మాజీ ఎంపీ వివేక్, తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వెళ్ళే విషయమై తెగ మొహమాటపడిపోతున్నారట. కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి (ఇటీవలే మరణించారు) తనయుడైన వివేక్, గతంలో కాంగ్రెస్ ఎంపీగా పనిచేశారు. ఆ మధ్య కాంగ్రెస్‌ని వీడి, టీఆర్‌ఎస్‌లో చేరిన వివేక్, తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన, తాజాగా కారెక్కేందుకు (అదేనండీ టీఆర్‌ఎస్‌లో చేరేందుకు) ప్రయత్నిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి టీఆర్‌ఎస్‌లో చేరే విషయమై వివేక్ అంత ఆసక్తి చూపడంలేదట. టీఆర్‌ఎస్ మాత్రం, వివేక్‌ని తమ పార్టీలో చేర్చుకునేందుకు నానా తంటాలూ పడ్తున్నారట. ఇది వివేక్ సన్నిహితుల వాదన. అయితే, అంత దేబిరించాల్సిన అవసరమైతే టీఆర్‌ఎస్‌కి లేదు. తెరవెనుక ఏం జరుగుతోందోగానీ, వివేక్‌కీ టీఆర్‌ఎస్ నేతలకీ మధ్య సన్నిహిత సంబంధాలైతే కొనసాగుతున్నాయి.
తాజాగా వివేక్, టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. తన తండ్రి జ్ఞాపకార్థం హైద్రాబాద్‌లో కొంత స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేసేందుకే కేసీఆర్‌ని వివేక్ కలిశారట. వివేక్ విజ్ఞప్తి పట్ల కేసీఆర్ సానుకూలంగా స్పందించారట. అసలు భేటీ జరిగింది, వివేక్‌ను కేసీఆర్ టీఆర్‌ఎస్‌లో ఆహ్వానించడానికేనన్న అజెండాతోననీ, చర్చలు ఫలప్రదం కాలేదని గుసగుసలు విన్పిస్తున్నాయి.
కేసీఆర్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన వివేక్, తాను కాంగ్రెస్‌ని వీడటంలేదనీ, టీఆర్‌ఎస్‌లోకి వెళ్ళే ఆలోచనే లేదని చెప్పుకొచ్చారు. ఏమో.. ఈ మధ్య బొత్తిగా రాజకీయాలు ‘డీల్’ బేస్డ్‌గా నడుస్తున్నాయి. ఓ పార్టీ నుంచి ఇంకో పార్టీకి నేతలు జంప్ చేయాలంటే తెరవెనుక చాలా ‘డీల్స్’ నడుస్తున్నాయనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో వివేక్ మొహమాటం వెనుక డీల్ కుదరకపోవడమే ప్రధాన కారణమా.? అని గాసిప్స్ షురూ అవడంలో వింతేముంది.!