జగన్మోహన్ రెడ్డి దయతో నరసాపురం ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి! తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలోని అన్ని స్థానాలకు తమ అభ్యర్థులను పూర్తిగా ప్రకటించేసిన తర్వాత.. ఏం మాయ చేశారో గానీ, ఉండి వంటి సిట్టింగ్ స్థానంలో, సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు ప్రకటించిన అభ్యర్థిత్వాన్ని అడ్డదారిలో ఆయన దక్కించుకున్నారు.
పర్యవసానంగా తెలుగుదేశం పార్టీలో చిచ్చు పెట్టారు. ఇది మామూలు చిచ్చు కాదు. రావణ కాష్టం లాగా రగులుతూనే ఉంది. పార్టీ పరువును మాత్రమే కాకుండా చంద్రబాబు నాయుడును కూడా బజారుకీడుస్తోంది.
2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలిచిన స్థానాలు అతి తక్కువ. అలాంటి వాటిలో ఉండి కూడా ఒకటి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ దాదాపుగా టికెట్లు మళ్ళీ ధ్రువీకరించిన చంద్రబాబు నాయుడు అదే క్రమంలో ఉండి అభ్యర్థిత్వాన్ని కూడా ఎమ్మెల్యే మంతెన రామరాజుకు ప్రకటించారు. ఆయన తన ప్రచారాన్ని కూడా ప్రారంభించారు.
అయితే నరసాపురం ఎంపీగా బరిలోకి దిగుతానంటూ.. కూటమిలో ఏ పార్టీ అయినా తనకు టికెట్ ఇవ్వాల్సిందే అని విర్రవీగిన రఘురామకృష్ణరాజు చివరకు భంగపడ్డారు. చంద్రబాబు నాయుడును ఆశ్రయించి తనకు ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా గానీ, ఎంపీగా కానీ టికెట్ ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే ఎంపీ స్థానాలకు పోటీ మరింత ఎక్కువగా ఉండటంతో.. చంద్రబాబు నాయుడు ఉండి ఎమ్మెల్యే టికెట్ ప్రకటించారు.
గత అయిదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లుతూ పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడినందుకు ప్రత్యుపకారం ఆశించారో.. లేదా చంద్రబాబును భారీ ఆఫర్లతో ప్రలోభ పెట్టారో తెలియదు కానీ మొత్తానికి రఘురామకృష్ణరాజు స్థానికుల అభీష్టానికి వ్యతిరేకంగా ఉండి టికెట్ను దక్కించుకున్నారు. కానీ ఈలోగానే అక్కడ అసంతృప్తి జ్వాలలు రగులుకున్నాయి.
సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు చంద్రబాబునాయుడు ద్రోహం చేశారంటూ ఆయన అనుచరుల ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నాయి. మరొకవైపు పార్టీ టికెట్ ఆశించిన శివరామరాజు కూడా రెబెల్ అభ్యర్థిగా బరిలో ఉన్నాను అంటున్నారు.
తాజా పరిణామాలలో మంతెన రామరాజు వర్గం జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఇంటిని ముట్టడించి ఆందోళనలు చేయడం చర్చనీయాంశం అవుతోంది. చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే తాను ఇండిపెండెంటుగా అయినా బరిలోనే ఉంటానని మంతెన రామరాజు అంటున్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో మున్ముందుకు సాగిపోతున్నారు. ఆయన అనుచరులు ఆమరణ నిరాహారదీక్ష కూడా చేస్తున్నారు.
ఇన్ని పరిణామాల మధ్య ఉండిలో రగులుతున్న జ్వాలలను చంద్రబాబు ఏ రకంగా సర్దుబాటు చేయగలరు అనే అనుమానం పలువురిలో వ్యక్తం అవుతోంది. ఆ విషయంలో చంద్రబాబు సక్సెస్ కాకపోతే గనుక ఇప్పటికే టికెట్లు అమ్ముకుంటున్నారని ఆయనకు వచ్చిన పేరుతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి నష్టం జరుగుతుంది అనే అభిప్రాయం ప్రజల్లో వినిపిస్తోంది.