ఉమ్మడి కడప జిల్లా నుంచి ఉత్తరాంధ్రకు వచ్చి, పూర్తిగా గ్రామీణ వాతావరణం ఉన్న అనకాపల్లి నుంచి బీజేపీ పువ్వు గుర్తుపై భారీ మెజారిటీతో గెలిచారంటేనే సీఎం రమేష్ రాజకీయ చతురత అర్థమవుతోందని అంటున్నారు.
రెండున్నరేళ్ల తన పార్లమెంట్ సభ్యత్వ కాలంలో ఆయన స్థానికంగా మరింత బలం పుంజుకున్నారని చెబుతున్నారు.
సీఎం రమేష్ మాటే వేదం అన్నట్లుగా అనకాపల్లిలో కూటమి రాజకీయాలను ఆయన శాసిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు కూడా ఆయన చేతుల్లోనే అనకాపల్లి జెడ్పీ చైర్‌పర్సన్ పీఠం ఉందని అంటున్నారు. ఆయన ఎవరి పేరు ప్రతిపాదిస్తే వారే కొత్త చైర్‌పర్సన్ అవుతారని చెబుతున్నారు.
మొత్తం 24 మంది జెడ్పీటీసీలు ఉన్న అనకాపల్లిలో సీఎం రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ నుంచి ఇద్దరు మాత్రమే గెలిచారు.
టీడీపీ 17 జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకోగా, జనసేన ఐదు స్థానాలను దక్కించుకుంది. దీంతో జెడ్పీ పీఠం కోసం టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్లుగా రాజకీయం సాగుతోంది.
ఈ నేపథ్యంలో కొత్త చైర్‌పర్సన్‌గా ఎవరుండాలనే విషయాన్ని సీఎం రమేష్ నిర్ణయిస్తారని అంటున్నారు. దీంతో టీడీపీ, జనసేన పార్టీల నుంచి ఆశావహులంతా ఎంపీ గారి ప్రాపకం కోసం ఎదురుచూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. రెండు పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో ఆశావహులు ఉండటంతో ఈ పదవి కోసం పోటాపోటీ రాజకీయం సాగుతోంది.
ఇంతకీ సీఎం రమేష్ మనసులో ఎవరి పేరు ఉందన్నది మాత్రం తెలియడం లేదని అంటున్నారు. అనకాపల్లి తొలి జెడ్పీ చైర్‌పర్సన్ ఎవరవుతారన్నది ఆయన నిర్ణయంపైనే ఆధారపడి ఉందని చెబుతున్నారు. చివరి నిమిషంలో బీజేపీ కూడా జెడ్పీ పీఠం కోసం పోటీ పడినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.
ఈ నెల 20న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జెడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

Saaaraaa Ramesh?