ఫీల్ గుడ్ మూవీ చేస్తే, అందులో గ్లామర్‌కి ఛాన్సుండదు.. వల్గారిటీకి అసలే అవకాశం వుండదు. కమర్షియల్ యాంగిల్ చూడరు. పైగా విమర్శకుల ప్రశంసలూ ఏదో ఒక రకంగా దక్కేస్తాయ్. ఇన్ని లెక్కలు వేసుకుని, 'ఒక మనసు' సినిమాని నిహారిక కోసం ప్లాన్ చేసినట్లున్నారు.
మెగా కుటుంబం నుంచి తొలిసారిగా ఓ అమ్మాయి, హీరోయిన్‌గా తెరంగేట్రం చేస్తోందంటే, ఆమె ఎలా నటిస్తుంది.? తెరపై ఎంత హుషారుగా వుంటుంది.? ఇలా అభిమానులు ఎదురుచూడటం సహజం. పైగా, ఆమె ఇప్పటికే బుల్లితెరపై హల్‌చల్ చేస్తోంది. ఫుల్ జోష్‌తో కనిపిస్తుంటుంది. అలాంటి నిహారికని వెండితెరపై చూడ్డం మాత్రం చాలా చాలా చాలా కష్టంగా అనిపించిందిప్పుడు.
ప్రస్తుతం టెలివిజన్ షోస్‌లో కూడా అంత 'ల్యాగ్' వుండడంలేదు. మధ్యలో సాంగ్స్ వచ్చేస్తున్నాయి, బోల్డంత కామెడీ కనిపిస్తోంది బుల్లితెర మీదనే. అలాంటిది, వెండితెరపై ఆ హుషారు లేకపోతే ఎలా.? డల్ మ్యూజిక్, స్లో స్లోగా సాగుతున్న సినిమా.. వెరసి, నిహారిక తొలి సినిమా బాగా హర్ట్ చేసేసింది అభిమానుల్ని, సినీ ప్రేక్షకుల్ని. ఎందుకిలా.? అంటే, సమాధానం సింపుల్.. అతి జాగ్రత్తే కొంప ముంచింది.