“మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా.. ఆ మత్తులోన పడితే గమ్మత్తుగ చిత్తవుదువురా” అని శ్రీకృష్ణపాండవీయం సినిమాలో ఓ పాట.
అయితే, ప్రస్తుత తరుణంలో “నిద్దుర మత్తు”కి బదులుగా “కులమతాల మత్తు” అని మార్చుకుంటే సరిపోతుంది. మిగతాదంతా సేమ్ టు సేమ్ సెట్టవుతుంది.
జాతీయ స్థాయిలో మతం మత్తు, రాష్ట్ర స్థాయిలో కులం మత్తు. అంతే! చిత్తైపోతున్నామని తెలియకుండానే చిత్తైపోతున్నాం, చితికిపోతున్నాం.
కాక్రోచ్ జనతా పార్టీ వాళ్లని తప్పుబడితే, “నువ్వు బత్తాయివి.. హిందుత్వ పిచ్చిలో కొట్టుకుంటున్నావు” అని ఒక వర్గం.
బీజేపీ ప్రభుత్వంలో అవకతవకల గురించి మాట్లాడితే, “నువ్వు దేశద్రోహివి, హిందూ వ్యతిరేకివి” అని మరొక వర్గం.
ఇలా మతం పేరుతో కొట్టుకుచావడం తప్ప, అసలు పాలనలోని తప్పొప్పుల గురించి మాట్లాడుకోవడానికి సామరస్యపూర్వకమైన వాతావరణం లేనే లేదు.
స్టార్‌లింక్ ఇండియాకి రావాలి, నెట్‌వర్క్ బాగుంటుంది అని ఒకడంటే, “చైనా వాడే రానీయట్లేదు. మన దేశ రక్షణ మనకి ముఖ్యం.. నెట్‌వర్క్ ఎలా తగలడ్డా మనకి జియో, ఎయిర్‌టెల్ మాత్రమే ముద్దు” అంటారు ఒక వర్గం.
చైనా వాడికి సొంత శాటిలైట్లే ఉన్నాయి, స్టార్‌లింక్ లాంటిదాన్ని ఏర్పాటు చేసుకోవడానికి. మనకెక్కడున్నాయి? ఈ ప్రశ్న అడిగితే, “నువ్వు టుక్డే టుక్డే గ్యాంగ్ మెంబర్‌వా!!” అంటూ ఎటాక్.
రోడ్డు మీదకొస్తే మొబైల్‌లో ఇంటర్నెట్ ఎన్ని సార్లు డౌన్ అవుతుందో వాడే వాళ్లకి అనుభవమే. వాట్సాప్ కాల్ ఎన్ని సార్లు కట్ అయిపోతుంది? కదలకుండా ఇంట్లో కూర్చుని వైఫై కాల్ మాట్లాడినా అంతే.
అదే స్టార్‌లింక్ అయితే విమానాల్లో కూడా చక్కగా పని చేస్తోంది. విమానంలో ప్రయాణిస్తూ కిందనున్న వాళ్లతో వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. కనెక్షన్‌లో రవ్వంత డ్రాప్ కూడా ఉండదు.
ఈ స్టార్‌లింక్ నెట్‌వర్క్‌ని ఒక్కసారి రుచి చూస్తే, మన కమ్యూనికేషన్ నెట్‌వర్క్ ఎంత బలహీనంగా ఉందో తెలుస్తుంది.
మనకి రోడ్లు బాగోకపోయినా చీమ కుట్టినట్టుండదు.
పారిశుధ్యం లేకపోయినా నోరు లేవదు.
మొదలుపెట్టిన ఫ్లైఓవర్ల నిర్మాణాలు ఎన్నో ఏళ్లుగా పూర్తి కాకపోయినా ప్రశ్నించం, ఉద్యమించం… మనకి గుళ్లు, గోపురాలు, చర్చిలు, మసీదులు ఉంటే చాలు..! ఇదీ ఈ దేశం దుస్థితి.
అలాగని చైనాలాగా నాస్తికత్వం పెంచుకోమని చెప్పట్లేదు.
మన జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా మనం ప్రభుత్వాలను ఎందుకు నడిపించలేకపోతున్నాం?
ఈ కాక్రోచుల విషయం కూడా అర్థం కావట్లేదు. ఆ మంత్రి దిగిపోవాలి, ఈ అధికారి రాజీనామా చేయాలి.. ఇదా? ఇది సరిపోతుందా దేశం మారడానికి, జనంలో చైతన్యం రావడానికి? వాడు పోతే ఇంకొకడొస్తాడు. దశాబ్దాలుగా చూస్తున్నదేగా?
