ఒకప్పుడు
సినిమా – వినోద సాధనం
రాజకీయం – సేవే పరమార్థం
కులం – కుటుంబానికి సంబంధించిన వ్యవహారం
ఇప్పుడు
సినిమా – రాజకీయ, వ్యాపార, తదితర బహుళార్థసాధకం
రాజకీయం – వేలకోట్ల సంపాదనకు అద్భుత అవకాశం
కులం – ఏ రంగంలో అయినా నిచ్చెన ఎక్కడానికి కనీస అర్హత
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలను, సినిమాలను, కులాలను, విడదీసి చూడడం అసాధ్యం. ఇది ఎవ్వరు ఎన్నిచెప్పినా కాదనలేని వాస్తవం. ముఖ్యంగా నందమూరి తారకరామారావు ఎప్పుడైతే సినిమా రంగంలోంచి రాజకీయాల్లోకి వచ్చారో, ఈ ముప్పేట బంధం మరింతగా అలుముకుంది. అంతకు ముందు సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రాలేదనీ కాదు, లేరనీకాదు. కానీ అప్పటి వరకు ఎంపీ కావాలనో, రాజకీయాల మీద ఆసక్తి వుండో వచ్చారు. పైగా అప్పటి వరకు కేవలం రెండు పేటల బంధం మాత్రమే వుంది. రాజకీయం, సినిమా. కానీ ఎన్టీఆర్ రంగప్రవేశం చేసాక 'కులం' అనే ముప్పేట బంధం కూడా ముడిపడింది.
ఇక్కడ అక్కడి నుంచి ఎవరు ఎన్ని చెప్పినా, అవునన్నా, కాదన్నా కులం-సినిమా-రాజకీయం అన్న ముప్పేట బంధమే ఇప్పుడు ఆంధ్రను ప్రభావితం చేస్తోంది. ఆంధ్రలో ప్రతి మీడియా వెనుక ఓ పార్టీ వున్నట్లుగా, రాజకీయ పార్టీల వెనుక ఓ కులం దన్నుగా వుంటోందన్నది కాదనలేని సత్యం. ఒకప్పుడు అంటే దాదాపు మూడు దశాబ్దాల క్రితం వరకు ఏకకులం ఛత్ర ఛాయలో వున్న సినిమా రంగం కూడా రెండు కులాల నడుమ చీలి, ముందకు సాగుతోందన్నదీ అంగీకరించాల్సిన వాస్తవమే. దీంతో సినిమాల విజయం మీద కూడా కులాల ప్రభావం తప్పడం లేదు. ఆ సినిమా నటుల అండ దండలు కోరుకునే రాజకీయ పార్టీలపై కూడా ఈ కులాల ప్రభావం కనిపిస్తోంది. ఇక రాజకీయాలు ఎలాగూ కులాల ఆధారంగానే నడుస్తున్నాయి. సీట్ల కేటాయింపు, మంత్రివర్గ విస్తరణ, పదవుల పంపిణీ ఇలాంటివి అన్నీ కులం ఆధారంగానే సాగుతున్నాయి. కొన్ని బయటకు గొప్పగా చెబుతారు. తాము బీసీలకు ఇన్ని సీట్లు ఇచ్చాం అని, కాపులకు ఇన్ని సీట్లు ఇచ్చామని. కొన్ని బయటకు చెప్పరు. ముఖ్యంగా ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీకి అనుగుణమైన కులానికి చెందిన అధికారులకు అగ్రతాంబూలం అందడం అన్నది వాస్తవమే కదా?
పాకుతున్న అసంతృప్తి
బాహుబలి సినిమా తెలుగువాడికి గర్వకారణంగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా విజయబావుటా ఎగరేసింది. కానీ ఇప్పుడు అదే బాహుబలి విజయం రాష్ట్ర రాజకీయాల మీద కూడా ప్రభావం చూపించే అవకాశం వున్నట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. బాహుబలి విజయాన్ని కేవలం ఓ డైరక్టర్, ఓ హీరో, ఓ సినిమా సాధించిన విజయం అన్నది వాస్తవం. అయితే, పైకి తేలకపోయినా, ఈ విజయం కాపుల్లో అసంతృప్తి రగలిస్తోందన్నది రాజకీయ వర్గాల అంచనా. ఎందుకంటే మెగా ఫ్యామిలీ సినిమాల్లో ఈ రేంజ్‌కు చేరుకోవడం వెనుక కాపుల అండదండలు ఎంతయినా వున్నాయి. ఆ అండదండలు చూసుకునే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చారు కూడా.
