ఎమ్బీయస్‌ : సెన్సార్‌ బోర్డు ప్రక్షాళన

''బిజెపికు డేరా అండ'' అనే పేరుతో రాసిన వ్యాసంలో కొన్ని వాక్యాలు గుర్తుకు తెచ్చుకుంటే సెన్సారు బోర్డు విషయం బోధపడుతుంది – 'డేరా ప్రభావం ఉత్తరభారతంలోని 60 లక్షల మందిపై వుందంటారు. వాళ్లే ఓటర్లు…

''బిజెపికు డేరా అండ'' అనే పేరుతో రాసిన వ్యాసంలో కొన్ని వాక్యాలు గుర్తుకు తెచ్చుకుంటే సెన్సారు బోర్డు విషయం బోధపడుతుంది – 'డేరా ప్రభావం ఉత్తరభారతంలోని 60 లక్షల మందిపై వుందంటారు. వాళ్లే ఓటర్లు కూడా కాబట్టి పంజాబ్‌, హరియాణా రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో డేరా వుంది. పంజాబ్‌లో 2007లో జరిగిన ఎసెంబ్లీ ఎన్నికలలో రామరహీమ్‌ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌కు మద్దతు యిచ్చాడు. మొత్తం మీద కాంగ్రెసు ఓడిపోయినా డేరా ప్రభావం వున్న చోట్ల మాత్రం సీట్లు బాగానే గెలిచింది. ఇప్పుడు జింద్‌, ఫతేబాద్‌, కైతాల్‌, హిస్సార్‌, సిర్సా, తోహణా జిల్లాలలో డేరా అనుయాయులు వున్న విషయం గ్రహించిన మోదీ-అమిత్‌ షా రామ్‌రహీమ్‌ను మచ్చిక చేసుకున్నారు. అతనిపై హత్య, బలాత్కారం వంటి కేసులున్నా 'పరిశుభ్రతకై డేరా చేస్తున్న కృషి ప్రశంసనీయం' అంటూ మోదీ సిర్సా బహిరంగసభలో మెచ్చుకున్నాడు. రాష్ట్రంలో బిజెపి ఎన్నికల ప్రచారానికి యిన్‌చార్జిగా వున్న కైలాష్‌ విజయవర్గీయ 40 మంది బిజెపి అభ్యర్థులను రామ్‌రహీమ్‌ వద్దకు తీసుకెళ్లి ఆశీర్వాదం తీసుకున్నాడు. డేరా అనుయాయులు ఎన్నికలలో బిజెపికి ఓట్లేయడమే కాక, పోలింగ్‌ ఏజంట్లుగా పనిచేశారు. దాంతో ఆ జిల్లాలలో బిజెపి గెలుపు తథ్యమైంది. ఇప్పుడు రామ్‌రహీమ్‌ కార్యకలాపాలు మరింతగా విస్తరించడమే కాక, డేరాపై నిఘా తగ్గిపోవచ్చు. ఇంతటి భారీ సామ్రాజ్యంలో అవకతవకలు వుండక మానవు. ఇప్పటివరకు రామ్‌రహీమ్‌ అనుయాయులుగా వున్న అన్ని పార్టీల రాజకీయ నాయకులు (నవీన్‌ జిందాల్‌, హూడా, ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌, ప్రకాశ్‌ జావడేకర్‌, అరుణ్‌ జైట్లీ, వసుంధరా రాజే వారిలో కొందరు) కాపాడుతూ వచ్చారు. ఇప్పుడు సాక్షాత్తూ ప్రధానితో నేరుగా సంబంధం పెట్టుకుంటే చిక్కుల్లో పడకుండా వుండవచ్చని బాబా ఆలోచన. అతని అనుయాయులు వున్న తక్కిన రాష్ట్రాలలో కూడా బిజెపికి అతని సాయం అవసరపడుతుంది కదాని మోదీ-అమిత్‌ షా ఆలోచన!'

అదే వ్యాసంలో బాబా తనను తాను దేవుడిగా చిత్రీకరించుకుంటూ సినిమా తీయబోతున్నాడని కూడా రాశాను. ఆ సినిమా తయారైంది. పేరు ''ఎంఎస్‌జిః మెస్సెంజర్‌ ఆఫ్‌ గాడ్‌'' ఆ సినిమాలో బాబాకు మానవాతీత శక్తులున్నట్లు చిత్రీకరించారు. భక్తులందరూ అతన్ని 'భగవాన్‌' అని సంబోధిస్తూ వుంటారు. భజన వస్తూ వుంటే బాబా తన పృష్టాన్ని వూపుతూ వుంటాడట. ఆ సినిమా సెన్సారు సర్టిఫికెట్టుకై వచ్చినపుడు నందినీ సర్దేశాయి అనే సోషియాలజిస్టు ఏడుగురు యితర సెన్సార్‌ సభ్యులతో కలిసి సినిమా చూసి జీవించి వున్న వ్యక్తిపై యిలాటి సినిమా విడుదలైతే ప్రజల్లో మూఢనమ్మకాలు పెంచుతుందని అభిప్రాయపడి సర్టిఫికెట్టు ఏకగ్రీవంగా నిరాకరించారు. సహజంగా బాబా సెన్సారు బోర్డు కంటె పైనున్న ఫిల్మ్‌ సర్టిఫికెట్‌ ఎప్పిలేట్‌ ట్రైబ్యునల్‌కు అప్లయి చేసుకున్నారు. ట్రైబ్యునల్‌ సభ్యులు కూడా సినిమా చూసి, ఎందుకు తిరస్కరించారో బోర్డు సభ్యులను అడిగి తెలుసుకుని, తమలో తాము సంప్రదించుకుని బోర్డు నిర్ణయాన్ని తిరగతోడడానికి సాధారణంగా 15-20 రోజులు పడుతుంది. అయితే యీ సినిమా విషయంలో 24 గంటలు తిరక్కుండా ౖట్రైబ్యునల్‌ ఆ సినిమాను క్లియర్‌ చేసింది. ట్రైబ్యునల్‌ అసాధారణ చర్యకు సెన్సారు బోర్డు నిర్ఘాంతపోయింది. బోర్డు చైర్మన్‌ లీలా శామ్‌సన్‌ యీ అవకాశాన్ని తీసుకుని రాజీనామా చేసింది. ఆమె పదవీకాలం ఏడాది క్రితమే ముగిసింది. తన కొనసాగింపు కష్టమని ఆమెకు తెలుసు. 

