బాబుతో ప‌వ‌న్ బంధం.. ఎంతో దృఢం!

ఎన్నో న‌చ్చ‌ని విష‌యాలున్నా, చంద్ర‌బాబుతో మాత్రం స‌ర్దుకుపోతాన‌ని ప‌వ‌న్ ప‌దేప‌దే చెబుతున్నారు. అంతా రాజ‌కీయ మాయ‌.

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ వైవాహిక జీవితం మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశ‌మైంది. 1997లో విశాఖ‌కు చెందిన నందినితో మొద‌లైన వివాహ బంధం, ఇప్ప‌టికీ కుదురుకోవ‌డం లేదు.

వివాహమ‌నే ప్రయోగంలో ముచ్చ‌ట‌గా మూడో భార్య అన్నా లెజినోవాకు ప‌వ‌న్ విడాకులు ఇచ్చారు. వీళ్లిద్ద‌రి మ‌ధ్య‌లో రేణుదేశాయ్ కూడా ఉన్నారు.

త‌మ గోప్య‌త‌ను గౌర‌వించాల‌ని విడిపోయిన ప‌వ‌న్ జంట కోరింది. ప‌బ్లిక్ లైఫ్‌లో ఉన్న త‌ర్వాత‌, గోప్య‌త‌కు చాలా త‌క్కువ చోటు వుంటుంది. మ‌రీ ముఖ్యంగా సినీ, రాజ‌కీయ రంగంలో విశేష సంఖ్య‌లో అభిమానులు, శ‌త్రువుల్ని క‌లిగిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ్య‌క్తిగ‌త జీవితం గురించి త‌ప్ప‌క మాట్లాడ్తారు.

ప‌వ‌న్ జీవిత పంథాను బాగా గ‌మ‌నిస్తే, ఆయ‌న‌కు చంద్ర‌బాబుతో బంధ‌మే దృఢ‌మైన‌దిగా క‌నిపిస్తోంది. వివాహ బంధంలో ఒక్క‌సారి విడిపోయిన త‌ర్వాత‌, తిరిగి క‌లిసే ప‌రిస్థితి ఉత్ప‌న్నం కాదు.

ప్ర‌తి విడిపోయే జంట‌… వైవాహికంగా విడిపోతున్నామ‌ని, స్నేహితులుగా క‌లిసి వుంటామ‌ని ప్ర‌క‌టించ‌డం ప్యాష‌న్‌గా మారింది. స్నేహంగా క‌లిసి ఉంటున్న దాఖ‌లాలుండ‌వు.

కానీ రాజ‌కీయ రంగంలో మాత్రం చంద్ర‌బాబుతో ప‌వ‌న్ పాలునీళ్ల‌లా క‌లిసిపోవ‌డాన్ని చూడొచ్చు. ఒక‌సారి విడిపోయిన త‌ర్వాత‌, మ‌ళ్లీ వాళ్లిద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురింది, బంధం మ‌రింత బ‌ల‌ప‌డ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

2014లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోయిన త‌ర్వాత ప‌వ‌న్‌క‌ల్యాణ్ జ‌నసేన అనే రాజ‌కీయ పార్టీని స్థాపించారు. అంత‌కు ముందు మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్ర‌జారాజ్యం పార్టీలో యువ‌రాజ్యం అధిప‌తిగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనం త‌ర్వాత‌, కొంత కాలం ప‌వ‌న్ రాజ‌కీయంగా మౌనం పాటించారు.

ఆ త‌ర్వాత ప్ర‌శ్నించ‌డానికి అంటూ జ‌న‌సేన రూపంలో ప‌వ‌న్ రాజ‌కీయ తెర‌పైకి వ‌చ్చారు. వైఎస్ జ‌గ‌న్‌ను సీఎం కానివ్వ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో టీడీపీ-బీజేపీ కూట‌మికి బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ఇచ్చారు.

మూడున్న‌రేళ్ల త‌ర్వాత బాబుతో విభేదించి కూట‌మి నుంచి ప‌వ‌న్ బ‌య‌టికి వ‌చ్చారు. 2019లో వామ‌ప‌క్షాలు, బీఎస్పీతో క‌లిసి ఆయ‌న పోటీ చేశారు. ఎన్నిక‌ల త‌ర్వాత వామ‌ప‌క్షాలు, బీఎస్పీతో ప‌వ‌న్ విడాకులు తీసుకున్నారు.

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు విడిపోయిన బీజేపీతో ప‌వ‌న్ మ‌ళ్లీ జ‌త క‌ట్టారు. 2024 ఎన్నిక‌ల నాటికి చంద్ర‌బాబుపై ప‌వ‌న్‌లో రాజ‌కీయ మోజు పెరిగింది. ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేసి వీర‌మ‌ర‌ణం పొంద‌లేన‌ని బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు.

స్కిల్ స్కామ్ కేసులో చంద్ర‌బాబు అరెస్ట్‌ను సాకుగా తీసుకుని, రాజ‌మండ్రి జైలు వ‌ద్ద పొత్తుపై ప‌వ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆ త‌ర్వాత మూడు పార్టీలు క‌లిసి కూట‌మిగా ఏర్ప‌డి ఎన్నిక‌ల‌కు వెళ్లాయి. అధికారాన్ని ద‌క్కించుకున్నాయి.

ఇంకా 15 ఏళ్ల‌పాటు కూట‌మిగా క‌లిసే వుంటామ‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌దేప‌దే ప్ర‌క‌టిస్తుంటారు. టీడీపీ, బీజేపీ అభిప్రాయాల‌తో సంబంధం లేకుండా సుదీర్ఘ కాలం క‌లిసి వుండ‌డంపై ప‌వ‌న్ ప్ర‌క‌టన‌లు చేయ‌డం సొంత పార్టీకి న‌చ్చ‌డం లేదు. అయితే జ‌గ‌న్ అనే ప్ర‌త్య‌ర్థి భ‌యంతో చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయంగా క‌లిసే వుంటున్నార‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం.

కానీ వైవాహిక జీవితం వేరు. కుద‌ర్లేదంటూ రాత్రికి రాత్రే ప్ర‌క‌టిస్తున్నారు. వివాహ జీవితంలో స‌ర్దుబాటు చేసుకోలేని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, రాజ‌కీయ రంగంలో మాత్రం చంద్ర‌బాబుతో ఒద్దిక‌గా వెళుతుండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

స‌హ‌జంగా రాజ‌కీయాల కంటే భార్య‌, పిల్ల‌ల‌కు ఎవ‌రైనా ప్రాధాన్యం ఇస్తుంటారు. అదేంటో గానీ ప‌వ‌న్‌క‌ల్యాణ్ విష‌యంలో కొంచెం తేడా క‌నిపిస్తోంది.

ఎన్నో న‌చ్చ‌ని విష‌యాలున్నా, చంద్ర‌బాబుతో మాత్రం స‌ర్దుకుపోతాన‌ని ప‌వ‌న్ ప‌దేప‌దే చెబుతున్నారు. అంతా రాజ‌కీయ మాయ‌.