అయితే అసలే రిజర్వేషన్ల సమస్య కాపుల్లో కాస్త అసంతృప్తిని రగిలించింది. ముద్రగడ పద్మనాభం లాంటివాళ్లు దాన్ని మరింత ఎగసం దోసే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి సమయంలో ఒక్కో ఇటుక పేర్చినట్లు పలు వ్యవహారాలు కాపుల అసంతృప్తిని పైకి తెలియకుండానే పెంచుతున్నాయి. ఇటీవలే వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమా విషయంలో చిన్న అసంతృప్తి స్టార్ట్ అయింది. దానికి ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వలేదన్న వార్తలు, వదంతులు వచ్చాయి. అలాగే కాటమరాయుడి విషయంలో కూడా. నిజానికి అసలు షోలు అడిగారో లేదో, ఇచ్చారో లేదో, రీజన్ ఏమిటో ఎవరికీ అంతగా తెలియదు. కానీ కాపుల్లోకి ఈ విషయాల మాత్రం ఇంజెక్ట్ అయిపోయాయి.
సంక్రాంతి పోటీ
సంక్రాంతికి చిరు, బాలయ్య సినిమాలు పోటా పోటీగా విడుదలయినపుడు కూడా ఇలాంటి వ్యవహారమే కనిపించింది. అయితే ఖైదీ సినిమా పెద్ద విజయం సాధించడంతో కాపులు ఉత్సాహం పడ్డారు. అంతకుమించి లేదు. కానీ బాహుబలి విషయంలో మాత్రం మెగా కాపు అభిమానుల్లో కాస్త వేరే విధమైన వైఖరి కనిపిస్తోంది. బాహుబలి-2 విషయంలో తెలుగు మీడియాలో తెలుగుదేశం అనుకూల వర్గం చేసిన హాడావుడి ఇంతాకాదు. వాళ్లు వాళ్ల వాళ్ల కారణాలతో ఇలా చేసినా, ఇది కూడా కాపుల్లో పరోక్షంగాఅసంతృప్తిని పెంచిందనే అనుకోవాల్సి వస్తోంది.
అదే సమయంలో బాహుబలికి రేట్ల విషయంలో వెసులుబాటు ఇచ్చేసారు. షోల సంగతీ తెలిసిందే. ఇది కచ్చితంగా మెగాభిమానుల్లో కాపులకు కాస్త ఇబ్బందికరంగా వుంది. అది చాలదన్నట్లు బాహుబలిని ఆస్కార్‌కు నామినేట్ చేయాలని కోరతామని, అలాగే బాహుబలి యూనిట్‌ను అమరావతికి ఆహ్వానిస్తామని బాబుగారు ప్రకటించారు. నిజానికి ఇందులో తప్పు అయితే లేదు. కానీ ఒకరికి సత్కారం, అందలం లభిస్తుంటే, మరొకరు ఫీల్ కావడం అన్నది మానవ నైజం కదా? అదే ఇక్కడ పనిచేస్తోంది. బాహుబలి సినిమా మీద అలక కాస్తా, దానికి దన్నుగా నిలిచిన తెలుగుదేశం మీదకు మళ్లుతోంది.
ప్రకటనల తకరారు
మరోపక్క పవన్‌కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని మంత్రి అశోక్ గజపతిరాజు లాంటి వాళ్లు వ్యాఖ్యానించారు. అంతకు ముందు రామ్ గోపాల్‌వర్మ లాంటి వాళ్లు పరోక్షంగా మెగా హీరోలను బాహుబలిని అడ్డం పెట్టుకుని టార్గెట్ చేసారు. ఈ రెండింటి వెనుక వున్న కులాల ఈక్వేషన్లు కూడా కాపుల్లో అంతర్గత చర్చకు దారితీసాయి. అల్లు అరవింద్ అర్జెంట్‌గా రామాయణం ప్రాజెక్టునే ప్రకటించేసారు. నిజానికి అంత పెద్ద ప్రాజెక్టును హడావుడిగా ప్రకటించారు. అలా ప్రకటించడం వెనుక ఆయన విషయం ఏమైనా, దీన్ని కాపుల తరపున వెలువడిన రెస్పాన్స్ ప్రకటనగానే రాజకీయ పరిశీలకులు చూస్తున్నారు.
