పవన్ కల్యాణ్ పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టిపెట్టిన తర్వాత, అతడి సినిమాల వ్యవహారాలన్నీ త్రివిక్రమ్ చూసుకున్నాడనే సంగతి అందరికీ తెలిసిందే. కథలు వినడం, కాంబినేషన్ సెట్ చేయడం ఇలా అన్నీ త్రివిక్రమ్ ఓకే చేస్తే, పవన్ ఫైనల్ గా నెరేషన్ విని కాల్షీట్లు కేటాయించేవారు.
అలా కొన్నాళ్లు నడిచిన తర్వాత ఎన్నికలు దగ్గరపడ్డాయి. దీంతో సెట్స్ పై ఉన్న సినిమాలన్నింటినీ ఎక్కడికక్కడ వదిలేసి ఎలక్షన్లపై పడ్డారు. గెలిచిన తర్వాత మంత్రి పదవితో మరింత బిజీ అయ్యారు. మరి ఆయన తన సినిమాల్ని ఎప్పుడు రీ-స్టార్ట్ చేస్తారు..?
ఇప్పుడా టైమ్ రానే వచ్చింది. పవన్ కల్యాణ్ ను ప్రత్యేకంగా కలిశాడు త్రివిక్రమ్. ఆగిపోయిన సినిమాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. పవన్ పొలిటికల్ షెడ్యూల్స్, మంత్రిగా నిర్వర్తించాల్సిన ప్రజా కార్యక్రమాలు, వ్యక్తిగత పనులు.. ఇలా అన్నింటినీ లెక్కలోకి తీసుకొని, సినిమాలకు కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేసే అవకాశం ఉంది.
ఆగస్ట్ నుంచి పవన్ సెట్స్ పైకి వస్తాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. దానిపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వస్తుంది. అయితే పవన్ ముందుగా ఏ సినిమా సెట్స్ పైకి వెళ్తారు, ఆయన నుంచి ఏ సినిమా ముందు రిలీజ్ అవ్వాలి, మిగతా సినిమాలు ఎప్పటికి షెడ్యూల్ చేయాలి.. ఈ పనులన్నింటినీ త్రివిక్రమ్ చక్కబెడతారు.
ఈ డేట్స్ ఎడ్జెస్ట్ మెంట్ కోసమే పవన్-త్రివిక్రమ్ కలిసినట్టున్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో ఏ సినిమాకు పవన్ కాల్షీట్ ఇస్తాడు, ఏ సినిమా ముందు రిలీజ్ అవుతుందనేది ఆసక్తికరం.