతుకుతుంది. మేము హైదరాబాదులో వుండబోయేది ఒక్క ఏడాది మాత్రమే. తర్వాత ఎక్కడికి వెళతామో, ఏ పోస్టులో వుంటామో, కుక్కల్ని పెంచుకునే యిల్లూ, వసతి వుంటుందో వుండదో అన్నీ సందేహాస్పదమే. దానికి న్యాయం చేయలేకపోతే అంతకంటె పాపం వుండదు. వద్దు అన్నాను.
కానీ మా ఆవిడ వినలేదు. 'పిల్లలు సెటిలయిపోతున్నారు. బయటకి వెళ్లిపోయారు. పురుళ్లు, పుణ్యాలూ వాళ్లని చూసి రావడాలూ అంటూ నేనేమో అటూ యిటూ తిరుగుతుంటాను. మీరు ఒంటరి అయిపోతారు. మీ స్వభావం నాకు తెలుసు. కుక్క తోడు వుంటేనే మీకు మంచిది. ఇప్పుడు రాబోయేది యింకో పదేళ్లపాటు వుంటుంది. మీకు బెస్టు ఫ్రెండ్ కాబోతుంది.' అని వాదించింది. బతిమాలింది. శతపోరింది. చివరికి నాకు తెలియకుండానే తెచ్చుకుని ఇంట్లో పెట్టేసింది.
ఆ రోజు పొద్దున్నే లేచి చూస్తే మా ఆవిడ బెడ్‌మీద కనబడలేదు. అప్పుడే ఎక్కడకు వెళ్లిందా అని చూస్తే పక్కగదిలో ఓ బాస్కెట్ పెట్టుకుని వుంది. ఆ బాస్కెట్‌లో ఓ చిన్న ఎలుకలా ఓ కుక్కపిల్ల కూర్చుని వుంది. గదిలోకి నేను ప్రవేశించగానే నామీద ఓ చూపు పడేసి,'వీడెవడో మన మధ్య చొరబడుతున్నాడు. ఫర్వాలేదంటావా? ఓకేనా!?' అన్నట్టు మా ఆవిడకేసి ప్రశ్నార్థకంగా చూసింది. చిన్నప్పటినుండీ కుక్కలతో మసలుతున్నాను కాబట్టి అవి నాకు అర్థమవుతాయి. ఆ ఎక్స్‌ప్రెషన్ నేనెప్పుడూ మర్చిపోలేను. మా ఆవిడ అనుకున్నట్టే అది నాకు బెస్ట్ కంపానియన్ అయింది. మా యింటికి వచ్చిన ఏడాదిలోనే బాగా ఎదిగి మంచి పెద్దగా తయారయింది.
ఓ రోజు పొద్దున్న ఎక్సర్‌సైజ్ చేసి కాస్త కూల్ అవుదామని బయటకు రోడ్డుమీదకు వచ్చాను. నన్ను చూసిన ఉత్సాహంతో పరిగెట్టుకుంటూ వచ్చి వెనక్కాల నుంచి నా మీద పడింది. నేను ఊహించలేదు కాబట్టి, ఆ ఊపుకి, ఆ బరువుకి తట్టుకోలేక బాలన్స్ తప్పి నేను రోడ్డు మీద పడిపోయాను. నన్ను హాస్పటల్‌కి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఓ రాత్రంతా ఐసియులోనే వుండాల్సి వచ్చింది. మర్నాడు పొద్దున్న యింటికి తిరిగి వచ్చాను. నా పరిస్థితి చూడగానే మా కుక్క బెదిరిపోయింది. చాలా గిల్టీగా ఫీలయింది. నేను ఆసుపత్రిలో వున్న రోజంతా తిండి తినలేదు. నేను తిరిగి వచ్చాకనే దానికి గుండె కుదుటపడింది పాపం.
జరిగిన విషయం యిదైతే ఓ అత్యుత్సాహవంతుడైన పత్రికా విలేఖరి అన్యాయంగా 'చీఫ్ సెక్రటరీ వజ్ ఎటాక్‌డ్ ఆన్ ద రోడ్ బై హిజ్ ఓన్ డాగ్' – (చీఫ్ సెక్రటరీగార్ని రోడ్డు మీద ఆయన కుక్కే దాడి చేసింది) అని రాశాడు. కుక్కలకు అనేక విద్యలు వచ్చు కానీ పేపరు చదవడం రాదు. లేకపోతే 'దాడి' అని రాసినందుకు ఆ రిపోర్టరు పిక్క పీకి వదిలిపెట్టేవి.
కొసమెరుపు – ఇంట్లో కుక్క ఉంటే కలిగే లాభాలలో ఒకటి – ఇంటికి వచ్చిన కొత్తవాళ్లలో మంచి చురుకుదనం తేవచ్చు. 'అబ్బే ఏమీ చేయదండీ' అని మనం అంటున్నా 'ఈ కుక్క మనమీద హఠాత్తుగా పడితే ఏం చేయాలా? నన్ను నేను ఎలా కాపాడుకోవాలా?' అనే ఆలోచనతో అనుక్షణం అప్రమత్తంగా వుంటారు. వాళ్లకే తెలియకుండా వాళ్లలో అజ్ఞాతంగా వున్న ప్రజ్ఞ కూడా వెలికి దీయవచ్చు. మా నాన్నగారి స్నేహితులు జస్టిస్ కొమరయ్య గారు నాలోని ప్రజ్ఞను అలాగే వెలుగులోకి తెచ్చారు.
నా చిన్నపుడు (9 ఏళ్ల వయసుంటుంది) నేను మా నాన్నగారితో కలిసి వాళ్లింటికి వెళ్లాను. వాళ్లింట్లో పే..ద్ధ కుక్క ( ఆ జాతిని గ్రేట్ డేన్ అంటారు) వుండేది. కారు దిగి వెళ్లి బెల్ కొట్టాం. తలుపు తియ్యగానే అది కనబడింది. అంతే! మరుక్షణంలో నేను మళ్లీ కార్లో వున్నాను. ఎలా వచ్చిపడ్డానో నాకు తెలియదు. మా నాన్నగారి ద్వారా తెలిసింది, మా అమ్మతో చెప్పినపుడు – ''ఇవాళ మనవాడు 100 మీటర్ల పరుగుపందెంలో రికార్డు బ్రేక్ చేశాడు'' అని.
మీ సూచనలు [email protected] కి ఈమెయిల్ చేయండి.
excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com
please click here for audio version