ఉండిలో పుండుపెట్టిన చంద్రబాబు!

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తాను వేసిన ప్రలోభాలకు తప్పకుండా లొంగి తీరుతారని రఘురామక్రిష్ణ రాజుకు అపారమైన నమ్మకం. అందుకే ఆయన తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాలకు టికెట్లు ప్రకటించేసిన తర్వాత కూడా.. తనకు చంద్రబాబునాయుడు…

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తాను వేసిన ప్రలోభాలకు తప్పకుండా లొంగి తీరుతారని రఘురామక్రిష్ణ రాజుకు అపారమైన నమ్మకం. అందుకే ఆయన తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాలకు టికెట్లు ప్రకటించేసిన తర్వాత కూడా.. తనకు చంద్రబాబునాయుడు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని చెబుతూ వచ్చారు. ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటానని కూడా చెబుతూ వచ్చారు.

కాకపోతే.. కాస్త సందిగ్ధానికి తావిస్తూ ఎమ్మెల్యేగా గానీ, ఎంపీగా గానీ తర్వాత చెబుతానని కూడా అంటూ వచ్చారు. మొత్తానికి చంద్రబాబునాయుడు సమక్షంలో ప్రజాగళం సభలో ఆయన చేతుల మీదుగా పార్టీ కండువా కప్పించుకుని తెలుగుదేశం పార్టీలోచేరారు. లాంఛనంగా చేరడం కోసం కాసుకుని కూర్చున్నట్టుగా వెంటనే ఆయనను పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబునాయుడు.

ఇప్పుడు ఉండిలోని సిటింగ్ ఎమ్మెల్యలే మంతెన రామరాజు అనుచరులు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నారు. చంద్రబాబునాయుడు మాట నిలబెట్టుకోవాలని వారు యాగీచేస్తున్నారు. మొత్తానికి ఈ తాజా నిర్ణయంతో ఉండి నియోజవర్గం తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు పుండుపెట్టినట్టుగా అయింది.

ఉండి నియోజకవర్గం తెలుగుదేశానికి బలమైన నియోజకవర్గం అనే చెప్పాలి. 2004లో వైఎస్సార్ హవాకు ఓడిపోయినప్పటికీ.. 2009 నుంచి వరుసగా అదే పార్టీ గెలుస్తూ వస్తోంది. 2019 ఎన్నికల్లో తొలిసారిగా తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసిన మంతెన రామరాజు, అప్పటి జగన్ హవాను తట్టుకుని కూడా పదివేల పైచిలుకు ఓట్లతో గెలిచారు. అలాంటిది ఇప్పుడు మళ్లీ నెగ్గుతారనే నమ్మకం అక్కడి పార్టీ కార్యకర్తల్లో ఉంది. చంద్రబాబు కూడా ఆయనకు టికెట్ ఇదివరకే ప్రకటించారు.

ఈలోగా రఘురామక్రిష్ణ రాజు ఏం మాయ చేశారో ఏమో.. చంద్రబాబునాయుడును ఏ రకంగా ప్రలోభ పెట్టారో ఏమో గానీ.. తమకు అత్యంత సేఫ్ సిటింగ్ సీటు అయిన ఉండి నియోజకవర్గాన్ని ఆయనకు దఖలుపెట్టేశారు. చంద్రబాబునాయుడు అవకాశవాద ధోరణి మీద నియోజకవర్గంలోని పార్టీ నాయకుల్లో ఆగ్రహజ్వాలలు రేగుతున్నాయి. ఈ సీటును చంద్రబాబు అమ్ముకున్నారంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

ఉండి నియోజకవర్గం రామరాజు అడ్డా అంటూ ఆయన అనుచరులు నినాదాలు చేస్తున్నారు. చంద్రబాబు తాను ఎలాంటి బేరసారాలకు లొంగి ఉండిని రఘురామకు ఇచ్చారోననే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి స్థానికుల ఆగ్రహావేశాల మధ్య.. రఘురామ ఉండిలోని సిటింగ్ ఎమ్మెల్యే రామరాజును ఏ రకంగా ప్రసన్నం చేసుకుంటారో? టికెట్ దక్కినంత మాత్రాన ఏ రకంగా ముందుకు వెళతారో చూడాలి.