విశాఖ స్టీల్ ప్లాంట్ ని కేబినెట్ స్థాయి ఉక్కు మంత్రి సందర్శించి చాలా కాలం అయింది. ఆ పని బాధ్యతలు తీసుకుని నెల రోజులు తిరగకుండానే కేంద్ర ఉక్కు మంత్రి హెచ్. డి కుమారస్వామి చేశారు. ఆయన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని గురువారం సందర్శించి విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయబోమని ఒక క్లారిటీ ఇచ్చారు. విశాఖ ఉక్కు దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని అన్నారు.
తనకు రెండు నెలలు టైం ఇస్తే ఉక్కు కర్మాగారం విషయం ఒక కొలిక్కి తీసుకుని వస్తానని కార్మికులకు ఉద్యోగ వర్గాలకు హామీ ఇచ్చారు. తాను విశాఖ ఉక్కు కర్మాగారం మీద నోట్ తయారు చేసి ప్రధాని మోడీ వద్దకు వెళ్తాను అని చెప్పారు.
విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాబోదని స్వామి భరోసా ఇచ్చారు. విశాఖ ఉక్కు అన్నది కార్మికలకు ప్రజలకు సెంటిమెంట్ అని కుమారస్వామి గుర్తించడం మంచి పరిణామం. ఉక్కుని పూర్తి సామర్ధ్యంతో పనిచేసేలా చూస్తామని ఆయన ప్రకటించారు.
కేంద్ర మంత్రి నోటి వెంట వచ్చిన ఈ మాటలు అన్నీ కార్మిక లోకాన్ని సంతోషపెట్టే లాగానే ఉన్నాయి. విశాఖ ఉక్కు ని కాపాడాలని కోరిన వారికి తీపి కబురే చెప్పారు కుమార స్వామి. ఆయన కేబినెట్ మంత్రి. ఆయన మాట పవర్ ఫుల్. అయితే కేంద్రంలోని బీజేపీ పెద్దలు మిత్రపక్షంగా ఉంటూ కేంద్ర మంత్రి అయిన జేడీఎస్ అధినేత మాటను ఎంతవరకూ వింటారు అన్నది అంతా తర్కించుకుంటున్న విషయం. బీజేపీ ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలకు పెట్టుబడులు ఉపసంహరణ చేయడం ఒక పాలసీగా పెట్టుకుంది.
అది ఒక్క విశాఖ ఉక్కు విషయంలో మినహాయింపుగా ఇస్తే మిగిలిన వాటికి కూడా వర్తింప చేయాలని డిమాండ్ వస్తుంది. అయితే సీ షోర్ స్టీల్ ప్రాజెక్ట్ గా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది. అంతే కాకుండా ఎంతో మంది ఆత్మ బలిదానంతో ఏర్పడిన ప్రాజెక్ట్ కూడా దేశంలో ఇది ఒక్కటే. ఈ విధంగా సెంటిమెంట్ తో ఆలోచిస్తే విశాఖ ఉక్కు బలి పీఠం నుంచి ఒడ్డున పడినట్లే. కుమారస్వామి ఈ విషయంలో విజయం సాధిస్తే ఆయన విశాఖ ఉక్కు కర్మాగారానికి పునర్జన్మ ప్రసాదించిన వారు అవడమే కాదు ఉక్కు కార్మికులకు దేవుడు అవుతారు అని అంటున్నారు.