తెలంగాణలో ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు జోరుగా ప్రచారం చేస్తున్నాయి అన్ని పార్టీలు. ఈ ఎన్నికలను టీఆర్‌ఎస్, బీజేపీ బస్తీమే సవాల్ అన్నట్లుగా తీసుకున్నాయి. ఇక కాంగ్రెస్ ప్రచారం ఈ రెండు పార్టీల తరువాతే అని చెప్పుకోవాలి. ఇవి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి ప్రధానంగా ఉద్యోగాల విషయం హైలైట్ అవుతోంది. బోలెడు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడానికి అధికార పార్టీ నాయకులు నానా తంటాలు పడుతున్నారు.
మంత్రులు నోటికొచ్చిన లెక్కలు చెబుతున్నారు. లక్షన్నర ఉద్యోగాలు ఇచ్చామని ఒక మంత్రి అంటే, లక్షా 32 వేలని ఒకరు, లక్షా 35 వేలని మరొకరు చెబుతున్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిందని, ఉద్యోగాల కల్పన మీద మంత్రులు కాకి లెక్కలు చెబుతున్నారని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి చర్చ పెట్టుకుందామా అంటూ సవాళ్లు విసురుతున్నారు.
ఇక తెలంగాణా సీఎం కేసీఆర్ తనయుడు కం మంత్రి కేటీఆర్ తన తండ్రిని తెలంగాణా హీరోగా పొగుడుతున్నాడు. కేసీఆర్ ఒక్కడే ఆనాడు పార్టీ పెట్టి తెలంగాణా కోసం పోరాడి సాధించారని అంటున్నాడు. కేసీఆర్ ను నోటికొచ్చినట్లు తిడుతున్నారని, ఇందుకు వడ్డీతో సహా బదులు తీర్చుకుంటామని అంటున్నాడు. కేసీఆర్ ధర్మాన్ని ఆచరించే, అనుసరించే వ్యక్తి అని కూడా చెప్పాడు. ఇదిలా ఉంటే … కేసీఆర్ దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావును ఎప్పుడో సొంతం చేసుకున్నారు.
ఏడాదిపాటు ఆయన శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఆయనకు భారత రత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తామన్నారు. ఇంకా అవి చేస్తాం …ఇవి చేస్తాం అంటూ చాలా చెప్పారు. పీవీ కుమార్తె వాణీ దేవిని ఎమ్మెల్సీ చేస్తామన్నారు. ఆమెను ఎమ్మెల్సీ చేస్తామంటే పోటీకి పెట్టకుండా గవర్నర్ కోటాలో ఇస్తారని టీఆర్‌ఎస్ వాళ్ళు, ఇతర పార్టీల వాళ్ళు అనుకున్నారు. కానీ చివరకు హైదరాబాద్- రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపారు.
ఆమెను గెలిపించే బాధ్యతను ముగ్గురు నలుగురు మంత్రులకు అప్పగించారు. ఎట్టి పరిస్థితిలోనూ ఆమె గెలిచి తీరాలని గట్టిగా చెప్పారు. దీంతో వాణీ దేవి తరపున మంత్రులు తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్షాలేమో వాణీ దేవిని ఎన్నికల బరిలోకి దింపి పీవీ గౌరవం తగ్గించారని విమర్శిస్తున్నారు. ఆమెని పోటీ లేకుండా చట్టసభకు పంపితే బాగుండేది అన్నారు. ఓడిపోయే నియోజకవర్గంలో నిలబెట్టారని కేసీఆర్ కాన్ఫిడెన్స్ ను దెబ్బ తీసేలా మాట్లాడుతున్నారు. దీంతో వాణీదేవి తరపున ప్రచారం ఉధృతంగా సాగిస్తున్నారు.
వాణీదేవి పోటీ కారణంగా పార్టీలకు సాధారణంగా గుర్తుకురాని ఓ సామాజిక వర్గం గుర్తుకొచ్చింది. అదే బ్రాహ్మణ సామాజిక వర్గం. వాణీదేవీ ఆ వర్గానికి చెందిన అభ్యర్థే. దీంతో బ్రాహ్మణ సదస్సులు, ఆత్మీయ సమ్మేళనాలు పెడుతూటీఆర్‌ఎస్ హడావుడి చేస్తోంది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి కేసీఆర్ చేస్తున్న మేళ్లు ఏమిటో వివరిస్తున్నారు. మొన్న మంత్రి కేటీఆర్ బ్రాహ్మణ సదస్సులో మాట్లాడుతూ ప్రభుత్వం బ్రాహ్మణులకు కలిగిస్తున్న ప్రయోజనాలు వివరించారు. బాగానే ఉంది.
కేసీఆర్ వెయ్యి కోట్ల ఖర్చుతో యాదాద్రిని అభివృద్ధి చేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పారు. యాదాద్రిని అభివృద్ధి చేస్తే బ్రాహ్మణులకు కలిగే ప్రయోజనం ఏమిటి ? యాదాద్రి బ్రాహ్మణులకు సొంతమా ? దానివల్ల వీళ్లకు ఏమైనా ఆదాయం వస్తుందా ? జీవితాలు బాగుపడతాయా ? సమాజంలో బ్రాహ్మణుల ఓటు బ్యాంక్ తక్కువ కాబట్టి ఏ రాజకీయ పార్టీ కూడా వారిని పెద్దగా పట్టించుకోదు. ఇతర సామాజిక వర్గాలకు ఉన్న సంక్షేమ పథకాలు వీరికి ఉండవు. ఇప్పుడు వాణీ దేవి పోటీలో ఉండటం వల్ల బ్రాహ్మణుల గురించి తెగ మాట్లాడేస్తున్నారు.