లీలా శామ్‌సన్‌ కళాక్షేత్ర నుంచి వచ్చారు. ఆవిడ వచ్చాక కళాక్షేత్రలో భరతనాట్యానికి, హిందూమతానికి సంబంధం లేదన్న వాదన మొదలుపెట్టి  భరతనాట్య ప్రదర్శనలలో మార్పులు చేశారు. కళాక్షేత్రలో వున్న విగ్రహాలు అలంకారానికి మాత్రమేనని, వాటిని పూజించనక్కరలేదని నియమాలు పెట్టసాగారు. తరతరాల విధానాలను యిలా మార్చడం పొరపాటని ఎందరు చెప్పినా వినలేదు. ఇలాటి వ్యక్తి పద్ధతి కళాభిమానులకే బాధాకరంగా వుంటుంది. ఇక బిజెపికి ఎలా వుంటుందో వూహించవచ్చు. పైగా ఆమె సోనియాకు దగ్గర మనిషి. ప్రియాంకా వాద్రాకు భరతనాట్యం గురువు. మోదీ రాగానే ఆమె తన రోజులు లెక్కపెట్టుకోసాగింది. ఇప్పుడు డేరా బాబా సినిమా క్లియర్‌ చేయడంలో బిజెపి ప్రభుత్వం చేసిన అత్యుత్సాహాన్ని సాకుగా చూపి వెంటనే రాజీనామా చేసింది. ఆమెతో బాటు తక్కిన 12 మంది సెన్సారు బోర్డు సభ్యులు కూడా మూకుమ్మడిగా రాజీనామాలు పంపేశారు. లీలా శాంసన్‌ సంగతి సరే, తక్కినవాళ్లు కూడా యిలా రియాక్టయ్యేరేమిటని బిజెపి ప్రభుత్వం పునరాలోచించలేదు. తమాయించుకోలేదు. వదిలారు, హమ్మయ్య అనుకుని వెంటనే సెన్సారుబోర్డును తన సభ్యులతో నింపి పారేసింది. 

పార్లమెంటు ఎన్నికలలో ''హర్‌ ఘర్‌ మోదీ'' అనే ప్రచారచిత్రాన్ని తీసిన బిజెపి సమర్థకుడు పహలాజ్‌ నిహ్లానీని చైర్మన్‌ చేసింది. 2013లో ఎడిఎంకె వదిలిపెట్టి బిజెపిలో చేరిన తమిళ హాస్యనటుడు ఎస్‌.వి.శేఖర్‌ను, బెంగాలీ సినీనటుడు, బిజెపి సభ్యుడు అయిన జార్జి బేకర్‌ను, బిజెపి జాతీయ సెక్రటరీ, నటి వాణీ త్రిపాఠీ టిక్కూను, మోదీ సమర్థకుడైన సినీదర్శకుడు అశోక్‌ పండిట్‌ను సెన్సారు బోర్డులోకి తీసుకున్నారు. వారితో బాటు అనేక పార్టీలూ మారి చివరకు బిజెపిలో చేరిన తెలుగు నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్‌ను కూడా! తమకు కావలసిన వాళ్లకు యిలాటి పదవులు యివ్వడం ఎప్పుడూ జరుగుతూనే వుంటుంది. కానీ ఆ నియామకాలకు లింకులు వెతికితే తప్ప దొరకవు. ఇప్పుడు అలాటి మొహమాటాలు పోయాయి. నిస్సిగ్గుగా తమవాళ్లను పట్టుకుని వచ్చి నియమించేసుకుంటున్నారు. ఈ ఉదంతం ద్వారా సెల్ఫ్‌ స్టయిల్‌డ్‌ బాబాలకు ఒక సందేశం వెళుతోంది. బిజెపిని మచ్చిక చేసుకోండి, మీ కార్యకలాపాలకు ప్రభుత్వం అండ వుంటుంది. ఇంతకీ సినిమా గురించి చెప్పాలంటే – విడుదల కాకుండానే యీ సినిమా ప్రదర్శనను పంజాబ్‌ ప్రభుత్వం నిలిపివేసింది. హరియాణాలో శిఖ్కులు నిరసనలు తెలుపుతున్నారు. నిషేధంపై బాబా అనుచరులు కోర్టుకి వెళ్లారు. ఫిబ్రవరి 4 న హియరింగ్‌. ఏది ఏమైనా ఫిబ్రవరి 13 న సినిమా రిలీజవుతుందని బాబా చెప్తున్నాడు. ఎక్కడ ఏ ఏర్పాట్లు చేసుకున్నాడో ఏమో!

ఎమ్బీయస్‌ ప్రసాద్

[email protected]