చంద్రబాబు నో కాంప్రమైజ్.. మిత్రుల సంగతేంటి?

తెలుగుదేశం మాత్రం రెబెల్స్ ను శాశ్వతంగా దూరం పెట్టడానికి నిర్ణయించింది. ఇది పార్టీకి నష్టదాయకమైన నిర్ణయం కదా

ప్రస్తుతానికి చంద్రబాబునాయుడు లోని ఆగ్రహం చల్లారినట్టు కనిపించలేదు. రెబెల్స్ గా స్థానిక ఎన్నికల్లో పోటీచేసిన వారి పట్ల ఎలాంటి సానుభూతి లేదన్నట్టుగా ఆయన స్పష్టం ఇచ్చేశారు.

తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగిన రెబెల్స్ ను ఆల్రెడీ సస్పెండ్ చేశారు. అయితే వారిలో చాలా మంది కూటమి అభ్యర్థులను కూడా ఓడించి విజయం సాధించారు.

తెలుగుదేశం పార్టీ అధినేత తన పాత అలవాట్ల ప్రకారం.. ఒకసారి గెలిచిన తర్వాత.. తిరిగి పార్టీలో కలిపేసుకుంటారనే అంతా అనుకున్నారు. కానీ.. తాజాగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబునాయుడు ఈ విషయంలో స్పష్టత ఇచ్చారు.

ఒకసారి పార్టీ ఆదేశాలను ధిక్కరించి రెబెల్స్ గా పోటీచేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ పార్టీలోకి తీసుకునేది లేదని చెప్పేశారు.

వ్యక్తులు ఎంతగానైనా పాపులర్ కావొచ్చునని.. కానీ, పార్టీని ధిక్కరించి వెళతామంటే కుదరదని అన్నారు. ఈ విషయంలో చంద్రబాబునాయుడు ఒక క్లారిటీతోనే ఉన్నారు. కానీ అదేరీతిగా జనసేన బిజెపి కూడా రెబెల్స్ విషయంలో కఠినంగానే ఉండగలవా? అనేది అనుమానంగానే ఉంది.

జగన్ పై విద్వేషాన్ని వ్యాప్తిచేయడానికి చంద్రబాబునాయుడు ఒకవైపు రెబెల్స్ విజయాన్ని ఇంకా వాడుకుంటూనే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు.. అయితే కూటమి అభ్యర్థులకు ఓట్లు వేశారు.. లేదా, రెబెల్స్ కు ఓటు వేశారు తప్ప ఫ్యాను పార్టీకి ఓటు వేయలేదని ఆయన సూత్రీకరిస్తున్నారు. ఆ విషయంలో మాత్రం రెబెల్స్ విజయాల్ని ఓన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

అదే సమయంలో.. పదవుల పంపకాల్లో రెబెల్స్ చికాకులు పెడతారేమో అనుకుంటున్నారేమో గానీ.. వారిని తిరిగి పార్టీలోకి తీసుకునేది మాత్రం లేదని అంటున్నారు

మిత్రపక్షాలకు ఆగ్రహం రాకుండా చూసుకోవడం చంద్రబాబునాయుడుకు అత్యవసరం. ఎందుకంటే.. రాబోయే ఏ ఎన్నికలో కూడా జనసేన-బిజెపి కాంబినేషన్ లేకుండా.. ఎన్నికలకు వెళ్లగలిగే ధైర్యం ఆయనకు లేదు. అలాంటి పరిస్థితుల్లో వారు అలిగితే ఆయనకు ఇబ్బందే. అందుకని రెబెల్స్ ను దూరం చేసుకోవడానికే ఆయన మొగ్గు చూపించవచ్చు.

అయితే మిత్రులు కూడా అదే ధర్మాన్ని పాటించగలరా? అనేది అనుమానంగానే ఉంది. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గం పరిధిలో ఎంపీ ఉదయ శ్రీనివాస్ ఒంటెత్తు పోకడల ఫలితంగా పోటీచేసిన జనసేన రెబెల్స్ కూడా కొన్నిచోట్ల గెలిచారు. వారిని కూడా ఎన్నికలకు ముందు సస్పెండ్ చేశారు.

అయితే ఫలితాలు వచ్చిన వెంటనే.. ఎంపీ వారిని తన ఇంటికి పిలిపించుకుని పార్టీ కండువా కప్పేసి ‘తమ’ అనిపించేసుకున్నారు. అలా జనసేన మాత్రం గెలిచిన రెబెల్స్ ను తమతో కలిపేసుకుంది.

కానీ.. తెలుగుదేశం మాత్రం రెబెల్స్ ను శాశ్వతంగా దూరం పెట్టడానికి నిర్ణయించింది. ఇది పార్టీకి నష్టదాయకమైన నిర్ణయం కదా.. అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.