ఇవన్నీ వినడానికి, అనుకోవడానికి కాస్త వింతగానో, వాస్తవ దూరంగానో వుంటే వుండొచ్చు. కానీ గ్రౌండ్ రియాల్టీలో ఇవన్నీ వర్కవుట్ అయ్యేవిగానే రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. ఇదే విషయం ఓ రాజకీయ నాయకుడితో ప్రస్తావిస్తే, ఇలాంటివి బయటకు తేకూడదండీ..వాటిని అలాగే సైలెంట్‌గా పెరగనివ్వాలి అని కామెంట్ చేయడం విశేషం. ఎందుకంటే కిందస్థాయిలో అంటే బూత్ స్థాయిలో జనాల ఆలోచనలు డిఫరెంట్‌గా వుంటాయి. వాటికి ఎక్కువగా లాజిక్‌లు వుండవు. కులాల ఈక్వేషన్లు ఎక్కువగా వుండేది అక్కడే. మనోడు అనే పదం ఎక్కువగా వినిపించేది అక్కడే.
అభిమానుల్లో కొందరి తీరు
పైగా బాహుబలి సినిమాలో కీలకపాత్ర వున్న ఇద్దరు వ్యక్తుల, రెండు కులాలు, గోదావరి జిల్లాల్లో కాపులతో చిరకాల స్పర్థలు వున్నవే. అందువల్ల 2014లో రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో అందరూ కలిసి, ఒకేదిశగా ఆలోచించన మాట వాస్తవం. కానీ ఇప్పుడు 2019 నాటికి అందరూ ఒకేదిశగా ఆలోచించే పాయింట్ ఒక్కటి కూడా స్టేట్ లెవెల్‌లో లేదు. కేవలం మోడీ ఫ్యాక్టర్ మాత్రమే అందర్నీ ఒక్కటి చేయగలదు. కానీ అది మన స్టేట్‌లో ఏమేరకు వర్కవుట్ అవుతుందో తెలియదు. పైగా మోడీని విమర్శిస్తున్న పవన్, భాజపాతో వుంటే తెలుగుదేశంతో వుంటారా? అలా వుంటే మళ్లీ ఈక్వేషన్లు వేరుగా వుంటాయి. అలా కాకుండా పవన్ వేరుగా వస్తే అది తేడాగా వుంటుంది.
పైగా నిన్నమొన్నటి దాకా ఇండస్ట్రీలో మెగా హీరోలది పై చేయిగా వుంటూ వస్తోంది. మహేష్ బాబు తప్ప వేరే ఎవరూ సరైన పోటీ ఇచ్చే కమ్మ హీరో లేని పరిస్థితి నెలకొంది. అలాంటి టైమ్‌లో ప్రభాస్ వచ్చి ఇంత రేంజ్ సాధించడం, మెగా హీరోలకు సాధ్యం కానీ బాలీవుడ్ టాప్ హీరోగా అవతరించే స్థాయిలో వుండడం అన్నది మెగా హీరోల సంగతి ఎలా వున్నా, వారి అభిమానులు ముఖ్యంగా కాపు కులానికి చెందిన అభిమానులకు అంతగా మింగుడు పడడం లేదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
కాపుల రిజర్వేషన్
ఇప్పుడు ఇవన్నీ కలిసి తెలుగుదేశం పార్టీపై ప్రభావం చూపించే అవకాశం వుంది. ఎన్నికల నాటికి కాపులకు రిజర్వేషన్ కల్పించి, అది బ్రహ్మాస్త్రంగా వాడుకోవాలన్నది తెలుగుదేశం ఆలోచన. కానీ ఇక్కడ కేంద్రం ఇన్‌వాల్వ్ మెంట్ కూడా వుంది. ఇప్పటికే కేంద్రం ఈ విషయంలో సహకరించడం లేదన్న సన్నాయి నొక్కుల వార్తలు తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికల్లో రావడం ప్రారంభించింది. అంటే, తమకు ఇవ్వాలనే వుంది కేంద్రం సహకరించడం లేదన్న పాయింట్ అన్నమాట.
వీలయినంత వరకు కాపుల్లో చీలిక రాకూడదని అధికారపక్షం ప్రయత్నిస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ తమతోనే వుండేలా తెలగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది. అప్పుడు కాపు మెగా అభిమానులు కూడా తెలుగుదేశం వైపు వుండక తప్పదు. ఇలా పవన్‌ను దగ్గరకు తీయడం ఒక్కటే బాహుబలి ఎఫెక్ట్ నుంచి తెలుగుదేశం పార్టీని కాపాడుతుంది. లేదూ అంటే మాత్రం ఎన్నికల నాటికి కాస్త గట్టిగానే చూపించే అవకాశం వుంది.
వెంకట్ ఆరికట్ల