గొడవపడి, ప్రభుత్వం, యంత్రాంగం మెడలు వంచి పెండింగ్ పనులు చేయమని పట్టుబట్టండి… రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా ఉద్యమంలో భాగమవుతారు. ప్రస్తుతం చేస్తున్నవి మాత్రం రాజకీయాల్లాగానే కనిపిస్తున్నాయి కనుక బొద్దింకల గోల అంటున్నారు.
అదలా ఉంచి, రాష్ట్ర స్థాయిలో మాట్లాడుకుంటే.. ఇక్కడ కొట్టేది కులం కంపు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ కులాల రొచ్చు భరించలేని విధంగా ఉంది.
తమ కులం వాడు మర్డర్ చేసినా సమర్థించే ప్రబుద్ధులు ఉన్నారు.
తమ కులం పార్టీ కాకపోతే స్థానిక ఎన్నికల్లో నామినేషన్ కూడా వేయనీయరు అభ్యర్థుల్ని.
ప్రోగ్రెసివ్‌గా కనిపించడానికి కులాంతర వివాహాలు కావాలి.
కానీ రాజకీయాలు చేయడానికి అవే కులాలు విడి విడిగా కావాలి.
కులాల పేరుతో గ్రూపులు కట్టి రాజకీయ బలం చాటుకోవడం ఎంత వెనుకబాటుతనం?
ఏళ్లు గడుస్తున్న కొద్దీ కొత్త తరాల్లో పరిపక్వత వచ్చి ఈ కులాల పిచ్చిని వదులుకుంటారనుకుంటే.. అస్సలు మారట్లేదు పరిస్థితి.
ఇది ఆంధ్ర జాతి గమ్మత్తుగా చిత్తయ్యే దుస్థితి.
ఇన్ని దరిద్రాలతో దేశం ముందుకు పోలేక కుదేలవుతుంటే, భారత్ వెలిగిపోతోంది అని ఒకడు, రాష్ట్రం పెట్టుబడులతో ముందుకు పోతోంది అంటూ మరొకడు ఊదరగొడుతున్నారు! ఎక్కడ వెలుగు? ఎక్కడ పెట్టుబడి?
ఇవన్నీ చెప్పించడానికి ఒక పారిశ్రామికవేత్తని, ఒక సినిమావాడిని, ఒక విదేశీయుడిని కూర్చోబెట్టి దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని డబ్బా కొట్టించుకోవడం. దానిని కొనేసుకున్న సొంత మీడియాలో వాయించడం. గొర్రె జనం నమ్మడం… ఇంతకంటే జరుగుతున్నదేదీ లేదు దేశంలోనైనా, ఆంధ్ర రాష్ట్రంలోనైనా!
ఏ సమస్యని టచ్ చేసి మాట్లాడమన్నా కులం పేరో, మతమో ఎత్తుతున్నారు.
ఈ మధ్యన స్థానిక ఎన్నికల తాలూకు నామినేషన్ల నేపథ్యంలో జరిగిన అల్లర్ల గురించి బాధగా ప్రస్తావిస్తే, “నువ్వు మన కులంలో చెడపుట్టావు” అనేశాడు మా కులం వాడైన ఒకడు. ఇక్కడ కులం ప్రస్తావన ఎందుకు అని అడిగితే, “మన కులం వాళ్లు ఇదంతా చూసి ఎంజాయ్ చేయాలి తప్ప బాధపడకూడదు. ఇది కలుపుని ఏరేసే ప్రక్రియ. శాశ్వతంగా ఫలానా పార్టీని భూస్థాపితం చేయడమే మన లక్ష్యం కావాలి” అన్నాడు.
ఇలాంటి కరడుగట్టిన కులవాదుల్ని చూస్తే జాలేస్తుంది తప్ప కోపం కూడా రావట్లేదు. డెమోక్రసీ గురించి బేసిక్ కామన్ సెన్స్ కూడా లేకుండా మాట్లాడే మాటలివి.
ఏది ఏమైనా, కులమతాల మత్తు దిగనంత వరకూ ఈ దేశం ఇంతే… ఆంధ్రులూ ఇంతే!
— హరగోపాల్ సూరపనేని

Maa chaudhh ganla mundhu, mee eddy ganlu entha raa
Challe orko Reddy
ee situ nidichede kulam meeda
గ్రేట్ ఆంధ్ర లో తమరు కులం కంపు అని వాపోవడం ..చెత్త కుప్ప మీద కూర్చుని ప్రవచనాలు చెప్తున్నట్టు ఉంది ..
కులం మత్తు వదిలితే…అన్న కి దిక్కు ఉండదు….అప్పుడు G A కి పని లేదు…నీ సొళ్ళు స్క్రిప్ట్ ప్లేస్ లేదు హరగోపాలా